మహారాజా! ఇపుడు నేను అన్ని కోరికలనూ సంపూర్ణంగా తీర్చే సౌభాగ్య శయన వ్రతాన్ని వర్ణిస్తాను. ఆకర్ణించండి. ప్రళయానికి పూర్వం ‘భూర్భువః స్వః” మున్నగు అన్ని లోకాలూ దగ్ధమైపోయినపుడు అన్ని ప్రాణులయొక్క సౌభాగ్యములూ ఏకత్రితమై వైకుంఠంలో విష్ణుభగవానుని వక్షఃస్థలంపై నిలిచిపోయాయి. మరల సృష్టి జరిగినపుడు అందులోని సగం సౌభాగ్యం బ్రహ్మపుత్రుడైన దక్షప్రజాపతిని చేరుకుంది. తద్ద్వారా ఆయన రూపలావణ్యాలూ, బలం, తేజం సృష్టిలోనే అతి గొప్పవిగా పరిణమించాయి.
మిగతాసగం సౌభాగ్యం నుండి ఇక్షు, స్తవ, రాజ, నిష్పావ, రాజిధాన్య, గోక్షీర తద్వికార, కుసుంభ, కుంకుమ, లవణ- అనే ఎనిమిది పదార్థములుత్పన్నమైనవి. వీటిని సౌభాగ్యాష్టకమంటారు.
ఇక్షవః స్తవరాజంచ నిష్పావా రాజిధాన్యకం।
వికారవచ్చ గోక్షీరం కుసుంభం కుంకుమంతథా।
లవణంచాష్టమంతత్ర సౌభాగ్యాష్టకముచ్యతే॥ (ఉత్తరపర్వ 25/9)
తనకు లభించిన సౌభాగ్యాన్ని దక్షప్రజాపతి త్రాగివేయగా దానినుండి ఆయనకు సతి అనుపేరు గల కన్య జన్మించింది. ఆమె సర్వాతీత సౌందర్యం జరగద్విదితం కావడంతో ఆమెకు అతిశయ లాలిత్యానికి సార్థకంగా లలితాదేవి అను పేరు వ్యవహారంలోకి వచ్చింది. ఈ త్రైలోక్య సుందరికి శంకరభగవానులతో వివాహమైంది. అట్టి జగన్మాత లలితాదేవిని ఆరాధించడం వల్ల భక్తి, ముక్తి, స్వర్గరాజ్యాధిపత్యం కూడా లభిస్తాయి.
“శ్రీకృష్ణదేవా! ఆ జగద్ధాత్రిని ఏవిధంగా ఆరాధించాలి” అడిగాడు ధర్మజుడు. చెప్పసాగాడు శ్రీకృష్ణుడు.
“మహారాజా! లలితాదేవికి శంకరభగవానులతో పెండ్లి చైత్ర శుద్ధ తదియనాడు జరిగింది. కాబట్టి ఆ పుణ్యదినాన ప్రతి పూర్వాహంలో తిలమిశ్రిత జలంతో స్నానం చెయ్యాలి. ఆ తరువాత పంచగవ్యాలతోనూ చందన మిశ్రిత జలంతోనూ గౌరీ, శంకరుల ప్రతిమకు స్నానంచేయించి ధూప దీప నైవేద్యాలతో నానా ప్రకారఫలాలతో ఆద్వయాన్ని పూజించాలి. అప్పుడిక అంగపూజను ఈ మంత్రాలతో చేయాలి.
ఓం పాటలాయై నమః, ఓం శంభవేనమః
అంటూ పార్వతీ శంభుదేవుల చరణాలనూ,
ఓం త్రియుగాయై నమః, ఓం శివాయనమః
అంటూ శివానీ శివల గుల్ఫములనూ,
ఓం విజయాయై నమః, ఓంభద్రేశ్వరాయనమః
అంటూ ఉమాచంద్రశేఖరులు జానువులనూ,
ఓం ఈశాన్యైనమః, ఓం హరికేశాయ నమః
అంటూ కటి ప్రదేశాలనూ,
ఓం కోటవ్యై నమః, ఓం శూలినే నమః
అంటూ జగన్మాతా పితల కుక్షి భాగాలనూ,
ఓం మంగళాయై నమః ఓం శర్వాయ నమః
అంటూ ఉమామహేశుల ఉదరాలనూ,
ఓం ఉమాయై నమః ఓం రుద్రాయ నమః
అంటూ ఆదిదంపతుల వక్షభాగాన్నీ,
ఓం అనంతాయై నమః, ఓం త్రిపురఘ్నాయ నమః
అంటూ గౌరీ, శంకరుల పవిత్ర హస్తాలనూ,
ఓం భవాన్యై నమః, ఓం భవాయ నమః
అంటూ భవానీ, శంకరుల కంఠాలనూ,
ఓం గౌర్యై నమః, ఓం హరాయ నమః
అంటూ రుద్రాణీ రుద్రుల ముఖాలనూ
ఓం లలితాయై నమః, ఓం సర్వాత్మనే నమః
అంటూ లలితా మహాదేవుల మస్తకాలనూ పూజించాలి.
ఈ రకంగా విధ్యుక్తంగా సర్వాంగ పూజనం చేసిన పిమ్మట శివపార్వతుల సమ్ముఖంలో సౌభాగ్యాష్టకమును స్థాపించి ‘ఉమామహేశ్వరౌ ప్రీయేతాం’ అని పలుకుతూ వారికి నివేదించాలి. ఆ రాత్రి గోశృంగోదకాన్ని మాత్రమే నోటిలో వేసుకొని భూమిపైనే శయనించాలి. పెందలకడనే లేచి ద్విజదంపతులను రావించి వస్త్ర మాలాలంకారాదులతో వారిని పూజించి సువర్ణ నిర్మితమైన గౌరీశంకర ప్రతిమను సౌభాగ్యాష్టకంతో సహా లలితా ప్రీయతాం అంటూ వారికి సమర్పించివేయాలి.
ఈ విధంగా ఒక యేడాదిపాటు ప్రతిశుక్ల తదియనాడూ ఈ పూజనుచేయాలి. చైత్రాది పన్నెండు మాసాల్లోనూ క్రమంగా రాత్రి గోశృంగోదకం, గోమయం, మందార పుష్పం, బిల్వపత్రం, పెరుగు, కుశోదకం, పాలు, నెయ్యి, గోమూత్రం, వెన్న, నల్ల నువ్వులు, పంచగవ్యాలు ప్రాశించాలి- (అంటే నోట్లో వేసుకొని) పుడమిపై పడుకోవాలి. పన్నెండు మాసాలలోనూ దానానికి ముందు క్రమంగా లలితా, విజయా, భద్రా, భవానీ, కుముదా, శివా, వాసుదేవీ, గౌరీ, మంగళా, కమలా, సతీ, ఉమా అని ఉచ్చరిస్తూ ప్రీయతాం అని చెప్పాలి. అంటే మొదటి మాసంలో లలితాప్రీయతాం, రెండవమాసంలో విజయా ప్రీయతాం అలాగే చివరిమాసంలో ఉమాప్రీయతాం అనాలి.
పన్నెండు నెలలలోనూ క్రమంగా మల్లిక, అశోక, కమల, కదంబ, ఉత్పల, మాలతి, కుడ్మల, కరవీర, బాణ, వికసిత పుష్పం, కుంకుమ, సిందువారంలను పూజలో వాడాలి. కరవీరపుష్పమంటే లలితాదేవికి ప్రీతి. అలాగే జపాకుసుమం, మాలతి, కుసుంభం, కుందపుష్పాలు ప్రశస్త్రాలుగా పరిగణింపబడ్డాయి. వీటిని నిత్యమూ ఉపయోగించవచ్చు.
ఈ రకంగా ఒక సంవత్సరం పూజలు చేసిన తరువాత అన్ని సామగ్రులతో సహా ఒక శయ్యపై ఉమామహేశుల, గో, వృషభాలు సువర్ణప్రతిమల నుంచి వాటికీ పూజ చేసి బ్రాహ్మణునకు మొత్తం అన్నిటినీ దానమిచ్చెయ్యాలి.
ఈ వ్రతం చేసిన వారికి అన్ని కోరికలూ తీరుతాయి. అదే నిష్కామ భావనతో చేస్తే నిత్యపదం అనగా దైవ సన్నిధానం లభిస్తుంది. స్త్రీలు, పురుషులు, కుమారీమణులు - ఎవరు ఈ సౌభాగ్య శయనవ్రతాన్ని చేసినా దేవి అనుగ్రహాన్ని పొందుతారు. ఈ వ్రతాన్ని గూర్చి వినినవారు దివ్య శరీరాన్ని పొంది స్వర్గలోక నివాసాన్ని పొందగలరు. ఈ వ్రతాన్ని పూర్వం చంద్రుడు, మన్మథుడు, కుబేరుడు చేసి సత్ఫలితాలనందినారు. అపుడు మిగతా దేవతలంతా చేశారు.”