(మాసశబ్దాని కర్థం చంద్రుడనే. హిందువుల మాసం అమావాస్యతో పూర్తవుతుంది)
ధర్మరాజా! పూర్ణిమ చంద్రుని కత్యంత ప్రీతికరమైన తిథి. ఆ రోజాయన పదహారు కళలతో నిండుగా ప్రకాశిస్తాడు. అందుకే ఈ తిథిని పౌర్ణమాసీ అంటారు. (పున్నమి అనే మాట బాగా వాడుకలో వుంది.) ఈరోజే చంద్రుడికి తారవల్ల బుధుడనే పుత్రుడు జన్మించాడు. చంద్రుడే స్వయంగా ఇలా చెప్పాడు. ‘ఈ పూర్ణిమ తిథినాడు నాపట్ల భక్తితో విధ్యుక్తంగా నా పూజను చేసినవారిపట్ల నేను ప్రసన్నుడనై వారి కోరికలన్నిటినీ పూర్తిగా తీరుస్తాను.’ వ్రతి ఏం చేయాలంటే పున్నమనాడు తెల్లవారగానే పవిత్ర జలాశయంలో స్నానం చేసి దేవతలకూ, పితరులకూ తర్పణలివ్వాలి. ఇంటికి వచ్చి ఒక మండలాన్ని నిర్మించి అందులో చంద్రునీ నక్షత్రాలనూ చిత్రించి తెల్లగంధం, అక్షతలు, తెల్లపూలు, ధూపదీపఘృతపక్వ నైవేద్యాలు, శ్వేతవస్త్రాది ఉపచారాలతో చంద్రుని పూజించి సాయంత్రం ఈ క్రింది మంత్రంతో ఆయనకు అర్ఘ్యమివ్వాలి.
వసంత బాంధవ విభో శీతాంశో స్వస్తి నః కురు ।
గగనార్ణవ మాణిక్య చంద్ర దాక్షాయణీ పతే ॥ (ఉత్తరపర్వం 99/46)
అనంతరం రాత్రి మౌనంగా కూరలతో ‘తిన్నీ’ బియ్యపు అన్నంతో భోంచేయాలి. ప్రతి పున్నమినాడూ ఇలాగే ఉపవాస పూజలనొనరించాలి.
అమావాస్య తిథి పితృదేవతలకు అత్యంత ప్రీతికరం. ఈరోజు దానాలూ తర్పణలూ వారిని బాగా తృప్తిపరుస్తాయి. అమావాస్య నాడు ఉపవాసం చేసినవానికి అక్షయవటం క్రింద శ్రాద్ధకర్మ చేసిన మహాఫలం దక్కుతుంది. ఈ అక్షయవటం పితృదేవతలకు ఉత్తమ తీర్ధం. అక్షయవటం క్రింద శ్రాద్ధం పెట్టేవానికి పితరుల దయవల్ల సర్వ సద్గుణాలూ అలవడడమేకాక వానియొక్క ఇరువది యొక్క తరాలూ ఉద్ధరింపబడతాయి. ఈ ప్రకారం ఒక ఏడాదిపాటు పూర్ణిమావ్రతాన్ని చేసి నక్షత్ర సహితుడైన చంద్రుని సువర్ణ ప్రతిమను తయారుచేయించి వస్త్ర భూషణాదులచే దానికి పూజ చేసి దానిని భూసురునకు దాన మివ్వాలి. ఏడాదిదాకా చేసే శక్తిలేనివారు ఒక పున్నమి లేదా అమావాస్య నాడు చంద్రుని పూజను చేసి ఉద్యాపన చేసుకోవచ్చు. పార్థా! పౌర్ణమాసీ వ్రతం చేసే వ్యక్తి సర్వపాప విముక్తి నొంది చంద్రునిలాగే సుశోభితుడవుతాడు. పుత్ర, పౌత్ర, ధన, ఆరోగ్యాదులతో అన్ని సుఖాలనూ అనుభవించి పెద్ద కాలం జీవించి ఏ ప్రయాగ వంటి క్షేత్రంలోనో అనాయాస మరణాన్ని పొంది విష్ణులోకానికి గమిస్తాడు.
అమావాస్యనాడు కూడా చంద్రుని పూజించవచ్చు.”