భవిష్య పురాణము

145 - నక్షత్రార్చన విధి (రోగావలి చక్రం)

ధర్మజా! ఒకమారు గర్గముని కౌశిక మహర్షిని ఇలా అడిగాడు. ‘బ్రాహ్మణోత్తమా! బందీ గృహంలో నిర్బంధించబడిన వారికీ, విషమ పరిస్థితుల్లో ఇరుక్కున్నవారికీ, దస్యు శత్రు, హింస్ర పశువులచే చుట్టుముట్టబడినవారికీ, వ్యాధిపీడితులకు ఆయా సమస్యల నుండి బయటపడవేయు మార్గమున్నదా? దయచేసి వినిపించండి’ కౌశికుడు చెప్పసాగాడు ‘మునీంద్రా! కొన్నిటికి మాత్రం మార్గాలు లేకపోలేదు. కృత్తికా నక్షత్రంలో వచ్చిపడే వ్యాధి తొమ్మిది రాత్రులపాటు పీడిస్తుంది. రోహిణిలో మూడు, మృగశిరలో అయిదు, పునర్వసు, పుష్యలలో యేడు ఇలా ఒక్కొక్క నక్షత్రంలో తగిలే వ్యాధి ఒక్కొక్క కాల పరిమితిలో వుంటుంది. ఆర్ద్రలో ఉత్పన్నమయ్యే రోగం మాత్రం ప్రాణాంతకమే. వీటి విషయంలో జ్యోతిష్కులు మరిన్ని వివరాలు చెప్పగలరు.

రోగ ప్రారంభిక నక్షత్రం తెలిస్తే ఆ నక్షత్రాధి దేవత నిమిత్తమై నిర్దిష్ట ద్రవ్యాల ద్వారా హవనమును చేస్తే రోగ శాంతి కలుగుతుంది. వ్యాధి, నక్షత్రం యొక్క ఏ పాదంలో ఉత్పన్నమైందో తెలుసుకొని ఆ నక్షత్ర స్వామిని పూజించి ఆ దేవతకు ఇష్టమైన సమిధల ద్వారా హవనం చేస్తూ మంత్రాలతో తృప్తిపఱచాలి. అశ్వినీ నక్షత్ర శాంతికి పాలుగారు చెట్టు సమిధతో, అశ్వినీ కుమారుల మంత్రాన్ని జపిస్తూ హవనం చేయాలి. భరణికి యమదైవతయమాయ స్వాహా అనే మంత్రాన్నుచ్చరిస్తూ నెయ్యి, తేనె, తిలలతో హవనం చేయాలి. కృత్తికకి అగ్ని మంత్రాలు, రోహిణికి ప్రజాపతి మంత్రాలూ చదువుతూ శాస్త్రోక్త హవనాలనివ్వాలి. ఇలాగే ప్రతి నక్షత్రానికీ మంత్రం, సమిధ, హవనం ప్రత్యేకంగా వుంటాయి. వాటిని కనుగొని పూజిస్తే ఫలముంటుంది.

మునీంద్రా! బ్రహ్మదేవుడు గాయత్రి మంత్రాన్ని విధిపూర్వకంగా ఒక వేయి మార్లు జపిస్తూ వేయి నేతి ఆహుతులనిస్తే అన్ని జ్వరాలూ రోగాలూ శాంతిస్తాయని చెప్పాడు. గాయత్రి అనే మంత్రానికి అర్థమే గానం, హవనం, పూజనం ద్వారా రక్షణనిచ్చు మంత్రమని.’

ధర్మజా! గర్గాచార్యులవారు మా గోకులం కోసమే ఇలాటి వివరాలన్నీ కనుక్కొనేవారు.’