భవిష్య పురాణము

210 - 211 - అర్కసంపుటి - సప్తమీవ్రతం; కౌథుమికథ

            సుమంతుడింకా ఇలా అన్నాడు. “మహారాజా! ఫాల్గున శుక్ల సప్తమిని అర్కసప్తమి అంటారు. దీనికి షష్ఠినాడుపవాసం చేసి (ఉండి) స్నానాంతరం గంధ, పుష్ప, గుగ్గుల, అర్కపుష్ప తెల్లగన్నేరు, చందనాదులతో దివాకర భగవానుని పూజను చేయాలి. ఆయన ప్రసన్నతకై బెల్లపునీరు నైవేద్యంగా సమర్పించాలి. దినమందు ఈ విధంగా పూజ సలిపి, రాత్రంతా నిద్రారహితంగా వుండి సూర్యమంత్రాలను జపిస్తూ గడపాలి.”

            “మహాత్మా! సూర్యభగవానునికి ప్రియమైన మంత్రమేది? ధూపదీపాలేవి?”

            “మహారాజా! ఒకే మంత్రమని కాదుగానీ, ముందుగా ఏకాగ్రచిత్తంతో సాధకుడు లేదా ప్రతి షడక్షర మంత్రంతో జప, హోమ, పూజాది కర్మలన్నిటినీ చేయాలి. అప్పుడు యథాశక్తి సౌరగాయత్రిని జపించాలి. ఇది సౌరగాయత్రి మంత్రం :

ఓం భాస్కరాయ విద్మహే

సహస్రరశ్శిం ధీమహి

తన్నః సూర్యః ప్రచోదయాత్ II

            దీనిని స్వయంగా సూర్యభగవానుడే నిర్దేశించాడు. ఈ సౌరగాయత్రి పరమశ్రేష్ఠము. దీనిని ఒక్కమారు పఠించినా మానవుడు పవిత్రుడౌతాడు. ఇందులో సందేహం లేదు. సప్తమిరోజు ప్రాతఃకాలంలో ఈ మంత్రాన్ని శ్రద్ధా పూర్వకంగా పఠించి భాస్కర భగవానులకు విధ్యుక్తంగా పూజగావించి భక్తిపురస్సరంగా బ్రాహ్మణశ్రేష్ఠులకు భోజనం పెట్టాలి. ధనంపై దృష్టిని పెట్టుకోకూడదు. అంటే కక్కుర్తి పడకూడదు. సూర్యభక్తిగలవానికే ఈ రోజు భోజనం పెట్టాలి. శాల్యోదనం, పెసరపప్పు, అప్పాలు, బెల్లపు వంటకాలు, నెయ్యి, పెరుగులతో భోజనం పెట్టాలి. దీనివల్ల భాస్కరుడు తృప్తినొందుతాడు. అభక్ష్యాలను వడ్డించరాదు. చేదుగా వున్నవాటిని, ఘాటైన వాసనవచ్చేవాటిని పెట్టరాదు. ఉలవ, మసూర, ఉడద దినుసులు నిషిద్ధాలు.

            ఓంఖభోల్కాయ నమః అంటూ సూర్యవృక్షానికి పూజచేసి దాని చిగురాకును స్వీకరించాలి. తరువాత స్నానం చేసి అర్కపుష్పాలతో సూర్యుని పూజించి బ్రాహ్మణులకు భోజనాలు పెట్టి అర్కోమే ప్రీయతామ్ అని చెప్పాలి. ఆ తరువాత దేవప్రతిమల, బొమ్మల, చిత్రాల సముఖంలో దంతాలుగాని, పెదవులుగాని, ముట్టుకోకుండా క్రింద చెప్పబడిన అర్కసంపుటిని ప్రార్థిస్తూ చేతిలో నీరుపోసుకొని తూర్పువైపు తిరిగి నీటిని త్రాగాలి. (పురాణంలో అర్కపుటాన్ని మింగాలి అని వుంది.)

అర్కసంపుట భద్రంతే సుభద్రం మేఽస్తు వై సదా

మమాపి కురు భద్రంవై ప్రాశ్నాద్ విత్తదోభవ (బ్రాహ్మ 210/73)

            ఈ మంత్రాన్ని జపిస్తూ సూర్యదేవుని ధానిస్తూ అర్కసంపుటాన్ని నోట్లో వేసుకొన్నవారికి శ్రేష్ఠగతులు లభిస్తాయి.

            దంతాలను స్పృశించకుండా ఓష్ఠాన్నీ స్పృశించకుండా అంటే పళ్ళకుగానీ పెదాలకు గానీ తగలకుండా మింగాలనే నియమం వుండబట్టే అర్కపుటాన్ని అర్కసంపుటమన్నారు. ఈ విధి విధానాలతో ఒక యేడాది పాటు సూర్యనారాయణని ప్రసన్నతకోసం శ్రద్ధాభక్తులతో ఈ అర్కసంపుటి సప్తమీ వ్రతాన్ని చేసేవారి గృహంలో ఏడుతరాలపాటు అక్షయంగా, అచలంగా ధనం నిలచివుంటుంది. సామగానంలో దిట్టయైన కౌథుమిమహర్షి ఈ వ్రతానుష్ఠానం ద్వారానే కుష్ఠురోగవిముక్తుడైనాడు. పైగా గొప్ప సిద్ధిని కూడా పొందాడు. అలాగే బృహద్‌వల్కుడు, జనకమహారాజు, యాజ్ఞవల్క్యమహర్షి, శ్రీకృష్ణపుత్రుడైన సాంబుడు - వీరంతా సూర్యభక్తిప్లావితులై ఈ వ్రతాన్ని చేసి ఆయనను ప్రసన్నము చేసుకోగలిగారు. ఈ అర్కసప్తమి పవిత్రము, పాపనాశిని, పుణ్యప్రదము, ధన్యము.”

            కౌథుమికథను శతానీకుని అభ్యర్థన మేరకు ఇలా చెప్పసాగాడు సుమంతు మహర్షి.

            “మహారాజా! ప్రాచీన కాలంలో హిరణ్యనాభుడను పేరు గల బ్రాహ్మణ విద్వాంసుడు పుత్ర సమేతంగా జనకమహారాజు ఆశ్రమానికి వెళ్ళాడు. ఈ పుత్రుడే అనంతరకాలంలో వేదపండితునిగా మహర్షిగా ప్రసిద్థుడైన కౌథుమి. ఆ రోజు జనకరాజర్షి ఆశ్రమంలో చాల గొప్ప విద్వద్గోష్ఠి జరుగుతోంది. బ్రహ్మ సమానులైన శాస్త్రకర్తలు ఎన్నో సిద్ధాంతాలను ప్రతిపాదించి వాదించి నిరూపించి స్థాపించసాగారు. ఏదోఒక సిద్ధాంతం విషయంలో కౌథుమికి ఒక మహాపండితునితో గట్టిగా వాగ్వాదం జరిగింది. ఒక దశలో కోపం పట్టలేక కౌథుమి ఆ బ్రాహ్మణోత్తమునిపై దాడి చేయగా అందులో ఆయన మరణించాడు. బ్రహ్మహత్యాపాతకియైన పుత్రుని హిరణ్యనాభుడు అక్కడికక్కడే పరిత్యజించాడు. (ఇక్కడ కులమనగా వర్ణమే గాని నేటి ‘కులం’ కాదు.) కులం వారూ వెలివేసి తగిలేశారు. అపుడతడు మిక్కిలి శోకసంతప్తుడై దుఃఖిస్తూ అన్ని దివ్య, మానవ నిర్మిత దేవాలయాలకూ వెళ్ళాడు. అనేక తీర్థయాత్రలు చేశాడు. బ్రహ్మహత్యా పాపం ఉపశమింపక పోగా కుష్ఠువ్యాధిరూపంలో సోకి వేధించసాగింది. అనతికాలంలోనే ఆ కుష్ఠుబాధ అతిగా విస్తరించడంతో దుఖవ్యాకుల చిత్తుడై కౌథుమి తన తండ్రి కాళ్ళమీద పడి తరణోపాయాన్ని వేడాడు. ఎంత పరిత్యజించినా తండ్రి తండ్రేకదా! ఆయన ఇలా అన్నాడు, ‘విన్నాను కుమారా విన్నాను. నీవు పడ్డ పడరాన్ని పాట్లన్నీ విన్నాను. అన్ని దేవాలయాలను దర్శించా వనీ సర్వతీర్థాలను సేవించావనీ విన్నాను. ఇక నీకు దిక్కు బ్రహ్మాది దేవత లందరిచేతా నిత్యమూ పూజింపబడే భాస్కరభగవానుడే.’

            ‘తండ్రీ! నేను ఇంచుమించు వికలాంగుడినైపోయాను. ఏసత్కర్మనిమాత్రం యథావిధిగా ఎలా చేయగలను?”

            ‘చింతించకు నాయనా, చింతనం చెయ్యి. నేనింతవఱకు సూర్యుని వంటి కరుణామయుని కనలేదు, వినలేదు. నీవు ఆయన మంత్రాలను జపించు. ఆయనకై తపించు. సామవేద మంత్రాలను గానం చెయ్యి. భక్తి పూర్వకంగా భాస్కరుని ఆరాధించు. సూర్యసంబంధిత పురాణాలనూ ఇతిహాసాలనూ శ్రవణం చెయ్యి. నీ పశ్చాత్తాపాన్ని ఆయన త్వరలో అర్థం చేసుకొని రోగ విముక్తినే కాదు మోక్షప్రాప్తినీ అనుగ్రహిస్తాడు.’

            మహారాజా! సహజంగానే సామగానకళావిదుడైన కౌథుమి శ్రద్ధాసమన్వితుడై బ్రహ్మోపదేశమిచ్చిన తండ్రి వద్దనే సూర్యమంత్రోపదేశాన్ని, తపస్సుకి ఆదేశాన్నీ, ఆశీర్వదాన్నీ కూడా పొంది సూర్యదేవుని ఆరాధించి రోగవిముక్తుడైనాడు. అంతేకాదు ఆయన కృపవల్ల దివ్యమూర్తిమంతుడై ఒక మహర్షిగా వైదిక మంత్రద్రష్టగా పరిణితి చెందాడు. ‘ప్రాచ్యసామగ’ పదవులాయన్ని వరించాయి. చివరగా చిదానంద స్వరూపాత్మకమైన భాస్కర దివ్య మండలంలో ప్రవేశించగలిగాడు.

            మహారాజా! ఇదీ సూర్యభగవానునికరుణ” అంటూ ముగించాడీ కథను సుమంతు మునీంద్రుడు