“ప్రభో వాసుదేవా! ఎంతటి వానికైనా మనస్సులో ఉద్వేగం, భేదం, భిన్నత, ఏదో ఒక విషయ వాంఛ, అది దొరకని, తీరని దరిద్రత ఉంటాయి కదా! వీటన్నిటినీ నివృత్తం చేసేది అద్భుత శాంతి(సామవేదీయ ‘అద్భుత బ్రాహ్మణం (తాండ్య - 26) లోనూ అథర్వ పరిశిష్ట (72)లోనూ అద్భుతశాంతి విస్తారంగా ఉల్లేంపబడింది) అని విన్నాను. మృతవత్సయైన స్త్రీకి, దుఃస్వప్న పీడితులకూ కూడా సుఖశాంతులను ప్రసాదించే ధర్మకార్యాలను అద్భుతశాంతి ప్రదాయకాలను ఉపదేశించండి.”
“మహారాజా! ఏ ప్రాణికైనా పూర్వజన్మలో చేసిన పాపమే ఈ జన్మలో రోగంగా, దుర్గతిగా ఇష్టజన మృత్యువుగా పరిణమిస్తుంది. అవశ్యం అనుభోక్తవ్యమవుతుంది. అయినా ఈ అనుభవాన్ని పరిమితం చేసే శక్తి భగవంతుడికుంటుంది. ఆయన ఈ వ్రతాల ద్వారా ప్రసన్నుడై దుఃఖనాశనానికి పూనుకుంటాడు. నీవడిగిన దానికి సమాధానం సప్తమీ స్నపనమను పేరుగల ఒక వ్రతం.
వరాహ కల్పంలో వైవస్వత మన్వంతరంలో సత్యయుగంలో హైహయ వంశ క్షత్రియుల శోభనూ కీర్తినీ వృద్ధిపఱచిన కృతవీర్య మహారాజు కొన్నివేల సంవత్సరాలు ధర్మంగా నీతిపూర్వకంగా రాజ్య పాలనం చేశాడు. ఎప్పటి పాపమోగాని అతని వందమంది పుత్రులూ చ్యవన మహర్షి శాపాగ్నిలో దగ్ధమైపోయారు. అప్పుడా మహారాజు విధిపూర్వకంగా సూర్యభగవానుని ఉపాసనను ప్రారంభించాడు. అతని ఉపవాస - వ్రత, పూజాస్తోత్రాలకు సూర్యభగవానుడు ప్రసన్నుడై అతనికి దర్శనమిచ్చి ఇలా అన్నాడు, ‘కృతవీర్యా! నీకు కార్తవీర్యుడనే సుందర, చిరాయుపుత్రుడు పుడతాడు. కాని, నీవు ముందుగా పూర్వజన్మ పాపాలన్నిటి నుండీ విముక్తుడవు కావాలి. దానికై స్వపన - సప్తమి అను పేరుగల వ్రతాన్ని నీవు ఆచరింపవలసి యున్నది. నీ మృత వత్సయగు పత్ని (నీ భార్యలలో ఎవరికైతే పిల్లలు మరణించారో ఆమె)కి పుత్రుడు పుట్టిన ఏడవ నెలలో ఆ బాలకుని జన్మనక్షత్ర తిథిని తప్పించి ఇతర శుభదినాల్లో నొకరోజు తారాబలం చూసుకొని బ్రాహ్మణుల చేత స్వస్తి వాచనం చేయించు. రోగులు, వృద్ధులు, అన్యులు ఎవరికోసం ఈ వ్రతం చేసినా వారి జన్మనక్షత్ర తిథులను వదిలి మిగతా వాటిలోనే వ్రతం చేయాలి.
అగహనీ (మార్గశిర మాసంలో కోతకు వచ్చు) బియ్యాన్ని ఆవుపాలతో కలిపి హవ్యాన్నమును తయారుచేయించి మాతృకను, సూర్యుని, రుద్రుని తుష్టికోసమై అర్చించాలి. తరువాత సూర్య దేవుని నామంతో అగ్నిలో నేతితో ఏడు ఆహుతులను ప్రదానం చెయ్యాలి. తరువాత రుద్రసూక్తంతో ఆహుతులివ్వాలి. జిల్లేడు, పలాశ సమిధలనే వాడాలి. హవనకార్యంలో నల్లనువ్వులు, యవధాన్యము, నెయ్యిలతో నూటయెనిమిది ఆహుతులనివ్వాలి. హవనంచేశాక ప్రతి శీతల గంగాజలంతో స్నానం చేసి కుశలను చేత బట్టి ఒక వేదజ్ఞ బ్రాహ్మణుని దర్శకత్వంలో నాల్గు కోణాల్లో నాలుగు సుందరములైన కలశాలను స్థాపించాలి. తరువాత వాటి మధ్య ఛిద్రరహితమైన ఐదవ కలశను స్థాపించాలి. దానిని అక్షతలతో పెరుగుతో అలంకరించి సూర్య సంబంధితమైన ఏడు ఋగ్వేదమంత్రాల (ఋచాల)తో అభిమంత్రించాలి. అప్పుడందులో తీర్థజలాన్ని నింపి రత్నాన్ని గాని సువర్ణాన్ని గాని వేయాలి. తరువాత అన్ని కలశలలోనూ సర్వౌషధుల బిందువులను, పంచగవ్యాలను, పంచరత్నాలను, ఫలాలను, పుష్పాదులను వేసి వాటిని చక్కటి వస్త్రాలతో చుట్టాలి. తరువాత ఏనుగులసాల, గుఱ్ఱాలసాల, విమోటం, నదీ సంగమం, చెఱువు, గోశాల, రాజద్వారం - ఈ యేడింటి నుండి మన్నును తెచ్చి అన్ని కలశలలో వేయాలి.
కులపురోహితుడు లేదా బ్రాహ్మణుడు మధ్యలో నున్న అయిదవ కలశను చేతిలోకి తీసుకొని సూర్యమంత్రాలను పఠించాలి. ఏడుగురు సులక్షణలైన స్త్రీల నాహ్వానించి వారిని పుష్పమాలలతో, వస్త్రభూషణాదులతో సత్కరించి వారిచేత ఈ కలశలలోని నీటిద్వారా ప్రతియు మృతవత్సయునగు స్త్రీని ఈ విధంగా దీవిస్తూ అభిషేకింపజేయాలి.
దీర్ఘాయురస్తుబాలోఽయం జీవపుత్రాచు భావినీ।
ఆదిత్యచంద్రమాసార్ధం గ్రహనక్షత్ర మండలం॥
శక్రః సలోకపాలోవై బ్రహ్మవిష్ణుర్మహేశ్వరః।
ఏతేచాన్యే చవైదేవాః సదాపాంతు కుమారకం॥
మాశనిర్మాసహుత భుంగ్మాచ బాలగ్రహాః క్వచిత్!
పీడాంకుర్వంతు బాలస్య మామాతృజనకస్యవై॥ (ఉత్తరపర్వం - 52/26,28)
అభిషేకానంతరం ఆ స్త్రీ తెల్లబట్టలు కట్టుకొని తన పతితో సహా భక్తిపూర్వకంగా ఆ యేడుగురు స్త్రీలనూ పూజించాలి. తరువాత గురువుగారిని కూడా పూజించి ఒక తామ్రపాత్రపై యమధర్మరాజు స్వర్ణ ప్రతిమ నుంచి ఆయనకు నివేదించాలి. అలాగే ఏ మాత్రము కక్కుర్తి పడకుండా నేతితో పాయసంతో విశిష్ట భక్ష్య పదార్థాలతో అన్య బ్రాహ్మణులను కూడా భోజనం ద్వారా తృప్తులను గావించి వీలైనంతగా స్వర్ణాన్నీ వస్త్రాలనూ రత్నాలనూ దానం చేయాలి. ఈ పూజల్లో ప్రతి అంశంలోనూ ఆ ఏడునెలల బాలకుని కూడా కలుపుకుంటూ పోవాలి. బ్రాహ్మణులంతా ఆ బాలకుని ఈ క్రింది మంత్రం ద్వారా ఇలా దీవించాలి:
దీర్ఘాయురస్తుబాలోఽయం యావద్వర్షశతం సుఖీ।
యత్కించిదస్యదురితం తత్‌క్షిప్తం వడవాముఖే॥
బ్రహ్మరుద్రో విష్ణుః స్కందో వాయుః శక్రోహుతాశనః।
రక్షంతు సర్వేదుష్టేఽవరదా యాంతు సర్వదా॥ (ఉత్తరపర్వం 52/32,33)
బ్రాహ్మణులను సగౌరవంగా వీడ్కొలిపిన పిమ్మట మృతవత్సయైన స్త్రీ బాలకుని ఒడిలో నిడుకొని సూర్యదేవునికీ శంకరభగవానునికీ స్తోత్ర సహిత నమస్కారాలను చేయాలి. హవనం చేయగా మిగిలిన హవ్యాన్నమును ‘సూర్యదేవాయనమః’ అంటూ హవనం చేయాలి. మనసుపై ఒత్తిడినీ దుఃస్వప్నాలనీ కూడా ఈ వ్రతం దూరం చేస్తుంది.
ఈ వ్రతప్రభావం వల్లనే కార్తవీర్యుడు చిరజీవియై పదివేల సంవత్సరాల దాకా జీవించి రాజ్యపాలన చేశాడు. (చిరజీవి సరైన పదమే. సున్న అవసరం లేదు)
ఆరోగ్యం భాస్కరాదిచ్ఛేద్ధన మిచ్ఛేత్ హుతాశనాత్।
శంకరాత్ జ్ఞానమిచ్ఛేత్‌తు గతిమిచ్ఛేత్ జనార్దనాత్॥
ధర్మజా! రోగ నాశనం కోసం సూర్యునీ, ధనం కోసం అగ్నినీ, జ్ఞానానికై శంకరునీ, మోక్షేచ్ఛవుంటే విష్ణువునీ ఉపాసించాలి.”