198 - 209 - భీష్మ వ్యాస సంవాదంలో సూర్య మహిమ - అర్ఘ్యం - ఆదిత్యపూజ

            “గురుదేవా! ఈ లోకంలో మనుష్యులందరూ శుభ, పుణ్య, సుఖాలకై ఏ దేవుని పూజాస్తుతులను చేయాలి? దేవోత్తముడెవ్వరు? అన్ని ధర్మాలలోకి శ్రేష్ఠ ధర్మమేది? బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా ధ్యాన మగ్నులై ఎవరికోసమో తపస్సు చేస్తుంటారు కదా! వారెవరు? దయచేసి చెప్పండి.”

            ఇలా అభ్యర్థించిన శతానీకుని చూసి సంతోషించాడు సుమంతుడు. త్రిమూర్తులే ఎవరినో ధ్యానిస్తూ ఎవరికోసమో తపిస్తూ వుంటారని తెలుసుకోవడానికే గొప్ప జ్ఞానం కావాలి. అలాటి జ్ఞానుల జ్ఞానాన్ని మరింత పెంచడం తన విధి. చెప్పడం మొదలుపెట్టాడు.

            “హే రాజేంద్రా! అన్ని పాపాలనూ, వినినంతనే నాశనం చేసి, సుఖాలను ప్రదానం చేసే పుణ్య సంవాదమొకటుంది. అందులో నీ ప్రశ్నలన్నిటికి జవాబులు దొరుకుతాయి. ఒకరోజు వేదవ్యాసమహర్షి గంగాతీరంలో కూర్చుని వున్నారు. ఆయన అగ్నితో సూర్యునితో సమానమైన తేజస్సుతో వెలిగిపోతున్నారు. సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే ఋుషిగా అవతరించి గంగఒడ్డున కూర్చున్నాడేమో అన్నట్లున్నారు. అన్ని లోకాలలోని ఋషులకూ, రాజర్షులకూ పరమగురువైన ఆయనే మహాభారతకర్త, కురువంశాభివృద్ధికి కారకుడు కూడా. ఆయనవద్దకు పరమపూజ్యుడు, రాజర్షి, మహాతేజస్వి, స్థితప్రజ్ఞుడునైన భీష్మపితామహుడు వచ్చి సాష్టాంగనమస్కారం చేసి నిలబడి ఇలా ప్రార్థించాడు.

            ‘ఓ మహామతివైన పరాశరనందనా! నాకు యోగవిద్యా గురువులైన మీరు సంపూర్ణ వాఙ్మయాన్నీ వ్యాఖ్యా సహితంగా నాకు వివరించారు. అయినా నాకు భాస్కర భగవానులకు సంబంధించి ఒక సందేహం ఉండిపోయింది. గురువర్యా! సర్వప్రథమంగా ఆదిత్య భగవానులకు నమస్కారం చేసిన తరువాతనే అన్యదైవతాలను పూజించడం జరుగుతున్నది. దీనికి కారణమేమిటి? అసలీ భాస్కరభగవానులెవరు? ఎక్కడి నుండి ఉత్పన్నులైన్నారు. అని కూడా కొందరడుగుతుండడం జరుగుతున్నది. హే ద్విజశ్రేష్ఠా! లోక కల్యాణం కోసం తమరు ఆ పరమతత్త్వాన్ని గూర్చిన జ్ఞానాన్ని నాకు కలిగించండి.

            ‘భీష్మా! బ్రహ్మ, సిద్ధులు - ఇతర దేవగణాలు భాస్కర భగవానుని స్తుతి, పూజన, అర్చన చేస్తూంటారు. అందరు దేవుళ్ళ(లో) కీ ఆదిదేవుడని సర్వత్ర చెప్పబడుతున్నది సూర్యదేవుడేకదా! అన్ని లోకాలనూ దిశలనూ అంధకారం నుండి కాపాడి వెలుగులలో నిలబెట్టినది ఆయనే కదా! అన్ని ధర్మాల యొక్క శ్రేష్ఠస్వరూపమే ఆదిత్యుడు. ఆయనే పూజ్యతముడు. త్రిమూర్తులు నిత్యమూ ధ్యానించేది ఆయననే. అదితిపుత్రుడు కాబట్టే సూర్యుని ఆదిత్యుడనుటలేదు. ఆయన ఈ విశ్వానికే ఆదికర్త, అన్నివిధాలా తొలిదైవతం. కాబట్టి కూడా సూర్యుని ఆదిత్యుడంటున్నారు. ఈ సంపూర్ణ జగత్తుకీ, దేవ, అసుర, గంధర్వ, సర్వ రాక్షస,పక్షి - ఆదిగణాలతో చివరికి తన తండ్రియైన కశ్యపుని జన్మకూ కూడా కారణమైనవాడు సూర్యనారాయణుడే. కాబట్టి ఆయన దేవతలలో సర్వశ్రేష్ఠుడు పూజ్యతముడు.’

            ‘వ్యాసదేవా! మరి ఇంతటి మహానుభావుడిని రాహువు కబళిస్తాడని వింటూ వుంటాము కదా’, అదెలా సాధ్యం?’

            ‘రాక్షస, పిశాచ, సర్ప, డాకిన్యాదులు సూర్యునిపై ఆక్రమణకు ప్రయత్నం చేస్తూనే వుంటాయి. ఆయన ఇచ్చిన శక్తులతోనే ఆయన చేతిలోని కాలముహూర్తాలలోనే అవి ఆయనను దెబ్బకొడుతుంటాయి. విశ్వంలో ధర్మం సూర్యునే తనకు ఏకమాత్ర ఆధారంగా చేసుకొని ప్రవర్తితమవుతుంది. బ్రహ్మాది దేవతలందరూ సూర్యమండలంలో నే వుంటారు. ఆయనకు నమస్కరిస్తే అది అందరు దేవతలకూ అంది అందరూ దీవెనలిస్తారు, శుభాలు కురిపిస్తారు. ఇక రాహువు సంగతంటావా వీడాయన్ని పట్టుకొని కొరికిందీ లేదు ఆయన వీడికి దొరికిందీ లేదు. సూర్యరథం అమృతమయం. దానిక్రింది భాగంలో అమృతభాండం కూడా వుంటుంది. రాహువు తన విరామ సమయాల్లో వచ్చి ఆ రథం క్రింది భాగంవైపు నోరు తెఱచుకొని దూసుకుపోతుంటాడు, కొన్ని సమయాల్లో మరీ దగ్గరకు చేరుకుంటాడు. అది సూర్యదేవుని ఎవరో మింగేస్తున్నట్టు మనకి కనిపించడం భగవన్మాయ. కొన్ని ప్రత్యేక పూజల కోసం దాన్నే గ్రహణంగా భగవంతుడు మనచే భావింపజేశాడు. అంతే గాని వీడు ఆయన్ని కొరికేదీ లేదు ఆయన వీడికి దొరికేదీలేదు.

            ‘మహాత్మా! నాకు సౌరధర్శస్నానాన్ని అందులోని రహస్యసహితంగా మీ ద్వారా వినాలని వుంది. అది ఆదిత్యపూజకూ, ఆ పూజ సుఖమోక్షాలకూ ఆలవాలముని విని యున్నాను. మీరే ఎందుకు నన్ననుగ్రహించాలని వేడుకొంటున్నానంటే శంఖంలో పోస్తేనే కదా తీర్థమయ్యేది.’

            ‘సంతోషం భీష్మా! అన్ని ప్రకారాల పాపాలనూ ప్రాకారాలు దాటించి తగిలేసే సూర్యోపాసనలో ఈ స్నానానిదొక పవిత్రపాత్ర. ముందుగా ఒక పవిత్ర స్థలం నుండి మట్టిని సేకరించి ఇంటికి వచ్చి దానిని వంటి నిండా పట్టించుకోవాలి. తరువాత సూర్యాభిమంత్రిత జలాలతో స్నానంచేసి శంఖాదులను మ్రోగిస్తూ సూర్యదేవుని ధ్యానించాలి. హ్రాం హ్రీం సః అనే మంత్రరాజంతో సూర్యునుద్దేశించి ఆచమనం చేయాలి. తరువాత దేవతలకూ ఋషులకూ తర్పణలిస్తూ వారిని స్తుతించిన పిమ్మట జందెమును అపసవ్యం చేసుకొని పితృదేవతలకు తర్పణలిచ్చి సంధ్యావందనం చేయాలి. తరువాత భాస్కరభగవానునికి దోసిళ్ళతో నీటిని అర్ఘ్యమివ్వాలి. మరల స్నానం చేసి మూడక్షరాల హ్రాం హ్రీం సః మంత్రాన్ని గాని, ఆరక్షరాల ఖఖోల్కాయనమః మంత్రాన్ని గాని జపించాలి. మూడక్షరాల మంత్రంతో హృదయన్యాసం కూడా చెయ్యాలి. తరువాత సూర్యదేవునికి మరల అర్ఘ్యప్రదానం గావించాలి. ఒక రాగి పాత్రలో గంధము, ఎర్రచందనాదులతో మండలాన్ని తయారు చేసి దానిలో గన్నేరు మున్నగు పూలను, గంధపునీరు, రక్తచందనం, కుశ, తిల, బియ్యం మున్నగువాటిని పోసి మోకాళ్ళపై కూర్చొని ఆ పాత్రను భక్తిగా శిరస్సుపై పెట్టుకొని భక్తిపూర్వకంగా ఇందాకటి మూడక్షరాల మంత్రరాజాన్ని జపిస్తూ సూర్యదేవునికి మరల అర్ఘ్యప్రదానం చేయాలి. ఈ విధానంతో సూర్యదేవుని అర్చించిన వారికి అన్ని పాపాల నుండీ విముక్తితోబాటు వేల కొద్దీ సంక్రాంతుల, చంద్ర గ్రహణాలలో పూజ చేసిన పుణ్యం, వెయ్యి గోవులను దానంచేసిన పుణ్యం, పుష్కర, కురుక్షేత్రాది తీర్థాలను స్నానంచేసి సేవించిన పుణ్యం లభిస్తాయి. సౌరదీక్షా విహీనుడైనా సూర్యదేవునికి సంవత్సర పర్యంతము అర్ఘ్యప్రదానం చేస్తే వానికి కూడా ఇదే ఫలితం ప్రాప్తిస్తుంది. ఇక దీక్షాగ్రహణం చేసి సూర్యపూజలను గావించేవాని అదృష్టము గూర్చి చెప్పాలా! అతడు భాస్కరభగవానునిలో లీనమైపోతాడు.’

            పూజావిధినడిగిన భీష్మునికి వ్యాసుడిలా చెప్పసాగాడు. ‘గాంగేయా! ఆదిత్యపూజకు ముందుగా వ్రతి స్నానాదులచే పవిత్రం కావాలి. ఏదైనా శుద్ధ ఏకాంతస్థానంలో ప్రసన్నంగా కూర్చుని పూజ చేయాలి. ఒక శ్రేష్ఠమైన సుందరమైన ఆసనంపై తూర్పు ముఖంగా కూర్చొని సూర్యమంత్రాలతో కరన్యాస, హృదయన్యాసాలు చేసుకోవాలి. దీని ద్వారా కలిగిన ఆత్మశుద్ధి వలన సూర్యుడు నా వాడు అనే భావన ఏర్పడుతుంది. తరువాత నేనే భాస్కరుడను అనే భావాన్ని కలిగించుకొని స్థండిలపై స్వామిని స్థాపించి పూజించాలి. దక్షిణం వైపు పూలసజ్జనూ, ఎడమవైపు నీటితో నింపిన రాగిపాత్రనూ పెట్టాలి. పూజా ద్రవ్యాలన్నిటినీ అర్ఘ్యపాత్రలోని జలాలతో సంప్రోక్షించి పూజ చేసి తదనంతరం సూర్య మంత్రాలను జపించాలి.’

            ‘మహాత్మా! సూర్యభగవానుని వైదిక అర్చనా విధిని విశదీకరించవలసిదని ప్రార్థిస్తున్నాను’.

            ‘శాంతనవా! భీష్మా! ఈ విషయమై పరమ సురజ్యేష్ఠులైన బ్రహ్మ విష్ణువుల సంవాదమొకటుంది. దానిని వింటే నీకు కావలసిన విశదీకరణ ప్రాప్తిస్తుంది. మేరుపర్వతం మీద మనోవతీ అనే సభాస్థలిలో బ్రహ్మ అప్పుడప్పుడు కొలువు తీరుతుంటాడు. ఒకమారు బ్రహ్మ ఆ సభలో సుఖపూర్వకంగా వేంచేసి వుండగా విష్ణువక్కడికి వచ్చి భాస్కరభగవానుని ఆరాధనావిధిని మండలస్థుడైన సూర్యుని పూజా పద్ధతిని వివరించుమని అడిగాడు. బ్రహ్మ ఇలా విన్నవించాడు.

            ‘హే పరంధామా! ఈ విశ్వవాసులకోసమై మీరు చాలా మేలైన విషయాన్నే వినాలని కోరారు. ఇంత గొప్ప విషయాన్ని మీ అంతటి వారికి చెప్పగలగడం నాకు మిక్కిలి ఆనందసంధాయకం.

            ఈ పూజలో ముందుగా భూమిని సంప్రదాయ పద్ధతిలో శోధించి శుద్ధి చేసి దానిపై కేసరాది గంధాలతో సప్తావరణయుక్తమైన, కర్ణికాసమన్వితమైన ఒక అష్టదళకమలాన్ని ఏర్పాటు చేయాలి. దానిలో తూర్పున మొదలై ఈశాన్యంతో అంతమయ్యేలాగ సూర్యుని దీప్తాది అష్టదివ్యశక్తులనూ స్థాపితం చెయ్యాలి. మధ్యలో సర్వతోముఖీదేవిని స్థాపించాలి. దీప్తా తోనే ప్రారంభింపబడే సూర్యదేవుని నవశక్తులు వేరేవున్నాయి. అవి దీప్తా, సూక్ష్మా, జయా, భద్రా, విభూతి, విమలా, అమోఘా, విద్యుతా, సర్వతోముఖీ శక్తులు. వీటిని కమలంలోకి ఆవాహన చేసి, కమలకర్ణికపై సూర్యభగవానుని స్థాపించాలి. ఉదుత్యం జాతవేదసం (యజు7/41) అగ్నిం దూతం (యజు22/17) అనే మంత్రాలను ఆవాహన, ఉపస్థానాలలో చదవాలి. ఆ కృష్ణేనరజసా (యజు33/43) మరియు హంసః శుచిషద్ (యజు 10/24) అనే మంత్రాలతో సూర్యభగవానుని పూజించాలి, అపసేతారకం - మంత్రంతో దీప్తాదేవిని పూజించాలి. ఆపై అదృశ్రమస్యకేతవో (యజు8/40) తో సూక్ష్మాదేవినీ, తరణీర్విశ్వదర్శతో (యజు33/36) తో జయానీ. ప్రత్యంగం దేవానా తో భద్రాదేవినీ, యేనా పావకచక్షసా (యజు 33/32) తో విభూతినీ, విద్యామేషీ అనే మంత్రంతో విమలా దేవిని పూజించాలి. ఇవే మంత్రాలతో ఇతర సూర్యశక్తులనూ, సప్తావరణ మధ్యస్థుడైన సూర్యభగవానునీ కూడా పూజించవచ్చు.

            మండలస్థ భాస్కరభగవానుని ప్రతిమారూపంలో ఇలా వైదికార్చితుని గావించాలి ‘ఇషేత్వో’ (యజు1/1) అనే మంత్రం చదువుతూ సూర్యుని శిరస్సును పూజించాలి. ‘అగ్నిమీళే’ (ఋగ్వే 1/1/1) అనే మంత్రంతో ఆయన కుడిచేతిని పూజించాలి. ‘అగ్న ఆయాహి’ (ఋగ్వే 6/16/0) అనే మంత్రంతో ఆయన రెండు పాదాలనూ పూజించాలి. ‘ఆజిఘ్న’ (యజు 8/42) అనే మంత్రం చదువుతూ పుష్పమాలను సమర్పించాలి. ‘యోగేయోగే’ (యజు11/14) అనే మంత్రంతో పుష్పాంజలిని సమర్పించాలి. ఆపై ‘సముద్రం గచ్ఛ’ (యజు 6/21), ‘ఇమంమే గంగే’ (ఋగ్వే10/75/5), ‘సముద్రజ్యేష్ఠాః’ (ఋగ్వే7/49/1) అనే మంత్రాలు చదువుతూ పాలతో స్నానాన్ని, ‘దధిక్రావ్ణో’ (యజు 23/32) అనే మంత్రం పఠిస్తూ నేతితో స్నానాన్నీ, ‘యా ఓషధీః’ (యజు 12/75 అనే మంత్రం ద్వారా ఓషధీస్నానాన్ని స్వామికి చేయించాలి. ఆ తరువాత ‘ద్విపదా’ (యజు 23/34) అనే మంత్రంతో ఆయనను ఉద్వర్తనం చేయాలి. ‘మానస్తోకే’ మంత్రం (మంజు 16/16) తో మరల స్నానం చేయించాలి. పిదప ‘విష్ణోరరాట’ (యజు 5/21) అనే మంత్రం పఠిస్తూ గంధంతో నీటితో స్నానం చేయించాలి. ‘స్వర్ణధర్ణ్శ’ (యజు18/50) మంత్రోచ్ఛాటన చేస్తూ స్వామికి పాద్యమివ్వాలి. ‘ఇదం విష్ణుర్విచక్రమే’ (యజు5/15) మంత్రంతో అర్ఘ్యమివ్వాలి. ‘వేదోఽసి’ (యజు2/21) మంత్రంతో యజ్ఞోపవీతాన్ని వేయాలి. ‘బృహస్పతే’ అనే మంత్రం (యజు 26/23) తో వస్త్ర - ఉపవస్త్రాదులను సమర్పించాలి పుష్పమాలతో స్వామిని అలంకరించాలి. ‘ధూరసి థూర్వ’ (యజు 1/8) అనే మంత్రంతో గుగ్గిలధూపాన్ని వేయాలి. ‘సమిద్ధో’ (యజు21/1) అనే మంత్రంతో దీపాన్ని పెట్టాలి. ‘దీర్ఘాయుస్త’ (యజు12/100) అనే మంత్రంతో అలక్తాన్ని వేయాలి. ‘సహస్రశీర్షా’ అనే (యజు31/1) మంత్రంతో సూర్యుని శిరస్సును పూజించాలి. ‘సంభావయా’ ‘విశ్వతశ్చక్షు’ (యజు17/11) మంత్రాలతో స్వామి నేత్రాలనూ సమస్త శరీరాన్ని పూజించాలి. చివరగా ‘శ్రీశ్చతేలక్ష్మీశ్చ’ (యజు 31/22) మంత్రాన్నుచ్చరిస్తూ విధివిధానయుక్తంగా సూర్యదేవార్చన చేయాలి.

            ‘విష్ణుదేవా! వ్యాసుడావిధంగా భీష్మునికి ఉపదేశించాడు. ఇక సూర్యవ్యోమ. పూజనంలో బంగారు, వెండిలోహాలు, అష్టధాతువులతో శృంగమయ వ్యోమాన్ని తయారుచేసి ఈ క్రింది వేద మంత్రాలతో పూజ చేయాలి. ‘మహిషావో” ‘త్రాతారమింద్ర’ (యజు20/50) ‘ఉదీరతా మవర’ (యజు 19/49) ‘నమోస్తు సర్వేభ్యో’ (యజు 13/6) అని చెప్పగా విష్ణువు సంతోషించాడు.”