భవిష్య పురాణము

103 - మహాకార్తికీ వ్రతం - కళింగ భద్ర కథ

శ్రీకృష్ణుని అనుగ్రహ భాషణమింకా కొనసాగుతోంది. ఇలా: “పాండవాగ్రజా పూర్వకాలంలో మధ్యదేశంతో వృష స్థల రాజ్యాన్ని పాలించే దిలీపుడను రాజుకు సర్వగుణ సంపన్నయైన కళింగ భద్రయను రాణి వుండేది. ఆమె దేవార్చన తత్పరయై బ్రాహ్మణుల కెల్లప్పుడూ దానాలిస్తుండేది. ఒకమారు ఆమె కార్తిక మాసంలో అర్ధసంవత్సర కృత్తికా వ్రతాన్ని చేయ సంకల్పించింది. ప్రత్యేక పారణలోనూ నిత్యపూజన, దాన, బ్రాహ్మణ భోజన, హవనాదులలోనూ తత్పరయై వుండేది. ఒకనాటి రాత్రి వత్రానంతరము ఆమె పతితో కలసి విశ్రాంతి తీసుకొనుచుండగా ఎక్కడి నుండో ఒక భయంకర సర్పం వచ్చి ఆమెను కాటువేయగా ఆమె వెంటనే మరణించింది. మరుజన్మలో ఆమె ఒక ఆడుమేకగా జన్మించింది. అయినా వ్రత ప్రభావంవల్ల నామెకు పూర్వజన్మ స్మృతి వుంది. ఈ జన్మలో కూడా తను కృత్తికా వ్రతాన్ని చేస్తానని నియమగ్రహణం చేసింది. మందకు దూరంగా వుంటూ ఉపవాసం చేయసాగింది.

ఒకనాడామె ఎవరి పొలంలోనో తిరుగాడుతుండగా దాని యజమాని వచ్చి పట్టుకొని తన ఇంటికి తీసుకువెళ్ళి గుంజకి కట్టేశాడు. విశిష్ట జాతస్మమరుడైన అత్రిమహర్షి ఆ దారంట వెళుతూ ఈ మేకను చూసి ఇది కళింగ భద్రయేనని పోల్చుకొనినవాడై ఆమెను బంధ విముక్తురాలిని చేశాడు. ఆమె పరుగున పోయి రేగు పత్రాలను తిని చల్లని నీటిని త్రాగి కృత్తికావ్రత పారణం చేసింది. అత్రి మహర్షి ఆ మేకకు యోగజ్ఞానాన్నుపదేశించి తన ఆశ్రమానికి వెళ్ళిపోగా ఆ యోగేశ్వరి మరల వ్రతాన్ని కొనసాగించి చివరకు దానిని సంపూర్ణంగావించుకొని యోగబలం ద్వారా ప్రాణత్యాగం చేసింది.

అనంతర జన్మలో ఆమె అహల్యా గౌతములకు కూతురుగా పుట్టింది. ఇప్పుడామె పేరు యోగలక్ష్మి. గౌతముడామెను శాండిల్య మహర్షికిచ్చి వివాహం చేశాడు. ఆమె శాండిల్యునింట సరస్వతీ, స్వాహా, శచీ, అరుంధతీ, గౌరీ, రాజ్ఞీ, మహాలక్ష్మి, మహాసతీ వంటి మహోత్తమ సాధ్వీమణుల తేజస్సుతో సమానమైన వెలుగుతో విరాజిల్లసాగింది. బ్రాహ్మణులకు భోజనాలు పెడుతూ, దేవతలకూ పితరులకూ అతిథులకూ సత్కారాలూ, ఇతర సత్కర్యాలూ చేస్తూ వుండగా ఒకనాడామె యింటికి వచ్చి ఆమెను చూడగానే ఆమె వృత్తాంతమంతా ఆకళింపు చేసుకున్నవాడై:

‘మహాభాగే యోగలక్ష్మీ! కృత్తికలెన్ని?’ అని అడిగాడు అత్రిమహర్షి.

వెంటనే యోగలక్ష్మికి తన కళింగ భద్ర జన్మకూడా గుర్తు వచ్చింది.

‘మహాయోగీ! కృత్తికలు ఆరు’ అని బదులిచ్చింది. కాని ఆమెకు మహాకార్తికీ విధానం ఇంకా పూర్తిగా గుర్తుకు రాలేదు. అప్పుడతి దయాళువైన అత్రి మహర్షియే ఆమెకు మంత్ర సహితంగా కృత్తికా వ్రతాన్నుపదేశించాడు. ఆమె ఆ వ్రతాన్నాచరించి చిరకాలం సర్వ సంసార సుఖాలూ అనుభవించి దేహాంతంలో మోక్ష ప్రాప్తినందింది.

ధర్మరాజా! ఇక ఈ వ్రత విధానాన్ని ఆకర్ణించు కార్తిక పౌర్ణమి, కృత్తికా నక్షత్రం, సోమ లేదా గురువారం ఒకమారు కలసివస్తే దానిని మహాకార్తికీ యోగమంటారు. ఈ యోగం దుర్లభం కాబట్టి సాధారణ కార్తిక పున్నమనాడే ఈ వ్రతాన్ని చేయవచ్చు. ఆరోజు పొద్దున్నే నక్తవ్రతాన్నో ఉపవాసాన్నో నియమంగా, గ్రహించి వీలైనంతవఱకు పుష్కర, ప్రయాగ, కురుక్షేత్ర, నైమిష, శాలగ్రామ, కుశావర్త, మూలస్థాన, సకుంతల, గోకర్ణ, అర్బుద, అమర కంటకాది పవిత్ర క్షేత్రాలలో నొకదానిలో గాని అది కుదరకపోతే తన ఇంటిలోనేగాని స్నానం చేయాలి. తరువాత దేవతలనూ, ఋషులనూ, పితరులనూ, అతిథులనూ పూజించి హవనం చేయాలి. సాయంకాలం బంగారం, వెండి, రత్నాలు, నవనీతం అన్నకణాలు, పిష్టాలతో కృత్తికల ఆరుమూర్తులను తయారుచేసి వాటిని నెయ్యి, పాలు నింపిన ఆరు పాత్రలలో స్థాపించాలి. పిమ్మట వాటిని ఎఱ్ఱదారాలతో చుట్టి సింధూర, కుంకుమ, చందన, మల్లికా, ధూపదీపనైవేద్యాదులతో పూజించి ఆ కృత్తికల మూర్తులను బ్రాహ్మణునకు దానం చేయాలి. దానమిస్తున్నపుడీ క్రింది మంత్రాన్ని పఠించాలి:

ఓం సప్తర్షి దారా హ్యనలస్య వల్లభా

యాబ్రహ్మణా రక్షితయేతి యుక్తాః

తుష్టాః కుమారస్య యథార్థ మాతరో

మమాపి సుప్రీత తరాభవంతు (ఉత్తరపర్వం- 103/37)

బ్రాహ్మణుడీ క్రింది మంత్రాన్నుచ్చరిస్తూ మూర్తి దానాన్ని గ్రహించాలి :

ధర్మదాః కామదాః సంతు ఇమా నక్షత్రమాతరః

కృత్తికా దుర్గ సంసారాత్ తారయంత్య వయోః కులం (ఉత్తరపర్వం - 103/39)

బ్రాహ్మణుడింటికి పోవునపుడు యజమాని ఆయనతో కలసి ఆరడుగుల దూరం పయనించాలి. ఈ ప్రకారం ఈ వ్రతాన్ని చేసే పురుషునికి సూర్య సమాన ప్రకాశమాన విమానమెక్కి నక్షత్ర లోకానికి పోయే భాగ్యమబ్బుతుంది. స్త్రీకి కూడా పతితో సహా నక్షత్ర లోక నివాస మబ్బుతుంది.