భవిష్య పురాణము

19 - ప్రతిష్ఠాముహూర్తం, జలాశయాది ప్రతిష్ఠావిధి

బ్రాహ్మణులారా! దేవతాది ప్రతిష్ఠలకై మహర్షులు మాఘ ఫాల్గునాది ఆరుమాసాలను నిర్ణయించారు. విష్ణుభగవానుడు శయనించేలోగానే ప్రతిష్ఠలన్నీ జరిగిపోవాలి. శుక్ర, గురు, బుధ, సోమ ఈ నాలుగు వారాలు శుభప్రదాలు. శుభలగ్నం వున్నపుడూ, శుభగ్రహాలు దానివైపు చూస్తున్నపుడూ ప్రతిష్ఠచేయాలి. తిథులలో విదియ, తదియ, పంచమి, సప్తమి, దశమి, త్రయోదశి, పౌర్ణమి ఉత్తమాలు. ప్రాణప్రతిష్ఠ, జలాశయాది కార్యాలకు కూడా ప్రశస్త శుభముహూర్తాలలోనే పూనుకోవాలి. దేవప్రతిష్ఠకూ పెద్దపెద్ద యాగాలకూ పదహారు జానల, నాలుగు ద్వారాల మండపాన్ని నిర్మించి దాని దిశలలో, విదిశలలో శుభ్ర ధ్వజాలనెగురవేయాలి. పాకడ మేడి, అత్తి. రావి, మఱ్ఱి తోరణాలను పూర్వాది క్రమంలో నాలుగు ద్వారాలకూ కట్టాలి. మాలలతో ఇతరాలతో అలంకరించాలి. దిక్పాలకుల పతాకలను వారి వారి ప్రత్యేకవర్ణాలలో చేయించి పెట్టాలి. మధ్యలో నీలవర్ణ పతాకను పెట్టాలి. ధ్వజదండం పదిహస్తాల పొడవుంటే పతాక అయిదడుగులుండాలి. మండప ద్వారాలపై అరటి స్తంభాన్ని నిలబెట్టాలి. ఆ తరువాత మండపాన్ని బాగా అలంకరించాలి. మండపం మధ్యలోనూ మూలల్లోనూ హోమవేదికలు వచ్చేలా నిర్మించాలి. వేదీ నిర్మాణంలో, యోని, మేఖలామండిత కుండాలనూ వేదిపై సర్వతోభద్ర చక్రమునూ నిర్మించుట ముఖ్యము. కుండము యొక్క ఈశాన్యభాగంలో కలశను స్థాపించి దానిని మాలాదులతో అలంకరించాలి.

యజమాని పంచదేవులకు, యజ్ఞేశ్వరుడైన నారాయణునకు నమస్కారము చేసి ప్రతిష్ఠాది క్రియలకు సంకల్పించి బ్రాహ్మణులను ఈ విధంగా వేడుకోవాలి. ‘భూసురులారా! నేనీ పుణ్యభూమిలో శాస్త్రోక్తపద్ధతిలో జలాశయాదులను ప్రతిష్ఠించాలనుకుంటున్నాను. మీరందరూ నాకు అనుజ్ఞనివ్వండి’. ఇలా పలికి, పొంది మాతృశ్రాద్ధాన్ని వృద్ధిశ్రాద్ధాన్ని పెట్టాలి. భేరీమున్నగు మంగళవాద్యాలు మ్రోగిస్తూ మండపంలో షోడశాక్షరయుక్త హరేరామ హరేరామ రామ రామ హరే హరే వంటి మంత్రాలను లిఖించి, ఇంద్రాది దిక్పాలకులనూ వారి ఆయుధాలనూ సముచిత స్థానాలలో చిత్రించాలి. తరువాత ఆచార్యునీ ఇతర బ్రాహ్మణులనూ వరించాలి. వారప్పుడు యజమానుని పట్ల ప్రసన్నులై అతని సర్వవిధ శుభాలనూ కోరుతూ స్వస్తి అని దీవిస్తారు. పిమ్మట (భార్యతోకూడిన) సపత్నీకుడైన యజమానిపై సర్వౌషధీజలం (అన్నిరకాల ఓషధులనూ కలిపిన నీటిని) తలంటిన పద్ధతిలో ఆపోహిష్ఠాం (యజు. 11/50) అనే మంత్రాన్ని చదువుతూ బ్రహ్మా, ఋత్విక్కూ పోస్తారు. యవ, గోధుమ, నీవార, తిల, నల్ల ఆవబీజ, సామ్వా, శాలి, వ్రీహి - ఈ ఎనిమిదింటినీ సర్వౌషధిగా వ్యవహరిస్తారు. ఆచార్యాదుల ఆదేశానుసారం యజమాని భార్యతో సహా ధవళ వస్త్రాలను, చందనాదులను ధరించి పురోహితుని ముందిడుకొని మంగళఘోషధ్వనిస్తుండగా పుత్ర, పౌత్రాదులతో బయల్వెడలి పశ్చిమద్వారం గుండా మండపంలోకి ప్రవేశించాలి. అక్కడి వేదికి ప్రదక్షిణ చేసి నమస్కరించాలి. బ్రాహ్మణులు స్వస్తివచనాలు చెప్పిన అనంతరం యజమానిచే అయిదుగురు దేవతలకు పూజ చేయిస్తారు. యజమాని అపుడు విఘ్నకర్తలైన భూతాలకు ఆవాలతో అపసర్పణం చేయాలి. తన ఆసనాన్ని పుష్ప చందనాలతో అర్చించి భూమిపై చేతిని వేసి ఇలా ప్రార్థించాలి. (మధ్యమపర్వం. 2/20/23)

పృథ్విత్వ యాధృతా లోకా దేవిత్వం విష్ణునాధృతా

త్వంచధారయమాం నిత్యం పవిత్రమాసనం కురు ॥

అప్పుడు సూర్యునికి అర్ఘ్యమిచ్చి గురువుకి చేతులు జోడించి నమస్కరించి, హృదయ కమలంలో ఇష్టదేవతనూహించుకొంటూ మూడుమార్లు ప్రాణాయామం చేయాలి. ఈశాన్యం వైపున్న కలశలో కొలువైన విఘ్న విధ్వంసకుడైన గణపతిని గంధ, పుష్ప, వస్త్ర, వివిధ నైవేద్యాదులతో గణానాంత్వా.. (యజు. 23/19) తరువాత ఆబ్రహ్మన్.. (యజు. 22/22) అనే మంత్రంతో బ్రహ్మదేవునికీ, తద్విష్ణోః.. (యజు. 6/5) అనే మంత్రంతో ‘విష్ణుభగవానునికీ పూజ చేయాలి. తరువాత మరొక్కమారు దేవతలందరినీ వారి వారి స్థానాలలో స్థాపించి పూజ చేయాలి. తరువాత రాజాధిరాజాయప్రసహ్య.. అనే మంత్రంతో భూశుద్ధిని గావించి శ్వేతపద్మాసనం పై విరాజమానుడై శుద్ధస్ఫటిక, శంఖ, కుంద, ఇందు సమానఉజ్జ్వల శరీరవర్ణుడై, కిరీట కుండల ధారియై, శ్వేత కమలమాల, వస్త్ర, అలంకృతుడై, శ్వేతగంధానులిప్తుడై పాశహస్తుడై, సిద్ధ గంధర్వ దేవతాసంస్తూయమానుడై, నాగలోక శోభారూపుడై, మకర, గ్రాహ, కూర్మాది నానా జలచరావృతుడై, జలశాయియై నరజాతిని నానావిధ సంపన్నము చేయు వరుణదేవుని ధ్యానించాలి. ధ్యానానంతరం పంచాంగన్యాసం చేసుకోవాలి. అర్ఘ స్థాపనం చేసి మూలమంత్ర జపంచేస్తూ ఆ జలంతో ఆసనాన్నీ, యజ్ఞ సామగ్రినీ ప్రోక్షణ చేయాలి. మరల సూర్యభగవానునికి అర్ఘ్యమివ్వాలి. అనంతరం ఈశాన్యకోణంలో నున్న గణేశునితో మొదలు పెట్టి అగ్నికోణంలో నున్న గురుపాదుకతో సహా యథాక్రమంగా అందరు దేవతలనూ పూజించాలి. మండల మధ్యంలో శక్తి, సాగర, అనంత పృథ్వి, ఆధారశక్తి, కూర్మ, మందర, సుమేరు, పంచతత్త్వాలను ఆరోపించి సాంగోపాంగంగా పూజించాలి. తూర్పువైపు కలశపై శ్వేతాక్షతలనూ, పుష్పాలను వేసి భగవానుడైన వరుణదేవుని ఆవాహన చేయాలి. ఆయనకు ఎనిమిది ముద్రలను చూపించాలి. గాయత్రి చేస్తూ స్నానం చేయించి పాద్యం, అర్ఘ్యం, పుష్పాంజలి వంటి అన్ని ఉపచారాలతో వరుణదేవ పూజనం సాగాలి, గ్రహాలకూ లోకపాలకులకూ, దశదిక్పాలురకూ యథావిధిగా పూజలు సలిపి, పీఠంపై బ్రహ్మ, శివ, పృథ్వి, గణేశులను స్థాపించి గంధ చందనాదులతో పూజించాలి. పీఠముయొక్క ఈశానాది కోణాలలో కమల, అంబిక, విశ్వకర్మ, సరస్వతిలనూ పూర్వాదిద్వారాలలో అందరు మరుద్గణాలనూ, స్థాపించి పూజించాలి. పీఠానికి వెలుపల పిశాచ, రాక్షస, భూత, బేతాళాదులను కూడా పూజించాలి. కలశంపై సూర్యాది నవగ్రహాలనూ ఆవాహన చేసి ధ్యానం చేసి పాద్య, అర్ఘ్య, గంధ, అక్షత, పుష్ప, నైవేద్య, బల్యాదుల ద్వారా మంత్ర పూర్వకంగా పూజించాలి. వారి వారి పతాకలను వారికి నివేదించాలి. తరువాత శతరుద్రియాన్ని పఠించాలి. (శతరుద్రీయం అనే మాట కూడా వాడుకలో వుంది) వారుణ సూక్తము, రాత్రిసూక్తము, రౌద్రసూక్తము, పవమానసూక్తము, పురుషసూక్తము, శాక్తసూక్తము, అగ్ని సూక్తము, సౌరసూక్తము, జ్యేష్ఠసామము, వామదేవసామము, రధంతరసామము, రక్షోఘ్నము - ఇత్యాదులను సరైన స్వరాలతో ఉచ్చరిస్తూ, గానం చేస్తూ హవనం అర్పించాలి. తన గృహోక్త విధి ప్రకారం కుండంలో అగ్నిని ప్రదీప్తం చేసి హవనాలు చేయాలి. ఏ దేవతను ప్రసన్నం చేసుకోవడం కోసం యజ్ఞం చేయబడుతోందో, ఏ దేవతను ప్రతిష్ఠిస్తున్నామో ఆ దేవతకే ప్రథమంగా ఆహుతులను సమర్పించాలి. అనంతరం తిల, ఆజ్య, పాయస, పత్ర, పుష్ప, అక్షత, సమిధాదులతో ఇతర దేవతలకు కూడా మంత్ర సహితంగా హవనం చేస్తూ ఆహుతులను సమర్పించాలి.

పంచదివసాత్మక - అంటే అయిదు పగళ్ళపాటు జరిగే - ప్రతిష్ఠాయాగంలో తొలిదినం దేవతలను ఆవాహనం చేసి స్థాపించాలి. మలిదినం పూజన, హవనాలూ మూడోరోజు బలి ప్రదానం, నాలుగవ రోజు చతుర్థీకర్మమూ, చివరిరోజు నీరాజనసమర్పణమూ చెయ్యాలి. ముందు నిత్యకర్మనూ, తరువాత నైమిత్తిక కర్మనూ నెరవేర్చాలి.

ఇతర యజ్ఞాలలో రెండవరోజు ప్రాతఃకాలమే మొట్టమొదట బ్రాహ్మణుల ద్వారా, ప్రతిష్ఠ చేయబడుతున్న దేవతకు సర్వౌషధ మిశ్రిత జలాలచే వేద మంత్ర పాఠపూర్వకంగా మహాస్నానమునూ, మంత్రాభిషేకాన్ని చేయించాలి. తరువాత చందనాదులను దేవతలకు పూయాలి. తరువాత ఆచార్యాదులను యజమానియే స్వయంగా అలంకరించి, పూజించి వారికి గోవులను దానమివ్వాలి. పిమ్మట మంగళఘోషల నడుమ తటాకంలోకి నీటిని వదలడానికి సంకల్పించాలి. నీటిని వదిలాక అందులోకి నాగయుక్త వరుణ, మకర, కచ్ఛపాది అలంకృతప్రతిమలను ప్రవేశపెట్టాలి. వరుణదేవునికి విశేషంగా పూజలు చేసి అర్ఘ్యమివ్వాలి. తరువాత ఆ తటాక జలాన్నీ, సప్తమృత్తికా మిశ్రిత జలాన్నీ, తీర్థజలాన్నీ, పంచామృతాలనీ, కుశోదకాన్ని, పుష్పజలాన్నీ ఒకచోట కలిపి దానితో వరుణదేవునికి స్నానం చేయించి గంధ, పుష్ప, ధూప, దీప నైవేద్యాదులను సమర్పించాలి. అందరు దేవతలకూ బలిప్రదానం జరపాలి. మంగళఘోషను ప్రతిధ్వనింపచేస్తూ నీరాజనాలిచ్చి ప్రదక్షిణ చేయాలి. ఒక వేదిపై వరుణభగవానుని యొక్క పుష్కరిణీదేవి యొక్క ప్రతిమలను యథాశక్తి స్వర్ణాదులచే చేయించి నిలిపి వారికి కల్యాణం చేయించి ఆ ప్రతిమలను మరల వరుణదేవునికి నివేదన చేయాలి. యజమానునంత పొడవేగల ఒక కాష్ఠయూపాన్ని చేయించి, అలంకరించి, తటాకానికి ఈశాన్యదిశలో స్థిరంగా పాతి నిలబెట్టాలి. దీనిని మంత్రపూర్వకంగా నిర్వర్తించాలి. ప్రాసాదానికైతే ఈశాన్యకోణంలోనూ, ప్రప (చలివేంద్రంలాంటిది) కైతే దక్షిణభాగంలోనూ, ఆవాసానికైతే మధ్యలోనూ ఈయూప స్తంభాన్ని పాతాలి. తరువాత దిక్పాలకులకు బలి ప్రదానం, బ్రాహ్మణులకు భోజన దక్షిణల ప్రదానం గావించాలి.

ఆ తటాకం నీటి మధ్యలో జలమాతృభ్యోనమః అంటూ నిలబడి జల మాతృకలను పూజించి ఆ తల్లులను ఇలా ప్రార్థించాలి. ‘ఓ మాతృదేవతలారా! మూడు లోకాలలోనూ నివసించు చరాచర ప్రాణికోటి సంతృప్తికై నా ద్వారా ఈ జలము విడువబడుతున్నది. ఈ నీరు ప్రపంచానికి ఆనందదాయకమగుగాక! ఈ జలాశయాన్ని మీరు రక్షించండి.’ ఇటువంటి మంగళకర ప్రార్థననే వరుణదేవునికికూడా చేయాలి. ఆయనకి బింబ, పద్మ, నాగముద్రలను చూపించాలి. బ్రాహ్మణులకు ఆ నీటిని ముందు ఇవ్వాలి. అనంతరం తర్పణలు చేసి అగ్నిని పూజించాలి. స్వయంగా యజమాని ఆ జలాశయంలోని నీటిని త్రాగాలి. పితరులకు ఆర్ఘ్యమివ్వాలి. మరల వరుణ దేవునికి ప్రార్థనలు సలిపి జలాశయానికి ప్రదక్షిణ చేయాలి. బ్రాహ్మణులచేత వేదధ్వనులను ఘోషింపజేస్తూ యజమాని తన గృహంలో ప్రవేశించి బ్రాహ్మణులను, దీనులను, అంధులను, కృపణులను, కుమారికలను ఆత్మకింపైన భోజనాలు ద్వారా సంతృప్తి పఱచి సూర్యభగవానునికి అర్ఘ్యప్రదానం చేయాలి”.

మధ్యమపర్వ ద్వితీయ భాగం సమాప్తం