భవిష్య పురాణము

23 - గణేశుని విఘ్నాధికారం; ఆయన పూజావిధి

శతానీకుడు సుమంతుని ఈ విధంగా అడిగాడు, “ఓ విప్రవరా! గణేశుడు తన అన్న ఉన్నా కూడా గణాధిపతి, విఘ్నాధికారి ఎలా అయ్యాడు?”

“రాజా! కృతయుగారంభంలో అసలు విఘ్నాలేలేవు. ప్రజలందరూ తలపెట్టిన అన్ని కార్యాలు చూస్తుండగానే నిరాటంకంగా నెరవేరిపోతుండేవి. దాంతో ప్రజల్లో అహంకారం బలిసిపోయింది. అహంకారం అన్ని పాపాలకూ దారితీస్తుందని తెలిసిన బ్రహ్మదేవుడు బాగా ఆలోచించి దానిని అదుపులో వుంచగల గణాధీశుని కోసం శంకరుని ప్రార్థించగా ఆయన గణేశుని సృష్టించి ఇచ్చాడు. (గణేశుని పార్వతీదేవి సృష్టించిందనే కథలోక ప్రసిద్ధమే కాని ఆమె సృష్టించిన బాలకుని సంహరించి ఏనుగు తలతో పూజనీయుడైన గణపతిని సృష్టించి ప్రపంచానికి అనుగ్రహించినది శంకరుడే).

నరవరా! గణేశుని తొలుత తలచుకోకుండా పూజలను ప్రారంభించే ప్రాణి లక్షణాలు ఇలా వుంటాయి. ఆ వ్యక్తికి అగాధమగు జలనిధిలోకి క్రమక్రమంగా మునిగిపోతున్నట్టు, స్నానం చేస్తున్నట్టు కేశాలు తలను వీడిపోతున్నట్టు కలలు వస్తాయి. మరి కొన్ని కలల్లో తాను కాషాయబట్టలు కట్టుకొని పులుల వంటి హింసాత్మక పశువులపై ఎక్కి కూర్చున్నట్టు కనిపిస్తుంది. శూద్రునిపై లేదా గాడిదపై లేదా ఒంటిపై స్వారీ చేస్తున్నట్టు, తన వారంతా దూరమైపోతున్నట్టు కలవస్తుంది. నడుస్తున్న తన వారి నుండి విడివడి యమరాజు వైపు సాగిపోతున్నట్టు కలవస్తుంది. ఇలాంటివారు నిత్య దుఃఖితులై వుంటారు.

తన రూపం తనకే పరమ వికృతంగా, గన్నేరు పూలదండలు మెడకు తగిలించుకొని కలలో కనిపించే రాజకుమారుడు గణేశుని ఆగ్రహానికి గురి అయినాడనీ, వానికి వారసత్వంగా రావలసినవేవీ రావని అర్థం. అలాగే కన్యకైతే అనుకున్న భర్త దొరకడు. బ్రాహ్మణునికైతే అధ్యాపకత్వ ఫలము రాదు. శిష్యులచేత అధ్యయనం చేయించలేడు. వైశ్యునికి వ్యాపారంలో, కృషికునికి వ్యవసాయంలో శ్రమ తప్ప ఇంకేమీ మిగలదు. కాబట్టి ఓ మహారాజా! ఇలాంటి కలలు వచ్చినవారు ముందుగా గణపతిని ప్రసన్నుని చేసుకోవాలి. ఇతరులు అప్పటికే ఆ మార్గం పట్టివుంటారుగా.

శుక్ల చతుర్థి, బృహస్పతి వారం, పుష్యనక్షత్రం కలిసొచ్చిన రోజు చూసుకొని అన్ని ఔషధాల, సుగంధ ద్రవ్యాల ఆకులను సమకూర్చుకొని గణేశుని పూజకు సిద్ధం కావాలి. విఘ్ననాయకుని ప్రతిమను ఎదుటబెట్టుకొని, భద్రాసనంపై కూర్చుని బ్రాహ్మణుల చేత స్వస్తి వచనాలను పలికించుకోవాలి. ఆ తరువాత పార్వతీ పరమేశ్వరులను, గణేశుని పూజించాలి. పితృదేవతలను గ్రహాలను స్తుతించాలి. నాలుగు కలశలను స్థాపించి వాటిలో సప్తమృత్తికలను గుగ్గిలాన్ని, గోరోచనాది ద్రవ్యాలను వదలాలి. సుగంధద్రవ్యాలను కూడా వదలాలి.

సింహాసనస్థుడైన గణేశునికి స్నానం చేయిస్తూ ఈ క్రింది మంత్రాలనుచ్చరించాలి:

సహస్రాక్షం శత ధార మృషి భిః పావనం కృతం

తేన త్వామభిషించామి పావమాన్యః పునంతుతే

 భగంతే వరుణోరాజా భగం సూర్యోబృహస్పతిః

భగమింద్రశ్చ వాయుశ్చ భగం సప్తర్షయోదదుః

యత్తే కేశేషు దౌర్భాగ్యం సీమంతే యచ్చ మూర్ధని

లలాటే కర్ణ యో రక్ష్ణో రాపస్తద్ధంతు మే సదా (బ్రాహ్మ 23/ 19 - 21)

ఈ మంత్రాలతో స్నానం పూర్తి చేయించి, హవనాది కార్యాలు చెయ్యాలి. అనంతరం చేతిలో పుష్పాలను, దూర్వాలను, ఆవాలను తీసుకుని గణేశుని మాతృ మూర్తియైన పార్వతీదేవికి మూడు మార్లు పుష్పాంజలిని సమర్పించి ఈ ప్రార్థనను చేయాలి.

రూపం దేహి యశోదేహి భగం భగవతి దేహిమే

పుత్రాన్ దేహి ధనం దేహి సర్వాన్ కామాంశ్చ దేహిమే

అచలాం బుద్ధిం మేదేహి ధరాయాం ఖ్యాతి మేవచ   (23 - 28)

            అనగా రూపం, యశస్సు, తేజము, పుత్రసంతానం, ధనం, అచలబుద్ధి, ప్రసిద్ధి, ఇంకా కోరికలు తీరుట ఇవన్నీ అమ్మని అడుగుతున్నాను.

ప్రార్థన తరువాత బ్రాహ్మణులకు గురువుకీ భోజనం పెట్టి వస్త్రయుగళం, దక్షిణలు సమర్పించాలి. ఈ విధంగా గణేశునీ, గ్రహాలనూ పూజించడం వల్ల అన్ని కర్మల సత్‌ఫలమూ ప్రాప్తిస్తుంది. అత్యంత శ్రేష్ఠ లక్ష్మీ లభిస్తుంది. సూర్య, కార్తికేయ, వినాయకుల పూజ చేసి తిలకధారణం చేస్తే అన్నీ సిద్ధిస్తాయి.”