భవిష్య పురాణము

19 - చైతన్య మహాప్రభువు ఇతర ఆచార్యులపై ఆయన ప్రభావం

సూతమహర్షి తన ప్రవచనాన్ని ఇంకా ఇలా కొనసాగించాడు. “మునులారా! దేవగురువైన బృహస్పతి దేవతలందరి అంశలూ మానవలోకంలో ప్రవేశించి లోకకల్యాణం జరిగిన తరువాత తాను కూడా భూలోకంలోకి తన అంశను పంపగా అది ఇష్టికానగరిలో గురుదత్తుడను బ్రాహ్మణుని పుత్రునిగా జన్మించడం జరిగింది. ఆ పుత్రుడు రోపణునిగా ప్రసిద్ధి చెందాడు. అతడు బ్రహ్మమార్గ ప్రదర్శకుడైనాడు. సూత్రంతో గ్రుచ్చబడిన మాలను ధరించుట, జలనిర్మిత తిలకాన్ని ధరించుట, వాసుదేవ మంత్రాన్ని జపించుట మొదలగు పవిత్ర కార్యాలను అవశ్యాచరణ కర్తవ్యాలుగా జనులకు బోధించి కొన్నివేల మంది మనసులలోకి మాల, తిలక, వాసుదేవ మంత్రాలను జొప్పించగలిగాడు. అలా ప్రచారం చేస్తూ వాటిని ధరింపజేస్తూ జనులను తరింపజేస్తూ ఆయన చైతన్య మహాప్రభువును చేరి ఆయనకు శిష్యుడైపోయాడు. కృష్ణచైతన్యుడు తన కంబళిని నిరోపణున కిచ్చి పంపించాడు. రోపణుడు మరల తన నగరుకు మరలి అక్కడ కృష్ణధ్యానంతునిగా, చైతన్య మతప్రచారకునిగా జీవించాడు.

ఇపుడు విష్ణులీలనొక దానిని వినిపిస్తాను. యజ్ఞాంశము నుండి పుట్టిన కృష్ణచైతన్యుడు అయిదు సంవత్సరాల బాలకునిగా నుండిన కాలంలో వంగదేశంలో ఈశ్వరపురీ అను మహాత్ముడుండేవాడు. ఆయన శారదాదేవి నుపాసించి విశేషసిద్ధిని పొందియున్నాడు. ఎందరో మేధావులాయనను పూజించసాగారు. దానితో ఆ మహాత్మునిలో కూడా అహంకారం ప్రవేశించింది. కొన్నేళ్ళ తరువాత ఒకనాడాయన తన సంచారంలో భాగంగా శాంతిపురం చేరి అక్కడి గంగాతటంలో కూర్చుని ఒక రమ్యమైన దివ్యస్తుతిని రచించి పఠించసాగాడు. ఆ దారి వెంట వస్తున్న కృష్ణచైతన్యుడా స్తోత్రాన్ని విని చేతులు జోడించి ఈశ్వరపురికి నమస్కరించి ‘మహాత్మా! ఈ మీ రచన దోషయుక్తంగా కనబడుతోంది’ అన్నాడు. ఆ దోషాలేవో నిరూపించాడు కూడ. ముందు ఆశ్చర్యం ఆ తరువాత తీవ్రమైన లజ్జా కలిగి దుఃఖితుడై నిలబడిన ఈశ్వరపురి తనకు ఆత్మీయుడు కూడా అగుటవలన సర్వమంగళ శారదాదేవి అతనికి కనిపించి వాత్సల్యపూరిత మందహాసం చేస్తూ ‘వత్సా! బాధపడకు. ఈయన సాక్షాత్తు హరి, యజ్ఞాంశుడునైన కృష్ణచైతన్యుడు. ఇతని చేతిలో ఓటమి కూడ అదృష్టమే’ అని చెప్పింది. వెంటనే ఈశ్వరపురీ కృష్ణచైతన్యునికి శిష్యునిగా మారి ఆయన నుండి కృష్ణమంత్రాన్ని ఉపదేశంగా పొంది దానినుపాసించి వైష్ణవశ్రేష్ఠునిగా చైతన్య శిష్యునిగా జగత్‌ప్రసిద్ధుడైనాడు.

మునులారా! ఆ కాలంలోనే ‘శ్రీధరుడని ఒక శివపూజకుడైన బ్రాహ్మణుడొకాయన వుండేవాడు. ఆయన పత్తన నగర రాజుకి శ్రీమద్భాగవత సప్తాహం సందర్భంగా ఆ కథను వినిపించాడు. రాజుగారాయనకు బాగా ధనాన్నిచ్చాడు. శ్రీధరుడా ధనాన్ని గ్రహించి అత్తారింటికెళ్ళి అక్కడొక సంవత్సరముండి తన భార్యతో సహా తన యింటికి బయలుదేరాడు. అతనిని ఎప్పటినుండో గమనిస్తున్న ఏడుగురు దొంగలు అతనితో బాటే యాత్రికుల లేదా ప్రయాణీకుల వేషాలలో బయలుదేరారు. ఇతని విశ్వాసాన్ని పొందడానికి వారు చీటికీ మాటికీ రాముని దయవల్ల అంటూ రామప్రసక్తిని తీసుకు రాసాగారు. శ్రీరామునిపై శపధం చేసి నీతో స్నేహాన్ని పాటిస్తాము’ అని కూడా వారు శ్రీధరునితో అన్నారు. దారిలో ఒక అడవిని దాటవలసి వచ్చినపుడు ఆ అడవి చివర్లో ఆ దొంగలు శ్రీధరుని చంపివేసి అతని పత్నిని, ధనాన్ని అతని ఎడ్లబండితో సహా తీసుకొని పోసాగారు. మాటిమాటికీ వెనక్కి చూస్తున్న శ్రీధరుని పత్నితో వారు ‘ఇంకా ఎవరికోసం వెనక్కి చూస్తున్నావు? నీ పతి లేడు. ఇక రాడు’ అన్నారు. ఆమె ‘నేను నా పతి కోసం కాదు ఎవరో జగత్పతిరాముడు రాముడంటూ మీరంతా ఇంతసేపూ ఆయన పేరునే చెప్తూ వచ్చారు కదా! ఆయనపై ఒట్టువేసి మా ఆయనతో స్నేహం చేస్తున్నామన్నారు కదా! ఆయన ఎక్కడో దిగబడిపోయాడు. వస్తాడేమో అని చూస్తున్నాను’ అంది.

వెంటనే కదిలివచ్చాడు కరుణాపయోనిధి. చిటికెలో ఆ ఏడుగురు దొంగలనూ హరించాడు. దయానిధియైన దాశరధి అంతటితో ఆగక శ్రీధరుని బ్రతికించి బృందావనం వైపు సాగిపొమ్మని ఆనతిచ్చి అంతర్ధానం చెందాడు. వెంటనే శ్రీధరుడలాగే చేసి యజ్ఞాంశ శ్రీకృష్ణ చైతన్యులవారి శాంతి (పురి + ఆశ్రమ = పుర్యశ్రమ అవుతుంది. అది శాంతి పుర్యశ్రమం) పూర్యాశ్రమాన్ని చేరుకున్నాడు. ఆ స్వామికి శిష్యుడై ఆయన ద్వారా బ్రహ్మజ్ఞానాన్ని పొందిన శ్రీధరుడు శ్రీమద్భాగవతానికి ఒక టీకను వెలిచాడు. అది భాగవతాన్నే సుసంపన్నం చేసింది. శ్రీధరీయటీకయే నేటికీ పరమ ప్రామాణిక టీకా గ్రంథముగా వెలుగొందుతున్నది.

శౌనకాచార్యా! కాశీలో రామశర్మయని మహావిద్వాంసుడూ, శంకర పూజాతత్పరుడూ నైన బ్రాహ్మణుడొకాయన వుండేవాడు. ఆయన శివరాత్రినాడు అవిముక్తేశ్వరంలో ఒక్కడే ఒకచోట కూర్చొని ధ్యానపూర్వకంగా శివపంచాక్షరిని జపిస్తూ రాత్రంతా జాగారం చేసేశాడు. శివుడు ప్రసన్నుడై సాక్షాత్కరించి వరం కోరుకొమ్మంటే, ‘స్వామీ! తమరు ఎప్పుడూ ఎవరిని ధ్యానిస్తుంటారో వారినే నా హృదయంలో కూడా ప్రవేశపెట్టండి’ అన్నాడు రామశర్మ. శివుడు నవ్వుతూ ‘వత్సా! నేను శ్రీరామునీ, బలరామునీ నిత్యం ధ్యానిస్తాను’ అంటూ ఆ దేవతల మంత్రోపాసనను రామశర్మకిచ్చి అంతర్ధానం చెందాడు. తరువాత రామశర్మ శ్రీరామ మంత్రోపాసకుడై గొప్ప జ్ఞానియై కూడ కృష్ణచైతన్యుల వారినాశ్రయించి ఆయన శిష్యునిగా మారాడు. ఆధ్యాత్మ రామాయణాన్ని రచించాడు. (ఆధ్యాత్మ రామాయణం వ్యాసభగవానుల రచనేనని ఎక్కువమంది విద్వాంసులు భావిస్తున్నారు)

మునులారా! కృష్ణచైతన్యుని వద్దకు జీవానంద రూపానందులను మహాపండిత మేధావులు వచ్చారు. అప్పటికి చైతన్య మహాప్రభువు వయసు పదహారేళ్ళు. వారు వచ్చి ఆయన శిష్యులైపోయారు. జీవగోస్వామిగా, పరిణతి చెందిన జీవానందుడు ‘షట్ సందర్భ’మను గ్రంథాన్ని వ్రాశాడు. భక్తిమార్గం అను పేరిట వర్ధిల్లిన ఆధ్యాత్మిక, సాహిత్య శాఖలో వారు పరమప్రసిద్దులు. వారు అనగా జీవానంద రూపానందులు. రూపగోస్వామిగా పరిణతి చెందిన రూపానందుడు చైతన్యులవారి ఆజ్ఞమేరకు శ్రీ రాధాకృష్ణ తత్త్వ ప్రతిబోధకమైన ‘కృష్ణఖండ’మనే పురాణం వంటి గ్రంథాన్ని పదివేల శ్లోకాలలో రచించాడు.

కొంతకాలానికి విష్ణుస్వామి కూడా కృష్ణచైతన్యుల వారి వద్దకు అరుదెంచాడు. అప్పటికి చైతన్యుల వయసు ఇరవై తొమ్మిది. విష్ణుస్వామి ఆయనకు నమస్కరించి (శ్రీకృష్ణ చైతన్యుడు అవతారపురుషుడని విద్వాంసులందరికీ తెలియడంవల్ల పరమవృద్ధులు కూడా పదేళ్ళ వయసున్న చైతన్యులకు నమస్కరించేవారు) ‘హే ప్రభో! ఈ బ్రహ్మాండంలో దేవతలకే పూజ్యుడైన దేవుడెవరు?’ అని అడిగాడు.

శ్రీ వైష్ణవుడైన చైతన్యుడిలా చెప్పాడు. ‘మహాదేవుడే భక్తానుగ్రహంలో సర్వశ్రేష్ఠుడు. ఆయనే పరమ పూజ్యుడు. విష్ణువు, బ్రహ్మా కూడా ఆయన్నే పూజిస్తారు. శంకరార్చన తత్పరులైన విష్ణుభక్తులు శివప్రసాదం వల్ల ఉత్తమ వైష్ణవులుగా ప్రసిద్ధులౌతారు. లోకకల్యాణకారుడైన శంకరుని కూడా పూజించే వైష్ణవుడే నిజమైన విష్ణుభక్తుడు’ చైతన్యమహా ప్రభువుల శిష్యునిగా మారిన పిమ్మట కొంత కాలానికి కృష్ణమంత్రోపదేశాన్ని పొంది దానిని నిష్ఠగా జపిస్తూ, శివారాధనను ప్రాణప్రదంగా చేస్తూ విష్ణుస్వామి గొప్పజ్ఞానిగా రూపొంది ‘వైష్ణవీ సంహిత’ అను గ్రంథాన్ని వ్రాశాడు.

మునులారా! కృష్ణభక్తి పరాయణుడైన మధ్వాచార్యుడు కూడ చైతన్యమహాప్రభువుల శాంతి పుర్యాశ్రమానికి వచ్చి ఆయన శిష్యరికాన్ని స్వీకరించాడు.