విష్ణుదేవా! ప్రాచీనకాలంలో యయాతిమహారాజు వంశంలో సత్రాజిత్తను ప్రతాపవంతుడైన చక్రవర్తి జన్మించాడు. ఆయన అత్యంత ప్రభావశాలి. తేజస్వి, కాంతిమంతుడు, క్షమావంతుడు, సద్గుణవంతుడు, బలశాలియైన రాజు. ధీరత, గంభీరత, యశస్సు ఆయన సొమ్ములు. ఆయన గూర్చి పురాణవేత్తలు ఈ విధంగా గాథలనే గానం చేసేవారు. ‘సూర్యుడుదయించినప్పటి నుండీ అస్తమించేదాకా ఎక్కడెక్కడ దర్శనమిస్తాడో ఆ సంపూర్ణ రాజ్యమంతా సత్రాజిత్ క్షేత్రమను పేరుతో ఆ మహారాజుదే అయివుండినది. అన్ని రత్నాలతో పరిపూర్ణమైన సప్తద్వీపవతియైన పృథ్విపై ధర్మపూర్వకంగా రాజ్యం చేస్తుండేవాడు సత్రాజిత్తు.’ ఆయన సూర్యనారాయణుని పరమభక్తుడు, ఆయన ఐశ్వర్యాన్ని చూసి దేవతలే ఆశ్చర్యపడేవారు. ఆరాజ్యంలో అంతా ధర్మానుయాయులే. ఆయనకు నలుగురు మంత్రులుండేవారు. అప్రతిహత సామర్ధ్యంతో వెలుగొందుతూ రాజభక్తికి ఆలవాలములై వుండేవారు. వారును గొప్ప సూర్యభక్తులు, వారి బుద్ధి విశేషాన్ని, మేధస్సును చూసి ప్రజలే కాక మహారాజు కూడా ఆశ్చర్యచకితుడవుతూ వుండేవాడు. రాజుగారి ఐశ్వర్యం తులలేనిది, వెలకట్టలేనిది. రాజుగారే తన ఐశ్వర్యాన్ని చూసి ఆశ్చర్యపోయి వచ్చేజన్మలో కూడా తనకు ఇంత ఐశ్వర్యమూ వుంటే బాగుండుననుకున్నాడు. వెంటనే సకల శాస్త్రాలలో పారంగతులైన పండితులను రావించి, వారిని భక్తి పురస్సరంగా పూజించి ఇలా వేడుకొన్నాడు. ‘బ్రాహ్మణోత్తము లారా! నాపై దయవుంచి నా జిజ్ఞాసనొక దానిని మీరు శాంతపరచాలి.’
‘మహారాజా! మీ మనసులోని మాటను ఏ మాత్రమూ సందేహించకుండా మా ముందు చెప్పవచ్చు. మీరు మా పాలన, పోషణలను చూసుకోవడమే కాకుండా మమ్ము సర్వవిధాలా సంతుష్టులను గావిస్తున్నారు. విద్వాంసులైన బ్రాహ్మణుల కర్తవ్యం. మీధర్మ సందేహాలను తీర్చడమూ, అధర్మం నుండి మరల్చడమూ, కల్యాణకారకములైన ఉపదేశాలను చేయడమే. మీ ఇచ్ఛానుసారం ఏదైనా అడగవచ్చు’ అన్నారు బ్రాహ్మణులు.
మహారాణి విమలవతి కూడా ‘మహారాజా! నాకు కూడా ఒక ధర్మసందేహమేర్పడినది. నేనెప్పుడూ అంతఃపురంలో వుండిపోతాను కాబట్టి నాకు ధర్మగోష్ఠులలో పాల్గొనడానికి పెద్దగా అవకాశం రాదు’ అంది.
‘ప్రియా! ముందుగా నీ సందేహాన్ని తీర్చడం లేదా తీరేలా చూడడం నాకర్తవ్యం. నిస్సందేహంగా నీ సందేహాన్ని అడుగు’ అంటూ అనుమతించాడు సత్రాజిచ్చక్రవర్తి.
‘మహారాజా! నేను ఎందరో రాజుల చరిత్రలను విన్నాను. కాని మీ అంతటి ఐశ్వర్యవంతులెక్కడా ఎప్పుడూ తారసపడలేదు. ఇది ఏ కర్మయొక్క ఫలము? నేను ఏయే మహెూత్తమ కర్మలనాచరించి వుంటానో మీవంటి మహనీయునికి భార్యనైనాను. మనం పూర్వజన్మలో చేసిన అత్యంత మహిమాన్వితమైన క్రియలు గానీ పూజలు గాని ఏవో నాకు తెలుసుకోవాలనివుంది’ అంది విమలవతి.
‘దేవీ! నువ్వు నామనసులోని మాటనే అన్నావు. భార్య భర్తయొక్క అర్ధాంగిని అని మునులు చెప్పిన మాట పరమసత్యమని నీవు ఋజువు చేశావు. మునులకు తెలియని జ్ఞానముండదు. ఈ మహాత్ములను నేనూ ఇటువంటి మాటనే అడగదలుచుకున్నాను, ఓ భగవానులారా! నేను పూర్వజన్మలో ఎవర్ని? నేను ఈ సర్వాంగసుందరి నా ధర్మపత్ని కావడానికేయే పుణ్య కర్మలను అనుష్టించాను? మాలో ఒకరిపట్లనొకరికి గల అతిశయప్రీతి ఏ పుణ్యఫలము? ఈరోజు సమస్త రాజలోకమున అధీనంలో వుంది. నాదగ్గర ద్రవ్యముంది. మీ దయవల్ల నేను అత్యంత బలశాలిగా పేరొందాను. నా పత్నిలాంటి ఉత్తమ స్త్రీ ఎక్కడా లేదు. నా తేజస్సు సాటిలేనిది. ఓ మహామునులారా! మీరు త్రికాలజ్ఞులు. నా ఈ జిజ్ఞాసను ఫలింపజేయండి’ అని ఎంతో మర్యాదగా అడిగిన రాజుకు ఆ బ్రాహ్మణోత్తములలో సూర్యనారాయణుని పరమభక్తుడు, ధర్మజ్ఞుడునైను పరావసువను జ్ఞాని ఇతర పండితుల అనుమతితో యోగ సమాధిలోనికి నిర్గమించి తద్ద్వారా మొత్తం విషయ పరిజ్ఞానాన్ని పొంది మరలి వచ్చి రాజ దంపతులకు ఇలా చెప్పసాగాడు.
‘మహారాజా! తమరు పూర్వజన్మలో ఒక అతి నిర్దయుడు, కఠోర మనస్కుడు, హింసాత్మకుడునైన శూద్రుడుగా జన్మించారు. ఒక దశలో కుష్ఠరోగ పీడితులైనారు. ఆ జన్మలో కూడా మహారాణిగారే మీ సతీమణి. ఈమె ఎంత మహాపతివ్రతంటే మీరామెనెంత బాధించినా ఆమె నిరంతరం మీ సేవలోనే మనసును, శరీరాన్ని లగ్నం చేస్తూవుండేవారు. మీ బంధువులంతా మిమ్మల్ని విసర్జించారు. పూర్వీకులు మీకు ఆర్జించి పెట్టిన ధనమంతా అయిపోయింది. అనంతరం మీరు వ్యవసాయం చేయడం మొదలుపెట్టారు. కాని దైవేచ్ఛ వశాన అది కూడా వ్యర్థమై చెడింది. అత్యంత దీన హీన పరిస్థితిలో ఇతరులను సేవించుకుంటూ బ్రతుకసాగినారు. ఇట్టి పరిస్థితుల్లో కూడా మీ భార్యని (ఏ మారుమనువో చేసుకొమ్మని) మీరు ఎంత చెప్పినా వినకుండా మిమ్మల్ని వీడకుండా సేవిస్తూనే వుండిపోయారు. కొంతకాలం తరువాత మీరు కన్యాకుబ్జం పోయి అక్కడ సూర్య మందిరంలో సేవలు చేస్తూ వుండిపోయారు. అక్కడ ప్రతిదినమూ మందిరాన్ని తుడవడం, అలకడం, నీరుజల్లి శుభ్రం చేయడం మున్నగు కార్యాల్ని మిక్కిలి భక్తితో నిర్వహించారు. మందిరంలో పురాణకథా కాలక్షేపం జరుగుతుండేది. మీరెంతో భక్తి, శ్రద్ధలతో వినేవారు. మహారాణిగారు తన తండ్రి ఇచ్చిన అంగుళీయకాన్ని పురాణ కథకునికి భక్తితో దాన మిచ్చేశారు. క్రమంగా ఆ మందిరం మీ మస్తిష్కాలలో చోటు నాక్రమించింది. రాత్రింబవళ్ళు మీరా సూర్యదేవుని, ఆమందిరాన్ని మరింత శుభ్రంగా మరింత పవిత్రంగా ఎలా ఉంచగలమా - అనే ఆలోచించసాగారు. మీరక్కడ కొన్నేళ్ళపాటు నివసించారు. అహర్నిశలూ భగవానుని సేవారూపమైన యోగకర్మయే మీకు సర్వస్వమైపోయింది. నిష్కామభావంతో సూర్యచింతనయే నిత్యం చేస్తుండడంతో మీ పాపాలన్నీ పటాపంచలైపోయినవి.
ఒకనాడచ్చటికి కువలాశ్వుడను ఒకరాజు తన బ్రహ్మాండమైన పరివారంతో వచ్చాడు. అతని వైభవాన్నీ ఆ రాణీల వైభోగాన్ని చూసిన మీకు రాజు రాణీలుగా పుట్టాలనే కోరిక జనించింది. స్వల్పకాలంలోనే ఆ జన్మ ముగిసిపోయింది. సూర్యభగవానికి శ్రద్ధాభక్తుల పూర్వకంగా మీరు గావించిన సేవ, పురాణ శ్రవణ ప్రభావం. మిమ్మల్ని రాజునూ, రాణినీ చేశాయి. మీ ఇద్దరికీ అసమానమైన తేజస్సు కూడా ప్రాప్తించింది. అదెలాగంటే సూర్యదేవాలయంలో ఒక్కొక్కప్పుడు దీపాలకి నూనె సరిపోయేది కాదు. అప్పుడు మీరు వంటకై దాచుకున్న నూనెను తెచ్చిపోసేవారు. వత్తులు లేకపోతే మీ వస్త్రాలను చించి వత్తులు చేసి వేసేవారు.
మహారాజా! మీకు వచ్చే జన్మలో కూడా ఇంత ఐశ్వర్యమూ, బలమూ కావాలంటే శ్రద్ధగా సూర్యదేవుని ఆరాధించండి. మీకు బాగా ఇష్టమైన గంధ, పుష్ప, ధూప, దీప, నైవేద్యాదులను సూర్యభగవానునికర్పించండి. చక్రవర్తిననే సంగతి కొంతసేపు విస్మరించి సూర్యమందిరాన్ని తుడిచి, అలికి, కడిగి దాన్ని స్వచ్ఛంగా నిర్మలంగా వుంచండి. ఉత్తమ దినాల్లో ఉపవాస జాగరణలను చేసి నృత్య, గీత, వాద్యాదుల ద్వారా బ్రహ్మాండమైన ఉత్సవాలను పెద్ద యెత్తున నిర్వహించండి. పురాణ, ఇతిహాస కథా కాలక్షేపాలను నేర్పాటు చేసి మీరూ శ్రద్ధగా శ్రవణం చేయండి. ఇవన్నీ నిష్కామభావనతో తన్మయులై చేయాలి. మనస్సులో సూర్యుడే వుండాలి. కోరిక వుండరాదు. అలా చేస్తే రాజత్వమేమి, ఇంద్రత్వమే ప్రాప్తిస్తుంది.’
‘బ్రాహ్మణోత్తమా! ఇంద్రత్వం, అమరత్వము పొందినంత ఆనందం నాకు మీ మాటలు వింటేనే కలుగుతోంది. అజ్ఞానరూపంలో మామనస్సులలో నిండిన చీకటి మీమాటల కాంతిలోపడి చెదరిపోయింది. సంపదకోసం వ్యాకులత్వం పడినమాకు ఆ సంపద యొక్క మూలతత్త్వాన్నే ఉపదేశరూపంలో ప్రసాదించారు మీరు. ఇప్పుడు నాకు బాగా బోధపడిన విషయమేమనగా ఈ సంపదలూ, వైభోగాలూ, వైభవమూ, తేజమూ అన్నీ పూర్వజన్మ సుకృతఫలాలేనని, దరిద్రుడైనా భక్తితో సూర్యదేవుని ప్రసన్నుని చేసుకోగలిగితే కుబేరుడౌతాడని, భక్తుడు కాని వాని ఐశ్వర్యము నిలబడదని ఇపుడు మీరు నాకు సూర్యభగవత్ ఆరాధనా విధానాన్ని నాపై దయతో ఆదేశించండి అని అడిగాడు సత్రాజిత్తు. చెప్పసాగాడు పరావసువు.
‘మహారాజా! కార్తికమాసంలో ప్రతిరోజూ సూర్యపూజను చేసి బ్రాహ్మణులకు భోజనాలు పెట్టించి మీరు మాత్రం ఒకపూట భోంచేయాలి. ఈ ఆరాధన వల్ల బాల్యావస్ధలో తెలిసీ తెలియక చేసిన పాపాలన్నీ నశిస్తాయి. మార్గశిర మాసంలో కూడా ఇలాగే ఈ వ్రతాన్ని చేసి స్త్రీ పురుషులిరువురూ కలిసి బ్రాహ్మణునికి మరకతమణిని దానంచేస్తే ఊహ తెలిశాక, ప్రౌఢావస్థలో చేసిన పాపాలన్నీ నశిస్తాయి. ఇదే వ్రతాన్ని పుష్యమాసంలో చేస్తే వృద్ధావస్థలో చేసిన పాపాలన్నీ నశిస్తాయి. పాతకాలలో లఘు, ఉప, మహా, ఆధి భౌతిక, ఆధి దైవిక, ఆధ్యాత్మిక, త్రివిధ పాతకాలని వివిధ రకాలున్నాయి, ఈ వ్రతాన్ని ఏడాదిలో మూడునెలల చొప్పున మూడు సంవత్సరాలపాటు చేస్తే ఈ పాపాలలో నేది మిగిలిపోయినా నశించిపోవడమేకాక ఈప్సితార్థాలన్నీ నెరవేరుతాయి. ఈ సర్వపాపహర్తయైన వ్రతాన్ని త్రివిక్రమ వ్రతమని అంటారు.’
‘భోజనం ఎటువంటి బ్రాహ్మణులకి పెట్టాలి?’
‘మహారాజా! పౌరాణిక బ్రాహ్మణునికి భోజనం పెట్టాలని స్వయంగా సూర్యభగవానుడే తన సారథియైన అరుణునికి చెప్పాడు. ఒకమారు ఉదయాచలంపై వారున్నపుడు అరుణుడు సూర్యభగవానుని ‘ప్రభో! ఏయే పుష్పాలు, నైవేద్యాలు మీకు ఎక్కువగా నచ్చుతాయి? ఎటువంటి బ్రాహ్మణులకు భోజనం పెడితే మీరు సంతుష్టులౌతారు?’ అని అడిగాడు. సూర్యభగవానులిలా చెప్పారు. ‘అరుణా! గన్నేరు పూలు, రక్తచందనం, గుగ్గిల ధూపం, నేతి దీపాలు, మోదకాది నైవేద్యం నాకిష్టము. నాభక్తులైన పౌరాణిక బ్రాహ్మణులకిచ్చే దానాలు, నాకెంతో ఆనందాన్ని కలిగిస్తాయి. గీత, వాద్యపూజనాదులు నన్ను ప్రసన్నుని చేస్తాయి. అంతకంటె ఎక్కువగా పురాణ ప్రవచనానికి ప్రసన్నుడనౌతాను. ఇక జీవులలో నేనెక్కువగా ఇష్టపడేది ఇతిహాస పురాణ ప్రవచకులను, భక్తులైన భోజకులను’
Summary of chapter 64 of the Bhavishya Purāṇa is as follows:
The Phala-saptamī vrata involves the offering of specific fresh fruits to Sūrya on the saptamī tithi. Different fruits are associated with different aspects of Sūrya's grace: offering coconuts brings progeny, offering sugarcane brings sweetness and prosperity to relationships, offering mangoes brings sovereignty and leadership qualities, offering pomegranates brings abundance. The chapter is simultaneously a practical vrata manual and a subtle teaching on the principle of correspondence between the outer world (fruit types) and the inner world (desired qualities). The votary is instructed to offer the fruit that corresponds to the specific quality she or he most deeply wishes to cultivate, making each Phala-saptamī offering a personalised act of devotional intention.