యుధిష్ఠిరుడు మాధవుని ఇలా అడిగాడు. “పరంధామా! ఉపవాసాలు పెద్దగా చేయలేని వారికి పుణ్య, ధనాదులను ప్రాప్తింపజేయగల వ్రతములుంటే సెలవివ్వండి.”
ఈ ప్రశ్నకు కూడా ప్రజలకోసమేనని తెలిసిన శ్రీకృష్ణుడు ఇలా చెప్పసాగాడు.
“ఆశ్రిత జనపాలకా! భాద్రపద శుక్ల ద్వాదశి శ్రవణనక్షత్రయుక్తమైననాడు చేయవలసిన వ్రతమొకటుంది. ఇది పరమ పవిత్రం, మహాఫలదాయకం.
ఒక్కరోజు ఉపవాసం చేస్తే చాలు, పన్నెండు ఉపవాసవ్రతాల ఫలాలను దక్కించే వ్రతం ఇది.
ప్రాతఃకాలమే నదీ సంగమానికి పోయి స్నానం చేసి ఆ ద్వాదశిరోజు మాత్రం ఉపవాసం చేయాలి. ఈ తిథి నక్షత్రాలతోబాటు బుధవారం కూడా యోగిస్తే మహాభాగ్యమే. ఆరోజు చేసే పుణ్యకర్మల ఫలాలు అక్షయాలవుతాయి. ఈ వ్రతం వల్ల గంగాస్నానలాభం కలుగుతుంది. ఒక సుందర కలశను శాస్త్రోక్తంగా నిలబెట్టి అందులో విష్ణుప్రతిమను స్థాపించాలి. అనంతరం భగవానునికి అంగపూజను గావించాలి. రాత్రిజాగరం చేయాలి. మరునాటి ప్రాతర్వేళ విష్ణువును, స్నానానంతరం, పూజించి పుష్పాంజలిని కైసేసి ఈ క్రింది శ్లోకం ద్వారా ప్రార్థించాలి.
నమో నమస్తే గోవింద బుధశ్రవణ సంజ్ఞకః
అఘౌఘ సంక్షయం కృత్వా సర్వసౌఖ్య ప్రదోభవ॥ (ఉత్తరపర్వం 75/15)
తరువాత వేదజ్ఞులూ, పురాణజ్ఞులూ బన బ్రాహ్మణులనాహ్వానించి సత్కరించి వారికి ప్రతిమతో సహా సర్వపూజా పదార్థాలనూ ప్రీయతాం మే జనార్దనః అంటూ సమర్పించాలి.
ధర్మజా! ఈ సందర్భంలో నొక ప్రాచీన ఆఖ్యానముంది. చెప్తాను విను. దశార్ణ దేశానికి పశ్చిమ భాగంలో ఒక శ్మశానముండేది. సర్వప్రాణులూ దానివైపు చూసి భయపడుతుండేవి. భయంకర సర్పాలు గజానికొకటిగా అక్కడ తిరుగుతుండేవి. అన్ని రకాల ముళ్ళచెట్లూ అడ్డమాకలు లేకుండా అక్కడ పెరుగుతుండేవి. వృక్షాలుండేవి గాని ఆకులు పెరిగేవి కావు. నీడ చాలా తక్కువగా పడేది. పక్షులు అక్కడ వాలితే, లేళ్ళు అటుపోతే దిక్కుతోచక ఎగురుతూ, పరిగెడుతూ దాహంతో మరణించేవి.
అటువంటి మరుస్థలిలోకి దారి తప్పి తన సన్నిహితులను వెతుక్కుంటూ ఒక వ్యాపారి ప్రవేశించాడు. అటూ ఇటూ తిరుగుతుండగా అతనికి కొన్ని పిశాచాలు కనిపించాయి.
ఎలా వాటికి కనబడకుండా దరి మళ్ళించుకొని అక్కడే గిరగిరా తిరుగసాగాడు. ఆకలిదప్పులతో అలమటించి పోసాగాడు. తన వెనుక ఏదో అలికిడి వినిపించి వెనక్కి తిరిగాడు. గుండె ఆగినంత పనయింది. ఒక ప్రేతం పీకలపై మరొక ప్రేతం కనిపించాడు. అతనిని నలువైపులా పరివేష్టించి ఇతర ప్రేతాలు సేవిస్తున్నాయి. ఆ ప్రేతాధిపతి ఇలా అడిగాడు:
‘ఎవరు నువ్వు? ఈ నిర్జల, నిర్జన ప్రదేశానికెందుకొచ్చావు?
‘నా అనుచరులను వెతుక్కుంటూ వచ్చి నా పూర్వ పాపకర్మల వల్ల ఇక్కడ అడుగిడి ఇరుక్కుపోయాను. ఆకలిదప్పులతో చచ్చేలాగున్నాను. మీ దర్శనంతో ఇక బతుకుపై మిగిలిన ఆశ కూడా పోయింది.
‘మేము పీక్కు తినే ప్రేతాలం కాము. నువ్వు ఈ పున్నాగ చెట్టు క్రింద ఒక్కక్షణం పాటు నిలబడు. నీ బాధలన్నీ తీరిపోతాయి. ఆ తరువాత యథేచ్ఛగా పోవచ్చు’ అని ప్రేతపతి అంటుండగానే ఎవరో వ్యక్తి పున్నాగ చెట్టు నుండి ఒక పాత్ర నిండా నీటినీ మరొక పాత్ర నిండా పెరుగన్నాన్నీ పట్టుకు వస్తూ కనిపించాడు. వ్యాపారి చేతికి కొంత భాగానివ్వగా అతడు దానిని వినియోగించి సంతృప్తి చెందాడు. ఆ వ్యక్తి ప్రేతాలకు కూడా భోజనాన్నీ జలాన్నీ ఇచ్చి వాటినీ సంతృప్తి పఱచాడు. అందరూ తృప్తిగా తలలూపినాక ఆ వ్యక్తి తిన్నాడు. మిక్కిలిగా ఆశ్చర్యపోయిన ఆ వణిజుడు ప్రేతాధిపతిని లా అడిగాడు. “ఇట్టి దుర్గమస్థానంలో అన్నజలాలు ఇంత సమృద్ధిగా ఎక్కడి నుండి వస్తున్నాయి? పైగా తక్కువగా తిన్నా కడుపు నిండిపోయినట్లుంది. ఒక పాత్ర తోడి అన్నమే ఇంతమందికెలా సరిపోయింది? నా ప్రాణాలను మీరు ఎందుకు నిలబెట్టారనేది కూడా నాకు ఆశ్చర్యకర విషయమే. హే శుభవ్రతా! ఇంత ఉత్తములైన మీరు ఈ ఘోరాటవిలో ఎందుకుండవలసి వస్తోంది? నాకు చాలా కుతూహలంగా వుంది. దయచేసి చెప్పండి’
ప్రేతాధిపతి ప్రసన్నంగా ఇలా చెప్పాడు ‘ఓయీ పుణ్యుడా! నేను పూర్వం చాలా మహాపాపాలు చేశాను. పరమ దుష్టబుద్ధినైన నేను శాకల నగరంలో నివసిస్తుండేవాడిని అధికాంశ జీవనాన్ని వ్యాపారంలోనే గడిపాను. ధనలోభం ఏనాడూ ఆకలిగొన్న వాడికి అన్నం పెట్టలేదు. దాహమన్న వాడికి నీరివ్వలేదు. మా ఇంటి ప్రక్కనే ఒక గుణవంతుడైన బ్రాహ్మణుడుండేవాడు. దాన గుణమూ ధర్మబుద్ధీ అంటే లేవుగానీ, నాకు కాస్త దైవభక్తి వుండేది. అదీ ఆ బ్రాహ్మణుడి ప్రసాదమే.
ఆయన ఒక శ్రవణ నక్షత్రయుక్త భాద్రపద ద్వాదశినాడు నన్ను ‘తోషా’ నదికి రమ్మన్నాడు. తోషానది అక్కడ చంద్రభాగా నదిలో కలుస్తుంది. మేమా తీర్థంలో స్నానం చేసి ఉపవాసముండి, విష్ణు ప్రతిమకు దధ్యోదన, ఛత్ర, వస్త్రాది ఉపచారాలతో పూజ చేసి వచ్చేశాం. తరువాత ఆయన భక్తి పెరిగి మహర్షి అయినాడు. నేను భక్తి నశించి నాస్తికుడినయ్యాను. మరణించిన పిమ్మట నా పాపాలు నన్ను ఇదిగో ఇలా ప్రేతాత్మగా మార్చి ఇక్కడ పడేశాయి. ఈనా సహచరబృందంలో బ్రాహ్మణ ధనాన్నపహరించిన వారు కొందరైతే, స్వామిద్రోహులు మరికొందరు, మిత్రద్రోహులు ఇంకొందరైతే ఇతరేతర పాపాలు చేసిన వారు ఇతరులు. అయ్యా! అక్షయ - సనాతన పరమాత్మయైన శ్రీకృష్ణు భక్తులు మీరు. ద్వాదశి వ్రతం నాకిన్నాళ్ళూ అన్నం పెట్టింది. కృష్ణభక్తి మిమ్మల్ని కాపాడింది. మీరు ఒక్క ఉపకారం చెయ్యండి. మీరు హిమాలయంవైపు వెళ్ళి ఇబ్బడి ముబ్బడిగా ధనం సంపాదిస్తారు. అపుడు వీరిపై దయతో గయలో వీరికి శ్రాద్ధకర్మ చేయండి. వీరు ముక్తులౌతారు మీకు అన్నం పెట్టిన పుణ్యానికి నేనిపుడే ముక్తుడనయ్యాను. ద్వాదశి వ్రతం వల్ల స్వర్గానికి పోతున్నాను’ అంటూ తన కోసం వచ్చిన విమానాన్నెక్కి అతడు స్వర్గలోకానికి వెడలిపోయాడు.
ఈ వణిజుడు వెంటనే హిమాలయానికి వెళ్ళి అక్కడ ధనప్రాప్తి నొంది స్వగృహానికి మరలి కొద్దిరోజులుండి గయకుపోయి అక్కడి అక్షయవట సమీపంలో ప్రేతాత్మల నుద్దేశించి శ్రాద్ధం పెట్టాడు. ఆ ప్రేతాత్మలన్నీ అతని కలలో కనబడి ‘ఓ మహాభాగా! నీ కృపవల్ల మేము ముక్తులమైనాము. మాకు పరమగతి ప్రాప్తించింది’ అని చెప్పి వెళ్ళాయి. మహారాజా! ఆ వణిజుడు ఇంటికి వచ్చి భాద్రపద శుక్ల ద్వాదశి, శ్రవణ నక్షత్రాలు యోగించిన రోజున జనార్దనుని పూజించి బ్రాహ్మణులకు గోదానాలు చేశాడు. దేహాంతంలో సామాన్యులకు అతి దుర్లభమైన ఉత్తమలోక ప్రాప్తి నొందాడు.