భవిష్య పురాణము

35 - విషలక్షణాలు - చికిత్స

“రాజా! కశ్యపుడింకా చెప్పసాగాడిలా: తన యమదూతి అనే పేరు గల కోరతో సర్పం కాటు వేసిందని తెలిస్తే ఇక చికిత్స అనవసరం. దినంలో రెండవ, రాత్రి పదహారవ ప్రహరార్ధ కాలాన్ని నాగోదయవేళ అంటారు. ఈ వేళలో పాము వేసే కాటు కాల ప్రచోదితం. దానికి చికిత్స లేదు.

సర్పవిషం శరీరంలోకి క్షణాల్లో ఎక్కుతుంది. చేతిని చాచి ముడిచేదానికి పట్టేటంత సూక్ష్మ సమయంలోనే అది మెదడు నాక్రమిస్తుంది. గాలి మంటలను వ్యాపింప జేసినంత వేగంగా రక్తంలో చేరిన విషం వృద్ధి నొందుతుంది. శ్రవణశక్తి, శ్వాసశరవేగంతో ఆగిపోయి మరణం సంభవిస్తుంది. ఈ శరీరం పంచభూత నిర్మితం కదా! మరణించాక ఏ భాగానికాభాగం విడిపోయి పంచభూతాల్లో కలిసిపోతుంది. కాబట్టి విషానికి చికిత్స చాలా వేగంగా జరగాలి.

రోమాంచము, స్వేదము, కంపనము, శ్రవణశక్తి నష్టము, ఎక్కిళ్ళు, మెడ వేలాడుట, ప్రాణము పోవుట అనేవి విషము ఎక్కుటలో ఏడు దశలు. ఒక్కొక్క దశలో ఒక్కొక్క శరీరధాతువుని విషం చేరుకుంటుంది.

కనుల ముందు చీకటి మూగుట, శరీరం లోంచి మంటలు పుట్టుకొస్తున్నట్టుండుట విషము చర్మంలోకి ఎక్కిందనే దానికి సంకేతాలు. ఈ దశలో జిల్లేడు వేరు(ఉత్తరేను మొక్క) (ఉత్తరేను మొక్క)అపామార్గ,  (నందివర్ధనం) తగర (ప్రేంకణపు చెట్టు)ప్రియంగులను  నూరి పొడిచేసి నీటిలో కలిపి త్రాగిస్తే విష ప్రభావం తగ్గవచ్చును. చర్మదశ దాటి రక్తంలోకి విషం ప్రవేశిస్తే దాహము, మూర్ఛ అనే సంకేతాలొస్తాయి. అప్పుడు వట్టివేరు, చందనం, కూటము, తగర, నీలోత్పలము(వావిలి చెట్టు) సిందువారజడము(ఉమ్మెత్త)  ధతురాజడము, ఇంగువ, ఎండుమిరప - వీటిని నూరి ముద్దజేసి ఇవ్వాలి. బాధ తగ్గకపోతే (దురదగొండి)భటకటయ్యా, వెర్రిపుచ్చజడము, సర్పగంధాలను నేతితో రంగరించి ఇవ్వాలి. ఇంకా తగ్గకపోతే సిందువారము ఇంగువలను కషాయం చేసి ఇవ్వాలి. దానినే మెత్తగా పొడి చేసి లేపనం చేసి శరీరమంతటా పూయాలి.

సర్పదష్టుడు ఎగిరెగిరిపడుతుండడం, చర్మం పచ్చ పచ్చగా అయిపోతుండడం, దాహం, మూర్ఛ ఇవన్నీ విషం రక్తంలోకీ పిత్తంలోకి చేరిందనే దానికి సంకేతాలు. ఈ అవస్థలో (రావి)పీపల, తేనె, నెయ్యి, మహువా, తుంబాజడం(ఉసిరి), వెర్రి పుచ్చజడం వీటన్నింటినీ కలిపి గోమూత్రంతో రంగరించి నస్య, లేపన, అంజనాలను తయారుచేసి పూయాలి.

విషం పిత్తం నుండి కఫంలోకి ప్రవేశించినపుడు శరీరం బిగుసుకుపోతుంది. శ్వాసరాదు. గురక వస్తుంది. ఈ దశలో పీపల, ఎండు మిరప, శొంఠి, (విరిగి చెట్టు)శ్లేష్మాతక లోధ, మధుసార పొడులను సమాన పాళ్ళలో కలిపి గోమూత్రంతో రంగరించి లేపనము, అంజనము చేయాలి. నీటిలో వేసి త్రాగించడం కూడా చెయ్యవచ్చు.

కఫంలోంచి వాతంలోకి విషం వెళ్ళిపోయినపుడు పొట్ట ఉబ్బిపోతుంది. కనులు పనిచెయ్యవు. అపుడు (లొద్దుగు చెట్టు)శోణాజడం  (ఎఱ్ఱదుండిగ మొక్క వేరు)ప్రియాలం, (ద్రాక్ష, మోరటి)గజపీపలం, (ఆకు కూర చెట్టు)భారంగి  (వస)వచా, దేవదారు, మహువా, సిందువారం, ఇంగువలను పొడిచేసి, గోలీలను తయారుచేసి రోగికి తినిపించాలి. అంజన లేపనాలను కూడా చేయాలి.

వాతం నుండి విషం ఎముకలలోని మూలుగుకు చేరినపుడు రోగి శరీరం శిథిలమైపోయి ఏ అంగమూ పనిచేయదు. అపుడు నెయ్యి, తేనె, పంచదార కలిపిన(ముద్ద (గసగసాలనే అర్ధం కూడా ఉంది) ఖసము, చందనము కలిపి పానీయం చేసి త్రాగించాలి.

ఈ దశకూడా దాటిన వారిని సాధారణ వైద్యులు బతికించలేరు. సిద్ధమంత్రాలు, కొన్ని అపరూప ఓషధులు, మృత సంజీవని వంటివి గల సిద్ధులే బ్రతికించగలరు.