మహారాజా! సంపూర్ణ పాప నాశకమూ, సమస్త కల్యాణ కారకమూనగు అనంత చతుర్దశీ వ్రతాన్ని వినిపిస్తాను. దీనిని భాద్రపద శుక్ల చతుర్దశినాడు చేస్తారు.
“భగవన్! అనంత శబ్దానికి శేషనాగుడనే అర్థమే ఎక్కువగా వాడబడుతున్నది. మీ నామాల్లో కూడా అనంత శబ్దముంది. అనంతుడంటే బ్రహ్మయనీ పరమాత్మయని కూడా అర్థాలున్నాయి కదా!”
“యుధిష్టిర మహారాజా! అనంతుడనేది నానామమే. కళా, కాష్ఠా, ముహూర్త, దిన, పక్ష, మాస, ఋతు, అయన, సంవత్సర, యుగ, కల్పాది కాల విభాగంలో ప్రతిచోటా నేనే వున్నాను. భూభారాన్ని తగ్గించడానికి దుష్టసంహారం చేయడం కోసం వసుదేవ నందనునిగా జన్మించి ఈరోజు నీ ముందున్నాను. (పృథ అంటే కుంతి ఆమె కొడుకు లంతా పార్థులవుతారు. ధర్మరాజూ పార్థుడే. నిజానికి ఆయన అర్జునుని కన్న ముందే పార్థుడైనవాడు.) పార్థా! విష్ణు, జిష్ణు, బ్రహ్మ, శివ, హర, భాస్కర, శేష, సర్వవ్యాపి ఈశ్వరాది నామాలతో నన్నే మీరంతా పిలుస్తున్నారు. అంతములేనివాడిని కనుక నన్ను అనంతుడని కూడా పిలుస్తారు.”
“తెలిసినది వాసుదేవా! ఇక అనంత వ్రతాన్ని నాకు ఉపదేశించి నన్ను ధన్యుని చేయండి.”
“మహారాజా! దీనికి సంబంధించి ఒక ప్రాచీన ఆఖ్యానముంది. అవధరించు. కృతయుగంలో వసిష్ఠగోత్రీకుడైన సుమంతు నామక బ్రాహ్మణుడొకాయన వుండేవాడు. ఆయనకి భృగుమహర్షి కూతురు దీక్షతో వేదోక్తంగా వివాహం జరిగింది. వారికి శుభలక్షణ సంపన్నయైన ఒక కూతురు పుట్టింది. ఆమెకు శీలయని పేరు పెట్టారు. కొన్నేళ్ళకు దీక్షకేదో జ్వరం తగిలి మరణించింది. మహాపతివ్రత కాబట్టి ఆమెకు స్వర్గం ప్రాప్తించింది. సుమంతు బ్రాహ్మణుడు కర్కశయను పేరుగల కన్యను పునర్వివాహం చేసుకున్నాడు. ఆమె పేరుకు తగినట్టే దుఃశీల, కర్కశ, నిత్య కలహకారిణి, చండీరూప. శీలకి పెళ్ళీడు వచ్చింది. ఆమె తండ్రి ఇంట్లోనే నివసిస్తూ గోడలకు, తలుపులకు, అరుగులకు మంగళకరమైన స్వస్తిక, పద్మ, శంఖాది విష్ణు చిహ్నాలను చిత్రిస్తూ వాటికే అర్చన చేస్తుండేది. సుమంతు బ్రాహ్మణుడామెను కౌండిన్య మునికిచ్చి వివాహం చేశాడు. తన భార్యతో ‘దేవీ! అల్లుడికి పారితోషిక రూపంలో ఏమైనా ఇవ్వాలి కదా! ఏర్పాటు చెయ్యి’ అన్నాడు. ఆమె ఆ మాట విని పరమకోపితురాలై ఇంటిలో నున్న మండపాన్ని పెల్లగించి పడేసి ఇంట్లో ఆరోజు మిగిలిన భోజన పదార్థాలను చల్దిమూటగా కట్టి బయటపడవేసి ‘ఇకపొండి’ అంటూ తలుపు వేసేసుకుంది.
కౌండిన్యుడు శీలను తోడ్కొని ఎద్దులబండిపై మెలమెల్లగా తన వూరికి ప్రయాణించ సాగాడు. మధ్యాహ్నవేళ వారొక నదీతీరంలో ఆగారు. అక్కడ శుభ వస్త్రాలను ధరించిన కొందరు స్త్రీలు విడివిడిగా జనార్దనుని పూజిస్తూ శీలకు కనిపించారు. ఆమె వారిని సమీపించి వారిని వ్రత వివరాలడిగింది.
‘ఇది అనంత చతుర్దశీ వ్రతం. గిన్నె నిండా పక్వాన్నమును నైవేద్యంగా పట్టుకొని నదీ తీరానికి పోవాలి. అక్కడ స్నానం చేసి ఒక మండలంలో అనంత స్వరూపుడైన విష్ణువును గంధపుష్ప ధూపదీపాది ఉపచారాలతో పూజించి కథను వినాలి. ఆయనకు నైవేద్యాన్నిర్పించి అందులో సగభాగాన్ని బ్రాహ్మణునికి నివేదించి మిగతా సగభాగాన్ని ప్రసాదంగా మనం గ్రహించాలి. అనంతరం అనంతుని కెదురుగా పదునాల్గు ముడులతో నొక దొరకాన్ని స్థాపించి దానిని కుంకుమాదులతో అర్చించాలి. దానిని స్వామికి నివేదించి పురుషుడు కుడిచేతికీ స్త్రీ ఎడమ చేతికి కట్టుకోవాలి. దోరక బంధన సమయంలో ఈ మంత్రం ద్వారా వాసుదేవుని ప్రార్థించాలి.
అనంత సంసార మహాసముద్రే మగ్నాన్
సమభ్యుద్ధర వాసుదేవl
అనంతరూపే వినియోజితాత్మా
హ్యనంతరూపాయ నమోనమస్తే॥ (ఉత్తరపర్వం - 94/33)
అనంతరం నైవేద్యాన్ని గ్రహించి విశ్వరూపి అనంత దేవ నారాయణ భగవానులను ధ్యానిస్తూ ఇంటికి వెళ్ళాలి.’
శీలాదేవి కూడా విధి అనుసారంగా ఈ వ్రతాన్ని చేసి తన వద్ద నున్న అన్నం మూటను నివేదించి అందులో ఒక సగాన్ని అక్కడే వున్న బ్రాహ్మణునికి సమర్పించి మిగతా సగాన్ని తాను స్వీకరించి దోరకాన్ని కూడా కట్టేసుకుంది. అప్పుడే ఆమె భర్త అక్కడికి వచ్చాడు. వారిద్దరూ మరల బండినెక్కి అతని ఇంటికి సాగి పోయారు. ఇల్లు చేరగానే ఈ వ్రత ప్రభావం వల్ల ఆ గృహం ధన, ధాన్య రాశులతోనూ గోసంపదతోనూ నిండిపోయింది. ఉన్నట్టుండి శీల శరీరమంతటా మణులూ, ముత్యాలూ, స్వర్ణాభరణాలూ అమరిపోయాయి. ఆమె సూర్యతేజస్సుతో వెలిగిపోసాగింది.
కొంతకాలం తరువాత ఆమె పతికి ఎందుకో కోపం వచ్చి ఆ కోపావేశంలో ఆమె చేతికున్న అనంత దోరకాన్ని తెంచి పారేశాడు. వెంటనే ఆ ఇంటికి కష్టాలు మొదలయినాయి. ఆ విపరీత కర్మ వల్ల బంగారం అదృశ్యమై పోయింది. గోధనాన్ని దొంగలపహరించుకుపోయారు. ఆ ఇల్లు కలహాల కాపురానికి నిలయమై పోయింది. మిత్రులు వీరితో మైత్రిని వదులుకున్నారు. ఇంటిలో దారిద్ర్యం తాండవించసాగింది. అనంత భగవానుని పట్ల తాను చేసిన అపచారమే తన అధోగతికి కారణమని గ్రహించిన కౌండిన్యుడు ఆయన దర్శనాన్ని పొంది క్షమాపన వేడిగాని వెనక్కి రాకూడదని నిశ్చయించుకొని ఒక నిర్జన వనానికి పోయి అక్కడ నిరాహారంగా, బ్రహ్మచర్య వ్రతాన్ని పాటిస్తూ ఆ స్వామి వ్రతాన్ని జపాన్ని చేశాడు. ఇలా అనంత నారాయణ దర్శన లాలసతో విహ్వలుడై మరొక నిర్జన వనానికి పోయాడు. అక్కడొక పుష్ప, ఫలాలతో నిండిన మామిడిచెట్టుని చూసి ‘ఓ వనదేవతా! నీవు ఇక్కడెక్కడైనా అనంత భగవానుని చూశావా’ అని అడిగాడు. ఆ చెట్టు ‘బ్రాహ్మణోత్తమా! నాకాయన ఎవరో కూడా తెలియదు’ అంది. ఇలా వృక్షాదులను ఇలాగే అడుక్కుంటూ పోతూ కౌండిన్యుడు ఒక గడ్డిమేస్తున్న సవత్స గోవునడిగాడు. గోమాత తనకు తెలియదని చెప్పింది. ఒక వృషభాన్నడిగాడు. అది కూడా ఆయనెవరో తనకు తెలియదు పొమ్మంది. తరువాత రెండు రమణీయ సరోవరాలు కనిపిస్తే వాటినడిగాడు. అవీ అలాగే బదులిచ్చాయి. ఇలా ఆ బ్రాహ్మణుడు గాడిదనుండీ ఏనుగుదాకా అన్ని జంతువులనూ అడిగి అదే జవాబు రావడంతో నిరాశోపహతుడై నేలపై కూలిపోయాడు. అప్పుడాతనిపై జాలిపడి అనంత భగవానుడే ఒక వృద్ధ బ్రాహ్మణ రూపంలో వచ్చి అతనిని లేవనెత్తి సేదదీర్చి తన దివ్య చతుర్భుజ యుక్త దివ్యమంగళ స్వరూపంతో దర్శనమిచ్చాడు. కౌండిన్యుడత్యంతానందమగ్నుడై కంటివెంట పశ్చాత్తాపాశ్రువులు జాలువారుతుండగా పలు ప్రార్థనలు, స్తుతులు ఒనర్చి ఇలా క్షమాపన వేడాడు:
పాపోఽహం పాపకర్మాహం పాపాత్మాపాప సంభవః।
పాహిమాం పుండరీకాక్ష సర్వపాప హరోభవః
అద్యమే సఫలం జన్మ జీవితం చ సుజీవితం॥ (ఉపసర్గ పర్వం-94/60,1)
తరువాత స్వామిని ఆతడిలా అడిగాడు, స్వామీ నేనేదో పిచ్చిగా ఒక మామిడి చెట్టునీ, గాడిదనీ, ఏనుగునీ ఇతరాలనీ ‘నా స్వామిని చూశారా’ అని అడిగాను. అవి మానవ భాషలో నకారాత్మకంగా బదులిచ్చాయి. ఇదెలా సాధ్యమైంది?”
‘కౌండిన్యా! ఆ మామిడి మహావృక్షం పూర్వజన్మలో వేదజ్ఞుడు, విద్వాంసుడునైన బ్రాహ్మణుడు. మహాగర్వి. శిష్యులకు విద్యా దానం చేయలేదు. అందుచేత వృక్ష యోనిలో జనించాడు. ఆ ఆవు పూర్వజన్మలో వ్రతం చేస్తూ భూదానం కింద గడ్డి కూడా మొలవని ఎందుకూ పనికిరాని భూమినిచ్చి ఇలా పుట్టడం జరిగింది. వృషభం కూడా అంతే. నీవు చూసిన సరోవరాలు పూర్వజన్మలో బ్రాహ్మణ స్త్రీలు అక్కచెల్లెళ్ళు. విద్యావంతులై ధర్మాధర్మ చర్చలలో పడి నిత్యమూ కలహించుకొంటూ బ్రాహ్మణ, అతిథి, పతిసేవలేవీ చేయకుండానూ, దానమన్న ప్రసక్తే లేకుండానూ బ్రతికేశారు. నీకు జవాబిచ్చిన గాడిద పూర్వ జన్మలో మహాక్రోధి. ఏనుగు ధర్మదూషకుడు. వీరంతా నీతో మాత్రమే మాట్లాడగలిగారు. ఇక నీవు ఇంటికి పోయి నా వ్రతాన్ని చేసి బుద్ధిగా వుండు. నీవు ఉత్తముడివి కాబట్టి సుఖంగా పుత్ర పౌత్రాదులతో జీవించి అంతంలో మోక్షాన్ని పొంది నక్షత్ర పదవిని కూడా పొందగలవు’ అని తన కోసం తీవ్రంగా తపించి అన్వేషించి దర్శనాన్ని సాధించిన కౌండిన్యుడికి వరమిచ్చి అనంతుడంతర్థానం చెందాడు.
ఓ యుధిష్ఠిర మహారాజా! ఈ వ్రత కథను విన్నవారు దేహాంతంలో భగవంతునిలో ఐక్యమైపోతారు.”