“గురుదేవా ! గృహస్థధర్మాలను మీ ద్వారా వినాలని కుతూహలపడుతున్నాను” అన్నాడు శతానీకుడు.
చెప్పసాగాడు సుమంతుడు
“పంచమహాయజ్ఞాలు గృహస్థ ధర్మంలో విశేష ప్రాధాన్యాన్ని వహిస్తాయి. మన దైనందిన కర్మల్లో హింస జరిగే చోట్లు అయిదు అవి రోలు, తిరగలి, పొయ్యి, చీపురు, నీరు దాచే చోటు. ఈ హింసవల్ల, తెలియక చేసిన జీవహింస వల్ల, పేరుకునే పాపం నుండి విముక్తిని ప్రసాదించేవే పంచమహాయజ్ఞాలు. అవి బ్రహ్మయజ్ఞం మరియు పితృ, దైవ, భూత, అతిథియజ్ఞాలు.
అధ్యయనము, అధ్యాపనములే బ్రహ్మయజ్ఞము. తర్పణాది కర్మలు పితృయజ్ఞము. హవనము అంటే హెూమంలో అగ్నిని వ్రేల్చుట దైవయజ్ఞము, బలివైశ్వదేవకర్మ - అంటే కాకి నుండి అన్ని ప్రాణులకు అన్నమునో దేనినో పెట్టుట - భూతయజ్ఞము, అతిధులకు అభ్యాగతులకు సాదరంగా స్వాగతం పలికి విసుక్కోకుండా భోజనం పెట్టడం అతిథియజ్ఞం.”
“గురుదేవా! ఏ బ్రాహ్మణుని ఇంటిలోనైతే అగ్నిహోత్రం ప్రజ్వరిల్లదో అతడు మృతకల్పుడే అన్నారు కదా! మరి వాని పితరులెలా తరిస్తారు? వానికి జ్ఞానోదయమైనా, దేవతలెలా కరుణిస్తారు?”
“మహారాజా! కారణమేదైనా సరే, ఇంట్లో అగ్నిహోత్రం లేని బ్రాహ్మణులు ఇలా తరించవచ్చు :
“వ్రతోపవాస నియమైర్నానా దానైస్తథా నృప
దేవాదయోభవంత్యేయవ ప్రీతాస్తేషాం నసంశయంః ॥
విశేషదుపవాసేన తిధౌ కిల మహీపతే
ప్రీతా దేవాదయస్తే షాం భవంతి కురునందన॥ (బ్రహ్మ 16/23 - 24)
వీరు వ్రతాలు, ఉపవాసాలు, నియమాలు, దానాలు, దేవతాస్తుతి, భక్తి మున్నగు వాటిచే ఉద్ధరించబడతారు. కొన్ని కొన్ని పనులు చెయ్యాలి. విను.
ప్రతిపదా తిథినాడు పాలు, ద్వితీయనాడు ఉప్పు లేకుండా భుజించాలి. తదియనాడు నూనె, అన్నము మాత్రమే తినాలి. చవితినాడు పాలు త్రాగి ఊరుకోవాలి. పంచమినాడు పండ్లు మాత్రమే స్వీకరించాలి. షష్ఠినాడు కూరగాయలు, సప్తమినాడు బిల్వాహారము, అష్టమినాడు పిష్టము, నవమినాడు అగ్ని తగలని ఆహారము దశమి ఏకాదశులనాడు నెయ్యి, ద్వాదశినాడు ఫలరసము, త్రయోదశినాట గోమూత్రం, చతుర్దశినాడు యవధాన్యంతో వండబడిన అన్నము స్వీకరించాలి. పున్నమినాడు కుశదర్భలచే పవిత్రము చేయబడిన జలమును మాత్రమే స్వీకరించాలి. అమావాస్యనాడైతే హవిష్య - భోజనము చేయాలి. ఈ విధంగా ఒక పక్షం రోజులపాటు చేసినవారికి పది అశ్వమేధయాగాలు చేసిన ఫలం లభిస్తుంది. ఒక మన్వంతరం దాకా స్వర్గలోక ప్రాప్తి సిద్ధిస్తుంది. ఇలా మూడు నాలుగు మాసాలపాటు ఉపవసించిన వారికి వంద అశ్వమేధాలూ, వంద రాజసూయాలు చేసిన ఫలం లభిస్తుంది. అనేక మన్వంతరాల పాటు స్వర్గలోక ప్రాప్తీ సిద్ధిస్తుంది. ఈ విధమైన ఉపవాస, భోజన నియమాలను ఎనిమిదినెలల పాటు పాటించిన వానికి పైన చెప్పిన వేయి యజ్ఞాలు కావించిన ఫలంతో బాటు పదునాలుగు మన్వంతరాల కాలం స్వర్లోక ఆనందం ప్రాప్తిస్తుంది. అదే ఏడాదికాలం పాటిస్తే సూర్యలోక నివాసం అనేక మన్వంతరాల దాకా సిద్ధిస్తుంది. ఈ ఉపవాస విధిని చేయడానికి స్త్రీలకూ, నాలుగు వర్ణాల జనులకూ అధికారం వుంది.
ఈ వ్రతాన్ని ఆరంభించడంలో కూడా ఫల వైవిధ్యముంది. ఆశ్వయుజ నవమి, మాఘ సప్తమి, వైశాఖ తదియ లేదా కార్తీక పౌర్ణమినాడు ప్రారంభించి అన్ని నియమాలతో దిగ్విజయంగా పూర్తిచేసిన వారికి దీర్ఘాయువు, దేహాంతమందు సూర్యలోక ప్రాప్తి కలుగుతాయి.
కొంతమందిని మనం అదృష్టవంతులనీ భాగ్యశాలురనీ అంటూ వుంటాం కదా! ఇది విను. పూర్వజన్మలలో వ్రతాలను, ఉపవాసాదికములను జయప్రదంగా ముగించి దానగుణం ద్వారా అనేక బ్రాహ్మణ, సాధు, సంత, తపస్వి గణాలను సంతుష్ట పరచి మాతాపితలకు, గురువుకీ, శుశ్రూష చేసి విధి పూర్వకంగా తీర్థయాత్రలు సలిపి, తత్ఫలితంగా స్వర్గంలో ఎంతో కాలం ఆనందంగా గడిపి, మరల పృథ్విపై జన్మించినపుడు వారికి ఆ పూర్వజన్మల పుణ్యాలకు చిహ్నాలుగా ఏనుగులు, గుఱ్ఱాలు, పల్లకీలు, రథాలు, సువర్ణమూ, రత్నాలు, కంకణాలు, కేయూరాలు, హార కుండల ముకుటాలూ, ఉత్తమ వస్త్రాలు, శ్రేష్ఠ సుందర నారీజనమూ మంచి సేవకులూ అన్నీ సమకూరతాయి. వ్యాధులు లేని దీర్ఘాయువు, పుత్ర పౌత్ర సమృద్ధి కలుగుతాయి. పూర్వజన్మలో ఏపుణ్యమూ చేయని వానిని కూడా మనం సులభంగానే పోల్చవచ్చును. వానికి పుణ్యచిహ్నాలేవీ సమకూరకపోగా అష్ట దరిద్రాలనూ అనుభవిస్తుంటాడు.”
“మునీంద్రా ఏ తిథినాడు ఏం చేయాలో మీరు నాకు సంక్షిప్తంగా అనుగ్రహించారు. ఏ తిథినాడే దేవతనారాధించాలి, ఆ దేవత ప్రీతి కొరకు చేసే వ్రతవిధానమేమి, అనే విషయాలను విస్తారంగా నన్ను కరుణించి, వివరిస్తే, ద్వంద్వ రహితుడనై, పవిత్రుడనై యజ్ఞఫలాలను పొందగలను” అన్నాడు మహారాజు.
చెప్పసాగాడు మహాముని
“మంచిది మహారాజా! ఇంతవఱకు ఈ విషయాన్నెవరికి చెప్పలేదు. నీకే చెప్తున్నాను. ఇది బాగా అర్థం కావడానికి మనం, ముందుగా మరొక్కమారు సృష్టి ఎలా జరిగిందో స్మృతిలోకి తెచ్చుకుందాం. ముందుగా పరమాత్మ నీటిని సృష్టించి అందులో తేజస్సును ప్రవేశపెట్టాడు. అప్పుడొక అండము సృజింపబడి గోచరించింది. అందుండి బ్రహ్మ ఉద్భవించాడు. అండము అలాగే వుంది. ఆయన సృష్టి చేయాలనే కోరికతో దాని రెండు కపాలాలలో ఒక దాని నుండి భూమిని, రెండవ దాని నుండి ఆకాశాన్ని రచించాడు. అనంతరం దిక్కుల్నీ, ఉపదిశల్నీ, దేవదానవులనూ సృజించాడు. ఇవన్నీ చేయబడిన రోజుకి ప్రతిపదాతిథి అని పేరు. బ్రహ్మదేవుడీ తిథిని సర్వోత్తమంగా భావించాడు. అన్ని తిథులలో ప్రారంభ తిథి ఇది. ఈ తిథికి సంబంధించిన వ్రతాన్ని కార్తీక పున్నమినాడు గానీ, మాఘ సప్తమి లేదా వైశాఖ శుక్ల తదియనాడు ప్రారంభించాలి. ప్రతిపదాతిథి నాడే ప్రారంభించదలచుకొన్న దానికి ముందలి చతుర్దశి నాటి భోజనానంతరమే సంకల్పం చెప్పుకోవాలి. అమావాస్యనాడు త్రికాల స్నానాలు చేసి భోజనం మానేసి గాయత్రి జపిస్తూ గడపాలి. ప్రతి పద నాటి ఉదయమే ఒక బ్రాహ్మణ శ్రేష్ఠుని రావించి గంధమాల్యాదులతో పూజించి యథాశక్తి పాలను సమర్పించుకొని “బ్రహ్మదేవుడు నాకు ప్రసన్నుడు కావాలి” అంటూ బ్రాహ్మణునికి నమస్కరించి అప్పుడు తాను ఆవు పాలు తాగాలి. ఇలా ఒక యేడాదిపాటు చేసిన తరువాత గాయత్రికీ బ్రహ్మకీ పూజలు చేసి వ్రత సమాప్తి కావించాలి. ప్రతియొక్క సర్వపాపాలు నశిస్తాయి. ఆత్మశుద్ధి కలుగుతుంది. మరణానంతరం విమానం లో దేవలోకం పోయి మరల సత్యయుగంలో శ్రేష్ఠమైన పది బ్రాహ్మణ జన్మలెత్తుతాడు. వేదవిద్వాన్, ధనికుడు, ఆరోగ్యవంతుడు, మహాభోగి, యజ్ఞకర్త, మహాదాని, దీర్ఘాయువుగా జీవిస్తాడు. విశ్వామిత్రుడు బ్రాహ్మణపదవి కోసం ఎంతగానో జపించాడు, తపించాడు. చివరికి కఠోరనియమాలతో ఈ ప్రతిపదావ్రతాన్ని చేశాకనే బ్రహ్మ సాక్షాత్కరించి అతనిని బ్రహ్మర్షిని చేశాడు. క్షత్రియ, వైశ్య, శూద్రులు కూడా ఈ వ్రతాన్ని చేసి పాపముక్తులై మరుజన్మలో సంపన్న బ్రాహ్మణులైనారు. హైహయ, తాలజంఘ, తురుష్క, యవన, శకాది మ్లేచ్ఛ జాతులవారు కూడా ఈ వ్రతాన్నాచరించి బ్రాహ్మణ జన్మను పొందగలరు. ఈ వ్రత మాహాత్మ్యాన్ని విన్నవారు, చదివినవారు శుద్ధి, వృద్ధి సత్కీర్తులను పొంది దేహాంతమందు సద్గతిని పొందగలరు.”
“గురుదేవా! ఈ వ్రతాన్ని మరింత విస్తారపూర్వకంగా వినగోరుతున్నాను” అన్నాడు రాజు.
చెప్పసాగాడు సుమంతుడు
Summary of chapter 9 of the Bhavishya Purāṇa is as follows:
The supreme authority of the śāstra is affirmed: dharma is knowable only through scripture, and the life of the household must be continuously aligned with śāstric guidance. The pativratā — the woman of complete devotion to her husband — is presented here as the living foundation upon which all household dharma rests. Stories of great pativratās whose tapas-power altered the course of cosmic events are alluded to as testimony that such devotion is not mere social convention but a spiritual force of the highest order. The chapter establishes that a husband's dharma and prosperity are in a direct and mystical sense dependent on his wife's faithfulness and her inner cultivation of devotion.