భవిష్య మహా పురాణము
162, 163 - మహిషీ దాన విధి;
మహిషి (గేదె)ని దానమిస్తే పాపాలు నశిస్తాయి, పుణ్యమూ పెరుగుతుంది, ఆయువృద్ధి అవుతుంది, జీవితం సుఖప్రదంగా సాగుతుంది.
సూర్య, చంద్ర గ్రహణ దినాల్లో, శుక్ల చతుర్దశి మున్నగు పర్వదినాల్లో, కార్తిక పౌర్ణమి, అయన సంక్రాంతుల్లో సాంసారిక దుఃఖ నివృత్తికై ఒక విద్వాంసుడైన బ్రాహ్మణునికి ఈ క్రింది మంత్రాన్ని చదువుతూ గేదెను దానమివ్వాలి.
ఇంద్రాదిలోకపాలానాం యా రాజమహిషీ శుభా।
మహిషీ దాన మాహాత్మ్యాత్ సాస్తుమే సర్వకామదా॥
ధర్మరాజస్య సాహాయ్యే యస్యపునః ప్రతిష్ఠితః
మహిషాసురస్య జననీయా సాస్తు వరదామమ॥ (ఉత్తరపర్వం 162/9, 10)
ఈ మంత్రాన్ని ప్రదక్షిణం చేస్తూ చదివి గేదెను వెనుక నుండి దానమివ్వాలి.
మేషీదానవిధిలో స్వర్ణమయ మేషి ప్రతిమను చేయించి దానిని గాని ప్రత్యక్షమేషి (ఆడుగొఱ్ఱె)ని గాని దానం చేయవచ్చును. ఈ దానానికి గ్రహదినాలు, విషువయోగ దినాలు, అయన సంక్రాంతులు ప్రశస్తాలు. దుస్స్వప్న శాంతికై ఆ పీడకల వచ్చిన మరునాడే ఈ దానాన్ని చేయాలి. దాన సమయంలో త్రిమూర్తులకూ మన్మథునికీ వారి సతులతో సహా పూజలు చేయాలి. లోకపాలురనూ గ్రహాలనూ కూడా పూజించి హవనం చేయాలి.
పూజానంతరం మేషి ప్రతిమను నువ్వులతో నింపిన కలశలో స్థాపితం చేసి దానికెదురుగా ఉప్పును మరో కలశలో పోసి రెండింటినీ గృహస్థుడైన బ్రాహ్మణునికి దానం చేయాలి.”