భవిష్య పురాణము

33 - సర్పలక్షణ, స్వరూప, జాతులు 

శతానీకుడడిగిన మీదట ఈ విషయమై మహర్షి ఇలా చెప్పసాగాడు.

“మహారాజా! ఒకప్పుడిదే విషయాన్ని గౌతముడడుగగా సర్పవిజ్ఞాన సర్వస్వమన దగు వివరణను కశ్యపుడు చెప్పాడు. జ్యేష్ఠ, ఆషాఢ మాసాల్లోనే సర్పాలెక్కువగా సంగమిస్తాయి. వర్షర్తువంతా సర్పిణి గర్భిణిగానే వుంటుంది. కార్తికంలో అది రెండు వందల నలభై దాకా గుడ్లు పెడుతుంది. కాని వాటిలో కొన్నిటిని అదే తినేస్తుంది. ఏదో ప్రకృతి మాత దయవల్ల కొన్ని అటూ, ఇటూ దొర్లి మిగుల్తాయి. బంగారంలా మెరిసేవి మగగ్రుడ్లు. కేతకి పచ్చదనంతో వుండి, కోలగా రేఖలతో నుండేవి ఆడ గ్రుడ్లు. శిరీష పుష్పవర్ణంలో గుండ్రంగా వుండేవి నపుంసక గ్రుడ్లు. వీటిని సర్పిణి ఆరునెలల పాటు పొదుగుతుంది. గ్రుడ్లు పగలగానే వెలువడే పాము పిల్లలకు తల్లితో స్నేహముంటుంది. ఏడు రోజుల నాటికి అన్ని పిల్లలూ నల్లగానే వుంటాయి. పాము కనీసం నూట ఇరవై సంవత్సరాల ఆయువును కలిగివుంటుంది. దీనికి ఎనిమిది మృత్యు కారకాలుంటాయి. అవి మనిషి, నెమలి, చకోర పక్షి, పిల్లి, ముంగిస, పంది, తేలు, ఆవు వంటి పశువుల గిట్టలు. ఏడు దినాలకు దంతాలు పుట్టుకొస్తాయి. ఇరవై ఒక్క దినాల వయసు వచ్చేసరికి విషం తయారవుతుంది. ఆరునెలల కొకసారి కుబుసం విడుస్తుంది. నిజానికి సర్పానికి రెండువందల పాదాలుంటాయి కాని అవి ఆవు రోమములలాగే మిక్కిలి సూక్ష్మంగా వుంటాయి. కనబడవు. వేళ్ళు, సంధులు కూడా అన్నే వుంటాయి. కొన్ని గుడ్లు వేగంగా పగిలిపోతాయి. అలాటి సమయంలో బయట పడే పాముల్లో విషం తక్కువ వుంటుంది. వాటి ఆయువూ తక్కువే. 70 సంవత్సరాలు. ఎర్రగా గాని, పచ్చగా గాని, తెల్లగా గాని దంతాలుండే పాములు పిరికివి. వాటి విష వేగము మందమే.

పాముకి ఒక నోరు, రెండు నాల్కలు, ఇరువది యొక్క దంతములు, విషభరితాలైన నాలుగు కోరలూ వుంటాయి. మకరీ, కరాళీ, కాళరాత్రీ, యమదూతీ అను పేర్లు గల ఈ కోరలకు క్రమంగా బ్రహ్మ, విష్ణు, రుద్ర యములు దేవతలు. యమదూతి యను కోర అన్నిటి కన్న చిన్నదే కాని, పాము ఈ కోరతో కాటేసిన వానికి తక్షణ మరణమే! దానిపై మంత్రం, తంత్రం, మందులాటివేవీ పనిచేయవు. ఏ కోరతో కాటేసిందో ఈ చిహ్నాలను బట్టి తెలుసుకోవచ్చు. మకరి ఆయుధ చిహ్నం, కరాళి కాకిపాదం, కాళరాత్రి హస్తం గుర్తు, యమదూతి కూర్మాకారాలను వదులుతాయి. ఈ కాట్లకు క్రమంగా బెల్లపు అన్నము, కషాయయుక్త అన్నము, చేదు పదార్థము, సన్నిపాత పథ్యము విరుగుడుగా పనిచేయవచ్చు.

పాము కాటు వేయడానికి ఎనిమిది కారణాలుంటాయి. తొక్కుడు, పాతపగ, భయం, మదం, ఆకలి, విషం నిండుట, సంతాన రక్ష, కాల ప్రేరణ, చివరి దానినుండి రక్షణలేదు.