శౌనకా! ఒకప్పుడు ఉజ్జయినీ నగరంలో భీమవర్మ యను క్షత్రియుండేవాడు. అతడు హింసాపరాయణుడు, మద్యపానరతుడు, మాంసభక్షకుడు. అతిశయ హింస, అధర్మాచరణలవల్ల అతడు తీవ్రవ్యాధిగ్రస్తుడై యవ్వనదశ ముగియకుండానే మరణించాడు. ఎప్పుడో తన జీవితంలో అతడు చేసిన చండీ స్తోత్ర పాఠాలవల్ల, ఇంత నికృష్ఠ పాపియైననూ, నరకప్రాప్తి కలగకుండా, వెంటనే మగధరాజపుత్రునిగా పుట్టాడు. అతనికి మహానందుడని పేరు పెట్టారు. సరైన వయసులో అతడు మహారాజయ్యాడు. మంచిపేరు కూడా తెచ్చుకున్నాడు. అతనికి అమ్మ దయవల్ల పూర్వజన్మస్మృతి కలిగింది. వెంటనే సమర్థుడు, బుద్ధిమంతుడునైన కాత్యాయనుని (వరరుచి) వద్ద శిష్యునిగా చేరాడు. కొన్నాళ్ళకు గురువుగారు ప్రసన్నులై మహాలక్ష్మీదేవి బీజహిత మధ్యమ చరిత్రను మహానందుని కుపదేశించి వింధ్యపర్వతంపైకి, శక్తిని ఉపాసించడానికి వెళ్ళిపోయారు.
ఇక్కడ మహానందమహారాజు అనుదినమూ మహాలక్ష్మికి కస్తూరి, చందనాదులతో పూజ చేస్తూ శ్రీదుర్గా సప్తశతి మధ్యమ చరిత్రనే మంత్రంగా జపిస్తూ ఉన్నాడు. పన్నెండు సంవత్సరాలకి శక్త్యుపాసకుడు వరరుచి (కాత్యాయనుడు) మరలి వచ్చి తన శిష్యుడైన మహానందునిచే విధి పూర్వకంగా లక్షచండీ పాఠాన్ని (పారాయణను) చేయించాడు. ఫలస్వరూపంగా సనాతని, భగవతి లక్ష్మీదేవి ప్రత్యక్షమై ఆ రాజుకి ధర్మ, అర్థ, కామ సహితమైన సుఖ దీర్ఘాయువునూ, అంతమందు మోక్షాన్నీ ప్రసాదించింది. ఈ విధంగా ఒక జన్మలో మందభాగ్యుడైనవాడు అమ్మ దయవల్ల మరుజన్మలో మహాభాగుడయ్యాడు.