“వసుదేవనందనా! శ్రీకృష్ణదేవా! ఈ సర్వజగన్మోహకమైన విష్ణుమాయ ఏ ప్రకారంగా వుంటుందో దయచేసి వివరించు” అని కోరాడు ధర్మజుడు. చెప్తున్నాడు శ్రీకృష్ణుడు.
“ధర్మనందనా! ఒకప్పుడు నారదుడు శ్రీమన్నారాయణ దర్శనానికై, శ్వేతద్వీపానికి వెళ్ళాడు శ్రీ స్వామిని దర్శించి ప్రసన్న ముద్రలో ఆయన వుండడాన్ని గమనించి ఇలా అడిగాడు.
“మహానుభావా! విష్ణుమాయ అనే మాట విన్నాను. అదేమిటో ఎక్కడ ఏ రూపంలో వుంటుందో తెలియలేదు. దయచేసి నా అజ్ఞానాన్ని తొలగించండి. ఆ మాయను చూపించండి.”
శ్రీమన్నారాయణుడు చిన్నగా నవ్వి ఇలా అన్నాడు “నీకెందుకులే నారదా! ఆ మాయను చూసి మాత్రం ఏం చేస్తావు? ఇంకేదైనా అడుగు”
“భగవాన్! నాకిప్పుడే వరము అవసరం లేదు. ఆ మాయను చూడాలని, తెలుసు కోవాలని నా అభిలాష” అని పదేపదే అడిగాడు నారదుడు.
“సరే పద. నా మాయను చూపిస్తా”నంటూ నారదుని చిటికెన వ్రేలు పట్టుకొని శ్వేత ద్వీపం నుండి బయలుదేరాడు నారాయణుడు. మార్గమధ్యంలో శ్రీహరి ఒక వృద్ధ బ్రాహ్మణునిగా మారిపోయాడు. శిఖ, యజ్ఞోపవీతం, మృగచర్మం, కమండలం ధరించి చేతిలో కుశదర్భల నిడుకొని వేదపాఠం చేస్తూ సంకల్పంలో తన పేరు యజ్ఞశర్మ అని చెప్పుకుంటూ ఆయన నారదుని తోడ్కొని జంబూ ద్వీపం చేరుకున్నాడు. ఇక్కడ వేత్రవతీ నదీ తటాన వున్న విదిశా నగరంలో ఆగాడు.
అక్కడ సీరభద్రుడని ఒక వైశ్యుడున్నాడు. అతడు మంచి ధనధాన్య సమృద్ధి గలవాడు, అన్ని రకాల పశువులనూ పెంచుతూ శ్రీకృష్ణ వ్రత కార్యక్రమాలను చేస్తూ చేయిస్తూ హాయిగా జీవిస్తున్న అతని ఇంటికే ముందుగా వెళ్ళాడు మహావిష్ణువు.
సీరభద్రుడీ ఇద్దరు బ్రాహ్మణులకూ నమస్కరిస్తూ ఎదురేగి ఇంటిలోనికి గొనివచ్చి సాదరంగా అతిధి సత్కారాలు చేసి ఇలా అన్నాడు.
“స్వాముల్లారా! మీకు అభ్యంతరం లేకపోతే మీ రుచికి అనుగుణంగా మా ఇంటిలో భోజనం చేసి నన్ను తరింపజేయగలరు.”
“సీరభద్రా! నీకు అనేకులైన పుత్రులు పౌత్రులు కలిగి వ్యాపారాన్నీ, వ్యవసాయాన్నీ బాగా అభివృద్ధిలోకి తెస్తారు. నీ పొలాలూ, పశువులూ, ఇతర సంపదలూ నిత్య వృద్ధినొందుతాయి. ఇది నా ఆశీర్వాదం” అని నవ్వుతూ పలికి అక్కడ మంచినీళ్ళు త్రాగి వృద్ధ బ్రాహ్మణుడు నారదునితో సహా బయల్దేరిపోయాడు. తరువాత వారు గంగా తటమున నున్న వేణికా నామక గ్రామంలో గోస్వామియను పేరుగల ఒక దరిద్రుడైన బ్రాహ్మణుని ఇంటికి వెళ్ళారు. అతడు తన పొలం ఎండిపోయినదనే చింతలో నుండగా నారాయణుడు నారదునితో సహా అతని వద్దకువచ్చి నిలబడి “అయ్యా! మేము చాలా దూరం నుండి వచ్చాము. మీ వద్దకు ఆకలిగొన్న అతిథులుగా వచ్చాము. మాకు అన్నం పెట్టండి” అని అడిగాడు. ఆ బ్రాహ్మణుడు వారిద్దరినీ ఇంటిలోనికి తీసుకొనిపోయి వారికి ఎంతో ఆదరంగా స్నానానికేర్పాట్లు చేసి తదనంతరం మరెంతో ఆప్యాయంగా తనకున్న దానిలోనే వారికి తృప్తిగా భోజనం పెట్టాడు. రాత్రి సుఖనిద్రకై పక్కలు కూడా వేయించాడు. మరునాడు ప్రొద్దున్నే ఇక బయలుదేరుతూ విష్ణువు ఆ బ్రాహ్మణునితో “అయ్యా! మేము నీ గృహంలో ఎంతో సుఖంగా గడిపాము. ఇక వెళతాము. నీ పొలం నిష్ఫలంగానే వుండాలిగాక. నీ సంతానం వృద్ధి చెందకూడదుగాక’ అని ‘దీవించి’ నవ్వుతూ వెళ్ళిపోయాడు. ఆ బ్రాహ్మణునికి ఏ విష్ణు తేజస్సు కనిపించిందో ఏమో ఏమీ మాట్లాడలేకపోయాడు. నారదుడు మాత్రం అడగకుండా ఉండలేకపోయాడు.
“భగవాన్! ఆ వైశ్యుడు మనకి చేసిన సేవ ఏమీ లేదు. అయినా వాడికి వరాలు కురిపించేశారు. ఈ పేద బ్రాహ్మణుడు మనకెంతో సేవను, అదీ అత్యంత శ్రద్ధాపూర్వకంగా చేశాడు. మీరేదో ఆశీర్వదిస్తున్నట్లుగా చేయెత్తి మరీ ఆయనను శపించి వచ్చేశారు. ఈ లీల నాకర్థం కాలేదు.”
“నారదా! ఒక సంవత్సరమంతా చేపలను పడితే వచ్చేంత పాపం ఒక్కరోజులోనే నాగలి ద్వారా వస్తుంది. ఆ సీరభద్ర వైశ్యుడు తన పుత్రపౌత్రులతో సహా ఈ నాగలికి సంబంధించిన నరకానికే పోతాడు. అందుకే అక్కడ నీరు మాత్రమే సేవించాం. ఈ బ్రాహ్మణుని ఇంట్లో భోజనం చేశాం. ఆ అహింసాత్మకుని ఇంటిలో విశ్రమించాం. అతని సేవలందుకున్నాం. ఇక సంతానం ద్వారా చేయవలసిన పాపాలు కూడా వుండవు కాబట్టి ఆ బ్రాహ్మణునికి మోక్షం తప్పదు. ఈ జగజ్జాలంలో చిక్కుకోడు” అని వివరించాడు శ్రీమన్నారాయణుడు.
ఇలా మాట్లాడుకొంటూ నడుచుకుంటూ వారిద్దరూ కన్యాకుబ్జానికి దగ్గరగా వచ్చారు. అక్కడ వారికొక అతిశయ రమణీయమైన సరోవరం కనిపించింది. దాని శోభను గని వారెంతో ప్రసన్నులైనారు. నారదునితో అది అత్యుత్తమ స్నాన తీర్థమనీ తానందులో స్నానం చేసి వస్తాననీ చెప్పి నారాయణుడందులో దిగి స్నానం చేసి వచ్చాడు. తరువాత నారదుడు కూడా అందులో దిగి స్నానం చేసి వచ్చాడు. ఒక అద్భుతం జరిగింది.
నారదుడొక సుందర దివ్యకన్య అయిపోయాడు. ఆ కన్య చాలా అందంగా వుంది. విశాల నేత్రాలతో, చంద్రబింబము వంటి ముఖంతో, సర్వాంగీణ సౌందర్యంతో విశ్వాన్నే విమోహితం చేయగలదన్నట్లుంది. పాల సముద్రం నుండి పుట్టిన సర్వసులక్షణ లక్షిత జాతయైన శ్రీ మహాలక్ష్మివలెనే ఆ సరోవరం నుండి పుట్టిన ఈ సకల సౌభాగ్య లక్షణయైన లలన విరాజిల్లింది. నారదుడికి దిక్కుతోచలేదు. ఈ దిక్కుకి గొనివచ్చిన దేవుడే దిక్కు అవవలసినవాడే మాయమైపోయి దిక్కుల్లో కలసిపోయి తనను దిక్కుమాలినవాణ్ణి (దాన్ని?) చేసిపోయాడు. ఆ స్త్రీ గుంపు నుండి తప్పిపోయిన హరిణిలా బిక్కు బిక్కుమంటూ భీత హరిణేక్షణయై దిక్కులు చూడసాగింది.
అప్పుడే అక్కడికి తాలధన్వ మహారాజు సేనా సమేతంగా ఆ దారంట వెళుతూ వచ్చాడు. ఆ సుందరిని చూసి ఆమె దేవకన్యయో అప్సరసో అయి వుంటుందనుకొని ఆమెను మెల్లగా సమీపించి వివరాలడుగగా నామె తనకు మాతాపితలు లేరనీ నిరాశ్రయురాలననీ మాత్రమే చెప్పగలిగింది. తాను ఆశ్రయమిస్తానని చెప్పి ఆ రాజు ఆమె అంగీకరించగానే తన గుఱ్ఱంపై కూర్చుండబెట్టుకొని రాజధానికి గొంపోవడమే కాక ఆమె అంగీకారంతోనే ఆమెను శాస్త్రోక్తంగా వివాహం కూడా చేసుకున్నాడు. పదమూడేళ్ళ కాపురం తరువాత ఆమె గర్భవతైంది. ఆ గర్భము నుండి ఒక ఆనపకాయ (సొరకాయ) బయల్వెడలింది. అందులో చిన్న చిన్న దివ్య శరీరాలతో యాభైమంది మహాబలశాలులైన బాలకులున్నారు. ఆమె వారిని తీసి నేతికుండలలో నుంచగా కొన్నాళ్ళకు వారు పెరిగి మహావీరులైనారు. వారికి వివాహాలై అసంఖ్యాకంగా పరాక్రమవంతులైన పుత్రులు పుట్టారు. కాని ఈ తాలధన్వ మహారాజు పుత్రపౌత్రులందరూ మహా దురహంకారులూ, రాజ్య కాంక్షపరులూ కావడంతో వారిలో వారే, వారితో వారే భయంకర యుద్ధాలను కల్పింపజేసుకొని ఒక్కరూ మిగలకుండా సమరాల్లో సమసిపోయారు. ఆ మహారాజూ అతని భార్యా గుండెలు బాదుకుంటూ, గుండెలవిసేలా రోదించసాగారు.
అప్పుడక్కడికి శ్రీ మహావిష్ణువు బ్రాహ్మణరూపంలో వచ్చి ఇలా బోధ చేశాడు: “విష్ణుమాయంటే ఇదే. మీరు అనవసరంగా రోదిస్తున్నారు. అన్ని ప్రాణులకీ, మరణమే చివరి మెట్టు. మీకన్నా చాలా పెద్ద, గొప్ప చక్రవర్తులూ, ఇంద్ర పదవిని పొందినవారూ కూడా కాలగర్భంలో కలిసిపోయారు. ఒక పెనుగాలి ఎన్నో దీపాలనార్పేస్తుంది. ఒక మృత్యువు అన్ని ప్రాణుల ప్రాణాలనూ హరిస్తుంది. ఈ విషయం తెలియని వారూ లేరు; మృత్యువు పంజా విసిరినపుడు మీలాగే గుండెలు బాదుకోని మానవులూ వుండరు. ఇదే విష్ణుమాయ. సముద్రాన్ని ఇంకించగల సామర్థం గలవానికైనా, కొండలను పిండి చేయగల గండర గండనికైనా, నేలను చరిచి దుమ్ము దుమ్ము, దువ్వ దువ్వగా పొడి చేయగల పోటుగాడికైనా పర్వతాన్ని పెకలించి అరచేత పట్టగలవానికైనా కాలుని కరాలముఖగహ్వరంలో ప్రవేశింపక తీరదు; మరణం తప్పదు. త్రికూట పర్వతాన్నే దుర్గంగా కలిగి, సముద్రాన్నే కందకంగా పెట్టుకొని, అభేద్య స్వర్ణమయి లంకను రాజధానిగా పొంది, రాక్షస గణాలలో పరమ ప్రచండులైన వారిని సైనికులుగా పెట్టుకొని, వేదశాస్త్రాలను సంపూర్ణంగా అవుపోశన పట్టి, శుక్రాచార్యుని వంటి మహామేధావి చేత మంత్రాంగం నడిపించుకోగలిగి, కుబేరుడంత వానిని ఇంద్ర సహితంగా పరాజయం పాలుజేయగలిగిన దశకంఠ రావణుడే మరణించక తప్పలేదు.
దుర్గాస్త్రికూటః పరిఖాసముద్రో
రక్షాంసి యోధా ధనదాశ్చ విత్తం ।
శాస్త్రంచయ స్యౌశనసాప్రణీతం
సరావణోదైవ వశాద్ విపన్నః ॥ (ఉత్తరపర్వం-4/93)
యుద్ధంలో, ఇంట్లో, పర్వతంపై, అగ్నిలో, గుహలో, సముద్రంలో ఎక్కడున్నా మృత్యువు అక్కడికే వస్తుంది. భావిని ఎవరూ అతిక్రమించలేరు. పాతాళంలోకి పోయినా, ఇంద్రునిచే దాచబడినా, మేరు పర్వతము నెక్కి కూర్చున్నా, మంత్ర ఔషధ శస్త్రాదులచే ఎంత రక్షణ పొందినా ఎప్పుడెలా జరగాలో అప్పుడే అక్కడే అది జరుగుతుంది. ఇందులో సందేహం లేదు. మానవుల భాగ్యానుసారము శుభాశుభాలు వస్తుంటాయి. పోతుంటాయి. వెయ్యి ఉపాయాలైనా వాటిని ఆపడానికి అసమర్థాలే అవుతాయి. ఒకడు దుఃఖాశ్రువులు రాలుస్తాడు. మరొకడు రోదిస్తాడు, ఇంకొకడు ఆనందంతో నృత్యం చేస్తాడు. వేరొకడు మనోహరంగా గొంతెత్తి పాడతాడు, ధన సంపాదన కోసం జీవితమంతా చదరంగ పుటెత్తులు వేస్తూనే గడిపేవారు. కొందరు- ఇలా ఈ ప్రపంచమనే నాటకరంగంపై నర్తించేవారెవరూ శాశ్వతులు కారు.”
ఇంతవఱకు చెప్పిన పిమ్మట విష్ణువు ఆ మహారాణి చేతిని పట్టుకొని “అహెూ నారద మహాశయా! విష్ణుమాయంటే ఏంటో అనుభవపూర్వకంగా తెలుసుకున్నావు కదా! ఇకలే. స్నానం చేసి నీ పుత్ర పౌత్రులకు వీడ్కొలు చెప్పాలి కదా! (ఇక్కడ పురాణంలో “ఔర్ధ్యదైహిక” శబ్దం వాడబడింది)’అంటూ విష్ణువు ఆమెచేత అదే సనాతన తీర్థంలో స్నానం చేయించాడు. ఆమె దుఃఖిస్తూనే లోపలికి దిగింది. కాని పైకి వచ్చేసరికి దుఃఖమే లేదు. స్త్రీ లక్షణాలు రూపం అన్నీ పోయి జటాధారి, యజ్ఞోపవీత శోభితుడు, దండకమండలుధారి, వీణాధారి అమిత తేజస్వియైన తపస్విరూపం వచ్చేసింది. పురోహితులతోబాటు అక్కడే వున్న మహారాజు ‘ఈమె నా రాణి కాదు’ అంటుండగానే విష్ణుమూర్తి నారదుని చేయి పట్టుకొని ఒక్క క్షణంలోనే శ్వేత ద్వీపానికతన్ని చేర్చాడు.
‘దేవర్షి నారద మహాశయా! నీవే స్వయంగా విష్ణు మాయను తెలుసుకున్నావు’ అంటూ నారాయణుడు అదృశ్యమైపోయాడు. నారదుడు కూడా నవ్వుకుంటూ ఆ దేవదేవునికి సాష్టాంగ ప్రణామంగావించి తన పనిలో తాను పడ్డాడు. కాబట్టి ఓ యుధిష్ఠిర మహారాజా! ఈ విష్ణుమాయ ప్రభావం వల్లనే మనం స్త్రీ, పుత్ర, ధనాసక్తులమై, వేడుకలూ చేసుకుంటాం, వేదనల, రోదనల పాలూ అయిపోతుంటాం.”