శౌనకాచార్యా! చిత్రకూట పర్వత సమీపంలోని రాజ్యాన్ని పరిహార నామకుడైన రాజొకడు పరిపాలిస్తుండేవాడు. (ఇది నేటి బుందేల్ ఖండ్, బఘేల్ ఖండ్ ప్రాంతం కావచ్చు)
అతడు రమణీయమైన కలింజర నగరంలో వుంటూ స్వీయ పరాక్రమంతో బౌద్ధులను తరిమికొట్టి మంచి ప్రతిష్ఠను సంపాదించాడు. రాజపుతానా (నేటి ఢిల్లీ) సమీప క్షేత్రంలో చపహాని (చౌహాన్) అను పేరు గల రాజుండేవాడు. అతడు అతి సుందరమైన అజమేర నగరంలో వుంటూ వైదిక ధర్మం ప్రకారం నాలుగు వర్ణాల వారినీ పరిపాలిస్తూ సుఖంగా రాజ్యం చేశాడు. ఆనర్త (గుజరాత్) దేశంలో శుక్ల నామకుడగు రాజు ద్వారకను రాజధానిగా చేసుకొని రాజ్యపాలన చేశాడు. “
ఇంతవఱకు చెప్పి ఆగిన పరమ పౌరాణికుని అగ్నివంశరాజులగురించి అడిగాడు మహాపండితుడు, ఋగ్వేద అనుక్రమణి, అరణ్యక, రుక్పాతి శాఖ్యాది అత్యుత్తమ రచనల గ్రంథకర్త, గృత్సమదుడను అసలు పేరుగల శౌనకాచార్యుడు. కొంతకాలంపాటు యోగనిద్రలో సమాధి గతుడై లేచి ఇలా చెప్పసాగాడు సూతమహర్షి.
“మహామునీ! కలియుగంలో మూడువేలయేడువందల పదవయేట ప్రమరుడను రాజొకడు పరిపాలించాడు. అతనికి మహామదుడను పుత్రుడు జనించాడు. తరువాత వరుసగా దేవాపి, దేవదూత, గంధర్వసేన, శంఖులను వారలు రాజ్యం చేశారు. శంఖుడు ముప్పది వత్సరాలు రాజ్యపాలన చేశాక దేవరాజైన ఇంద్రుడు వీరమతి యను దేవాంగనను పృధ్వి పైకి పంపించాడు. శంఖుడామెను పరిగ్రహించి ఒక శుభ లక్షణుడైన కొడుకునికన్నాడు. అతడు పుట్టిన సమయంలో ఆ బాలునిపై దేవతలు పుష్పవృష్టి కురిపించి దుందుభులు మ్రోగించారు. సుఖప్రదమైన శీతల మందవాయువులు వీచాయి. అతనికి గంధర్వసేనుడని పేరు పెట్టారు. అదే సమయంలో ఆ రాజ్యానికి చెందిన శివదృష్టి యను పేరుగల బ్రాహ్మణోత్తముడొకాయన తపస్సుకై వనానికి పోయి శివుని ఆరాధించి, తపించి, శివస్వరూపుడైనాడు.
మూడువేల సంవత్సరాల తరువాత కలియుగం వచ్చాక శకులను నశింజేసి ఆర్యధర్మాన్ని అభివృద్ధి చేయడానికి శంకర భగవానుల ఆజ్ఞను పొంది ఈ శివదృష్టియే పృథ్విపై గంధర్వసేనుని పుత్రునిగా పుట్టి విక్రమాదిత్యుడను పేర ప్రసిద్ధుడయ్యాడు. ఆయన పుట్టగానే తల్లిదండ్రులకు ఆనందం కలిగించాడు. బాల్యం నుండే మహాబుద్ధి కుశలునిగా పేరుగాంచాడు. బుద్ధి విశారదుడైన విక్రమాదిత్యుడు తన అయిదవ యేటనే తపస్సు చేసుకోవడానికి వనాలలోకి వెడలిపోయాడు. పన్నెండు సంవత్సరాలపాటు తపస్సు చేసి ఐశ్వర్య సంపన్నుడైనాడు. భగవంతుడైన పరమేశ్వరుని సూచన మేరకు అంబావతియను దివ్య నగరంలో శివుని ద్వారా రక్షింపబడుతున్న దివ్య సింహాసనాన్ని భూమిలో నుండి వెలుపలికి తీసి దానినధిష్టించాడు. ఆ బ్రహ్మాండమైన సింహాసనానికి ముప్పది రెండు మెట్లు, మెట్టుకొకటిగా ముప్పదిరెండు సంపూర్ణ శిల్పమూర్తులు ఉన్నాయి. అవన్నియు సింహాసనంతో సహా స్వయం ప్రకాశమున్నవి. పార్వతీ దేవి సింహాసనాన్ని, సింహాసనస్థునీ రక్షించడానికొక వైతాలుని పంపింది. అతడు వాటిని సదా భద్రంగా చూసుకొంటాడు. విక్రమాదిత్యుడు మహాకాళేశ్వర క్షేత్రానికి పోయి దేవాధిదేవుడైన పరమేశ్వరునికి పూజలు చేశాడు. ఆ తరువాత అనేక వ్యూహాలతో పరిపూర్ణమైన ధర్మసభ నొకదానిని నిర్మించాడు. అందులో వివిధ మణి విభూషితాలైన ధాతు నిర్మిత స్థంభాలను కట్టించాడు. అందులో లతలతో పూలతో నున్న స్థానం మధ్యలో తన దివ్య సింహాసనాన్ని స్థాపితంచేశాడు. వేద వేదాంగ పారంగతులైన ఎందరో బ్రాహ్మణోత్తములను రావించి, విధివత్తుగా వారిని పూజించి వారి ద్వారా సకల వైదిక ధర్మాలను నేర్చుకున్నాడు. గాథలనూ తెలుసుకున్నాడు. ఇదే సమయంలో పార్వతీదేవిచే ఇతని రక్షణకై పంపబడిన శివకింకరుడైన వైతాలుడు (వైతాళుడే భేతాళుడు) బ్రాహ్మణరూపాన్ని ధరించి వచ్చి ‘విజయీభవ’ అని ఆశీర్వదిస్తూ ఉచితాసనంపై కూర్చున్నాడు. విక్రమాదిత్యుని వందనాలను స్వీకరించి ఇలా అన్నాడు. ‘మహారాజా! మీకు వినాలనే కోరిక వుంటే నేను ఇతిహాస పరిపూర్ణమైన ఒక రోచకాఖ్యాన్ని వినిపిస్తాను. (అత్యంత ప్రసిద్ధ దానపరునిగా, పరోపకారిగా, సర్వాంగీణ సదాచారవంతుడైన మహారాజుగా విక్రమాదిత్యుడు భారతదేశంలో సాటిలేని సత్కీర్తిని సాధించాడు. స్కాందాది పురాణాలలోబృహత్కథ, ద్వాత్రింశత్ పుత్తలికా, సింహాసన బత్తిస్తీ, కథా సరిత్సాగరం, పురుష పరీక్షాది గ్రంథాలలో ఈయన చరిత్ర వర్ణింపబడింది. కేంబ్రిజ్ హిస్టరీ రెండవ భాగంలో కూడ ఈయన చరిత్ర ఉటంకించబడింది. విక్రమాదిత్యులొకరి కంటె ఎక్కువే ఉన్నా రని స్మిత్, రిఫింస్టన్ వంటి చరిత్రకారులు ప్రతిపాదించారు. కాని మన పురాణంలోని విక్రమాదిత్యుడు ఉజ్జయనికి రాజు. కాళిదాసాది నవరత్నాలను పోషించాడు. ఈయన తరువాత భోజుని నుండి అక్బరు దాకా ఈయన ప్రభావంతోనే తమ సభల్లో నవరత్నాలను పోషించే ప్రయత్నం చేశారు.) మీరు వినాలి”.
ప్రతిసర్గ పర్వం ప్రథమ ఖండం సంపూర్ణం.