భవిష్య పురాణము

8 - మధ్వాచార్యులు, శ్రీధరస్వామి, వరాహమిహిరాది మహాత్ముల ఆవిర్భావము

సూతమహర్షి భారతజాతిపై అనుగ్రహంతో నైమిషారణ్యంలోని మునుల ద్వారా ప్రచారంలోకి తేదలచుకున్న పురాణ ప్రవచనాన్ని ఇలా కొనసాగించాడు.

“మునులారా! బృహస్పతి దేవేంద్రునికి ఇలా ఉపదేశించాడు. ‘దేవేంద్రా! త్రేతాయుగంలో అయోధ్యలో శక్రశర్మయను గొప్ప దేవోపాసకుడైన బ్రాహ్మణుడుండేవాడు. ఆయన అశ్వినీ కుమారులను, రుద్రులను, వసువులను, సూర్యుని, ఇతర దేవతలను వేరువేరుగా, మంత్రాలతో విధి పూర్వకంగా హవనాలతో, పూజలతో సంతృప్తిపఱచడంతో మూడువందల ముప్పదిమంది దేవతలూ తమ గణాలతో సహా ఆయన దుర్లభమైన కోరికలన్నీ సులభంగా నెరవేరేలా చూడసాగారు. ఆయన ఏ విఘ్నంగానీ ముసలితనంగానీ లేకుండా అలా వెయ్యేళ్ళపాటు దేవారాధన చేస్తూనే వున్నాడు. చివరికి దేహాంతంలో సూర్య సాయుజ్యాన్ని పొందాడు. ఆయన యొక్క శుభసద్గతిని చూసి, దేవేంద్రా! మీరు కూడా సూర్యారాధన చేశారు. దీనిని మీరు చివర్లో భూలోకానికి వచ్చి చేయవలసి వచ్చింది. ఆషాఢ పున్నమినాడు పృథ్విపై మీకు భాస్కర భగవానుడు ప్రత్యక్షమై తాను కలియుగంలో రమణీయ బృందావనంలో మాధవ స్వామియను బ్రాహ్మణుని యింట మధ్వాచార్యునిగా జన్మిస్తానని ఆ కాలంలో మీ కోరికలను తీరుస్తాననీ వరమిచ్చాడు కదా! ఆయన మధ్వాచార్య రూపంలో మధుర వచనాల ద్వారా వేదమార్గ విముఖుల నందరినీ అన్ని విధాలా తన వశం చేసుకున్నాడు. వారికి, భక్తి, ముక్తిదాయకమైన వైష్ణవీ శక్తిని కూడ ప్రదానం చేశాడు.

దేవేంద్రా! ద్వాపరంలో మేఘశర్మయని బ్రాహ్మణుడొకాయన వుండేవాడు. ఆ మహానుభావుడు జ్ఞాని, బుద్ధిమంతుడు, ధార్మిక, వేదమార్గ పరాయణుడై వుండి కూడా వ్యవసాయం చేసేవాడు. ప్రతిరోజు తను సంపాదించిన ధనంలో పదవవంతును దేవపూజనానికి వినియోగించేవాడు. ఒకప్పుడు శంతనుని రాజ్యకాలంలో అయిదేళ్ళపాటు అనావృష్టి బాధించింది. ఒక కోసెడు విస్తీర్ణంలోనే వర్షం పడేది. ఆ ప్రాంతం మేఘశర్మ వుండేచోటు కావడంతో ఆయన ఒక్కడే ధాన్యసంపదను కలిగివుండేవాడు. మిగతా ప్రజలందరూ శంతనుని వద్దకుపోయి మొరపెట్టుకున్నారు. దుఃఖితుడైన శంతను మహారాజు మేఘశర్మను పిలిపించి, ‘విప్రశ్రేష్ఠా! నేను మిమ్మల్నే గురువుగా భావించి శరణుకోరుతున్నాను. ఆశ్రయిస్తున్నాను. మీరే నా రాజ్యంలో వర్షాలను కురిపించగల దైవము మీరే ఉపాయాన్ని అనుగ్రహించాలి’ అంటూ ప్రణామ భంగిమలో అలాగే శిరస్సు వంచి నిలబడిపోయాడు. అప్పుడు మేఘశర్మ ‘మహారాజా! మీకు ఉపదేశం చేయడం ఉపాయం చూపడం నా విధ్యుక్త ధర్మం. శ్రావణమాసంలో పన్నెండు గురుబ్రాహ్మణుల ద్వారా విధిపూర్వకంగా సూర్య మంత్రము యొక్క జప, హవనాదులను, తర్పణములను, నిర్వహించి బ్రాహ్మణ భోజనములను, ఇతరేతర సూర్యారాధనలను చేయించండి’ అన్నాడు. సూర్యదేవుని కృపవల్ల వెంటనే వానలు కురిశాయి. ఈ వ్రతము ద్వారా శంతనునికి అశేష పుణ్యఫలం లభించింది. అంతేగాక ఒక అద్భుతమైన శక్తి కూడా కైవసమైంది. అదేమిటంటే, కొన్నాళ్ళదాకా ఆయన స్పర్శవల్ల వృద్ధులు యువకులై పోయారు. సూర్యదేవుని దయవల్ల మేఘశర్మ కూడా యువకుడైపోయాడు. ఆ రకంగా వృద్ధాప్యమన్నది రాకుండా అయిదువందలయేళ్ళు జీవించాడు. అతడే స్వయంగా ప్రాణపరిత్యాగం చేసి సూర్యలోక ప్రాప్తి నొందాడు. ఆ తరువాత బ్రహ్మలోకంలో నివసించాడు.

సూర్యభగవానుడు పర్జన్య రూపంలో ప్రయాగవచ్చి ప్రసన్న చిత్తంతో దేవతలకు దర్శనమిచ్చి ఇలా చెప్పాడు. ‘దేవగణులారా! ఘోర కలియుగంలో మ్లేచ్ఛ రాజ్యం రాబోతున్నది. అపుడు నేను బృందావనం వచ్చి మీ కార్యాలు సిద్ధింపజేస్తాను. ఈ మాటమేరకు ఆయన వచ్చి వేదశర్మకు పుత్రునిగా జనియించి శ్రీధర పండితుడను పేర ప్రఖ్యాతి చెందాడు. శ్రీధరుడు శ్రీమద్భాగవతానికి భక్తిపూర్ణ భావార్ధ దీపికా టీకను లిఖించి భాగవతం యొక్క అపార మహిమను లోకానికి తెలియజేశాడు.

దేవేంద్రా! కలియుగంలో ప్రాంశు శర్మయని ఒక బ్రాహ్మణుడుండేవాడు. ఆయన నిత్య వేదశాస్త్ర పరాయణుడు, దేవతలను, అతిధులను నిత్యం పూజించేవాడు. సత్యవాది, అతిశయ సాధువు, హింసావిదూరుడు, పాపవిదారుడు, అహింసాప్రవక్త అయినప్పటికీ భిక్షాటన చేసి భార్యాపుత్రులను పోషించుకొనేవాడు. ఒకరోజాయన భిక్షాటనకు పోతూ మాయావియైన కలిని చూడడం జరిగింది. కలి ఒక మనోహరమైన వాటికను నిర్మించి బ్రాహ్మణ వేషం ధరించి ‘ప్రాంశు శర్మా! ఇటురా. ఈ రమణీయ గృహంలో నివసించు’ అని పిలిచాడు. ప్రాంశుశర్మ వెళ్ళగానే దుష్టుడైన కలి తానూ శర్మతోనే లోపలికి వచ్చి సుందరఫలాలను కోసి ఆయనకు భోజనంలో పెట్టి చేతులు జోడించి ప్రణామపూర్వకంగా నిలబడి స్నేహ ప్రసన్నతలతో భాసించు మందహాసం చేస్తూ ‘ఈ కలింద ఫలాలను నాతో కలిసి తినండి విప్రోత్తమా’ అన్నాడు.

‘కలింద ఫలంలోనూ తాండ్ర చెట్టుపైన కలి నివాసముంటాడని విద్వాంసులు చెబుతుంటారు. కాబట్టి నేను వీటిని ఇప్పుడని కాదు, ఎప్పుడూ తినను. అయితే నీవు మిక్కిలి స్నేహ, భక్తి తాత్పర్య సహితంగా సమర్పిస్తున్నావు కాబట్టి నా సాలగ్రామానికి దీనిని నివేదించి తీస్కుంటాను. ఈ ‘సాలగ్రామమే సచ్చిదానంద స్వరూపమైన స్వయం బ్రహ్మ. ఆయనకు నివేదితమైనది అభక్ష్యం కానేరదు కదా’ అని నవ్వుతూనే చెప్పాడు ప్రాంశుశర్మ.

ఈ మాటలు విని ఆశాభంగం చెందాడు కలి. బ్రాహ్మణుడా ఫలాలను గ్రహించి తన నివాసానికి పోయాడు. తరువాత కలిపురుషుడు రాజుగారి వేషంలో వచ్చి ప్రాంశు శర్మను పిలచి ‘బ్రాహ్మణోత్తమా! మీరు ఏవో ఫలాలను గ్రహించారని తెలిసింది. వాటిని నాకొకమారు చూపించగలరా’ అని అడిగాడు. ప్రాంశుశర్మ వత్సముండ సమానమైన ఆ ఫలాలను తీసుకు వచ్చి చూపించాడు. వెంటనే రాజవేషధారి కృద్ధుడై బ్రాహ్మణుని బెత్తంతో బాది లోహమయమైన కారాగారంలో పడేశాడు.

అతి దుఃఖితుడు, పరమ పావనుడునైన ప్రాంశుశర్మ భాస్కర భగవానుని ఋగ్వేద సూక్తాల ద్వారా సంతుష్టుని చేశాడు. సాక్షాత్ సనాతన పరబ్రహ్మమైన సూర్యదేవుడు ఆకాశవాణి ద్వారా ఆ విప్రుని కర్ణాలను ఇలా పావనం చేశాడు. ‘మహాభాగా! ప్రాంశు శర్మా! స్వయంగా కాలరూపుడైన శ్రీహరియే నాలుగు యుగాల నేర్పాటు చేశాడు. విశ్వసమూహాల మృత్యువు కొఱకై ఆయనే కలినీ సృష్టించాడు. కాబట్టి నీవు ఘోర కలియుగం రాగానే విష్ణుమాయచే వినిర్మితమైన కలింజర నగరానికి వెళ్ళాలని అక్కడ ఆనందంగా జీవిస్తూ దైవకార్యాన్ని నిర్వర్తించాలని బ్రహ్మ నిర్ణయం.’

వెంటనే ప్రాంశు శర్మ యొక్క లోహబంధాలు విడివడ్డాయి. కన్నుమూసి తెరిచేలోగా సూర్యరక్షితుడైన ఆ మహనీయుడు కలింజర నగరంలో వున్నాడు. అక్కడొక గృహమూ, తన పత్నీ, పుత్రుడూ కనిపించారు. ఆయన అక్కడ నూటపాతిక సంవత్సరాలబాటు సూర్యారాధన చేస్తూ చేయిస్తూ సుఖంగా జీవించి దేహాంతంలో సూర్యలోకప్రాప్తి నొందాడు. ఆ ప్రాంశుశర్మయే పదునెనిమిదవ కలియుగంలో భాద్రపద పూర్ణిమనాడు మరల (జనించి) శివదత్తుడను బ్రాహ్మణునికి పుత్రునిగా జనించి విష్ణుశర్మ లేదా విష్ణుస్వామియను పేరుతో లోక ప్రసిద్ధుడైనాడు. ఆయన వేద, శాస్త్ర పారంగతుడు, సకల కళాజ్ఞానము కలవాడు. దేవపూజకుడు, పరమవైష్ణవాచార్యుడు.

దేవేంద్రా! పూర్వకాలంలో చైత్రరథమను పేరుగల స్థానంలో మేధావియను మునికీ మంజుఘోషయను అప్సరసకూ భగశర్మయను బాలకుడు జనించాడు. అతడు పుట్టగానే తల్లిదండ్రులు వదిలేసి పోయినా, ఎలాగో పెరిగి సూర్యారాధన తత్పరుడై జీవించాడు. తపస్సు ద్వారా నూరేళ్ళపాటు సూర్యదేవుని నిరంతరారాధన చేశాడు. గాయత్రి మంత్రమే ఒక రూపం ధరించి భగశర్మను ఒక మండలానికి ఆశ్వయుజ మాసమంతా రాజుని చేయడం జరిగింది. ఇక్కడ మండలమనగా సూర్యమండలాలలో నొకటి. ఆరోజు, నెల సూర్యమండలస్థ. దైవాన్నుద్దేశించే లోకాలన్నీ చేసే పూజలు ఆ మాసంలో భగశర్మకు అందాయి. దీనికన్న గొప్ప ఇంకేమున్నది. కాబట్టి ఓ మహేంద్రా! నీవును సూర్యు నారాధించు.

గుర్వాదేశానుసారము దేవేంద్రుడు ఆ ఆశ్వయుజంలో సూర్యుని దృఢ, భక్తి, ప్రపత్తులతో పూజించాడు. సూర్యదేవుడు ప్రత్యక్షమై, ‘దేవరాజా! కన్యాకుబ్జంలో సత్యదేవుడను బ్రాహ్మణుని పుత్రునిగా ‘వాణీభూషణ నామంతో నేను అవతరిస్తాను’ అని చెప్పాడు. చెప్పినట్లుగానే చేసి కాలక్రమంలో వంశీభూషణుడై చందఃశాస్త్రాన్ని నిర్మించి పాఖండులను పూర్తిగా పరాజితులను చేసి ఇంద్రపూజలను పునరుద్ధరించాడు. తాను స్వయంగా మానవ రూపంలో విష్ణునుపాసించి, వైష్ణవీ శక్తిని పొంది ఇతరులకు ఆదర్శంగా నిలిచాడు సూర్యభగవానుడు.

బృహస్పతి ఇంకా ఇలా చెప్పాడని సూతుడు చెప్పసాగాడు. ‘దేవేంద్రా! ఒకానొకప్పుడు సరయూ నదీ తీరంలో దేవయాజి అని ఒక బ్రాహ్మణుడు నివసించేవాడు. అతడు సర్వదేవోపాసకుడు, నిత్యవేదపాఠి. అతడికొక కొడుకు పుట్టాడు కానీ పుడుతూనే మరణించాడు. దుఃఖితుడైన దేవయాజి సూర్యదేవు నారాధించాడు. సూర్యుని దయవల్ల ఆ పోయినవాడు వెంటనే బ్రతికాడు. వానికి వివస్వంతుడని నామకరణం చేశారు. అతడు పదహారేళ్ళు వచ్చేసరికే సకలశాస్త్రాలలో ప్రకాండ విద్వాంసుడయ్యాడు. గొప్ప ధర్మపరాయణుడు, సూర్యవ్రత పరాయణుడునగు ఈ వివస్వంతునికి సుశీల అను బ్రాహ్మణ పుత్రితో వివాహమైనది.

ఒకయేటి శివరాత్రి పర్వదినాన వివస్వంతుడు వ్రతగ్రహణం చేసి కఠోర నియమంలో వుండగా ఘోరమైన కామవాంఛ కమ్ముకు వచ్చి సుశీలతో శృంగారంలో పాల్గొన్నాడు. ఈ అకృత్య కారణంగా దారుణమైన కుష్టురోగగ్రస్తుడై పోయాడు. పశ్చాత్తప్తుడై కుమిలి కునారిల్లుతున్న అతనికి ద్వాదశ రవివార వ్రతోపదేశం సూర్యుడే ఎవరి ద్వారానో చేయించాడు. వెంటనే వివస్వంతుడు నిరాహారుడై, జితేంద్రియుడై ఆ వ్రతం ద్వారా కఠోర నియమ సంయుక్త సూర్యారాధన చేశాడు. ఈ అకుంఠిత భక్తికి సూర్యభగవానుడు సంతుష్టుడై అతని రోగాన్ని దూరం చేశాడు. అతని పీడలన్నీ పీడకలవలె కరిగిపోగా కడిగిన ముత్యంలా తయారై రెట్టించిన భక్తితో ఆదిత్య హృదయ స్తోత్రాన్ని అనేక పర్యాయాలు పఠించాడు. ఈ పుణ్యఫలంగా అతని అందం కొన్ని రెట్లు పెరిగి మన్మథునితో సమానమైన సౌందర్యం అతనికి ప్రాప్తించింది. అతని అందాన్ని చూసి పొందుకోరని స్త్రీ అయినా అతడు ఈ దశలో అఖండ బ్రహ్మచర్య వ్రతాన్నవలంబించి బ్రహ్మధ్యాన పరాయణుడయ్యాడు. వందేళ్ళదాకా అతడు అలాగే నిరోగిగా, మహాజ్ఞానిగా జీవించి దేహ విసర్జనానంతరం సూర్యునిలో కలసి పోయాడు. సూర్యమండలంలో కార్తికమాసంలో అతడే వెలుగుతుండేవాడు, ఒక లక్ష సంవత్సరాలపాటు మిగిలిన కాలమంతా సూర్య సారూప్యంతో ఆయన లోకంలోనే నివసించేవాడు.

మునులారా! తన గురువైన బృహస్పతి హితవును పాటించిన ఇంద్రుడు శ్రద్ధా పూర్వకంగా ఒకనెలపాటు సూర్యభగవానుని కార్తికమాసంలో ఆయన చెప్పిన పద్ధతి ప్రకారమే పూజించాడు. కార్తిక పూర్ణిమనాడు భగవంతుడయిన సూర్యుడు ప్రత్యక్షమై, ఇంద్రా! నేను మరల భూలోకంలో అవతరిస్తాను. దేవకార్యాన్ని నెరవేరుస్తాను. విద్య తనకే బాగా అబ్బిందనే అహంకారంతో భట్ట మహాపండితుడు సూత్ర పాఠాన్నీ ధాతుపాఠాన్నీ అనుద్దిష్ట వ్యాఖ్యానం ద్వారా పాడు చేశాడు. అర్థానికి అనర్థాన్ని తెచ్చాడు. స్వరాన్నీ, వర్ణార్థాన్నీ అపభ్రంశం చేశాడు. దానివల్ల యజ్ఞాలు ఇబ్బందికి లోనౌతాయి. కాబట్టి నేను వచ్చి అతనితోబాటు ఇతర పాఖండులనూ జయించి వేదోద్ధరణ గావిస్తాను’ అని వరమిచ్చి భగవానుడు కాశీలో దీక్షితుల వంశంలో వేదశర్మయను బ్రాహ్మణునికి పుత్రునిగా జనించాడు. అతడు పన్నెండేళ్ళ వయసు వచ్చేసరికే అన్ని శాస్త్రాలలోనూ పారంగతుడై నాడు. భగవతియైన పార్వతినీ, విశ్వానికే అధినాథుడైన శంకరునీ ఆరాధించాడు. మూడేళ్ళకు పరమేశ్వరుడు ప్రత్యక్షమై అతనిని సర్వజ్ఞుని చేశాడు. ఆ జ్ఞాన ప్రదానం వల్ల అతనికి వ్యక్త, అవ్యక్తములైన తత్త్వములన్నీ కరతలామలకములైనవి. అప్పుడు ‘సిద్ధాంత కౌముది’ అనే పరమ ప్రామాణికమైన గ్రంథాన్ని రచించాడు. భట్టుల వేషాల్లో వున్న పాఖండు లందరినీ దిగ్విజయంగా వాదంలో గెలిచి వేదధర్మాన్ని నిలబెట్టా. అందుకే ఆయన ‘భట్టోజిదీక్షిత’ నామంతో జగత్ప్రసిద్ధుడయ్యాడు.

బృహస్పతి ఇంద్రునితో ఇలా అన్నాడు ‘దేవరాజా! పూర్వకాలంలో కాంచీపురిలో ఒక దైవజ్ఞుడు, జ్యోతిష్కుడునగు బ్రాహ్మణుడుండేవాడు. ఆయన వేదమార్గాను గామియైన సత్యదత్త మహారాజుగారి పురోహితుడు. ఒకనాడాయన రాజుగారితో ఇలా చెప్పాడు, ‘రాజా! పుష్య నక్షత్రయుక్తమైన అభిజిత్ అనే ముహూర్త మొకటి రాబోతోంది. ఆ లగ్నంలో వ్యాపార ప్రదర్శన నొకదానిని అన్ని దేశాల నుండీ ప్రజలు వచ్చేలాగ చూసి ఏర్పాటు చేయించండి. క్రయవిక్రయ రూపేణా మీకు అతిశయ ధనప్రాప్తి కలుగుతుంది. ‘

రాజు వెంటనే ఆ ముహూర్తం వేళకు అన్ని దేశాల వారినీ తమ తమ వాణిజ్య వ్యాపార ద్రవ్యాలను తీసుకొని రమ్మనీ ఎవరూ కొనని వస్తువులను తానే కొంటాననీ దండోరా వేయించాడు. ఈ ఘోషణకు జవాబుగా ఆనాటి సంతకు చాలా ద్రవ్య వస్తువులే వచ్చాయి. కానీ అన్నీ అమ్ముడుపోయాయి. ఒక కమ్మరి ఇనుప విగ్రహాన్నొక దాన్ని తయారుచేసి దాన్ని ‘దరిద్రపురుషుడు’ అను పేరుతో వంద రూకలకి అమ్మకానికి పెట్టాడు. దానినెవరూ, సహజంగానే, కొనలేదు. రాజుగారికి అది దరిద్రమూర్తియే అనిపించినా సత్యవాది కాబట్టి తానిచ్చిన మాటమేరకు కొని తన కోశాగారంలో వుంచాడు. దాని ప్రభావం వల్ల రాజ్యంలో, ముఖ్యంగా రాత్రివేళల్లో, సత్కర్మ ధర్మలక్ష్మీ శుభాదులు దూరం కాసాగినవి.

ఒకనాడు సత్యమే పురుష రూపాన్ని ధరించి వచ్చి ఆ రాజుతో ‘నాయనా! దరిద్ర దేవత తాండవించే చోట, లేదా కనీసం నివసించే చోట కర్మ పరాయణత వుండదు. కర్మం లేని పృథ్విలో ధర్మానికీ స్థానం వుండదు. అక్కడ లక్ష్మి కూడా నిలబడదు. కాబట్టి నేను నిష్క్రమిస్తే గాని నీకు సుఖం లేదు. నేను వెళతాను, అని బయలుదేరుతుంటే రాజు ఆ సత్యపురుషుని కాళ్ళను గట్టిగా పట్టుకొని, ‘నా ప్రాణం పోయినా సరే నిన్ను మాత్రం వదులుకోను’ అని చెప్పాడు. సత్యం రాజుగారి మహలులోకి వెళుతుంటే దానివెనుకే, అంతకు ముందు బయటికి వచ్చి నిలబడిన లక్ష్మి కూడా ఆ మందిరంలోకి ప్రవేశిస్తూ రాజుకి దర్శనమిచ్చింది.

రాజామెకు దండ ప్రమాణం చేసి ‘అమ్మా నా మీద దయవుంటే నీవు నా వద్ద స్థిరంగా వుంటానని మాటయిచ్చి లోనికిరా, నేను మాత్రం సత్యాన్ని వదులుకొని బతకలేను’ అని చెప్పేశాడు. ఆ తల్లి చిరునవ్వుతో అతనికా వరాన్ని ప్రసాదించిలోనికి వెళ్ళింది. (సత్యాన్ని ఆ రాజు వదిలేసి వుంటే లక్ష్మి అతనికి కనిపించకుండానే నిష్క్రమించి వుండేదని అర్థం చేసుకోవాలి.)

సత్యదత్తుడు మరల తన పురోహితుని పిలిపించి ఆయనకొక లక్ష స్వర్ణముద్రలను బహూకరించి జరిగిందంతా చెప్పాడు. ఆ రోజున వ్యాపారంలో వచ్చిన ధనాన్నంతటినీ పురోహితునికి పుత్రుడు పుట్టిన రోజున అతని పాలన పోషణాదులకై రాజు అతనికి దానం చేశాడు. ఆ పుత్రునికి ‘పూష’ అని సూర్యనామాన్నే పెట్టారు. పూష కూడా సూర్యారాధన చేస్తూనే జీవించాడు. మార్గశిర మాసంలో జీవితమంతా శాస్త్రోక్తంగా సూర్యవ్రతం చేసిన ఫలితంగా వారిద్దరూ దేహాంతంలో సూర్యలోక ప్రాప్తిని పొంది, సూర్యునిలో లీనమైపోయారు. కాబట్టి దేవేంద్రా! నీవునూ సూర్యుని పూజించు.’

మునులారా! బృహస్పతి నిర్దేశానుసారం ఇంద్రుడు కూడా మార్గశిర మాసంలో సూర్యారాధన చేశాడు. సూర్యభగవానునుడు ప్రసన్నుడై పూష రూపంలో ప్రత్యక్షమై ‘దేవేంద్రా! ఉజ్జయినిలో రుద్రపశుడను వానియింట మిహిరాచార్య (వరాహమిహిర) నామధేయుడనై జన్మించి జ్యోతిశ్శాస్త్ర ప్రవర్తకుడనౌతాను. తరువాత నీకు శుభం జరుగుతుంది’ అని దీవించాడు. అనంతర కాలంలో మూలగడంత అభిజిద్యోగంలో రుద్రపశుడను బ్రాహ్మణునికి ఒక బాలకుడు జన్మించాడు. అతడు లంకలో జ్యోతిశ్శాస్త్రాన్ని అధ్యయనం చేశాడు. జాతక ఫలిత, మూక ప్రశ్నాది సర్వజ్యోతిషాంగాలనూ క్షుణ్ణంగా అధ్యయనం చేసి అతడు విభీషణుని వద్దకు వచ్చి ‘మహారాజా! నన్ను రాక్షసీమణులు ఇక్కడకు గొనివచ్చి పెంచి పెద్ద చేశారు. ఇపుడు నేను నిన్ను శరణు కోరి వచ్చాను’ అన్నాడు. జ్ఞానియైన విభీషణుడు ఈ మహాజ్ఞానియు జ్యోతిశ్శాస్త్ర నిధియునగు మిహిరాచార్యుని చూడగానే పోల్చుకొని గౌరవించాడు. తరువాత అతనిని జన్మభూమికి సాదరంగా సాగనంపాడు. లోకంలో మ్లేచ్ఛులచే నాశనం చేయబడిన జ్యోతిశ్శాస్త్రాన్ని మిహిరా చార్యుడుద్ధరించాడు.