శౌనకాచార్యా! చంద్ర, సూర్య, అగ్ని వంశరాజుల చరిత్రం విన్నవారికి పాపాలు నశిస్తాయి. ఇక అన్యవంశాలను గూర్చి తెలుసుకుందాం. ఇందులో భగవంతుడు పుట్టిన వంశం కూడా వుంది.
అవ్యక్త జన్ముడైన బ్రహ్మకి మధ్యాహ్న కాలం మొదలైనపుడు చక్షుషాంతరం (మన్వంతరం)లో పెద్ద తుఫాను వచ్చింది. దాని ప్రభావంవల్ల హిమాలయమే కంపించింది. దీని తీవ్రత వల్ల సృష్టిలో అధికాంశ ప్రాణికోటి నశించింది. సప్తద్వీప సమన్వితయైన వసుమతి పూర్తిగా సముద్రంలో కలిసిపోయింది. ఉత్తర దిశలోని లోకాలోక పర్వతమొక్కటి మిగిలింది. మునులారా! మన్వంతరం లయం కాగానే సంపూర్ణ భూమీ లయమై పోయింది. ఒకవేయి సంవత్సరాలదాకా ఈ భూమి జలంలోనే వుండిపోయింది.
అపుడు విష్ణుభగవానుడు శంకర బ్రహ్మదేవులతో కలిసి ఆకాశంలో శిశుమార చక్రాన్ని స్థితం చేశాడు. అపుడు మరల నక్షత్రమండలాలూ గ్రహాలు యథాపూర్వ స్థితికి వచ్చి నెలకొన్నాయి. ఈ జ్యోతిశ్చక్రమే పృథ్విపైనున్న నీటిని ఆవిరి చేసి భూమిని తేలగొట్టింది. ఒక అయుత వర్షము వ్యక్తమైన భూమి అలాగే నిలిచి ఉంది.
అంతట భగవానుడైన బ్రహ్మ తన ముఖము నుండి మహామనీషి, సర్వవిద్యా విశారదుడునైన సోమునీ, రెండు భుజాల నుండి మహాబలశాలీ, రాజనీతి పారంగతుడూ, క్షత్రియరాజు సూర్యునీ, ఊరువుల నుండి సరితాపతీ, రత్నాకరుడూ, వైశ్యరాజూనైన సముద్రునీ, తన పాదాల నుండి కళావిశారదుడూ, శాస్త్రవిహిత కర్మిష్ఠీ ఉత్తమ విశ్వరచయితా, శూద్రరాజు అయిన దక్షునీ ఉత్పన్నం చేశాడు. సోముని నుండి బ్రాహ్మణుల, సూర్యుని నుండి క్షత్రియుల, సముద్రుని నుండి వైశ్యుల, దక్షుని నుండి శూద్రుల ఉత్పత్తి జరిగింది. సూర్య మండలం నుండి స్వయంగా వైవస్వతమనువే ఉద్భవించాడు. అతనికే అన్ని ప్రాణులపై ఆధిపత్యం నిర్ణయింపబడింది. విష్ణుదేవుని పూర్వార్ధం నుండి విశ్వరూపుడూ, పరార్ధం నుండి వామనుడూ ఉత్పన్నులైనారు. సత్య యుగంలో సనాతనుడైన విశ్వరూపుడు ప్రజాశ్రేయస్సుకై అవతారాలు ధరించేవాడు. వామన రూపంలో ఋషుల, ఇతరుల పూజలందుకొనేవాడు. ఆ యుగంలో మానవుని సామాన్య ఆయువు నాలుగు వందల సంవత్సరాలుండేది. త్రేతాయుగంలో విష్ణువు యువావస్థలో వుండేవాడు. మానవుని ఆయువు మూడు వందల సంవత్సరాలు. ద్వాపరయుగంలో విష్ణువు వార్ధక్య భావప్రాప్తిలో దర్శనిమిచ్చేవాడు. మానవుని ఆయువు రెండు వందల సంవత్సరాలు. కలియుగంలో విష్ణువు మరణ ధర్మస్వరూపుడై వున్నాడు. మానవుని పరమాయువు వందేళ్ళకు దిగి వున్నది.
భగవానుని పరార్ధము నుండి వచ్చిన వామనుడు ముందుగా మహేంద్రునిగా అవతరించాడు. విష్ణురూపుడైన ఇంద్రునికి నాలుగు భుజములు, శ్యామల వర్ణము ప్రాప్తించినవి. విశ్వరూపుడు త్రిగుణుడైనాడు. సత్యయుగంలో వామనుని అర్ధరూపము (భాగము) త్రియుగీ నారాయణ శ్వేతరూపంగా రూపొందింది. యోగశాస్త్రంలో ‘హంస’గా పిలువబడు పరమాత్మ స్వరూపమిదియే. త్రేతాయుగంలో భగవంతుడైన శ్రీహరి యజ్ఞ స్వరూపం రక్తవర్ణంలో ఉత్పన్నమైనది. ద్వాపరంలో స్వర్ణగర్భుడైన హరి పీతవర్ణ రూపుడై ఉద్భవించాడు. ద్వాపరయుగ సంధ్యలో కలియుగం రావడానికి పూర్వం విశ్వరూపుని యొక్క వామనుని యొక్క కళలన్నీ ఏకీభూతమై దేవకి గర్భంలో మధురలో వసుదేవుని ఇంట అవతరించాయి. బ్రహ్మాదులు ఆ సనాతన స్వరూపాన్ని స్తుతించినపుడాయన ద్వాపరంలో కృష్ణునిగాను కలియుగాంతంలో కల్కిగాను అవతరిస్తానని వరమిచ్చాడు.
కలియుగాంతంలో మరల ప్రళయం వచ్చి సత్యయుగం మొదలైనపుడు తానే సత్యధర్మ రూపాన్ని ధరిస్తానని ఆయన ప్రవచించాడు.
మునులారా! ఈ విధంగా ప్రతి యుగంలో శ్రీహరి క్రీడిస్తూనే వుంటాడు. విశ్వ వ్యాపకుడైన ఆ భగవానుని రహస్యలీలలను, లీలారహస్యాలను పరమ విష్ణుభక్తులే అర్థం చేసుకోగలరు. విష్ణువు ఇచ్ఛానుసారము సనాతనియైన విష్ణుమాయ వివిధ లోకాలనూ కల్పించి సంపూర్ణ చరాచర విశ్వానికీ మహాగౌరీ రూపంలో పూజ్యురాలవుతుంది.”