భవిష్య పురాణము

152 - 156 - బ్రహ్మాది దేవతలు గావించిన సూర్యస్తుతి

“మహారాజా! సూర్యభగవానునిపై భక్తిని కలిగియుండుట, పూజలు, దానాలు చేయగలుగుట అందరివల్లా అయ్యే పనేమీ కాదు. సూర్యభక్తి, జ్ఞాన, అభ్యాసం పరమదుర్లభం. అయినా నిజమైన భక్తులకది సులభమే. సూర్యభగవానుని మందిరంలో సూర్యునికి ప్రదక్షిణలు చేస్తే ఆయన ప్రసన్నులౌతారు. సూర్య చక్రాన్ని నిర్మించి పూజలు, స్తోత్రపాఠాలు నిర్వహించేవారి కోరికలన్నీ ఆయన తీరుస్తారు. విషయ వాంఛలన్నిటినీ పరిత్యజించి తన మనసులో సూర్యభగవానుని మాత్రమే నిక్షిప్తం చేసుకోగలిగిన వ్యక్తికి ఆయన ఇవ్వదలచుకోనిది లేదు.”

“ద్విజశ్రేష్ఠా! సూర్యదేవుని పూజావిధానాన్ని, ఆరతి, నృత్య, మంగళ గీతాదికృత్యాలను, అరుణుని పూజావిధానాలతో సహా ఫలసహితంగా ఇంకా మీ కృపాపూరిత వాక్కుల ద్వారా వినగోరుతున్నాను” అని  ప్రార్థించాడు శతానీకుడు.

“మహారాజా! ముందు మనం సూర్యభగవానుని మహనీయ తేజాన్ని గురించి మాట్లాడుకుందాం. కల్ప ప్రారంభంలో బ్రహ్మాది దేవతలంతా అహంకార వశీభూతులై పోయారు. తమోరూపమైన ఒక మోహం వారి నావరించింది. అదే సమయంలో వారి అహంకారపు చీకటిని పారద్రోలటానికా అన్నట్టు ఒక మహనీయ తేజస్సు స్వయం ప్రకటితమైంది. అది అలా అలా సంపూర్ణ విశ్వవ్యాప్తమై నిలిచిపోయింది. ఆపై అది ఆకాశంలో, ఈ దేవతలందరితో వినోదిస్తున్నట్టుగా గిరగిరా తిరుగసాగింది. దాని ప్రకాశం పృథ్విపై కమలకర్ణిక లాగ కనబడసాగింది. బ్రహ్మాది దేవగణాలు ఆ తేజఃపుంజాన్ని చూసి చకితులై ఇలా అనుకోసాగారు. ‘మనకోసం, లోకకళ్యాణం కోసమే ఈ కాంతి ఇలా వెల్లివిరిసింది. ఇది ఎక్కడినుండి వచ్చిందో ఏమాత్రమూ అవగతం కావడంలేదు. తేజాధిపతి, తేజోమూర్తి ఎందుకనో మనకు దర్శనమీయడం లేదు. ఆ తేజస్సునే ఇలా అర్థిస్తున్నాం. ఓ దేవా! తమరెవరు? ఎక్కడున్నారు? ఈ తేజమెటువంటి శక్తి? మేమంతా తమ దర్శనాన్ని ఆకాంక్షిస్తున్నాం.’

వారి ప్రార్థనలను వినతులను అంగీకరించి ఆ తేజానికి అధిపతియైన సూర్యభగవానుడు తన విరాడ్రూపంలో ప్రకటితమైనాడు. అపుడా తేజస్వరూపాన్ని బ్రహ్మాదిదేవతలు ఎవరికి వారుగా ఇలా స్తుతించారు.

నమస్తే దేవ దేవేశ సహస్ర కిరణోజ్జ్వల

లోకదీప నమస్తేఽస్తు నమస్తే కోణ వల్లభ

భాస్కరాయ నమోనిత్యం ఖఖోల్కాయ నమో నమః

విష్ణవే కాలచక్రాయ సోమాయామిత తేజసే

నమస్తే పంచకాలాయ ఇంద్రాయ వసురేతసే!

ఖగాయ లోకనాథాయ ఏకచక్ర రథాయచ

జగద్ధితాయ దేవాయ శివాయామిత తేజసే

తమోఘ్నాయ సురూపాయ తేజసాం నిధయే నమః

అర్థాయ కామరూపాయ ధర్మాయామిత తేజసే

మోక్షాయ మోక్షరూపాయ సూర్యాయచ నమో నమః

క్రోధలోభ విహీనాయ లోకానాం స్థితి హేతవే!

శుభాయ శుభరూపాయ శుభదాయ శుభాత్మనే

శాంతాయ శాంతరూపాయ శాంతయేఽస్మాస్తువై నమః ।

నమస్తే బ్రహ్మరూపాయ బ్రాహ్మణాయ నమోనమః

బ్రహ్మ స్తుతి భావం ఇది. బ్రహ్మ చేసిన స్తుతి (బ్రాహ్మ 153/50-56)

‘హేదేవ దేవేశ! తమరు సహస్రాల కొద్దీ కిరణాలతో ప్రకాశిస్తున్నారు. కోణవల్లభ! ఈ ప్రపంచానికి తమరే దీపము. తమకు నమస్కారము. ఏకచక్రయుక్త రథారూఢులై అంతరిక్షంలో ఉంటూ విశ్వాన్ని ప్రకాశింపజేసే భాస్కర భగవానులు, విష్ణువు, కాలచక్రం, అమిత తేజస్వి, సోముడు, కాలుడు, ఇంద్రుడు, వసువు (శ్లోకంలో వసురేతాయ అని వుంది. అంటే ఆయన రేతస్సు బంగారమే అని అర్ధము.) అగ్ని, ఖగుడు, లోకనాథుడు ఈ దివ్య శక్త్యాత్మక రూపాలన్నీ, నామాలన్నీ తమలోనే గోచరిస్తున్నాయి. తమకు నమస్కారము. తమరు అమిత తేజస్వి, లోకకళ్యాణ, మంగళకారకులు, తమ సుందర రూపము అంధకారాన్ని అంతం చేస్తోంది. తమరు తేజోనిధి, క్రోధలోభరహితులు. ఈ సంసార స్థితికి కారకులు. తమరు స్వయంగా శుభ, మంగళస్వరూపులు, శుభ, మంగళప్రదాత కూడ. తమరు శాంతస్వరూపులు, బ్రాహ్మణులు, బ్రహ్మరూపులు. హే పరబ్రహ్మ! పరమాత్మ! జగత్పతీ! నాపై ప్రసన్నులు కండి. తమకు నమస్కారము.’

శివుడిలాస్తుతించాడు. ‘విశ్వస్థితికారణస్వరూపా, హే సూర్యభగవాన్! మీకు జయమగుగాక! అజేయ, హంస, దివాకర, మహాబాహు, భూధర గోచర, ఖగ, లోక ప్రదీప, జగత్పతి, భాను, కాల, అనంత, సంవత్సర, శుభాననా! మీకు జయమగుగాక! కశ్యపానంద వర్ధన, అదితిపుత్ర, సప్తాశ్వవాహన, సప్తేశ, దూరీకృత అంధకార, గ్రహస్వామి, కాంతీశ, కాలేశ, శంకర, ధర్మాది చతుర్వర్గ స్వామీ! మీకు జయమగుగాక! వేదాంగరూప, గ్రహరూప, సత్యరూప, సురూప, క్రోధాది వినాశరూప, కల్మాష పక్షిరూప, యతిరూపా! మీకు జయమగుగాక! తమరే విశ్వరూపము, విశ్వకర్మ, ఓంకారము, వషట్కార, స్వాహాకార, స్వధారూపము, అశ్వమేధ, అగ్ని, అర్యమ రూపము అయివున్నారు. సంసారసాగరము నుండి తేల్చి మోక్షమిచ్చు ఓ జగత్పతీ! మీకు జయమగుగాక!’

శివుడు చేసిన స్తుతి

జయభావ జయాజేయ జయహంస దివాకర

జయ శంభో మహాబాహో ఖగగోచర భూధర

జయలోక ప్రదీపాయ జయ భానో జగత్పతే

జయకాల జయానంత సంవత్సర శుభానన

జయ దేవాదితేఃపుత్ర కశ్యపానంద వర్థన

తమోఘ్న జయసప్తేశ జయసప్తాశ్వ వాహన

గ్రహేశ జయకాంతీశ జయకాలేశ శంకర

అర్థ కామేశ ధర్మేశ జయమోక్షేశ శర్మద

జయవేదాంగ రూపాయ గ్రహరూపాయ వైనమః

సత్యాయ సత్యరూపాయ సురూపాయ శుభాయచ

క్రోధలోభ వినాశాయ కామనాశాయ వై జయ

కల్మాష పక్షిరూపాయ యతిరూపాయ శంభవే

విశ్వాయ విశ్వరూపాయ విశ్వకర్మాయ వై జయ

జయోంకార వషట్కార స్వాహాకార స్వధామయ

జయాశ్వమేధరూపాయ చాగ్ని రూపార్యమాయచ ।

సంసారార్ణవ పీతాయ మోక్షద్వార ప్రదాయ చ

సంసారార్ణవ మగ్నస్య మమ దేవ జగత్పతే

హస్తావలంబ్యో దేవ భవత్వం గోపతేఽద్భుత (బ్రాహ్మ 153/60-68)

మహావిష్ణువు ఇలా స్తుతించాడు.

‘నమామి దేవదేవేశ భూత భావనమవ్యయం

దివాకరం రవిం భానుం మార్తండం భాస్కరం భగం

ఇంద్రం విష్ణుం హరిం హంస మర్కం లోకగురుం విభుం ।

త్రినేత్రం త్ర్యక్షరం త్ర్యంగం త్రిమూర్తిం త్రిగతిం శుభం

షణ్ముఖాయ నమోనిత్యం త్రినేత్రాయ నమో నమః

చతుర్వింశతి పాదాయ నమో ద్వాదశ పాణయే

నమస్తే భూత పతయే లోకానాం పతయే నమః ।

దేవానాం పతయే నిత్యం వర్ణానాం పతయే నమః

త్వం బ్రహ్మాత్వం జగన్నాథో రుద్రస్త్వంచ ప్రజాపతిః

త్వం సోమస్త్వం తథాదిత్య స్త్వమోంకారక ఏవహి

బృహస్పతిర్బుధస్త్వంహి త్వం శుక్ర స్త్వం విభావసుః

యమస్త్వం వరుణస్త్వంహి నమస్తే కశ్యపాత్మజ

త్వత్త ఏవ సముత్పన్నం సదేవాసుర మానుషం ।

త్వయా తతమిదం సర్వం జగత్ స్థావర జంగమం

బ్రహ్మచాహంచ రుద్రశ్చ సముత్పన్నో జగత్పతే

కల్పాదౌతు పరాదేవ స్థితయే జగతోఽనఘ

 నమస్తే వేదరూపాయ అహెూ రూపాయవైనమః

నమస్తే జ్ఞానరూపాయ యజ్ఞాయచ నమో నమః

ప్రసీదస్మాసు దేవేశ! భూతేశ కిరణోజ్జ్వల’ (బ్రాహ్మ 153/73-80)

ఈ విధంగా బ్రహ్మాది దేవతలు తననుస్తుతించగా సూర్యభగవానుడు ప్రసన్నుడై వారందరికి తనపై అఖండ భక్తి, తనకు నిరంతరం వారిపై అనుగ్రహం నిలచివుండేలాగ వరమిచ్చాడు. ఆపై ఇలా అన్నాడు.

‘విష్ణుదేవా! మీరు దేవ, దానవ, యక్ష, రాక్షస, గంధర్వాదులందరిపై విజయం సాధించి అజేయులైనిలుస్తారు. స్థితికారకులైన మీపై నాప్రేమ, నాపట్ల మీ భక్తి అచలంగా వుంటాయి. బ్రహ్మకు సృష్టి కర్తగా శివునికి లయకారునిగా కర్తవ్యాలతో బాటు నాపట్ల భక్తి కూడా అభివృద్ధి చెందుతుంటుంది. నా పూజాఫలంగా మీరు జ్ఞానులలో ఉత్కృష్టస్థానాన్ని సాధించారు.’

సూర్యభగవానుని వాక్కులు విన్న మహాదేవుడు పరమేశ్వరుడిలా అన్నాడు. ‘భగవాన్! మిమ్ము మేము ఆరాధించవలసిన విధానాన్ని మీరే ఆదేశించండి. మాకొక గొప్ప తేజస్సు మహత్‌ప్రకాశము మాత్రమే గోచరిస్తున్నాయి. గాని మీ పరమపూజనీయ మూర్తి కనబడుట లేదు. మీ మహాతేజస్సు ఆకార విహీనంకావడం చేత అది మనసులో నిలకడగా నిలబడే అవకాశముండదు. ఒక విషయవస్తువు, ఒక ఆకారము, కనులు మూసుకున్నా కనబడే ఒక గాఢపరిచయము ఇవన్నీ ఏ వ్యక్తికైనా భక్తుడికైనా తానుపాసించే భావానికి ఒక నిర్దుష్టమైన ఆకారము, నిశ్చితమైన మూర్తి, వుంటేనే సిద్ధిస్తాయి. అపుడే భక్తిపుడుతుంది. భక్తి పుట్టనిదే పూజ చేయడం సాధ్యంకాదు. కాబట్టి మీరు మీసాకార రూపాన్ని ప్రకటించండి. అపుడు మేము మీ పూజన అర్చనలను చేసి సిద్ధిపొంది ధన్యులము కాగలము.’

‘మహాదేవా! చాలా మంచి లోకకళ్యాణకారకమైన కోరికనే వెల్లడించారు. దత్తచిత్తులైవినండి. అని చెప్పసాగాడు సూర్య భగవానుడు. ‘ఈ జగత్తులో సృజన, పాలన, పోషణ, సంహారాలు చేసే నాలుగు మూర్తులలో నేను కొలువు తీరాను. ఆ నాలుగు పనులలో సంలగ్నుడనైవున్నాను. నా ప్రథమమైనదైన రాజసమూర్తి బ్రాహ్మీశక్తియనుపేరిట ప్రసిద్ధమైంది. అది కల్పాదిలో విశ్వాన్నిసృష్టిస్తుంది. రెండవదైన సాత్త్వికమూర్తి విష్ణు స్వరూపాత్మకము. ఇది విశ్వపాలన, దుష్ట శిక్షణలలో నిమగ్నమై యున్నది. మూడవదైన తామసమూర్తి శంకరనామమున విఖ్యాతమై వున్నది. చేతిలో త్రిశూలాన్ని పూని కల్పాంతంలో దుష్ట సంహారం చేసే రూపం ఇది. నాచతుర్థమూర్తి ఈ సత్త్వాది గుణాలకు అతీతం. అత్యుత్తమం. అది అన్ని ప్రాణులలోనూ వుంటుంది. కాని కనబడదు. ఆ అదృశ్య శక్తి వల్లనే ఈ ప్రపంచం నడుస్తున్నది. ఓంకారమను పేరుతో అది నారూపమే అయివున్నది. ఇది సకల, నిష్కల, సాకార, నిరాకార రూపంలో జలంలో పద్మంలా కదులుతున్నా కదలనట్లు కనబడుతుంటుంది. ఇది అజ్ఞాన తిమిరాన్ని ఛేదించవలసినపుడు అవతరించే జ్ఞానమహాజ్యోతి. మీరు ఈ అస్పృష్ట, నిర్లిప్త రూపాన్ని ధ్యానించండి.

కల్పాంతంలో నాదైన ఆకాశంలో దేవతలంతా లయమైపోతారు. అపుడిక నా ఆకాశరూపమే వుంటుంది. మరల నాద్వారానే బ్రహ్మాది దేవతలు చరాచర జగత్తు నిర్మింపబడతారు. ఓ త్రిలోచనా! నేను సంపూర్ణ జగత్తులో వ్యాపించి వుంటాను. కాబట్టి నా వ్యోమరూపాన్ని మీ త్రిమూర్తులు ముగ్గురూ ఆరాధించండి. త్రిలోచనా! మీరు గంధమాదన పర్వతంపై వేయిదివ్యవత్సరాలపాటు తపస్సు చేసి పరమ శుభషడంగ సిద్ధిని సాధించండి. ఓ జనార్దనా! మీరు కలాపగ్రామంలో నివసించి శ్రద్ధాభక్తి పూర్వకంగా నావ్యోమ రూపాన్ని ఆరాధించండి. హే బ్రహ్మదేవా! మీరు అంతరిక్షంలోని పుష్కరతీర్ధంలో నా ఆరాధనలో మగ్నులై వుండండి. మీకు చివర గోలాకారంలో రశ్మిమాలాయుక్తమైన నా మూర్తి మీకు దర్శనమిస్తుంది.’

సూర్యదేవుని వచనాలను విన్న విష్ణుదేవుడాయనకు ప్రమాణంచేసి ఇలా అన్నాడు. ‘దేవా! పూజన, అర్చన, ఆరాధనా విధానాల ద్వారా మీ వ్యోమరూపాన్ని ప్రసన్నం చేసుకొనే విధిని మా త్రిమూర్తులకుపదేశించండి.’

సూర్యభగవానుడిలా చెప్పాడు. ‘దేవతా శ్రేష్ఠుడవైన వాసుదేవా! మిక్కిలి సముచితమైన కోర్కెమీది. అనుపమమైన నా వ్యోమరూపాన్ని మీరు ఇలా ఆరాధించాలి. దీనిని మధ్యాహ్నకాలంలో చేస్తే మరింత మంచిది. దేవతలంతా లోక కళ్యాణకారులే కాబట్టి ఈ విధానాన్ని ఆలకించండి. ఎందుకంటే ఎవరి పని చేస్తున్నపుడు వారు నా అంతటివారే. అహంకారం, మౌఢ్యం, కలహబుద్ధి, అసత్యం - ఇవన్నీ తమ, మోహాదికమైన అంధకార లక్షణాలు. వీటిచే ఆవరింపబడిన వారిని సముద్ధరించి లోక కళ్యాణాన్నేర్పాటు చేయడానికే నేను తేజోమయమైన ఈ స్వరూపాన్ని ధరించాను. కాబట్టి మీరంతా ముందు ఈ అంధకారం నుండి బయటపడి నిత్య శ్రద్ధాభక్తులతో ఈ వెలుగుని ఆరాధించాలి. ఈ కాంతిపుంజాలలోనే మీకు నా సకల, నిష్కల ఉత్తమ స్వరూపదర్శనం ప్రాప్తిస్తుంది. దానితోనే మీకు సకల సిద్ధులూ కైవసాలవుతాయి.’

ఇలా చెప్పి సూర్యభగవానుడంతర్ధానం చెందాడు. ఆయన తేజస్స్వరూపమును కనులార గాంచిన దేవతలు విస్మితులై ‘ఈయన అదితి పుత్రుడైన సూర్యనారాయణుడు. ఈ మహాతేజస్వియే లోకాలను జ్ఞానజ్యోతితో వెలిగించే భగవానుడు సూర్యనారాయణుడు. ఈయన మనందరి మనస్సులలోనూ చీకటిని ఛిన్నాభిన్నం చేసిన భాస్కరుడైన సూర్యనారాయణుడు. పదండి మనం మన మన స్థావరాలకు జేరి లోకకళ్యాణార్థమై సూర్యపూజను చేసి సిద్ధిపొందుదాం’ అంటూ బయలుదేరారు.

బ్రహ్మపుష్కర క్షేత్రంలోనూ, విష్ణువు శాలగ్రామంలోనూ, పరమేశ్వరుడు గంధ మాదనంపైనా క్రమంగా నాలుగు కోణాలు వ్యోమాన్ని, చక్రాంకిత వ్యోమాన్ని, అగ్నిరూప తేజాభిభూత వ్యోమవృత్తాన్నీ సదాభక్తి పూర్వకంగా పూజిస్తూ తపస్సు చేశారు. దేవతలంతా ఇలా గంధ, మాలా నృత్యాదులతో సహస్రవర్షాలు సూర్యుని పూజించారు.

శతానీక మహారాజా! వీరి పూజలకు ప్రసన్నుడైన సూర్యదేవుడు త్రిమూర్తులకు సత్త్వ, రజస్తమో గుణరూపాలతో దర్శనమిచ్చి, నాలుగవరూపంలో రథారూఢుడై ఆకాశంలో ప్రకటితమయ్యాడు. తన యోగబలంతో ఈ తపస్వులందరికీ వేరు వేరుగా ప్రత్యక్షsమయినాడు. కమలముఖ వ్యోమాన్ని అత్యంత శ్రద్ధతో పూజిస్తున్న బ్రహ్మ కడకేగి ‘సురశ్రేష్ఠా! నేను ప్రసన్నుడనైనాను. నీకు వరమివ్వడానికే వచ్చాను’ అన్నాడు.

హర్షపులకిత గాత్రుడై ప్రఫుల్లితుడై కరములు జోడించి నిలబడి అత్యంత వినమ్రుడై మరల సూర్యుని స్తుతించాడు బ్రహ్మ.

‘నీవు కారణరూపుడవై నాప్రథమ పుత్రునిగా ఉద్భవిస్తావు. ఇంకా ఏమి వరం కావాలో కోరుకో” అన్నాడు సూర్యుడు అతి ప్రసన్నుడై.

సృష్టికర్తగానే మరింత సమర్థవంతంగా పనిచేయగలిగే వరాన్ని కోరుకున్నాడు బ్రహ్మ. ఇక ఎవరెక్కడుండాలో చెప్పాడు సూర్యదేవుడు. బ్రహ్మ సూర్యుని మహద్‌వ్యోమానికి వెనుక కొమ్ముతో ఉత్తమరూపం కలిగియున్న కదంబవనంలోనూ, ఇంద్రుడు తూర్పులోనూ, శాండిలీసుతుడు ఆగ్నేయంలోనూ, యముడు దక్షిణానా, వరుణుడు పశ్చిమంలోనూ, వాయువు వాయవ్యంలోనూ వుండాలని ఆదేశించాడు సూర్యుడు. ఈశాన్యం వైపు శివుడునూ బ్రహ్మ శివుల మధ్య విష్ణువుండాలని కూడా చెప్పాడు.

బ్రహ్మను తీసుకొని గంధమాదన పర్వతం పైకి వెళ్ళిన సూర్యునికక్కడ తేజోయుక్తమైన వ్యోమపూజనమూ తీవ్రతపస్సూ చేస్తున్న పరమశివుడు గోచరించగా సూర్యుడు పరమ ప్రసన్నుడయ్యాడు.

‘భీమశంకరా! నేను మీ తపస్సుకి అతి ప్రసన్నుడనైనాను. వరమివ్వడానికే ఇక్కడికి వచ్చాను’ అన్నాడు సూర్యుడు.

‘దేవా! మీరు నాపై దయతో వేంచేశారు. మీరు జగత్పతి సంసారోద్ధారకులు. నేను మీ కృపవల్ల మీ అంశతో మీ పుత్రునిగా జన్మించాను. ఒక తండ్రి తన కొడుక్కి ఎలాంటి వరమిస్తాడో మీరు నాకు అలాంటి వరమే ఇవ్వండి’ అన్నాడు శివుడు.

            ‘శంకరా! మీరు చెప్పినది పరమ సత్యము. నా లలాటము నుండి మీరు పుట్టారు. అయినా మీకేం కావాలో కోరుకోండి. ‘

            ‘భగవన్! (భగవాన్ అనే సంబోధన సరైనది కాదు) మీరు నాపై దయ చూపించి వరమీయ వచ్చారు. నాకింత కంటే ఏం కావాలి? మీపట్ల నాభక్తి, అచంచలమై నిలిచి పోయేలాగా అనుగ్రహించండి. మీరు నాకు చూపిన కర్తవ్యంలో భాగంగా యక్ష, గంధర్వ, దేవ, దానవాదులకు అజేయుడనై యుగాంతమందు నిర్విఘ్నంగా సంహార కార్యాన్ని నెరవేర్చగలిగే శక్తి నివ్వండి. నాకొక ఉత్తమస్థానాన్ని ప్రసాదించండి.’

            ‘తథాస్తు శంకరా! నాపరమ వ్యోమరూపాన్ని ఇలాగే ప్రతినిత్యం పూజిస్తుండు. ఈ పరమ తేజస్వియైన వ్యోమమే నీ త్రిశూలంలో నిండి నీకు జయమీయ గలదు.’

            తదనంతరం సూర్యభగవానుడు విష్ణువుకి వరాన్నివ్వడానికి శాలగ్రామం (ముక్తినాథ క్షేత్రం) వెళ్ళాడు. అక్కడ (లేడి చర్మం) కృష్ణాజినధారియై శాంతచిత్తుడై పరమోత్కృష్టమైన తపాన్ని గావిస్తూ హృదయంలో సూర్యదేవుని నిలుపుకొని ధ్యానిస్తున్న విష్ణుదేవుని చూసి మిక్కిలి ప్రసన్నుడైనాడు.

            ‘విష్ణూ! నేను వచ్చాను. చూడు’ అన్నాడు.

            విష్ణువు సూర్యునికి తలవంచి నమస్కరించి, ‘జగన్నాథా! నన్ను అనుగ్రహించండి. నేను మీ ద్వితీయ పుత్రుడను. తండ్రి అతని కొడుకుపై ఎంతటి కృపాదృష్టిని కలిగియుంటాడో మీరు నాపై అదే దృష్టిని కురిపించండి’ అన్నాడు.

            ‘మహాబాహెూ! నీ శ్రద్ధతో భక్తితో నన్ను సంతుష్టిని చేశావు. నీకేం కావాలన్నా ఇస్తాను. వర ప్రదానానికే నేను వచ్చాను’.

            ‘భగవన్! ఈ రోజు నేను తపము ఫలించగా కృతకృత్యుడనైనాను. మీరే స్వయంగా నాకు వరదానం చేయడానికి కదలివచ్చారంటే, ఇక నాకంటే ధన్యుడు లేడు. మీపట్ల నాభక్తి అచంచలంగా ఉండునట్లు ఆశీర్వదించండి. నాకు ఆదేశించిన స్థితి కార్యాన్ని, శత్రువులపై తిరుగులేని విజయాన్ని, ఆధిక్యాన్ని, సాధిస్తూ సంసారపాలనాన్ని సమర్థవంతంగా చేయగలిగే శక్తి ననుగ్రహించండి. అన్ని లోకాలలో అత్యంత యశస్సు, బలము, వీర్యము, సుఖములందు సంపన్నుడనై నిలచేలా వరమివ్వండి’.

            సూర్యభగవానుడిలా ఆశీర్వదించాడు, ‘తథాస్తు నాయనా! నా పుత్రులలో రెండవ వాడివైనా నాకు పరమ ప్రీతి పాత్రుడవు కావున నిన్ను నా వ్యోమరూపమైన సుదర్శన చక్రాన్ని ప్రసాదించి అనుగ్రహిస్తున్నాను. ఈ ఆయుధానికి కూడా నీతోబాటు పూజార్హతను కల్పిస్తున్నాను. ఇది అత్యుత్తమాయుధము. అద్భుతాస్త్రము, శస్త్రము, శత్రుసంహారంలో దీనికెదురు లేదు. నీకూ లేదు.’

            శతానీక మహారాజా! ఈ విధంగా సూర్యభగవానుడు త్రిమూర్తులకు సృష్టి, స్థితి, లయలకు అవసరమైన శక్తులను ప్రసాదించి తన లోకానికి వెళ్ళిపోయాడు. ఈ ఆఖ్యానం అతి పవిత్రం, పుణ్యప్రదం, పాప వినాశకం. ఈ కథలో చెప్పబడిన త్రిమూర్తులు లోకారాధ్యులు. ధర్మార్థకామాలను ప్రసాదించగలరు. వారు ఇవ్వలేనిది లేదు. వీరుచేసిన సూర్య స్తోత్రాలు మూడింటినీ రోజూ పఠించేవారికి త్రిమూర్తులు మిక్కిలి ప్రసన్నులై ఇహలోక సుఖాలను, దేహాంతంలో విమానం పై సూర్యలోకానికి పోయే మహాభాగ్యాన్ని అనుగ్రహిస్తారు. ఈ కథను విని, ఈ స్తోత్రాలను ప్రతిదినం విన్నా, చదివినా, మానవులు మహాభక్తులై సూర్యసమాన తేజులై మహాజ్ఞానులై వర్థిల్లగలరు.”