50, 51 - కమల, శుభ సప్తములు

మహారాజా! కమలా సప్తమీ అనే పేరును తలచినంతనే సూర్యభగవానుడు ప్రసన్నుడౌతాడు. వసంతర్తువులో శుక్ల సప్తమినాడు ప్రాతఃకాలంలో పచ్చ ఆవాలను కలిపిన నీట స్నానం చేయడంతో ఈ వ్రతం మొదలు పెట్టబడాలి. ఒక పాత్రలో తిలలను పోసి వాటిపై సువర్ణకమలాన్నుంచి ఆ పాత్రనే సూర్యభగవానునిగా భావించుకొని రెండు వస్త్రాలతో చుట్టి గంధ పుష్పాది ఉపచారాలతో పూజించి ఈ క్రింది శ్లోకం ద్వారా ప్రార్థించాలి :

నమస్తే పద్మహస్తాయ నమస్తే విశ్వధారిణే

దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోఽస్తుతే (ఉత్తరపర్వం - 50/3,4)

తరువాత వస్త్రమాలాలంకృతులతో సహా ఆ పాత్రను బ్రాహ్మణునికి దాన మిచ్చెయ్యాలి. మరుసటి రోజు యథాశక్తి బ్రాహ్మణులకు భోజనాలు పెట్టి ప్రతి మాత్రం తైలాదిరహిత విశుద్ధ భోజనాన్ని చేయాలి. ఇలాగే ఒక యేడాదిపాటు ప్రతి శుద్ధ సప్తమినాడూ ఈ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించాలి. వ్రత సమాప్తినాడు సువర్ణ కమలాన్నీ, గోవు సువర్ణ ప్రతిమనీ, పాత్రలు, ఆసనాలు, దీపాలు వంటి పూజా సామగ్రినీ బ్రాహ్మణునికి దానమిచ్చెయ్యాలి. ఇలా కమలాసప్తమీ వ్రతాన్ని చేసినవారికి అనంత లక్ష్మీప్రాప్తి, దేహాంతంలో సూర్యలోకనివాసం, తరువాత ఒక్కొక్క ఊర్ధ్వలోకంలో ఒక్కొక్క కల్పంబాటు ఏడు కల్పాల దాకా సుఖనివాసం, ఆ తరువాత పరమగతి కలుగుతాయి.

శుభసప్తమీ వ్రతం ఆశ్వయుజ శుద్ధ సప్తమినాడు స్నానం చేసి బ్రాహ్మణుల చేత స్వస్తి వాచనం చేయించడంతో మొదలవుతుంది. ఒక కపిల గోవును గంధ, మాల్య, అనులేపనాదులతో పూజించి ఇలా ప్రార్థించాలి:

నమామి సూర్యసంభూతామశేష భువనాలయాం 

త్వామహం శుభకల్యాణ శరీరాం సర్వసిద్ధయే (ఉత్తరపర్వం 51/3,4)

తరువాత తామ్రపాత్రలో ఒక శేరు తిలల నుంచి వాటిపై వృషభం యొక్క స్వర్ణ ప్రతిమను స్థాపించి దానికి వస్త్రం, మాల్యం, బెల్లం మున్నగువాటితో పూజ చేయాలి. రోజంతా ఉపవాసముండి సాయంత్రం అర్యమాప్రీయతాం అంటూ మొత్తం సామగ్రిని భక్తి పురస్సరంగా బ్రాహ్మణునికి నివేదించాలి. రాత్రి పంచగవ్యాలను ప్రాశించి ప్రశాంతంగా నేలపై శయనించాలి. తెల్లవారినాక బ్రాహ్మణులను రావించి వారిని పూజాదికముల ద్వారా సంతుష్టిపఱచాలి. ప్రతిమాసంలో ఇలాగే చేసి స్వర్ణవృషభాన్నీ ఆవునీ దానం చేస్తూనే వుండాలి. సంవత్సరాంతంలో చెఱకు, బెల్లం, వస్త్రాలు, పాత్రలు, ఆసనం, తలగడలతో సహా శయ్య, శేరునువ్వులతో రాగిపాత్ర, స్వర్ణ వృషభాలను విశ్వాత్మాప్రీయతాం అంటూ బ్రాహ్మణునికి, వేదజ్ఞుడైనవానికి భక్తి గౌరవాలు కనుపట్టగా దానమివ్వాలి. ఈ రకంగా శుభసప్తమీ వ్రతాన్ని చేసిన వారికి ప్రతిజన్మలోనూ కీర్తీ, అష్టైశ్వర్యాలూ కలగడమే గాక కల్పాంతంలో దేవలోక నివాసం, అక్కడ గణాధీశ పదవీ ప్రాప్తిస్తాయి. ఒక కల్పం తరువాత భూమిపై చక్రవర్తి జన్మ లభిస్తుంది. ఈ వ్రతం చేయడం వల్ల భ్రూణహత్య, బ్రహ్మహత్యలాటి పాపాలు కూడా నశిస్తాయి. ఈ శుభసప్తమి వ్రత మాహాత్మ్యాన్ని చదివిన వారు, క్షణంసేపైనా విన్నవారు దేహాంతంలో విద్యాధరులకు అధిపతులౌతారు.