భవిష్య మహా పురాణము
106 - అనంతవ్రత మాహాత్మ్యం - కార్తవీర్యుని ఆవిర్భావ వృత్తాంతం
“వాసుదేవా! భక్తిపూర్వకంగా శ్రీ మన్నారాయణు నారాధిస్తే మనోవాంఛితాలన్నీ తీరి పోతాయి. కాని, స్త్రీ పురుషులు సంతాన హీనులుగా మిగిలిపోవడం కంటె పెద్ద దుఃఖం లేదేమో! యోగ్య సంతానం సకల సుఖాలకూ హేతువు. సర్వ సద్గుణ సంపన్నుడు, ఆరోగ్యవంతుడు, బలవంతుడు, ధర్మజ్ఞుడు, శాస్త్రవేత్త, దీన, అనాథాశ్రయుడు, భాగ్య వంతుడు, హృదయానందకరుడు, దీర్ఘాయుష్మంతుడునగు పుత్రుడు గలవారే లోకం మొత్తం మీద ధన్యులు. ప్రభో! ఇట్టి పుత్రుణ్ణిచ్చే వ్రతమేదైనా వుంటే ఉపదేశించండి” అని అడిగాడు ధర్మరాజు చెప్పసాగాడు శ్రీకృష్ణుడు.
“మహారాజా! ఈ విషయమై ఒక ఐతిహ్యముంది. ప్రాచీనకాలంలో మాహిష్మతీ నగరాన్ని హైహయవంశీయుడైన కృతవీర్యుడు పాలిస్తుండేవాడు. అతడు గొప్ప కీర్తి ప్రతిష్టలు గల రాజు. అతని రాణులలో శీలధనయను సార్ధక నామధేయురాలు, సకల సద్గుణరాశియగు ఒక రాణి పుత్రప్రాప్తిని గూర్చి వ్రతార్థియై బ్రహ్మవాదిని మైత్రేయి వద్దకు వెళ్ళింది. ఆధ్యాత్మిక, వైదిక జ్ఞానంలో ఎవరికీ అందనంత ఎత్తుకి ఎదిగిన మైత్రేయి ఆమెకు అనంత వ్రతాన్నుపదేశిస్తూ ఇలా చెప్పింది:
‘శీలధనా! జనార్దన భగవానుని ఆరాధించే వారికి అన్ని కోరికలూ తీరుతాయి. మార్గశిర మాసంలో మృగశిర నక్షత్రం వచ్చే రోజు స్నానం చేసి గంధ పుష్ప ధూప దీపాదులతో అనంత దేవుని వామ చరణాన్ని పూజించి ప్రార్థించి ఏకాగ్ర చిత్తంతో అర్చించి పలుమార్లు ప్రణామం చేసి బ్రాహ్మణునకు దక్షిణనివ్వాలి. రాత్రి నూనె, ఉప్పు లేని భోజనం చెయ్యాలి. ఇలాగే పుష్యమాసం, పుష్య నక్షత్రం యోగించిన రోజు అనంత దేవుని ఎడమ కటి ప్రదేశాన్ని పూజించాలి. మాఘమాసంలో మఘ నక్షత్రం పడిన నాడూ, ఫాల్గునమాసంలో ఫాల్గునీ (ఫల్గుణీకాదు) నక్షత్రం విరాజిల్లిననాడూ క్రమంగా అనంత భగవానుని వామ భుజాన్నీ వామస్కంధాన్నీ పూజించాలి. ఈ నాలుగు నెలల్లోనూ గోమూత్రాన్నీ నోట్లో వేసుకోవాలి. బంగారాన్నీ నువ్వులనీ బ్రాహ్మణులకివ్వాలి.
చైత్రమాసంలో చిత్తా నక్షత్రం వున్న రోజు భగవానుని కుడిభుజాన్ని పూజించాలి. వైశాఖంలో విశాఖ నక్షత్రంలోనూ అలాగే చేయాలి. జ్యేష్ఠలో జ్యేష్ఠ నక్షత్రంలో కటి ప్రదేశాన్నీ, ఆషాఢం ఆషాఢంతో యోగించినపుడు స్వామి కుడికాలినీ పూజించి ఈ నాలుగు నెలల్లోనూ పంచగవ్యాలను ప్రాశించి బ్రాహ్మణునికి బంగారాన్నిచ్చి రాత్రి భోం చేయాలి.
శ్రావణ మాసం శ్రవణ నక్షత్రం యోగించిన రోజు విష్ణుదేవుని రెండు పాదాలను, భాద్రపద మాసం, ఉత్తరాభాద్ర నక్షత్రంలో గుహ్యస్థానాన్నీ, ఆశ్వయుజుంలో అశ్వనీ నక్షత్రం వున్నరోజు హృదయ భాగాన్నీ, కార్తికంలో కృత్తిక నక్షత్రంలో స్వామి శిరస్సునీ పూజించాలి. ఈ నాలుగు నెలల్లో నేతిని నోటిలో వేసుకోవాలి. నేతినే బ్రాహ్మణునికి దానమివ్వాలి.
అనంత భగవానుని ప్రీత్యర్థం మొదటి నాలుగునెలల్లో (మార్గశిరంతో మొదలెట్టి) నేతితో, తరువాతి నాలుగు నెలల్లో శాలిధాన్యంతో, చివరి నాలుగు నెలల్లో పాలతో హవన కర్మను నిర్వర్తించాలి. అన్ని నెలల్లోనూ హవిష్యాన్నమును భుజించుట ప్రశస్తంగా పరిగణింపబడుతున్నది. ఈ ప్రకారంగా పన్నెండు నెలల్లో మూడు పారణలు చేసి ఏడాది చివర అనంత భగవానుల మూర్తిని స్వర్ణంతోనూ నాగలి, ముసలాలను వెండితోనూ చేయించి వాటిని రాగి పీఠంపై స్థాపించి పుష్ప ధూప దీపనైవేద్యాది ఉపచారాలతో పూజించాలి. చంద్రుని కూడా పూజించాలి. తరువాత పురాణవేత్త, ధర్మజ్ఞుడు, శాంతి ప్రియుడునగు భూసురుని వస్త్రభూషణాదులచే సత్కరించి పూజా సామగ్రినంతటినీ సమర్పిస్తూ అనంతః ప్రీయతాం అనాలి.
మహారాజా! మైత్రేయి ఉపదేశం మేరకు శీలధన భక్తి శ్రద్ధాదులతో అనంతుని వ్రతం ద్వారా మెప్పించి ఆయన అనుగ్రహంతో ఒక మహాపురుషుని ప్రసవించింది. ఆ బిడ్డ పుట్టిన వెంటనే ఆకాశం నిర్మలమైంది. వాయువు మందంగా ఆనందదాయకంగా వీచింది. దేవదుందుభులు మ్రోగాయి. పుష్ప వృష్టి కురిసింది. కృతవీర్యుడు తన పుత్రునికి అర్జునుడని పేరు పెట్టుకున్నాడు. అయితే అతనిని ఈ లోకం తండ్రి పేరుకి ఆదివృద్ధిని చేర్చి, కలిపి, కార్తవీర్యార్జునుడని పిలిచింది. అతడు చిన్న వయసులోనే గొప్ప తపస్సు చేసి విష్ణు భగవానుని అవతార స్వరూపమైన శ్రీ దత్తాత్రేయుని ఆరాధన చేసి ఆయన వద్ద ఇలా వరం పొందాడు. దత్తాత్రేయుడు ఇలా అన్నాడు:
‘అర్జునా! నీవు గొప్పచక్రవర్తివి, సమ్రాట్టువు కాగలవు. నిన్ను దైవ సమానునిగా ఆరాధించే వారుంటారు. పొద్దున్నా, సాయంత్రం నమోఽస్తు కార్తవీర్యాయ అను మంత్రం వాక్యాన్నుచ్చరించేవారికి నిత్య తిలదాన పుణ్యము లభిస్తుంది. నిన్ను స్మరించే పురుషుని కేనాడూ ద్రవ్య నష్టముండదు.’
భగవంతుని నుండి వరం పొందిన కార్తవీర్యార్జునుడు సప్తద్వీపయైన వసుంధరను ధర్మబద్ధంగా పాలించాడు. అత్యంత సంపన్నుడైన సమ్రాట్టు కావడం వల్ల భూరిదక్షిణలు అవసరమయ్యే యజ్ఞాలను చేశాడు. శత్రువులను జయించాడు.
కాబట్టి ఓ యుధిష్ఠిరా! మహారాణి శీలధరాదేవి చేసిన అనంత వ్రతం బహుదొడ్డది. ఆ వ్రతం వల్ల ఆమె దుఃఖాలన్నీ ఆరిపోయాయి. ఏడు జన్మలదాకా మంచి సంతానాన్ని పొందుతూనే వుంది. ఉత్తమ సంతానానికీ ఐశ్వర్యానికీ అనంతవ్రతం మంచి దారి.”