భవిష్య పురాణము

54 - విభిన్న ఋతువుల్లో విభిన్న వర్ణాలు - సూర్యమహిమ

సూర్యభగవానుని మాహాత్మ్యాన్ని ఇంకా చెప్పాలని కోరాడు శివుడు. చెప్పసాగాడు బ్రహ్మ.

ఈ చరాచర త్రిజగత్తులకు మూలం శ్రీసూర్యనారాయణుడే. దేవతలు, అసురులు, మానవులు మున్నగు జాతులన్నీ ఆయన నుండే పుట్టినాయి. ఇంద్ర, చంద్ర, రుద్ర, బ్రహ్మ వంటి దేవతలనందరినీ వెలిగించేది సూర్యతేజమే. అగ్నిలో విధిపూర్వకంగా వేసే ఆహుతులన్నీ ఆయననే చేరుకుంటాయి. సృష్టి కూడా ఆయనలోనే చివరకు విలీనమవుతుంది. సూర్యుడు లేకుంటే క్షణ, ముహూర్త, దిన, రాత్రి, పక్ష, మాస, ఋతు, అయన, వర్ష, యుగాది కాలగణనే వుండదు. కాల విభాగం లేకుంటే విశ్వమే లేదు.

ఆయన వసంతరువులో (వసంతఋతువు అనే మాట తప్పు.) కపిల వర్ణాన్నీ, గ్రీష్మంలో బంగారు రంగునీ, శరదృతువులో పాండువర్ణాన్నీ, హేమంతంలో రాగి రంగునీ, శిశిర ఋతువులో రక్తవర్ణాన్నీ పొంది ప్రకాశిస్తాడు. ఈ రంగులు ఋతువులు మారి కనిపిస్తే అరిష్టమే.

సూర్యుడు నల్లరంగులో కొస్తే జగత్తు మిగలదు. అసమయ తామ్రవర్ణం సేనాపతిని చంపుతుంది. పీతవర్ణం రాజకుమారునికీ, శ్వేతవర్ణం రాజపురోహితునికి మారకాలు. చిత్రవర్ణం చోరభయకారకం. ఈ వర్ణాలు కనబడగానే వర్షం కురిస్తే మాత్రం ఏ అరిష్టమూ జరగదు.