భవిష్య పురాణము

148 - సూర్యచక్రం - నిర్మాణం - సూర్యదీక్ష

“శతానీక మహారాజా! ఒకనాడు మహాతేజస్వియైన సాంబడు తన తండ్రి శ్రీకృష్ణపరబ్రహ్మ చేతిలో జ్వాలా మాలలతో ప్రదీప్తమై యున్న సుదర్శన చక్రాన్ని చూసి ఇలా అడిగాడు. తండ్రిగారూ! మీ చేతిలో ప్రకాశిస్తున్న ఈ సూర్యసమానమైన చక్రం మీకెలా ప్రాప్తించింది? సూర్యదేవునికి కూడా ఒక చక్రముంటుందని విన్నాను. దాని గూర్చి కూడా వినగోరుచున్నాను.’

శ్రీకృష్ణభగవానుడు ఇలా చెప్పాడు. ‘వేయి దివ్య సంవత్సరాలపాటు అత్యంత శ్రద్ధాపూర్వకంగా సూర్యభగవానునారాధించి ఈ చక్రాన్ని సంపాదించాను. భాస్కరభగవానులు ఆకాశంలో సంచరిస్తుంటారు కదా! ఆయన రథ చక్రపు నాభిమండలంలో చంద్రాది గ్రహాలుంటాయి. దాని ఊచలే పన్నెండుగురాదిత్యుల స్థానము. ఈ చక్రం కాలాత్మకం. పృధ్విని నిలబెట్టేదీ నడిపించేదే ఆ చక్రం. సూర్యభగవాను లిటువంటి చక్రాన్నే మరొక దాన్ని తయారు చేసి నాకు ప్రదానం చేశారు.

సూర్యదేవుని కమలరూప చక్రమున కుండే ఆరుదళాలూ ఆరు ఋతువులు. కమల మధ్యమంలో అధిష్ఠితుడైన పురుషుడు సూర్యభగవానుడే. చక్రానికుండే మూడు నాభులు భూతభవిష్యద్వర్తమాన కాలాలు. పన్నెండు ఊచలు పన్నెండు నెలలు. నేములు ఉత్తర దక్షిణ అయనాలు. స్థూల సూక్ష్మ ఇరుభేదాలలోనూ ఈ చక్రం సర్వ వ్యాపకం.

నా ఈ చక్రాన్ని దుష్టసంహారం కోసం సూర్యునారాధించి సంపాదించాను. గ్రహ, తత్త్వ సమన్వితమైన ఈ చక్రానికి నేను నిరంతరం పూజచేస్తాను. చక్రస్థితుడైన సూర్యదేవుని పూజించేవాడు, ఆయనతో సమానమైన తేజస్సునే పొందగలడు. సప్తమినాడు చక్రాంకితుడైన సూర్యభగవానుని రక్తచందనం, గన్నేరుపూలు, కుంకుమ, రక్తకమలం, ధూపదీపనైవేద్య ఛత్ర చామర ఫల నివేదాలతో పూజించి పుణ్యకథాశ్రవణం చేసినవానికి సంపూర్ణంగా కోరికలన్నీ తీరుతాయి. ప్రయత్నాలన్నీ నెరవేరుతాయి. అలాగే సంక్రాంతులలో, గ్రహణాది ప్రత్యేక సమయాలలో ఈ పూజ చేసిన వారి పట్ల గ్రహాలు కూడా ప్రసన్నం కావడంతో, సూర్యదేవుని కరుణవల్ల వారికి చిరజీవిత్వము, ఐశ్వర్యము, దుఃఖనాశనము, రోగవిముక్తి ప్రాప్తిస్తాయి.’