“మహర్షీ! ఏ స్తోత్ర పాఠం చేస్తే వేదపాఠం చేసిన ఫలం లభిస్తుంది?” అని అడిగారు మహర్షులు.
“ఋషులారా! ఈ విషయమై ఒక కథ చెప్పబడింది. విక్రమాదిత్యుని రాజ్యంలో ఒక బ్రాహ్మణుండేవాడు. అతని పత్నిపేరు కామిని. ఒకనాడాయన దుర్గాసప్తశతిని పఠించడానికి పక్క గ్రామానికి వెళ్ళగా అతని భార్య పేరుకి తగినట్లుగానే కామాతురయై వేరొకనితో భోగించింది. ఆ కార్యఫలితంగా ఆమెకొక నింద్యుడైన పుత్రుడు కలిగాడు. వాని పేరు వ్యాధకర్మ. వాడు ధూర్తుడై వేదపాఠరహితుడై తిరగసాగినాడు. వాని దుష్టకర్మలకు వెఱచి తల్లిదండ్రులే వానిని బయటికి తగిలేశారు. ఆ బ్రాహ్మణుడు తన భార్యను కూడా ఆమె పాపకర్మలను తెలుసుకొని తగిలేశాడు. ఆయన వింధ్యాచలంపై ప్రతిదినం చండీపాఠం చేస్తూ జగదంబ అనుగ్రహం వల్ల చివరికి జీవన్ముక్తుడయ్యాడు.
ఇక ఈ తల్లీకొడుకులు తమకు చిరపరిచితుడైన ఒక నిషాదుని వద్దకు పోయి నివసించసాగారు. అక్కడ దుష్టకర్మల ద్వారానే జీవనం గడిపారు. వ్యాధకర్మ దొంగతనాలూ, మోసాలూ చేస్తూ ధనాన్ని గడించాడు. ఒకనాడు దైవయోగం వల్ల వాడు దేవీ మందిరంలోకి వెళ్ళాడు. అక్కడ దుర్గాసప్తశతి ఆది పాఠాన్ని చేస్తున్నారు. దాని శ్రవణఫలం వల్ల వానికి వెంటనే దుర్బుద్ధులన్నీ నశించి తన జీవన విధానం పట్ల తనకే రోత కలిగింది. వెంటనే అతడు ధర్మబుద్ధి సంపన్నునిగా పరివర్తనం చెంది ఒక శ్రేష్ఠుడైన విప్రుని పాదాల చెంత చేరి తనను శిష్యునిగా స్వీకరింపుమని ప్రార్థించి సఫలుడయ్యాడు. ఆ తరువాత తన ధనాన్నంతటినీ ఆ గురువుగారి ఆశ్రమానికే సమర్పించి ధన్యుడయ్యాడు. గురువుగారి ఆదేశం మేరకు దేవీ మంత్రాన్ని అకుంఠిత శ్రద్ధతో జపించాడు. అతని పాపాలన్నీ, బీజమంత్రజప ప్రభావం వల్ల కృమిరూపంలో అతని దేహం నుండి జారిపోయి పారిపోయాయి. మూడు సంవత్సరాలపాటు ఇలాగే జపం చేసేసరికి అతడు నిష్పాప, శ్రేష్ఠద్విజునిగా ఆదరించబడ్డాడు. ఇలాగే మంత్రజపాన్నీ ఆదిచరిత్ర పాఠాన్నీ పన్నెండు సంవత్సరాలు చేసి గురువుగారి అనుమతితో నతడు కాశీ వెళ్ళిపోయాడు. అక్కడ రోచనాది ఉపచారాల ద్వారా మహాదేవి అన్నపూర్ణను పూజించి ఇలా స్తుతించాడు.
నిత్యానంద కరీపరాభయకరీ సౌందర్య రత్నాకరీ ।
నిర్ధూతాఖిల పాపపావన కరీ కాశీపురాధీశ్వరీ ।
నానాలోక కరీ మహాభయహరీ విశ్వంభరీ సుందరీ ।
విద్యాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ ॥ (ప్రతిసర్గపర్వం 2/33 /21)
ఇలా ఈ శ్లోకాన్ని మంత్రంగా నూటయెనిమిది మార్లు కనులు మూసుకొని జపించి అలాగే అతడు నిద్రలోకి జారుకున్నాడు. అతనికి శివపత్ని అన్నపూర్ణ స్వప్నంలో సాక్షాత్కరించి ఋగ్వేదముపై సంపూర్ణ జ్ఞానాన్ని అనుగ్రహించింది. ఈ విధంగా బుద్ధిమంతుడు బ్రాహ్మణశ్రేష్ఠుడుగా దేవిచే మలచబడిన ఆ విప్రుడు అనంతర కాలంలో విక్రమాదిత్యునికి యజ్ఞాచార్యుడైనాడు. యజ్ఞానంతరము యోగధారణ చేసి హిమాలయాలకు ప్రస్థానించాడు.
ఋషులారా! ఇదీ దుర్గాసప్తశతి ఆది చరిత్ర యొక్క మాహాత్మ్యం.