భవిష్య పురాణము

176 - హిరణ్యగర్భ - దానవిధి

“శ్రీకృష్ణా! ఆయువు, యశస్సు, ఐశ్వర్యము వృద్ధి చెందాలంటే చేయవలసిన వ్రతాన్ని గానీ దానాన్ని గానీ ఉపదేశించండి.” అని అడిగాడు ధర్మరాజు. చెప్పసాగాడు శ్రీకృష్ణుడు.

“మహారాజా! మీపై ప్రేమతో చెప్తున్న దానవిధి ఇది. దీన్ని చేసేవాడు నాతో సమానుడవు తాడు. దీనిపేరు హిరణ్యగర్భ దానం. ధర్మజా! సువర్ణం అగ్నిదేవుని జ్యేష్ఠ సంతానమైనందుకు సర్వధాతువులలోకీ శ్రేష్ఠమూ పవిత్రమూ ఐనది. సువర్ణం మరో పేరు హిరణ్యం. అదే జలగర్భంలో ప్రవేశించి పృథ్వీపై ఉత్పన్నమైంది.

ఇక దాన విధిని విను. ఏదో ఒక పర్వదినాన కాని, జన్మ నక్షత్ర, గ్రహపీడ, దుస్స్వప్న దర్శన కాలాల్లోగాని, ప్రయాగ, నైమిష, అర్బుద, కురుక్షేత్ర, గంగ, యమున, గంగా సాగర సంగమం వంటి పుణ్య స్థలాల్లో హిరణ్యగర్భ దానాన్ని చేయాలి. అలా కుదరని వారు ఇల్లు, కోవెల, తోట, తటాకం వంటి చోట్ల చేయవచ్చు. మొట్టమొదట భూమిని శోధించి పన్నెండు హస్తాల పొడవు, వెడల్పులతో నొక చతురస్రాకార మండపాన్ని నిర్మించి దానిని స్తంభ, తోరణ, పతాకాదులతో అలంకరించాలి. మండప మధ్యలో అయిదు హస్తాల జాగాలో నొక వేదిని నిర్మించి అందులో వితానమును పెట్టి దానిని పుష్పమాలాదులతో అలంకరించాలి. వేదిపై హిరణ్యగర్భ కలశనుస్థాపించాలి. ముందుగా వస్త్ర, ఆ భూషణాదులతో ఆస్థాన శిల్పిని పూజించి బ్రాహ్మణులచే స్వస్తి వాచనములు చేయించాలి. శిల్పి చేత ప్రత్యేకంగా హిరణ్యగర్భ సువర్ణ కలశను తయారుచేయించాలి. దాని ముఖ భాగము నడిమి భాగంలో సగంవుండాలి. దాని ఎత్తు అరువది నాలుగంగుళాలుంటే ముఖము అందులో మూడవవంతు ఉండాలి. దాని గుండ్రత దాని కర్ణికతో సమానంగా వుండాలి. కలశకడు సుందరంగా గ్రంథిరహితంగా వుండాలి. కలశ సమీపంలో సువర్ణ నాళము, సూర్యమూర్తి, స్వర్ణమయ సూచి, క్షుర, కమండలువు, ఛత్రము, పాదుకలు ఉంచాలి. బ్రహ్మదేవుని మూర్తిని ఆ ప్రక్కనే స్థాపించి వేదధ్వనులతో శంఖాదుల మంగళ ధ్వనులతో ఊరేగింపుగా ఆ కలశను ఏనుగుపై గాని రథంపై గాని పెట్టి బ్రాహ్మణులు ఈ మండపంలోకి తీసుకువచ్చి అక్కడి వేదిపై ఒక కుండతో నువ్వులను పెట్టి దానిపై ఈ కలశను స్థాపించాలి. తరువాత హిరణ్యగర్భునిపై కుంకుమను పూసి పట్టువస్త్రాలను కట్టి పూమాలలతో అలంకరించాలి. తరువాత ధూపదీపాదులతో పూజించి ఈ క్రింది మంత్రాలను చదివి నమస్కారం చేయాలి.

భూర్లోక ప్రముఖాలోకాస్త్వ గర్భేవ్యవస్థితాః

బ్రహ్మాదయస్తథా దేవా నమస్తే భువనోద్భవః

నమస్తేభువనాధార నమస్తే భువనేశ్వరః

నమో హిరణ్యగర్భాయ గర్భాయస్య పితామహః॥ (ఉత్తరపర్వం 176/30-32)

ఇలా పూజించి ఒక రాత్రిదాకా దానినలా అధివాసం చేసేవుంచాలి. వేదికి నలువైపులా నాలుగు చతురస్రకుండల నేర్పాటు చేసి నలుగురు వేదవేత్తలైన బ్రాహ్మణులచే మౌన హవనాలు చేయించాలి. తరువాత వారిని గంధ ధూపాదులతో పూజించి ఒక్కొక్కరికీ రెండేసి రాగిపాత్రలనివ్వాలి. వేదికి ఈశాన్యంలో గ్రహవేదిని నిర్మించి దానిపై నవగ్రహాల, దశదిక్పతుల, త్రిమూర్తుల సువర్ణప్రతిమను స్థాపించి గంధ పుష్పాక్షతలతో వస్త్రాదులతో దానిని పూజించాలి. మండపద్వారాలలో రత్నయుక్తములయిన రెండేసి కలశలను స్థాపించి తులాపురుష దానంలో చేసినట్టే లోకపాలుర నావాహన చేసి నైవేద్యాలూ బల్యర్పణలూ చేయాలి. ఈ యజ్ఞంలో పలాశ సమిధలను వాడడం శ్రేయస్కరం. చరు, తిలలు, ఆవు నెయ్యిలతో వ్యాహృతి, గ్రహ, దేవతా నామాలతో మంత్రాలతో ఇరవై వేల ఆహుతలనివ్వాలి. శుభముహూర్తంలో యజమానుడు స్నానంచేసి తెల్లబట్టలు కట్టుకొని హిరణ్యగర్భుని పూజించి ఈ విధంగా ప్రార్థిస్తూ ప్రదక్షిణలు చేయాలి:

నమోహిరణ్య గర్భాయ విశ్వగర్భాయవై నమః

చరాచరస్య జగతో గృహభూతాయతే నమః

మాత్రాహం జనితః పూర్వం మర్త్యధర్మా సురోత్తమ।

త్వద్గర్భ సంభవాదద్య దివ్యదేహో భవామ్యహం (ఉత్తరపర్వం 176/42,43)

తరువాత పాలు, పెరుగు, నెయ్యిలతో ఆ కలశను నింపి మండపంపై పెట్టాలి. యజమాని ఎడమచేతిలో యముని సువర్ణ ప్రతిమనూ, కుడిచేతిలో సూర్య సువర్ణ ప్రతిమను పట్టుకొని పిడికిళ్ళు బిగించి రెండు మోకాళ్ళ మధ్య శిరసును పెట్టి అయిదుమార్లు శ్వాసను పీల్చి వదలి శివుని ధ్యానిస్తూ కూర్చోవాలి. ఈలోగా బ్రాహ్మణులు హిరణ్యగర్భ ప్రతిమకు జాతకర్మాది సంస్కారాలు చేస్తుండాలి. అప్పుడు ఆచార్యుడు వచ్చి యజమానుని లేవనెత్తాలి. సంస్కారాలు జరుగుతున్నంతసేపూ యజమాని ఎవరి ముఖమునూ చూడరాదు. తరువాత పండితులు వేదఘోషను వినిపిస్తూ యజమానికి స్నానంచేయించి బంగారం, వెండి, రాగి లేదా మట్టితో ఎనిమిది కలశలను నిర్మింపజేసి మంత్రజలాలను వాటిలో పోసి దేవస్యత్వాం అనే మంత్రాన్ని పూర్తిగా పఠిస్తూ ఆ నీటితో యజమానినభిషేకించి ఇలా అనాలి.

అద్యజాతస్యతేంఽగాని అభిషేక్ష్యామహేవయం

దివ్యేనానేన వపుషా చిరంజీవ సుఖీభవ ॥ (ఉత్తర పర్వం 176/54)

తరువాత యజమాని సంకల్ప పూర్వకంగా ఆ హిరణ్యగర్భ ప్రతిమను బ్రాహ్మణులకు దానం చేసి వేయాలి. యజ్ఞ సామగ్రినంతటినీ గురు దేవులకు సమర్పించాలి. చెప్పులు, గొడుగు, బట్టలు, ఆసనాది సామగ్రిని సభలో నున్న బ్రాహ్మణులకి ఇచ్చివేయాలి. దీనులకూ అనాధులకూ వికలాంగులకూ భోజనాలు పెట్టాలి. ఈ విధంగా ఈ దానం చేసిన వ్యక్తి తన వంశాన్ని ఉద్ధరిస్తాడు. తాను స్వయముగా దేహాంతంలో దివ్యవిమానాన్నెక్కి స్వర్గ లోకానికి వెళతాడు. అక్కడొక వందమన్వంతరాలబాటు ఇంద్రునితో సమానంగా సుఖ భోగాలనుభవించి భూలోకంలో జగజ్జేతయగు ధర్మాత్ముడగు చక్రవర్తిగా జన్మిస్తాడు. ఈ దాన విధిని విన్నవారు వందేళ్ళకంటె నెక్కువగా స్వర్గ సుఖాలననుభవిస్తారు.