130 - దీపాదాన మహిమ - లలితారాణి (జాతిస్మర) కథ

“వాసుదేవా! ఈ లోకంలోనే అత్యంత తేజోమయ స్వరూపం ప్రాప్తించాలంటే ఏ వ్రత, తప, నియమ, దానాలు చేయాలి?”

“ధర్మరాజా! ఒకప్పుడు పింగలుడను తపస్వి మథుర వచ్చివున్నాడు. ఆయనను జాంబవతి ఇదే ప్రశ్న అడిగింది. ఆయన ఇలా చెప్పాడు: ‘ఓ మహాదేవీ! సంక్రాంతి, సూర్యగ్రహణం, చంద్రగ్రహణం, వైధృతి, వ్యతిపాతయోగం, ఉత్తరాయణం, దక్షిణాయనం, విషువ, ఏకాదశి, శుద్ధ చతుర్దశి, తిథిక్షయం, సప్తమి, అష్టమి - ఈ పుణ్య దినాల్లో వ్రత పరాయణులైన స్త్రీ పురుషులు స్నానం చేసి తమ వాకిట్లో మధ్యలో నేతి కుంభాన్నీ, వెలుగుతున్న దీపాన్నీ భూమిదేవునికి దానం చెయ్యాలి. దీనివల్ల ప్రదీప్తమైన ఓజస్వియైన శరీరం లభిస్తుంది.”

“వాసుదేవా! భూమిదేవుడనగా నెవరు? అడిగాడు పార్థులలో అగ్రజుడు చెప్పసాగాడు పార్థసారధి.

“మహారాజా! ఒకప్పుడు సత్యయుగంలో సుప్రసిద్ధ సూర్యవంశానికి చెందిన త్రిశంకు మహారాజు తనను సశరీరంగా స్వర్గానికి పంపించమని తమకులగురువైన వసిష్ఠ మహర్షిని ప్రార్థించాడు. లోకానికీ, ధర్మానికీ కూడా విరుద్ధమైన ఈ పనికి ఆ మహర్షి అంగీకరించలేదు. మహారాజు పదే పదే అదే కోరికను వెలిబుచ్చడంతో మహర్షి విసిగిపోయి, ‘నీకు చాండాల రూపం రావాలిగాక’ అని శపించాడు. చండాల సహజమైన చాండాల రూపం వచ్చి వేయుటతో ఆ రాజు రాజ్యాన్ని వారసుని కప్పగించి అలాగే వెళ్ళి విశ్వామిత్రుని పాదాలను పట్టుకొన్నాడు. అప్పటికే వసిష్ఠుని పట్ల అలవి మీరిన స్పర్థా, సహజంగా క్షత్రియాభి మానమూగల ఆ రాజర్షి తన తపశ్శక్తిని ధారవోసి త్రిశంకుని బొందితోనే స్వర్గానికి పంపించాడు. ఇంద్రుడు చండాలుని వలెనున్న త్రిశంకుని తన లోకానికి రాగానే క్రిందికి తోసివేయగా క్రోధమునింకా జయించవలసి యున్న దశలోనే అప్పటికింకా వున్న విశ్వా మిత్రుడు మహాక్రోధియై కిందపడిపోతున్న త్రిశంకుని ఆకాశంలోనే ఆపి, అక్కడే నిలిపి అతని చుట్టూ ఒక కొత్త లోకాన్ని సృష్టించనారంభించాడు. అది రెండవ స్వర్గం అవుతుందన్నాడు. కొబ్బరి, శృంగాటకం, కో ద్రవం, గుమ్మడి, ఒంటె, గొఱ్ఱె మున్నగువానిని సృష్టించాడు. సప్తర్షుల, దేవతల ప్రతిమలను తయారుచేసి ప్రాణం పోయబోతుండగా ఇక కొత్త ఇంద్రుని కూడా ఈయన సృష్టించేస్తాడేమోనని భయపడి ఇంద్రుడే దిగి వచ్చి త్రిశంకుని సగౌరవంగా స్వర్గానికి ఆహ్వానించాడు. ఇక ఆయన సృష్టించిన దేవతా ప్రతిమలకు భూలోకంలోనే దీపాదానం చేయిస్తాననీ, ఈ ప్రతిమలలోనే త్రిమూర్తులతో సహా దేవతలంతా వాసం చేస్తారనీ, ఈ ప్రతిమలే భూమిదేవులుగా పూజలందుకొంటాయనీ, వాటిని పూజించినవారికి దేవతలు వరప్రదానం చేస్తారనీ ఇంద్రుడు విశ్వామిత్రునికి మాట యిచ్చి, నమస్కరించి వెళ్ళాడు. ఇదే భూమి దేవుల కథ. ఈ ప్రతిమలే భూమిదేవులు. వీటికే దీపాదానం చేయాలి.

సూర్యభగవానునికి రక్తవస్త్ర నిర్మిత వర్తిక (వత్తి)ను వాడాలి. దానిని ‘పూర్ణవర్తి’ అంటారు.

శివునికి వాడే శ్వేత వస్త్ర వర్తికను ఈశ్వర వర్తి అనీ, విష్ణువుకి దీపాదానం చేయడానికి వాడే పచ్చబట్టవత్తిని ‘భోగవర్తి’ అనీ గౌరీదేవి కుపయోగించే కుంకుమరంగు వస్త్ర వర్తికను సౌభాగ్యవర్తి’ అనీ, దుర్గాదేవికి వాడే లక్కరంగు వస్త్రపు వర్తికను ‘పూర్ణ వర్తికా’ అనీ వ్యవహరిస్తారు.

బ్రహ్మకోసం వాడేది ‘పద్మవర్తి’ అనీ, నాగుల కోసం వాడేది ‘నాగవర్తి’ అనీ గ్రహాలకు చేసే వత్తి ‘గ్రహవర్తి’ అని పిలువబడుతున్నాయి.

ఈ దేవతలందరికీ దీపాలు పెట్టాలి. ముందా దేవతను పూజించి, పెద్ద పాత్రలో నేతిని నింపి దీపాదానం చేయాలి. ఇలా చేసినవారు సుందర తేజస్వీ రూపాలను ధరించి తేజోవంతమైన విమానానెక్కి స్వర్గానికి వెళతారు. అక్కడ ప్రళయ పర్యంతమూ నివాస ముంటారు. దీపం లాగానే దీపాదానాన్ని చేసినవారు కూడా ప్రకాశిస్తారు. దీపశిఖవలెనే వారి ఆత్మ కూడా పైకి పైపైకి వెళ్ళి ఊర్థ్వలోకాలను చేరుకుంటుంది. దీపాన్ని నేతితోనో నూనెతోనో పెట్టాలి. వసా, మజాది తరళ ద్రవ్యాలతో కాదు. వెలుగుతున్న దీపాన్ని ఆర్పడంగాని, చోటు మార్చడం గాని చేయరాదు. అవి నిందనీయ కర్మలు. చెవులు పోతాయి, దీపాన్ని దొంగిలించినవారు అంధులైపోతారు.

మహారాజా! దీపాదాన మాహాత్మ్యాన్ని తెలిపే ఆఖ్యాన మొకటుంది. విదర్భ దేశంలో చిత్రరథుడని ఒక రాజుండేవాడు. అతనికి చాలామంది కొడుకులూ, ఒక కూతురూ కలిగారు. ఆ కూతురి పేరు లలిత. ఆమె సంపూర్ణ శుభలక్షణ సంపన్న మరియు సుందరి చిత్రరథుడామెను ధర్మపరాయణుడు, కాశీ మహారాజునగు చారుదగ్మునికిచ్చి వివాహం చేశాడు. ఆమె అక్కడ పట్టపురాణిగా సంభావింపబడింది. ఆమె ప్రతిరోజూ విష్ణు మందిరంలో వేయిదీపాలను వెలిగిస్తుండేది. అంతేకాక, విశేషించి, కార్తిక, ఆశ్వయుజ మాసాల్లో పెద్ద ఉత్సవ స్ఫూర్తితో దీపాదానం చేస్తుండేది. కూడళ్ళలో, వీధుల్లో, రావిచెట్టుకీ, గోశాలలో, పర్వత శిఖరంపై, నదీ తీరంలో, నూతిపై దీపాదానం చేస్తుండేది. ఒక రోజామెను సవతులు ఇలా అడిగారు. ‘లలితా! నీ భక్తి దేవతల పూజల పట్ల దేవాలయ దర్శనాదుల మీద కంటె విశేషంగా దేవతలకు దీపా దానం వైపే ఎక్కువగా మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది. దీపాదానం వల్ల కలిగే ఫలమేమిటో మాకు కాస్త చెప్పవూ!?’

‘సఖులారా! మద్రదేశంలో దేవికయను పేరుగల శ్రేష్ఠమైన నది వుంది. మనుష్యులను ఉద్ధరించడానికి పార్వతీదేవి పుడమిపై అవతరించవలసి వచ్చినపుడు బ్రహ్మ ఆమెను ఆ నదీ రూపంలో అవతరితం చేశాడు.

ఈ నది పరమేశ్వరునికి పరమ ప్రీతి పాత్రం. అందులో స్నానం ఒకసారి చేసినా కూడా అత్యంత అలభ్యమైన శివగణ సభ్యత్వం లభిస్తుంది. ఆ నదిలోనే మహావిష్ణువు నృసింహరూపంలోనున్నప్పుడు స్నానం చేసేవాడు. అప్పటినుండీ ఆ ప్రాంతం నృసింహ తీర్థమని పిలువబడుతోంది. ఇక్కడ స్నానం చేస్తే సర్వపాపాలూ నష్టమైపోతాయి.

సఖులారా! సౌవీరుడని ఒక రాజుండేవాడు. రాజపురోహితుడైన మైత్రేయుని సూచనపై ఆ రాజు దేవికానదీ తీరంలో నొక విష్ణుమందిరాన్ని నిర్మించాడు. ఆ కోవెలలో మైత్రేయుడు ప్రతిదినమూ పుష్ప దీప నైవేద్య ధూపాదులతో పూజనొనర్చి దీపాదానాన్ని కూడా నిర్వర్తించేవాడు. ఒక కార్తిక పున్నమనాడతడు దీపాదాన కార్యక్రమ సందర్భంగా పెద్ద ఉత్సవాన్ని చేస్తుండగా, జనులందరికీ నిద్ర ముంచుకొచ్చింది. నేను ఆ జన్మలో ఎలకనై పుట్టి ఆ కోవెలలోనే తిరుగుతుండేదాన్ని. ఒక ఆరిపోతున్న దీపాన్ని చూసిన నాకు నేతి వాసనతో ఘుమఘుమలాడుతున్న వత్తిని తినాలనిపించి దగ్గరకు వెళ్ళి వత్తిని బయటకు లాగబోయాను. సగం లాగేసరికి పిల్లి కూత వినబడింది. ఆ వత్తిని అలాగే వదిలి పారి పోయాను. నేతిలోకి వత్తి జారిపోవడం వల్ల ఆరిపోబోతున్న ఆ దీపం నేను వత్తిని పైకి లాగడం వల్ల మరల పూర్తిగా వెలిగింది. అది ఇక ఆరనేలేదు. ఆవిధంగా ఆరిపోబోతున్న దీపాన్ని అఖండం చేసిన నాకు దీపాదాన ఫలం దక్కింది. కొన్నాళ్ళకి మూషికంగా మరణించిన నేను తెలియక చేసిన పుణ్య ఫలంవల్ల ఇదిగో ఇలా పుట్టి ఇంత దాననైనాను. పైగా జాతిస్మరత్వం కూడా ప్రాప్తించింది. తెలియక చేసిన పాపానికి శిక్షపడిపోతున్న మానవులు గగ్గోల పెట్టేసి దేవుని తిడతారేగాని వాళ్ళు అనుభవిస్తున్న సుఖాలన్నీ వారికే తెలియక చేసిన ఏ పుణ్య ఫలాలో కావచ్చనే ఆలోచన చేయరు. తెలియక చేసిన పుణ్యానికి ఫలాన్ని తెగ సుఖంగా అనుభవించేస్తున్నప్పుడు తెలియక చేసిన పాపానికి శిక్షగా దుఃఖాన్ని కూడా అనుభవించాలి కదా! ఈ విధంగా నాకు దేవతలకు దీపాదానం చేయడం వల్ల పుణ్యం అనుభవయోగ్యమై అవగతమై విరాజిల్లింది కాబట్టి నేనిలా ఇన్నేసి దీపాలను వెలిగిస్తున్నాను.’ అని చెప్పింది లలిత.

పట్టపురాణి ఇలా చెప్పిన పిమ్మట ఇతర రాణులూ సంపన్న స్త్రీలూ దీపాదానం చేయ సాగారు. ఫలితంగా కొన్నేళ్ళపాటు అన్ని సంపదలనూ అనుభవించి దేహాంతంలో పతి సమేతంగా విష్ణులోక నివాస ప్రాప్తిని పొందారు.”