భవిష్య పురాణము

24, 25 - కలియుగ ద్వితీయ తృతీయ చతుర్థ చరణాల వృత్తాంతం, భగవంతుడైన కల్కి

“శౌనకాచార్యా! విజయులుగా నిలిచిన మ్లేచ్ఛులను కలి మిక్కిలిగా సన్మానించాడు. తరువాత దైత్య గణాలన్నీ సముద్రం మీద పడ్డాయి. లెక్కకు మిక్కిలిగా నౌకా నిర్మాణాలను చేపట్టి ఎక్కడెక్కడి నుండో హరిఖండానికి వచ్చి పడ్డాయి. అప్పటికి హరిఖండంలోని మనుజులు దేవతల వలెనే మిక్కిలి బలశాలులు. వారు తమ భయంకరమైన అస్త్రశస్త్రాదుల సాహాయ్యంతో మ్లేచ్ఛులతో బ్రహ్మాండమైన యుద్ధాన్ని చేశారు. ఈ మహాయుద్ధం పదేళ్ళపాటు జరిగింది. కాని, చివరికి దైత్యులే మాయా యుద్ధం చేసి గెలిచారు. పరాజితులైన హరిఖండయోధులు మహేంద్రుని శరణు వేడారు. ఆయన విశ్వకర్మను పిలిపించి, ‘అయ్యా! మీరొకప్పుడు సప్త సింధువులలోనూ ‘భ్రమి’ అను యంత్రాలను నిర్మించి పెట్టారు. వాటి ప్రభావం వల్ల ఒక ఖండంలోని మానవులు ఆ ఖండంలోనే వుండవలసి యుండేది. ఏ ఒక్కరినీ అవి ఖండం దాటనిచ్చేవికావు. మ్లేచ్ఛుల నుండి భరతఖండం కొంతవఱకు సురక్షితమై వుండేది. కాని, మాయావియైన మయుడు ఆ యంత్రాలను పనిచేయకుండా చేసేశాడు. దాంతో అన్నిచోట్ల నుండీ మ్లేచ్ఛులు వచ్చేసి మన ఖండాన్ని ఆక్రమించ బోతున్నారు. మరల మీరే మన భరత వర్షాన్ని రక్షించాలి’ అని చెప్పాడు.

మాయామయుడైన మయుడు విరుగుడు చేయలేనిదేదో చేయాలి- అని చింతించి విశ్వకర్మ ఒక దివ్య భ్రమి యంత్రాన్ని నిర్మించాడు. దానిని ఉపయోగించగానే మ్లేచ్ఛనాశకమైన ఒక మహావాయువు బయటికి రాగా దానినుండి ఒక మహాపురుషుడుద్భ వించాడు. అతడు ‘వాత్యుడను పేర ప్రసిద్ధుడైనాడు. జ్ఞానమయుడైన వాత్యుడు దేవగణాలనూ ఆర్యులనూ, మ్లేచ్ఛేతరులను సమీకరించి ముందుగా మ్లేచ్ఛులకు మూలబలమైన దైత్యయక్ష పిశాచ గణాలను ఓడించి తన్ని తగిలేశాడు. త్రివర్ణాలకు చెందిన ద్విజులనూ విశేషంగా సన్మానించాడు. మ్లేచ్ఛులుగా మారిన వారిని మరల వైదిక ధర్మంలోకి గొనివచ్చి వారి పూర్వపు వర్ణాలనే వారికి ప్రసాదించాడు. మహాబలశాలీ, జ్ఞానీయైన వాత్యుడీ విధంగా ధర్మ సంస్థాపనం చేసి అర్ధ శతాబ్ది కాలం ఈ దేశాన్ని పరిపాలించాడు. అతని వంశంవారు పదహారువేలయేళ్ళపాటు ఈ రాజ్యాన్నేలారు. వీరంతా వాయుదేవోపాసకులే.

దుఃఖితుడైన కలి మరల దైత్యరాజు బలి వద్దకు పోయి తన మతానికి కలిగిన వాత్యోప ద్రవాన్ని చెప్పుకొని ఆక్రోశించాడు. ఎప్పట్లాగే కలిమీద జాలిపడిన బలి ఈమారతనిని తోడ్కొని తనకు చిరంజీవిత్వాన్నీ పాతాళ లోకాధిపత్యాన్నీ ప్రసాదించిన భగవంతుడైన వామనమూర్తి కడకు పోయి నమస్కరించి, ‘హే సురోత్తమా! నాపై కరుణతోనే మీరు కలికి ఈ యుగాన్నిచ్చి దీవించారు. మరి ఇప్పుడు వాత్య - ద్విజుల ద్వారా కలికి శృంగ భంగమై నిలువనీడ లేకుండా పోయింది. ప్రభూ! త్వరలోనే ఈ యుగంలో మొదటి చరణం ముగియబోతోంది. ఇంతవఱకూ నాపై దేవతల ప్రాబల్యమే ఇంకా కొనసాగు తోంది. నన్నెలాగూ దేవతలంతా కలిసి మాయచేసి పాతాళంలో పాతేశారు. నా మిత్రుడు, విష్ణువరప్రసాదియైన ఈ కలినైనా దయ చూడండి’ అని వేడుకొన్నాడు.

అప్పుడు భగవానుడు, వామనుడునైన హరి యుగధర్మమును కూడా ఆలోచించి, తన పూర్వార్ధ అంశను యమునాతట నివాసులైన కామశర్మ, దేవహూతియను బ్రాహ్మణ దంపతులలో ప్రవేశపెట్టాడు. ఫలితంగా వారికి ఇద్దరు దివ్యపుత్రులు జనించారు. వారి పేర్లు భోగసింహుడు, కేళిసింహుడు. వారు వాత్యోత్పన్నులైన రాజుల నోడించి కల్పక్షేత్రానికి వచ్చారు. అక్కడ మయుడు నిర్మించి యిచ్చిన రహః క్రీడావతి యను నగరంలో వుంటున్న ఆ మహాబలశాలులిద్దరూ కలి ప్రసాదించిన కత్తులను ధరించారు. వారి నాయకత్వంలో వర్ణసంకరం విశృంఖలంగా పెరిగింది. చెట్లమీది పక్షుల్లాగే మానవులు కూడా విచ్చలవిడిగా బతుకసాగారు. రెండువేల సంవత్సరాల్లో వీరు పూర్వాచార పరాయణతను, పరాయణులతో సహా సర్వనాశనం చేసి పారేశారు.

అప్పుడే పృథ్విపై కలియుగ ద్వితీయ చరణం ప్రారంభమైంది. ఈ సమయంలో కిన్నరులు భూవాసులయ్యారు. ఈ దైత్య అంశలున్న నరులు రెండున్నర అడుగుల దాకానే పెరిగేవారు. వారి ఆయుఃప్రమాణం నలభైయేళ్ళే. పూర్తిగా పక్షుల్లాగే బతికేసేవారు. కర్మ హీనులు. ఈ ద్వితీయ చరణాంతానికి వివాహవ్యవస్థే వుండదు. రాజులుండరు. ఉద్యమ శీలురూ వుండరు. కర్మిష్ఠులుండరు. ఈ భోగ, కేళి సింహుల వంశజులు పాతికవేల యేళ్ళదాకా పృథ్విపై నుండవచ్చు. కాబట్టి హే శౌనకాది మహామునులారా ఇకపై ఏం జరగబోతోందో మన గురువుగారైన వ్యాసుల ద్వారా తెలుసుకుందాం పదండి” అని సూతమహర్షి అంటుండగానే భగవంతుడైన వేదవ్యాస మహర్షి వారి యెదుట ప్రత్యక్షమై ఇలా భవిష్యద్వాణిని వినిపించాడు.

“మునులారా! విశాలాపుర నివాసులైన మునులందరూ అప్పటి యజ్ఞాంశకృష్ణ చైతన్యుల ఆశ్రమానికి పోయి ఆయనను ‘స్వామీ! ప్రణామాలు. ఇక మేము ఇంద్రలోకానికి పోతాం. అనుమతించండి’ అని అడుగుతారు. అప్పుడు యజ్ఞాంశ కృష్ణచైతన్యులు ఆహ్లాదుడు, గోరఖ్‌యోగి, శంకరాది రుద్రాంశులతోనూ భర్తృహరి మహారాజు మున్నగు శిష్యులతో, అన్యయోగి జనులు, విశాలాపుర నివాసులైన మునులను కూడా తోడ్కొని ఒక దివ్య విమానాన్నధిరోహించి దేవలోకానికి వెళతారు. అప్పటికే మొదలైపోయిన కలి ద్వితీయ చరణం ఇందాక మీరు విన్నట్లుగానే సాగిపోతుంటుంది.

కలి యొక్క మూడవ చరణంలో కిన్నరగణాల అస్తిత్వం మెల్లమెల్లగా నశించి పోతుంది. ఈ చరణంలో ఇరవై ఆరువేల సంవత్సరాలు గడిచాక రుద్రుని ఆజ్ఞతో భృంగమహర్షి, సౌరభీ దంపతులు మహాబలవంతులైన కైలకల్ప నామకులైన, మహావీరులైన మానవులకు జన్మనిస్తారు. వారు కిన్నరులను దొరికిన వారిని దొరికినట్లే భక్షించేస్తారు. భయభీతులైన కిన్నరులు వామనాంశులైన భోగ, కేళి సింహులను శరణువేడతారు. వారు వచ్చి కైల కల్పులతో భయంకరమైన యుద్ధాన్ని చేస్తారు. ఇలా పదేళ్ళపాటు ఘోరమైన యుద్ధం జరిగాక మొత్తం అనుచరగణాన్ని యుద్ధంలోకి దించిన సింహులు పరాజితులై దైత్యులతో సహా పాతాళంలోకి పారిపోతారు.

అప్పుడిక పుడమిపై భృంగునియొక్క భయంకర సృష్టియే మిగులుతుంది. వీరు మ్లేచ్ఛుల కంటె దారుణంగా వావి వరసలు విడిచి ప్రవర్తిస్తారు. కామాంధులై, వివాహ బంధం లేకుండానే అధిక సంఖ్యలో పుత్రుల్ని ఉత్పన్నం చేస్తారు. కలియుగ తృతీయ చరణంలో ‘అన్ని విలువలూ పతనమైపోతాయి.

కలియుగం నాల్గవచరణంలో మానవుల ఆయుఃప్రమాణం ఇరవై యేళ్ళకు పడి పోతుంది. గిట్టే ప్రతి ప్రాణి దారీ నరకానికే. నాగరికత నట్టేట్లో మునిగిపోవడంతో జనులు మళ్ళా జలచరాల్లాగ, వన్య ప్రాణుల్లాగా, నీళ్ళల్లో, అడవుల్లో దొరికే వాటినే తింటూ వుంటారు. తమిస్రాది భయంకర నరకాలన్నీ మన కర్మభూమిలో పుట్టిన నరులతోనే నిండిపోతాయి. క్రిక్కిరిసి వుంటాయి. నరక లోక కర్మచారుల నాయకుడైన నరకుడు యమధర్మరాజు నాశ్రయించి ఆక్రోశిస్తాడు. ఇలా: హే మహాత్మా! నరకాలన్నీ పాపులతో కిటకిటలాడి పోతున్నాయి. మాకు కనీసం నిటారుగా చేతులు చాచి నిలబడడానికి క్కూడా స్థలం లేకుండా పోతోంది. యముడు చిత్రగుప్తుని తోడ్కొని బ్రహ్మవద్దకు పోతే ఆయన వీరందరినీ తీసుకొని క్షీరసాగర శయనుడైన జగదానంద కారకుని ఆశ్రయిస్తాడు. వీరంతా జగన్నాథుడు, దేవాదిదేవుడు, వృషాకపియగు ఆయనను సాంఖ్యశాస్త్రమయ స్తోత్రాలతో ప్రార్థించగా ఆయన ఇలా చెప్తాడు: ‘దేవతలారా! లోకకల్యాణం కోసం ఈ కశ్యపుడు సంభల గ్రామంలో విష్ణుయశుడను పేర జన్మిస్తాడు. అతని పత్ని పేరు విష్ణుకీర్తి కాగలదు. విష్ణుయశుడు కృష్ణలీలా సంబంధిత గ్రంథాలను ప్రజలకు వినిపిస్తాడు. కాని, ఆ భయంకర మహాధూర్తనారకీయ ప్రాణులు ఆయనను గట్టి గొలుసులతో కట్టేసి చెఱసాలలో భార్యతో సహా తోసేస్తారు. అప్పుడు విష్ణుకీర్తి గర్భాన మార్గశిర కృష్ణాష్టమి అర్ధరాత్రి చిక్కటి చీకటిలో నేనే కల్కిరూపంలో ఉద్భవిస్తాను. ఈ బ్రహ్మాండాన్ని సముద్ధరించటానికి మరల దేవతలు భూమిపై పుట్టి గ్రహాలతో సహా పరమేశ్వరుని స్తుతిస్తారు. అపుడు భగవాన్ కల్కి వారందరికీ కల్పాల, మన్వంతరాల, అవతారాల వివరాలనూ, సనాతన రాధాకృష్ణతత్త్వ మహిమనూ, కర్మభూమి, ఇతర లోకాల, గ్రహాల కదలికలనూ వినిపిస్తాడు. ఈ సందర్భంలోనే శ్వేతవరాహకల్ప కథనీ ప్రవచిస్తాడు’ అని అనంతశయనుడు అనుగ్రహ భాషణాన్నివ్వగా అందరూ ఆనంద తరంగితులై వారి వారి స్థానాలకు వెళతారు” అని చెప్పాడు వ్యాసుడు.