భవిష్య పురాణము

49 - సూర్యనారాయణుని నిత్యార్చన విధానం

“శతానీక మహారాజా! శ్రీకృష్ణ భగవానుడు ఇంకా ఇలా చెప్పసాగాడు. ఏ పూజనాచరిస్తే సంపూర్ణంగా పాపాలూ, విఘ్నాలు పారిపోతాయో, అన్ని మనోరథాలూ సిద్ధిస్తాయో, అఖండపుణ్యం ప్రాప్తిస్తుందో ఆ సూర్యనారాయణ పూజావిధానాన్ని చెప్తున్నాను. విను.

ప్రాతఃకాలంలోనే మేల్కొని శౌచాదులు చేసుకొని నదీతీరానికి పోయి ఆచమనం చేసి సూర్యోదయ సమయానికల్లా శుభ్రమైన మట్టిని శరీరం నిండా పట్టించి అది వదిలేలాగ స్నానం చేసి వెయ్యాలి. మరల ఆచమనం చేసి మడిబట్టలు కట్టుకొని సప్తాక్షర మంత్రాన్ని- అనగా ఓం ఖఖోల్కాయస్వాహా అనే మంత్రాన్ని జపిస్తూ సూర్యదేవునికి ఆర్ఘ్యమిచ్చి అలాగే మనసులో ధ్యానిస్తూ సూర్యమందిరాన్ని చేరుకొని అక్కడ పూజ చేయాలి. ముందుగా శ్రద్ధాపూర్వకంగా పూరక, రేచక, కుంభక, ప్రాణామాయాలు చేసి వాయవీ, ఆగ్నేయ, మహేంద్రి, వారుణి ధారణ చేసి భూతశుద్ధిరీతిలో శరీర శోషణ, దహన, స్థంభన, ప్లావనాలచే శరీరశుద్ధిని గావించుకొని సర్వశుద్ధంగా సూర్యునికి ప్రణామం చేయాలి. స్థూల, సూక్ష్మ శరీరాలను, ఇంద్రియాలను దేని స్థానంలో అది వుండేలా ఆదేశించి(యోగీశ్వరేశ్వరుడైన శ్రీకృష్ణుడు తనదైన శైలిలో యోగపరిభాషలో ప్రవచించిన ఈ పంక్తులకు అర్థం తెలియాలంటే యోగం (యోగా కాదు) తెలిసిన వారిని సంప్రదించాలి.) ఈ క్రింది మంత్రాలను చదువుతూ పూజాసామగ్రిపై నీళ్ళు జల్లాలి.

ఓం ఖః స్వాహా హృదయాయ నమః

ఓం ఖః స్వాహా శిరసే స్వాహా,

ఓం ఉల్కాయస్వాహా శిఖాయై వషట్

ఓం యాయస్వాహా కవచాయ హుం,

ఓం స్వాం స్వాహా నేత్రత్రయాయ వౌషట్,

ఓం హాఁ స్వాహా అస్త్రాయ ఫట్

తరువాత సుగంధిత పుష్పాది ఉపచారాలతో సూర్యభగవానుని పూజ చేయాలి. పగటి పూట సూర్యమూర్తినీ, రాత్రిపూట అగ్నినీ ముందిడుకొని ఈ పూజ చేయాలి. ప్రభాతకాలంలో తూర్పువైపు, సాయంత్రం పడమటివైపు, రాత్రి ఉత్తర దిశగా తిరిగి పూజ చేయాలి. సూర్యమండలంలో మధ్యలో వుండే ఆరుదళాల కమలాన్ని మనసుతో చూస్తూ ఈ సప్తాక్షరమూలమంత్రాన్ని జపిస్తూ ఆ కమలం మధ్యలో వేలకొద్దీ కిరణాలతో వెలిగిపోయే సూర్యభగవానుని ధ్యానించాలి. తరువాత రక్తచందనం, కరవీరాది ఎఱ్ఱనిపూలు, ధూపదీపాలు, అనేక ప్రకారాల నైవేద్యాలు, వస్త్రభూషణాది ఉపచారాలతో పూజ గావించాలి. లేదా తామ్రపత్రంపై రక్తచందనంతో ఆరు దళాల కమలాన్ని చిత్రించి దాని మధ్యలో అన్ని ఉపచారాలతో సూర్యపూజ చేయాలి. ఆరు దళాలలోనూ షడంగపూజను చేసి చంద్రాది ఎనిమిది గ్రహాలను, ఇంద్రాది అష్టదిక్పాలకులనూ పేరుపేరునా అర్చించాలి. వారి ఆయుధాలనూ ఆయా దిశలలోనుంచి మంత్రం చదివి అర్చించాలి. మంత్రమెలా చదవాలంటే ఆ దేవుని పేరుని చతుర్థీవిభక్తిలో పెట్టి దానికి ముందు ఓం కారాన్ని చివర నమః అనే అక్షరాలనీ పెట్టి పలకాలి. ఉదాహరణకి సోముని “ఓం సోమాయ నమః” అంటూ అర్చించాలి. ఇలాగే మిగతా దేవతలను కూడా. ఆ తరువాత వ్యోమ, రవి, పద్మ, మహాశ్వేత, అస్త్ర ముద్రలను చూపించాలి. ఈ అయిదు ముద్రలూ పూజ, జప, ధ్యాన అర్ఘ్య, తపాదుల ఒక్కొక్క దాని తరువాత చూపించాలి.

భక్తిపూర్వకంగా, తన్మయతతో ఇలా ఒక సంవత్సరం పాటు సూర్యభగవానుని పూజించిన ఏ రోగియైనా రోగవిముక్తులౌతారు. అభీష్ట మనోరథాలన్నీ నెరవేరి దేహాంతంలో ముక్తి లభిస్తుంది. ప్రజ్ఞ, మేధస్సు కోరుకుంటే చిరంజీవిత్వం కూడా లభిస్తాయి. ధన, ధాన్య, సంతాన, పశు, మొదలగునవన్నీ తన పూజను చేసేవారికి అభివృద్ధి చెందుతాయనీ, మనుష్యుడు నిష్కాముడై సద్గతికి పోతాడని స్వయంగా సూర్యనారాయణుడే చెప్పాడు.