ధర్మజుని ప్రార్ధన మేరకు సావిత్రి కథను సావిత్రీ వ్రత విధిని చెప్పసాగాడు శ్రీకృష్ణుడు ఇలా:
ప్రాచీన కాలంలో మద్రదేశాన్ని (నేటి పంజాబ్) గొప్ప పరాక్రమవంతుడు, సత్యవాది, క్షమాశీలుడు, జితేంద్రియుడు, ప్రజారంజన తత్పరుడునగు అశ్వపతి మహారాజు పరిపాలిస్తుండేవాడు. ఆయనకు చాలా కాలం సంతానం కలగక పోయేసరికి పత్నీ సమేతుడై ఒక అమోఘ వ్రతం ద్వారా సావిత్రీదేవిని (అంటే సరస్వతీ దేవినే) ఆరాధించాడు. కొంత కాలానికామె రాజుకు దర్శనమిచ్చి తన అంశతోనే ఒక కూతురు జన్మిస్తుందని వరమిచ్చి అంతర్ధానం చెందింది. కొంత కాలం తరువాత రాజుగారికొక దివ్యపుత్రి జనించింది. అతడామెకు సావిత్రి అని పేరు పెట్టుకొని అల్లారుముద్దుగా పెంచాడు. ఆమె పెద్దదై భృగుమహర్షి ఉపదేశం మేరకు సావిత్రీ వ్రతాన్ని చేయసాగింది.
ఆమెకు వివాహయోగ్యమైన వయసు రాగానే రాజుగారు పెండ్లి కొడుకును వెదక సాగారు కాని ఆయనకెవరూ నచ్చలేదు. ఒకనాడాయన ఆమాత్యులతో ఇదే విషయమై చర్చిస్తుండగా అప్పుడు సావిత్రీ వ్రతాన్ని చేసుకొని వచ్చిన సావిత్రి వచ్చి ఆయన వద్ద కూర్చుంది. ఆయన సావిత్రితో ‘అమ్మా! నేనెంత ప్రయత్నించిననూ నీకు తగినవాడు నా మనసుకు కనబడుటలేదు. అందుచేత నీవే మన వృద్ధ బాంధవులతో అమాత్యులతో చర్చించి, నీకు నచ్చిన వానిని వెతుక్కోవడానికి అనుజ్ఞనిస్తున్నాను అన్నాడు. తండ్రి యానతిని శిరసావహించి ఆమెయే స్వయంగా మంత్రులతో, కొందరు వృద్ధబాంధవులతో కలిసి బయలుదేరింది. స్వల్పకాలంలోనే రాజర్షుల ఆశ్రమాలనూ, తీర్థాలనూ, తపోవనాలను తన సుడిగాలి పర్యటనలో చుట్టేసింది. ఆమె తిరిగి వచ్చేసరికి ఆమె తండ్రితో దేవర్షి త్రిలోక సంచారి నారద మహర్షి మాట్లాడుతున్నాడు. సావిత్రి తన తండ్రికీ నారద మహర్షికీ ప్రణామం చేసి తాను శాల్వదేశ మహారాజు ధర్మాతుడునైన ద్యుమత్సేనుని పుత్రుడైన సత్యవంతుని తనకు వరునిగా ఎంచుకొన్నాని చెప్పింది. వెంటనే నారదుడు ముందుకి వంగి, ‘మహారాజా! ఈమె ఏదో చిన్నతనంకొద్దీ తొందరపాటు నిర్ణయం తీసేసుకున్నట్లుంది. సత్యవంతుడు సర్వ సద్గుణ సంపన్నుడు, సావిత్రికి అన్నివిధాలా తగిన వరుడే అనుటలో సందేహంలేదు. కానీ అతడు అత్యంత అల్పాయుష్కుడు. సరిగ్గా నేటికి ఏడాది గడిచేరోజున అతనికి మృత్యువు రాసిపెట్టి వుంది అని చెప్పాడు. వెంటనే మహారాజు సావిత్రవైపు చూసి మరో వరుణ్ణి వెతుక్కుందామన్నాడు. అప్పుడు సావిత్రి యుగయుగాలకీ నిలిచిపోయే ఒక చక్కని సుభాషితాన్ని చెప్పింది ఇలా:
సకృజ్జల్పంతిరాజానః సకృజ్జల్పంతిపండితాః!
సకృత్ ప్రదీయతే కన్యా త్రీణ్యేతాని సకృత్సకృత్॥ (ఉత్తరపర్వం - 102/29)
‘రాజుల ఆజ్ఞ ఒకేమారు వెలువడుతుంది. పండితులు ఒక నిష్కర్షపై ఒకేమారు మాట్లాడతారు. కన్య ఒకేమారు వరిస్తుంది. ఈ మూడూ పలుమార్లు చేయబడేవి కావు. సత్యవంతుడు ఆయుష్మంతుడైనా అల్పాయుష్కుడైనా, గుణవంతుడైనా కాకపోయినా, నేను వరించాను. ఇక అంతే. మరొకరిని నా పతి స్థానంలో ఊహించుకోలేను.
ఈ మాట వినగానే నారద మహర్షి ఏదో అర్థమైన వాడిలా తలపంకించి ప్రసన్న వదనుడై మహారాజా! కన్య అభీష్టాన్ని వెంటనే నెరవేర్చాలి. శుభస్య శీఘ్రం. మీరు చేయ బోయే సావిత్రీ కన్యాదానం నిర్విఘ్నమై సంపన్నమై వెలుగొందాలి గాక’ అని దీవించి స్వర్గంవైపు వెళ్ళిపోయాడు.
రాజు ఒక శుభముహూర్తంలో సావిత్రీ సత్యవంతుల వివాహాన్ని చక్కగా జరిపించాడు. తన పుత్రిక సరస్వతీ వరపుత్రిక కాబట్టి ఆయన పెద్దగా ఆందోళన చెంది వుండడు. కాని సావిత్రికి మాత్రం నారదుని మాటలు మనసులో మెదులుతూనే వున్నాయి. ఆమె భర్తతోబాటు తపోవనంలోనే ఉండిపోయింది. ఏడాది కావస్తుండగా నామె భాద్రపద శుద్ధ ద్వాదశి నుండి త్రైరాత్రిక అనగా మూడురాత్రుల వ్రతాన్నొక దాన్ని సంకల్పించింది(ఈ వ్రతాన్ని జ్యేష్ఠ బహుళ లేదా శుద్ధ ద్వాదశినాడు ప్రారంభించే సంప్రదాయం విరివిగా కనిపిస్తోంది.). సావిత్రీ దేవిని జప, ధ్యాన, పూజనాదుల ద్వారా ఆరాధించింది. మూడు పగళ్ళూ మూడు రాత్రులూ నియమాలతో గడిపింది. నాలుగోరోజు దేవతలనూ పితరులనూ సంతృప్తిపఱచి, అత్తమామల పాదాలపై వ్రాలి ఆశీస్సులు తీసుకుంది. భర్తకి రాబోయే మృత్యువు నెదుర్కోవడానికి సర్వసన్నద్ధురాలైంది.
తపోవనంలో సత్యవంతునికి కట్టెలు కొట్టి తెచ్చే బాధ్యత ఒప్ప చెప్పబడి వుంది. ఆ రోజు సత్యవంతుడా పనిమీద బయల్దేరుతున్నపుడు సావిత్రి వెంట పడింది. అతడు ఆమెను అత్తమామల అనుజ్ఞ తీసుకొమ్మన్నాడు. వారు తొలుత కాస్త తటపటాయించినా సావిత్రి వ్యర్థంగా ఏ పనీ చేయదన్న నమ్మకంతో ఒప్పుకున్నారు.
వనంలో సత్యవంతుడు కట్టెలు కొట్టే పనిని ముగించి మోపును నెత్తికెత్తుకున్నాడు గానీ భరింపరాని తలనొప్పి రావడంతో మూపు నుండి మోపును జారవిడచి, సావ్రితితో ‘ప్రియా! తలనొప్పిగా వుంది. కాసేపు విశ్రమిస్తాను’ అంటూ ఆమె ఒడిలో తల పెట్టుకొని కన్నుమూశాడు. ఆమె అలాగే కూర్చొని వుంది. ఎవరి ద్వారా సావిత్రి మహిమను విన్నాడో యేమోగాని సత్యవంతుని ప్రాణాలను పట్టుకుపోడానికి తానే స్వయంగా వచ్చాడు యమ ధర్మరాజు. సావిత్రీదేవి దయవల్ల ఆయన సావిత్రికి కనబడిపోయాడు.
‘ప్రభో మహాపురుషా! జాజ్వల్యమానమైన తేజస్సుతో నావంటి సామాన్యురాలి కన్నులను వెలిగిస్తున్న తమరెవరు? త్రిమూర్తులలో ఒకరా, లేక దేవేంద్రాది దిక్పతులలో నొకరా?’ అని మిక్కిలి వినయంతో అడిగింది.
తాను ఆమెకు కనబడ్డాడనే విషయం తెలియగానే ఈమె సామాన్యురాలు కాదని కూడా తెలిసింది యమరాజుకి అయినా ఆయన తన సహజ ధోరణిలో ఇలా చెప్పాడు.
‘సావిత్రీ! నేను సంపూర్ణలోకాలన్నిటిలో జీవన్మరణ నియమ నిష్ఠలను పాటింపజేసే యమధర్మరాజును నీ పతికి ఈ లోకంలో ఆయువు సమాప్తమై పోయింది. అతని ప్రాణాలు నా దూతలకు, నీవు పరమ పతివ్రతవు కావడం వల్ల లొంగలేదు. అందుచేత నేనే స్వయంగా వచ్చాను’ అంటూ సత్యవంతుని శరీరము నుండి అంగుష్ఠ మాత్ర ప్రాణాన్ని లాగి తీసుకొని తన లోకానికి పోసాగాడు యమధర్మరాజు. సావిత్రి కూడా అతని వెనుకనే పోసాగింది. మానవులెవరూ అంతవఱకు వెళ్ళలేని దారిలో పోలేని విధంగా ఆమె పోగలిగింది. యమధర్మరాజు ఏదశలో వెనుకకు తిరిగి చూసినా ఆమె కనిపిస్తూనే వుంది. కించిత్తు ఆశ్చర్యం, ప్రేమ కలగలిపిన గొంతులోకి కాఠిన్యాన్ని కూడా ప్రవేశపెట్టి ఇలా అన్నాడాయన:
‘ఓ పతివ్రతా! నా వెంట రాగలగడం అసాధ్యం. నాదారి మిక్కిలి క్లేశాలతో గ్లాని భూయిష్టమై వుంటుంది. నీవిక వెనుకకు మరలిపో.’
‘హే మహాపురుషావతంసా! నా పతి వెంట వస్తున్నంత కాలమూ నాకు క్లేశముగాని గ్లాని గాని తెలియవు. శ్రమ ఇంచుకేనియు లేదు. నేను సుఖంగానే వున్నాను, వస్తున్నాను. ఎలాగైతే సజ్జనులకు సంతులు గతియో, వర్ణాశ్రమాలకు ఆధారం వేదమో, శిష్యులకు రక్షణ గురువో, మానవుల కాశ్రయం పృథ్వియో, అలాగే స్త్రీకి ఏకమాత్ర గతి, ఆధారం, రక్షణ, ఆశ్రయం ఆమె పతిదేవుడే అగుచున్నాడు.
సతాంసంతో గతిర్నాన్యా స్త్రీణాంభర్తా సదాగతిః ।
వేదోవర్ణాశ్రమాణాంచ శిష్యాణాంచగతిర్గురుః ॥
సర్వేషామేవ జంతూనాం స్థానమస్తి మహీతలం ।
భర్తార ఏవ మనుజస్త్రీణాం నాన్యః సమాశ్రయః !॥ (ఉత్తరపర్వం 102/55,56)
సావిత్రి యొక్క ధర్మ, అర్థయుక్తములైన ఈ వచనాలను విని కడుంగడు ప్రసన్నుడైన యమధర్మరాజు, ‘అమ్మా! నేను నీ సద్గుణ సంపదనూ ధర్మశక్తినీ గని మిక్కిలి సంతుష్టుడనై నాను నీకెన్ని వరాలు కావాలో కోరుకో. అన్నీ ప్రసాదిస్తాను’ అన్నాడు. (నీ పతి ప్రాణంబు దక్క- అనే వాక్యం తెలుగుదేశంలో ప్రాచుర్యం చెందియున్నది కాని, దానికి పౌరాణిక ప్రామాణికత లేదు)
అప్పుడు సతీసావిత్రి వినయపూర్వకంగా అయిదు వరాలను కోరుకుంది. అవి:
1) తన మామగారికి నేత్రప్రాప్తియు రాజ్యలాభము కలగాలని,
2) తన తండ్రికి నూర్గురు పుత్రులు కలగాలని,
3) తన పతికి దీర్ఘాయువు కలగాలని,
4) తనకూ నూరుగురు కొడుకులు పుట్టాలని,
5) తమ జీవితాంతము ధర్మనిష్ఠులై మెలిగే అవకాశం, భాగ్యం వుండాలని.
యమధర్మరాజు ఆమె కోరిన వరాలన్నీ ప్రసాదించి మరల వనంలోకి వచ్చి సత్యవంతుని మేల్కొలిపి దంపతులిద్దరినీ ఆశీర్వదించి సంతోషంగా తన లోకానికి మరలిపోయాడు. సావిత్రి ఆనందంగా తన పతితో కలసి ఆశ్రమానికి వచ్చి ఆశ్చర్యానందాలలో తలమునక లగుచున్న అత్తమామలకు నమస్కరించి మొత్తం విషయమంతా చెప్పింది. ఇదంతా సావిత్రీ వ్రత ప్రభావమేనని వినయంగా వక్కాణించింది.
మహారాజా! ఇక ఈ వ్రత విధానాన్ని ఆలకించు. సౌభాగ్యాన్ని కోరుకొనే స్త్రీ భాద్రపద శుద్ధ త్రయోదశినాడు పవిత్రయై మూడురోజుల సావిత్రీ వ్రత నియమ గ్రహణం చేయాలి. మూడురోజులూ ఉపవాసముండే శక్తి లేకపోతే త్రయోదశి నాట నక్తవ్రతం, చతుర్దశినాడు అయాచితవ్రతం. పున్నంనాడు ఉపవాసం చేసుకోవచ్చు. నదిలోగాని తటాకంలోగాని నిత్యస్నానాలు చేస్తూ పున్నమనాడు ఆవాలతో అభ్యంగన స్నానం చేయాలి.
శక్తి కొలదీ బంగారం, వెండి లేదా మట్టితో బ్రహ్మ సహిత సావిత్రీ దేవి ప్రతిమను చేయించి దానిని వెదురుపాత్రలో స్థాపించి రెండు రక్తవర్ణ వస్త్రాలతో ఆచ్ఛాదితం చేయాలి. తరువాత గంధ పుష్ప ధూప దీప నైవేద్యాలతో పూజ చేయాలి. గుమ్మడి, కొబ్బరి, దోస, బీర, ఖర్జూర, వెలగ, అనారు, నేరేడు, పనస, అఖరోట పండ్లు, బెల్లం, నారంగీ, జంబీర ఫలములు, లవణం, జీలకఱ్ఱ, అంకురిత అన్నము, సప్తధాన్యాలు, కంఠ సూత్రం (సావిత్రీ సూత్రం) - వీటన్నిటినీ వెదురు పాత్రలో వుంచి సావిత్రీ దేవికి సమర్పించాలి. రాత్రి జాగరం చేసి గీత, వాద్య, నృత్యాదులతో ఉత్సవం చేయించాలి. బ్రాహ్మణుని చేత సతీ సావిత్ర కథను జనరంజకంగా చెప్పించాలి. ఈ ప్రకారం రాత్రిని ఉత్సవంలో గడిపి తెల్లారగానే పూజా సామగ్రిని వెదురు పాత్రతో సహా శ్రేష్ఠుడూ విద్వాంసుడూ నైన భూసురునకు దానం చేయాలి. యథాశక్తి బ్రాహ్మణులకు భోజనాలు పెట్టి, తాను హవిష్యాన్నమును తినాలి.
రాజా! ఈ పద్ధతిలోనే జ్యేష్ఠ అమావాస్యనాడు వటవృక్షం క్రింద కట్టెలమోపుతో సత్యవంతునితో సహా సతీ సావిత్రీ ప్రతిమను స్థాపించి దానికి విధ్యుక్తంగా పూజ చేయాలి. రాత్రి జాగరణాదులను చేసి తెల్లవారాక ఆ ప్రతిమను బ్రాహ్మణునికి దానమివ్వాలి. ఈ విధముగా సావిత్రీ వ్రతాన్ని గావించే స్త్రీలు పుత్ర, పౌత్ర, ధనాది వృద్ధి ప్రాప్తించగా అన్ని సుఖభోగాలనూ అనుభవించి దేహాంతంలో పతితో సహా బ్రహ్మలోకాన్ని చేరుకుంటారు. ఈ వ్రతం స్త్రీలకు పుణ్యవర్ధకం, పాపహారకం, దుఃఖప్రణాశకం, ధనప్రదాయకం. ఈ వ్రతిని తన పతికులాన్నీ తన కులాన్నీ కూడా ఉద్ధరిస్తుంది. (కులమంటే నేటి కులం కాదు. వంశం) ఈ వ్రత మాహాత్మ్యాన్ని చదివిన వారికీ విన్నవారికీ కూడా మనోవాంఛిత ఫలాలు ప్రాప్తిస్తాయి.”