166 - హలపంక్తి దానవిధి (పదినాగళ్ళ దానం)

మహారాజా! వ్యవసాయదారుడే వెన్నెముకయైన దేశంలో నాగలి దైవసమానమే. అందుచేతనే ఈ హలపంక్తి దానం గావించినవారికి అన్ని దానాలూ చేసిన పుణ్యం దక్కుతుంది.

ఒక్క నాగలికి నాలుగెద్దుల ఆవశ్యకత వుంటుంది. పదినాగళ్ళను ఒక హలపంక్తి అంటారు. టేకుకర్రతో పదినాగళ్ళను చేయించి వాటిని సువర్ణ పట్టంతో రత్నములతో చుట్టి అలంకరించాలి. తరుణ, సుందర, బలిష్ట, ఉత్తమములైన ఎద్దులను వస్త్ర, స్వర్ణ, పుష్ప, చందనాలతో అనువైన చోట్ల అలంకరించి వాటి మెడలపై కాడిని కూడా అమర్చి నాగళ్ళకు కట్టాలి. కొరడాలనూ, అంకుశాలను కూడా పక్కనే వుంచుకోవాలి. పర్వకాలంలో ఈ హలపంక్తితోబాటు పదిగ్రామాల నుండీ వంద (నివర్తన = బీఘా = ఒక ఎకరం) నివర్తనాలదాకా (భూమిని) దానం చెయ్యాలి.

వేదవేత్తలూ సదాచారులూ నగు పదిమంది బ్రాహ్మణులను ఆహ్వానించి వారిని సర్వాలంకారాలతో సత్కరించి వుంచాలి. పది హస్తాల ప్రమాణంలో నొక మండపాన్ని నిర్మించి దానికి తూర్పులో ఏకహస్త ప్రమాణాలతో రెండు కుండాలను కట్టించాలి. ఈ బ్రాహ్మణులను ఆ కుండాలలో పలాశ సమిధలతో, నెయ్యి, నల్ల నువ్వులు, పాయసాలతో వ్యాహృతులను వేయిస్తూ పర్జన్యసూక్తాన్నీ, ఆదిత్యసూక్తాన్నీ, రుద్రమంత్రాలనూ పఠిస్తూ హవనం చేయవలసినదిగా ప్రార్థించాలి. అప్పుడు యజమాని స్నానం చేసి శ్వేత వస్త్రాదులచే అలంకృతుడై పదినాగళ్ళనూ సప్తధాన్యాలపై స్థాపించి ఎద్దులను పూన్చాలి. ఆ సమయంలో బ్రాహ్మణులు వేదఘోషను వెలయించగా వాద్య ధ్వనులు మిన్నుముట్టాలి. ఆ తరువాత యజమాని చేతులు జోడించి వాటిలో పూలను పట్టుకొని ఈ మంత్రాలను చదవాలి:

యస్మాద్ దేవగణాః సర్వే హలే తిష్ఠంతి సర్వదా!

వృషస్కంధే సంనిహితాస్మస్మాద్భక్తిః శివేఽస్తుమే

యస్మాచ్చ భూమిదానస్య కలాం నార్హంతిషోడశీం।

దానాన్యన్యాని మేభక్తిర్ధర్మేచాస్తు దృఢా సదా॥ (ఉత్తరపర్వం 166/16,17)

తరువాత ఆ భూమినీ హలాలనూ బ్రాహ్మణులకు దానం చేయాలి. (ఆరోజులలో చాలామంది బ్రాహ్మణులకు పొలాలుండేవి. పోతనలాటివారు నాగలి కూడా పట్టేవారు. (ఈ పోతన భాగవతాన్ని రచించిన బమ్మెర పోతన కాదు. దగ్గుపల్లి పోతన.)  చరిత్ర ప్రసిద్ధిగాంచిన చక్రవర్తులు దిలీపుడు, శిబి, నిమి, యయాతి, భరతుడు ఈ దానాన్ని చేశారు. మరి కొందరు రాజర్షులు కూడా చేశారు. వారంతా ఈనాటికీ స్వర్గంలోనే అమరేంద్రునికి సమరాల్లో సాయంచేస్తూ పూజలందుకొంటున్నారు. పదినాగళ్ళ నివ్వలేని వారు అయిదు, నాలుగు లేదా ఒకటైన ఇవ్వవచ్చు. స్త్రీలు కూడా ఈ దానాన్నివ్వ వచ్చును. ఈ దానమును చేయువారు ఆ నాగలివల్ల ఎన్ని ధూళి కణాలు ఎగురుతాయో, ఆ ఎద్దులకు ఎన్ని రోమాలున్నాయో అన్ని వేలయేళ్ళు శివలోకంలో నివసించి మరల పుడమిపై పుట్టినపుడు శ్రేష్ఠులైన రాజులవుతారు.”