భవిష్య పురాణము

4 - వేదాధ్యయన - విధి, ఓంకార, గాయత్రి - మాహాత్మ్యం, ఆచార్యాది - లక్షణాలు, బ్రహ్మచారి ధర్మము - నిరూపణము, అభివాదన - విధి, అంగిరాపుత్రుని ఆఖ్యానము, తల్లి - తండ్రి - గురువుల మహిమ.

ఓ రాజా! బ్రాహ్మణునికి పదహారవయేట, క్షత్రియునికి ఇరవైరెండవయేట, వైశ్యునికి ఇరువది యైదవయేట కేశఖండన సంస్కారం చెయ్యాలి. దీనినే కేశాంత సంస్కారమనీ, సమావర్తన సంస్కారమని కూడా అంటారు. స్త్రీలకు కూడా చేస్తారు కానీ అది మంత్రములు లేకుండా వుంటుంది. దీని తరువాత గురుగృహానికి పోయి మరింత విద్యని కొందరభ్యసిస్తే, కొందరు ఇంటికి విచ్చేసి అగ్నిహోత్ర గ్రహణం, దానికి ముందు వివాహం విధివిధానంగా ఆచరిస్తారు. స్త్రీలకు మాత్రం ఈ దశలో వివాహమే చెయ్యాలి.

గురువు బ్రహ్మచారులకు శౌచ, ఆచార, సంధ్యోపాసన, అగ్నికార్యాలను నేర్పించి వేదాధ్యయనం చేయించాలి. శిష్యుడు ఆచమనం చేసి ఉత్తరదిక్కువైపు కూర్చుని (చదువుకున్నంతసేపూ తన రెండు అరచేతులనూ కట్టివేసినట్లుగా జోడించి అలాగే వుంచడం బ్రహ్మాంజలి.) బ్రహ్మాంజలి బద్ధుడై ఏకాగ్రచిత్తంతో ప్రసన్నమనస్కుడై వేదాధ్యయానికి ఉపక్రమించాలి. దానికి ముందే గురుదేవుని కుడిపాదాన్ని తన ఎడమ చేతితోనూ, ఆయన ఎడమపాదాన్ని తన కుడిచేతితోనూ స్పృశించి నమస్కారం చెయ్యాలి. వేదపఠన ప్రారంభంలోనూ, అంతంలోనూ ఓంకారాన్ని స్వరయుక్తంగా ఉచ్చరించకపోతే ఆ చదువు నిష్ఫలమవుతుంది. అంతకుముందు రోజు చదివింది గుర్తురాదు, మరునాటిదీ అబ్బదు.

తూర్పువైపు తిరిగి కుశాసనంపై కూర్చుని (మూడుమార్లు చేసే ప్రాణాయామం పవిత్రి.) పవిత్రీధారణం చేసి ఓం కారాన్ని ఉచ్చరించాలి. మూడు వేదాలనుండి అ,ఉ,మ అనే స్వరాలను తీసి ప్రజాపతి ఓం కారాన్ని సృష్టించాడు. భూ,ర్భువః, స్వః - అనే మూడు వ్యావృతులూ(చుట్టబడినవి), గాయత్రి యెక్క మూడుపాదాలు కూడ మూడువేదాల నుండే స్వీకరించబడ్డాయి. అందుచేత ఏ బ్రాహ్మణుడు రెండు సంధ్యలలోనూ శాస్త్రోక్తంగా గాయత్రిజపం చేస్తాడో వానికి వేదపాఠన పుణ్యం లభిస్తుంది.

బ్రహ్మ, క్షత్రియ, వైశ్య వర్ణంవారు తమ వర్ణాచారములను పాటించకపోతే సమాజంలో నిందకు లోనౌతారు. ప్రజలు వారిని గౌరవించరు. పరలోకంలో కూడా వారికి సుగతి వుండదు. కాబట్టి కర్మత్యాగము చేయరాదు. ప్రణవ, త్రివ్యాహృత త్రిపాదగాయత్రి మొత్తం కలిపి గాయత్రి మంత్రమనబడుతుంది. ఇది బ్రహ్మముఖమే!

ఈ మంత్రో పాసనను శ్రద్ధాభక్తులతో నిత్యం, నియమంగా మూడేళ్ళపాటు చేసేవాడు వాయువువలె వేగ సంపన్నుడై ఆకాశ స్వరూపాన్ని ధరించే శక్తి గలిగి, బ్రహ్మతత్త్వాన్ని సాధించగలడు.

ఏకాక్షర, ‘ఓం’ పరమబ్రహ్మము. ప్రాణాయామం పరమతపము. (సావిత్రి అంటే గాయత్రియే సవిత అంటే సూర్యునినుండి వచ్చింది కాబట్టి దానిని సావిత్రి అనీ అంటారు.) సావిత్రిని మించిన మంత్రమేలేదు. ఒక నిజం చెబుతాను విను. మౌనంకన్న సత్యం చెప్పడం మేలు. తపస్సు, అగ్ని, దానము, యజ్ఞము - వీటి స్వరూపాలు నశించవచ్చు. కాని ప్రణవస్వరూప ఏకాక్షర బ్రహ్మమైన ఓంకారానికి నాశనములేదు.

దర్శ, పౌర్ణమాసాది విధియజ్ఞాల కంటే ప్రణవాది జపయజ్ఞాలు శ్రేష్టమైనవి. వీటికన్న ఉపాంశుజపాలు(పెదవులు, నాలుక కదులుతాయి, కాని శబ్దం రాకుండా చేసే జపం.)  వాటికి వెయ్యిరెట్లు మానసజపాలు గొప్పవి. (పితృకర్మ, హవనం, బలివైశ్వదేవాదులు.) పాకయజ్ఞాలు విధి యజ్ఞాలు ఒకటే. ఈ యజ్ఞాలన్నీ చేసినా మానినా బ్రాహ్మణునికి గాయతి జపమనే మహాయజ్ఞం ద్వారా అన్ని సిద్ధులూ లభిస్తాయి. కాబట్టి బ్రాహ్మణుడు గాయత్రి జపం చెయ్యాలి.

సూర్యోదయానికి బాగా ముందు ఇంకా తారలు వెలుగుతుండగానే ప్రాతః సంధ్యా వందనాన్ని ఆరంభం చెయ్యాలి. సూర్యోదయం దాకా గాయత్రి మంత్రాన్ని జపించాలి. అలాగే సాయంసంధ్యను కూడా సూర్యాస్తమయానికి ముందే మొదలుపెట్టి తారలుదయించే దాకా గాయత్రి జపంచేస్తూనే వుండాలి.

ప్రాతఃసంధ్యలో నిలబడిచేసే జపానికి రాత్రిచేసిన పాపాలన్నీ పోతాయి. అలాగే సాయంసంధ్యలో కూర్చుని చేసే గాయత్రి జపఫలం - ఉదయంనుండి చేసే పాపాలన్నీ దగ్ధమైపోవడం. అందుచేత ఇరుసందెలలోనూ వందనం చెయ్యాలి. అలా చెయ్యనివారిని ద్విజజాతి కర్మలనుండి బహిష్కరించాలి. ఇంటికి వెలుపల, ఏకాంతస్థానంలో, అరణ్యంలో, లేదా నదీ, సాగర, సరోవరాల్లో గాయత్రిజపం చెయ్యడం వల్ల ఎక్కువ లాభముంటుంది. మంత్రజపం, సందెమంత్రాలు, బ్రహ్మయజ్ఞాది నిత్యకర్మల విషయంలో ‘అనధ్యాయ ప్రసక్తి’ వుండదు. అంటే - దీని అర్థమేమిటో, ఉచ్చారణ ఎలా చెయ్యాలో అనే ఆలోచనలు చెయ్య నక్కరలేదు.

వడుగైన నాటినుండి సమావర్తన సంస్కారం అయ్యేదాకా శిష్యుడు గురువు గారింట్లోనే వుండడం మంచి సంప్రదాయం. కటికనేలపై శయనించాలి. గురువుకి అన్నిరకాలైన సేవలూచేస్తూనే వేదాధ్యయనం చేయ్యాలి. అన్నీ తెలిసినా జడుని వలెనే జీవించాలి.

గురుకులంలో కూడా ప్రతివాడూ పాఠం చెప్పెయ్యకూడదు. పాఠం చెప్పడానికి పదిరకాల యోగ్యతల్లో కనీసం ఒకటైనా వుండాలి. ఆ యోగ్యతలేమిటంటే 1) గురు పుత్రుడు, 2) గురుసేవకుడు, 3) జ్ఞానదాత, 4) ధార్మికుడు, 5) పవిత్రుడు, 6) విశ్వాసి, 7) శక్తిమంతుడు, 8) ఉదారుడు, 9) సాధుస్వభావికుడు, 10) స్వజాతీయుడు అనే వారిలో నుండుట. గురుకుల విద్యార్థి ఎవరైనా ఏదైనా అడిగినపుడు జవాబు చెప్పడానికి మాత్రమే మాట్లాడాలి. న్యాయముతప్పి అడిగిన ప్రశ్నకు సమాధానమివ్వకూడదు. అనుచిత ప్రశ్నలకూ మాట్లాడరాదు. అడుగుటలోగాని చెప్పుటలోగాని ఇక్కడ అనౌచిత్యానికి పాల్పడిన వాడు నరకానికిపోతాడు. లోకంలో అందరికీ అప్రియుడౌతాడు.

గురువులు కూడా, ఎవరికి విద్యచెప్పడం వల్ల ధర్మార్థాలు ప్రాప్తించవో లేదా నష్ట మౌతాయో ఎవరికి సేవా శుశ్రూషలు చెయ్యడం ఇష్టముండదో, వారికి చదువు చెప్పకూడదు. ఎందుకంటే అలాటివానికిచ్చిన విద్య ఊషరక్షేత్రంలలో నాటబడిన విత్తనంవలె వ్యర్థమే కాగలదు.

విద్యల అధిష్ఠాతృదేవత బ్రాహ్మణవర్ణుడితో ఇలాచెప్పిందట - “ఓ అధ్యాపకా! నేను నీకు నిధిని. నన్ను జాగ్రత్తగా రక్షించుకో. అధ్యాపకులలో దోషవృద్ధి, ద్వేషబుద్ధి చూపేవారికి నన్నివ్వకు. అపుడే నా బలం పెరుగుతుంది. జితేంద్రియుడై పవిత్రుడై ప్రమాదరహితుడై ప్రకాశించు బ్రహ్మచారికి నన్ను ప్రసాదించు”.

గురువుగారి ఆజ్ఞలేకుండా వేదశాస్త్రాది విద్యలను స్వయంగా సంపాదించేవాడు అతిభయంకరమైన రౌరవ నరకంలో పడిపోతాడు. గురువు చెప్పడం ముఖ్యం. అందుకే లౌకిక, వైదిక లేదా ఆధ్యాత్మిక విద్యల జ్ఞానాన్నిచ్చిన వానికే ముందుగా ప్రణామం చెయ్యాలి. గురుకుల మర్యాద వుండి, పాటించి, ధన్యుడైన వాడికి గాయత్రి మాత్రమే తెలిసినా, అతడే ఉత్తముడు. అన్ని విద్యలూ నేర్చేసుకొని, మర్యాదను పాటించనివాడు అధముడు. అలాగే ఆహారనియమాలు పాటించని విద్యావంతుడైనా అధముడే. గురుకులానికి వస్తువులను దానంగానే ఇవ్వాలి. అవసరం చూసుకొని అమ్మేవాడు అధముడు.

గురువుగారి సమక్షంలో ఆసనం పైనగాని, శయ్యపైగాని వుండరాదు. అంతకు ముందు ఆసీనుడైవుంటే, గురువుగారు లోనికి రాగానే వేగంగా లేచి నిలబడి నమస్కరించాలి. వృద్ధజనుల విషయంలో మరింత జాగ్రత్త వహించాలి. వారు లోనికి ప్రవేశించగానే బ్రహ్మచారుల ప్రాణవాయువు తరిగిపోతుంది. సంభ్రమంగా లేచి నిలబడి వారికి నమస్కరిస్తే ప్రాణవాయువు తిరిగివచ్చి బలపడుతుంది. ప్రతిదినము వృద్ధులను ఇష్టంగా సేవించేవారికి ఆయువు, యశము, విద్య, బలము నిరంతరమూ పెరుగుతూనే వుంటాయి.

అభివాదనశీలస్య నిత్యంవృద్ధోపసేవినః

చత్వారి సమ్యగ్వర్థంతే ఆయుప్రజ్ఞా యశోబలమ్ బ్రాహ్మ 4/50

ఈ శ్లోకం పరమప్రసిద్ధం. దానిభావమే పైన ఈయబడింది. వినయ గౌరవాలు బ్రహ్మచారి ప్రవర్తనకు కేంద్రబిందువు. బంధువుకాని స్త్రీని భవతి అని సంబోధించి నమస్కరించాలి. చిన్నవారిని సుభగే, భగిని అని సంబోధించాలి. బాబాయి, అత్తమామాలు మేనత్త, మేనమామ, గురుపత్ని - వీరందరినీ ఎక్కడ కనిపించినా పూజించాలి. ముఖ్యంగా పెద్దన్నగారి భార్య అమ్మతో సమానం. ఆమెను సక్రమంగా విధ్యుక్తంగా పూజించువానికి విష్ణులోక ప్రాప్తి కలుగుతుంది. పెద్దవదిన తరువాత అంత గౌరవ్యులు(గౌరవనీయులు అనేమాట వ్యాకరణం ప్రకారం దోషము) మేనత్త, పిన్నమ, అక్క బ్రహ్మచారి పెద్దవాడైనా కూడా ఇదే మర్యాదని పాటించాలి. అతడు గృహస్థయినాక తన పుత్రులతో సమానంగా మిత్రులనీ, సోదరి పిల్లల్నీ ప్రేమించి, గౌరవించాలి. వారిని తనతో సమానంగా కూడా చూడాలి.

విత్తం బంధుర్వయః కర్మవిద్యాభవతి పంచమీ

ఏతాని మాన్యస్థానాని గరీయోయద్యదుత్తరం   బ్రాహ్మపర్వం 4/70

(ఒక మనిషి మహత్తుకి పంచ కారణాలుంటాయి. అవి ధనసంపద, బంధువులు, వంశం, కర్మ, విద్య. ఈ ఐదూ ఒకదానికన్నా ఆ తరువాత చెప్పబడినది గొప్పదిగా వర్ధిల్లుతాయి. అన్నీ ఉండాలి. విద్య అన్నిటికన్న నెక్కువగా మనిషిని మనీషిని చేస్తుంది.)

బ్రహ్మచారి ఎంత ముఖ్యమైన పని మీదపోతున్నా, రథము మొదలగు వాటిపై నున్నవారికి, అతివృద్ధులకు, రోగులకు, బరువు మోస్తున్నవారికి, స్త్రీలకు, స్నాతకులకు, రాజుకు, పెళ్ళికొడుకులకు - వారు ఎదురుగా వస్తుంటే తాను ఆగిపోయి వారికి దారివ్వాలి. రాజు (స్నాతకుడనగా సమావర్తన సంస్కారం పూర్తిచేసుకున్నవాడు. ఇతడు రాజు కన్నా ముఖ్యుడు.) స్నాతకుడు ముఖ్యంగా ఆగకూడదు.

ఏ బ్రాహ్మణవర్ణుడు తన శిష్యులకు ఉపనయనము చేసి, రహస్యాలు(యజ్ఞం, విద్య, ఉపనిషత్తులే ఉపనయనాంత త్రిరహస్యాలు.) బోధించి, కల్పసహితంగా వేదాధ్యయనం చేయిస్తాడో అతడే ఆచార్యుడనబడతాడు. ఏదో శిష్యుని బతుకు తెరువు నిమిత్తం వేదంలోని ఒకభాగం, అంటే వేదాంగం చదివిస్తాడో, అతడు ఉపాధ్యాయుడనబడతాడు. అన్ని సంస్కారాలను విధిగా పద్ధతిలో చేయించి, అన్నాదులచే షోషించే వానిని గురువు అంటారు. అగ్నిష్టోమ, అగ్నిహోత్ర, పాకయజ్ఞాది కర్మలను స్వయంగా శిష్యుని చేత చేయిస్తూ నేర్పేవానిని ‘ఋత్విక్’ అంటారు. మనిషి చెవులను ఆత్మను వేదధ్వనులతో నింపేవారు తల్లిదండ్రులతో సమానంగా ప్రేమింపబడాలి. వారిపై ఎట్టి పరిస్థితులలోనూ ద్వేషము కూడదు. గౌరవనిష్పత్తి ఇలా వుంటుంది.

ఉపాధ్యాయాందశాచార్య ఆచార్యాణాం శతం పితా

సహస్రేణ పితుర్మాతా గౌరవేణాతి రిచ్యతే   (బ్రహ్మ 24/71)

ఉపాధ్యాయునికి పదిరెట్లు ఆచార్యుడు, ఆయనకి వందరెట్లు తండ్రి, ఆయనకి వెయ్యిరెట్లు తల్లి గౌరవాన్ని పొందడానికి అర్హులు. వారినలాగే పూజించాలి.

జన్మనిచ్చినవాడు, వేదములను చదివించినవాడు - ఇద్దరూ తండ్రులే. వీరిలో వేదాధ్యయనం చేయించిన వారే శ్రేష్ఠులు. ఎందుకంటే బ్రాహ్మణవర్ణుడు ఆ పదానికి వేదం చదివితేనే తగినవాడవుతాడు. కాబట్టి “అందరు గురువులూ పూజార్హులే అయినా మహాగురువే అధికుడు”.

“మునీంద్రా! మహాగురువని ఎవరిని సంభావిస్తారు? అతని అర్హతలను వినగోరుచున్నాను”

“మహారాజా! అష్టాదశ పురాణాలనూ, రామాయణమునూ, విష్ణుధర్మాన్నీ, శివధర్మాన్నీ, మహాభారతాన్నీ, శ్రుతులనూ, స్మృతులనూ తెలుసుకొనిన వానిని మహాగురు వంటారు. మహాభారతంతో సహా మన గ్రంథాలన్నిటికీ ‘జయము’ అనేపేరు కూడా వుంది. కాబట్టి అవే ప్రాణంగా జీవించే మహాగురువుని ‘జయోపజీవి’ అనికూడ అంటారు. ఆయనను అన్ని వర్ణాలవారూ పూజించాలి.

వయసు ముఖ్యంకాదు. జ్ఞానమే సర్వ గౌరవాలకూ మూలం. బాగా చదివిన బాలకుడు వృద్ధులనుండి కూడా పితృగౌరవాన్ని పొందడానికి అర్హుడు. ఈ విషయమై ఒక ప్రాచీన కథ వుంది. విను.

అంగిరమహర్షి పుత్రుడు బృహస్పతి, బాలకుడైయుండి కూడా పెద్ద పెద్దవారికి చదువు చెప్తుండేవాడు. ఆ సమయంలో మాత్రం ‘హేపుత్రులారా! జాగ్రత్తగా చదవండి’ అంటుండేవాడు. పితృగణానికి చెందిన వృద్ధులు ఈ బాలకుడు తమని పుత్రులారా అంటుంటే బాధపడి దేవతల వద్దకుపోయి తమ క్షోభను చెప్పుకున్నారు. దేవతల దివిని ‘ఓ పితృగణ విద్యాధికులారా! ఇందులో బాధపడవలసినదేమీ లేదు. ఆ బాలకుడు న్యాయంగానే అన్నాడు. ఎందుకంటే నేర్చుకొనేవాడు వయసులో పెద్దవాడైనా బాలకుడి క్రిందే లెక్క వేద మంత్రాది విద్యలను నేర్పేవాడు ఉపదేశకుడు. ఉపదేశకుడు బాలకుడైనా పితృసమానుడే’ అన్నారు.

వయసు వచ్చినంత మాత్రాన, కేశములు తెల్లబడినంతమాత్రాన, బాగా ధనాన్ని పోగేసినంత మాత్రాన, బంధు బాంధవులను సమకూర్చుకున్నంత మాత్రాన ఎవడూ పెద్దవాడైపోడు. ఋషులు పెట్టిన నియమమేమనగా విద్యాధికుడే పెద్దవాడు, వృద్ధుడని. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు క్రమముగా జ్ఞాన, బల, ధన, జన్మాల వశాన మహాత్ములౌతారు. కర్రతో చేయబడిన ఏనుగు, తోలుతో నిర్మించిన లేడిలాగే వేద విహీనుడైన బ్రాహ్మణుడు కూడా ఎందుకూ కొఱగాడు. మూర్ఖునకిచ్చిన దానంలాగా నిష్ఫలుడవుతాడు. ఋక్కులు అనగా వేదమంత్రాలు రాని బ్రాహ్మణుడు నామమాత్రుడే అవుతాడు గాని సంపూర్ణ బ్రాహ్మణుడు కాలేడు. వేదాలను బట్టీ పట్టి అలాగే ఇంకొకరి చేత పట్టించిన వాడు కూడా సంపూర్ణ బ్రాహ్మణుడు కాలేడు. వేదాన్ని అర్థం చేసుకొని, వేద ధర్మాన్ని స్వయంగా ఆచరించి, దానిని బోధించువాని వేద విద్యయే సఫలమని స్వయంగా వేదాలే చెప్పి వున్నాయి. సుఖాన్ని జ్ఞానాన్ని కూడా కలిగించడం వల్ల వేదవిద్యకి ‘శేవధి’ అని పేరు.

వేద, శాస్త్ర వాఙ్మయాలను ఏమాత్రమూ అర్థం చేసుకోకుండా బ్రాహ్మణరూపుడై వాటిని బోధించేసేవాడు మూర్ఖుడు. అట్టివాడు పాపి. ఇట్టి అపవిత్ర, వేదరహిత, నష్టవ్రత బ్రాహ్మణునికి పెట్టబడిన అన్నం ఇలా రోదిస్తుందట - “ఓ దేవా! నేనేం పాపం చేసేనని నన్ను ఈ మూర్ఖ బ్రాహ్మణుని చేతిలో పడవేశావు?” జయోపజీవి చేతిలో పడిన అన్నము మొదలగునవి ప్రసన్నత పూర్వకంగా నాట్యం చేస్తూ ఇలా అంటాయట, “అహో! ఏమి నాభాగ్యము! ఇంత గొప్ప చేతనున్న పాత్రలో పడితి గదా!”

విద్యావంతులు, అధ్యాపనప్రియులు, తపస్సంపన్నులునైన బ్రాహ్మణులకు, ఆయా పనులను ముగించి ఇంటికి వచ్చేసిన తరువాత కూడా అన్నములు, ఔషధములు వారిపట్ల అతి ప్రసన్నతతో మెలగుచు సేవచేయుచు తమకు సద్గతి తప్పదనే నిశ్చయానికి వచ్చివుంటాయి.

వ్రత, వేద, జపహీనుడైన బ్రాహ్మణుడు రాతినావ వంటివాడు. వానికి దానము చేసినా ఫలశూన్యమే! రాతినావ ఎలాగైతే నదిని దాటించ సమర్థము కాదో అలాగే వీడూ మనను భవసాగరమును దాటించలేడు. ఏదో ఇంటి ప్రక్కనే వున్నాడు కదా అని ఈ హీనుడికి హవ్య - కవ్య దానాలిచ్చేయకుండా కాస్త దూరమైనా పోయి, వెదకి శ్రేష్ఠుడైన శ్రోత్రియ బ్రాహ్మణునికి ఆ దానాలిస్తే దేవతలు సంతోషిస్తారు. ఈ హీన బ్రాహ్మణుడే గాయత్రి జపం నిరంతరం చేసేవాడైతే అతడిని కూడా ఆదరించవచ్చు - అదీ కొంతవఱకే! ఎందుకంటే మన ఇంటినే నమ్ముకొని సమీపమందే వున్న బ్రాహ్మణుని పూర్తిగా నిరాదరిస్తే రౌరవనరకం ప్రాప్తించవచ్చు. గాయత్రి పరమ దేవ స్వరూపం కదా! వ్యవసాయం లేని గ్రామం, నీరు లేని బావి, విద్యయొక్క ఆర్జనము, అధ్యాపనము లేని బ్రాహ్మణుడు పనికిరారు.

రాజంటే శాసకుడు మాత్రమే కాదు. క్రూరుడసలే కారాదు. అహింస, ప్రేమ, నమ్రత, మధుర వచనము రాజుయొక్క ముఖ్య లక్షణాలు. పరిపాలనా విధానాలు మంచివి అయినపుడే లోక కళ్యాణం జరుగుతుంది. రాజు మనసు, వచనము కూడా నిష్కల్మషంగా వుంటే అతడు వేదాంతంలో చెప్పబడిన మోక్షాదులను పొందగలడు. మనిషి స్వయంగా ఆర్హుడై వున్నా తన దుఃఖిత మనసు, మాటల ద్వారా ఇతరులను యేడిపించరాదు. అలాగే ఇతరులు తనకన్నా సుఖంగా బతుకుతున్నారని మనసు మండించేసుకొని వారికి అపకారం తలపెట్టడం మహాపాపం. మంచిమాట చాలా సుఖపెడుతుంది.

నతథాశశీ నసలిలం నచందనరసోన శీతలచ్ఛాయా

ప్రహ్లాదయతేచ పురుషం యథా మధుర భాషిణీవాణీ  

ఒక మధురమైన మాట వల్ల మనిషికి కలిగే ఆనందం వెన్నెలవల్ల గానీ, చల్లని నీటివల్ల గానీ, గంధపుపూత వల్ల గానీ, చల్లనినీడ వల్ల గానీ కలుగదు.

బ్రాహ్మణుడు తనకు జరిగే సన్మానాలను విషంలాగా, అవమానాలను అమృతం లాగా భావించాలి. అవమానితునికి వచ్చే నష్టమేమిలేదు గానీ మంచివానిని అవమానించిన వాడు మాత్రం చెడిపోతాడు. తపస్సు, వేదాధ్యయనం, అధ్యాపనం నిత్యం కొనసాగిస్తూ జీవించడమే బ్రాహ్మణధర్మం.

బ్రాహ్మణునికి మూడు జన్మలుంటాయి. తల్లి కడుపున పుట్టగానే ‘మొదటి జన్మ, యజ్ఞోపవీతాన్ని ధరించగానే రెండవది, యజ్ఞ దీక్ష గైకొనగానే మూడవది మొదలవుతాయి. యజ్ఞోపవీత సమయమున గాయత్రి, ఆచార్యులే తల్లిదండ్రులుగా వానికి కొత్త జన్మనిస్తారు. వేదంలో శిక్షణ నిచ్చేవాడే దేవతల దృష్టిలో తండ్రి అవుతాడు. వడుగుకి ముందు అతని జీవితంలో వేదం ప్రసక్తే వుండదు కదా. కొంతమంది శ్రాద్ధకర్మలో చేసే వేద మంత్రాలను వదలివేసి మిగతా మంత్రాలనే ఉచ్చరిస్తారు, వల్లెవేస్తారు. అలా చేయకూడదు. అన్నీ చదవాలి. (పుట్టుకతోనైతే ప్రతివాడూ శూద్రుడే. ఉపనయనం నాడు ఆ శూద్రుడు మరణించి వర్ణుడు పుడతాడు. కాబట్టి ఆ సమయం నుండే శ్రాద్ధకర్మ మంత్రాలు చదవాలి.)  

ఉపనయమైన తరువాత వటువుకి గురువు వ్రతోపదేశం చేయ్యాలి. ఆ క్షణం నుండే వటువు విధిపూర్వకంగా వేదాధ్యయనం చెయ్యాలి. యజ్ఞోపవీత వ్రతంలో చెప్పబడిన వస్తువులన్నిటినీ - అంటే దండ, మేఖల, చర్మాదులను - ధరించి వుండాలి. తన తపస్సు (విద్య) పూర్తయ్యేదాకా, దాని వృద్ధి కోసం కూడా, బ్రహ్మచారి జితేంద్రియుడై గురువు గారి వద్దనే వుంటూ ఆయా ఆశ్రమ నియమాలన్నిటినీ నిష్ఠగా పాటించాలి. నిత్యస్నానాలు, పవిత్రత, దేవ, ఋషి, పితృగణాలకి తర్పణాలు, పుష్ప, ఫల, జల, సమిధ, మృత్తిక, కుశ అనేక ప్రకారాల చెట్టు బెరడులు, కర్రలు ఇవన్నీ సంగ్రహించి ఆశ్రమంలో చేర్చడాలు - ఈ నియమాల్లో భాగమే. మద్యమాంసాలనూ, పుష్ప, గంధ, రసాది, భోగాలను పూర్తిగా విసర్జించాలి. స్త్రీ సాంగత్యాన్ని మనసులోకి కూడా రానివ్వకూడదు. హింస, అంజనం వేయడం, నృత్యాన్ని చూడడం, జూదమాడడం, అసత్యవచనం, నింద, స్త్రీల దగ్గర కూర్చోవడం, కామ, క్రోధ, లోభాలను చర్చించడం - ఇవన్నీ బ్రహ్మచారికి పూర్తిగా నిషిద్ధాలు. ఏకాకిగా జీవించాలి. ఫల, పుష్ప, జలాదులనే కాదు అవసరమైతే బిక్షాటన చేసి ఆ ద్రవ్యాన్ని కూడా ఆశ్రమానికి తేవాలి. ఈ భిక్షాగ్రహణానికి ఎవరు పడితే వారి యింటికి పోరాదు. కర్మతత్పరుడై, వేదాది శాస్త్రవిదుడై, యజ్ఞాదులను శ్రద్ధగా చేసే గృహస్థు ఇంటికే పోవాలి. గురువు గారి కులం వారింటికి గాని బంధువుల గృహాలకు గాని సాధ్యమైనంతవఱకు భిక్షకు పోరాదు (గురువు గారి కులం వారంటే బ్రాహ్మణులే కదా! మరి బ్రాహ్మణులకు భిక్షాదానఫలం దక్కే అవకాశమే లేదా - అని కొందరడగవచ్చును. ఇక్కడ కుల శబ్దానికి ప్రస్తుత కులానికి చాలా తేడా వుంది. పాత రోజులలో కులమంటే గట్టు. అనగా స్వగ్రామపు హద్దు. పైగా గురువులలో అన్ని వర్ణాలవారూ ఉండేవారు, శూద్రులతో సహా!). భిక్ష అడిగినపుడు - అదేదో వాడి అదృష్టం కొద్దీ మనం వాడిని అడుగుతున్నట్టు కాకుండా - అహంకార మమకారాలు విడచిపెట్టి అడగాలి. మహాపాతకుల ఇంటికి భిక్షకు పోరాదు. బ్రాహ్మణవర్ణాన్నవలంబించేవారు భిక్షాన్నమే తినాలి. ఇతర వర్ణములనెంచుకొనేవారికి ఈ నియమం లేదు.

బ్రహ్మచారులంతా నిత్యమూ సమిధల నేరి తెచ్చి ఇరుసంధ్యలలోనూ హోమం చెయ్యాలి. గురువు గారి వద్దకు వెళ్ళినపుడు చేతులు జోడించి నిలబడే వుండాలి. ఆయన కూర్చోమన్నపుడే కూర్చోవాలి. అదీ ఆసనంపై కాదు. ఆయన లేవక పూర్వమే మేలుకోవాలి. ఆయన నిద్రించిన పిమ్మట పడుకోవాలి. ఆయన పరోక్షంలో కూడా ఆయన పేరును ఉచ్చరించరాదు. సరదాకైనా ఆయన మాట తీరును, కదలికలను అనుకరించరాదు. ఆయనను నిందించరాదు. ఎవరైనా గురువుగారిని నిందించినా, విమర్శ - ఆక్షేపణ ధోరణిలో చేసినా, నోటిని గాని భుజశక్తిని గాని ప్రయోగించెయ్యకుండా, చెవులైనా మూసుకోవాలి, ఆ తావునైనా వదలిపోవాలి.

జీవిత కాలంలో ఎన్నడైనా శిష్యుడు వాహనంపైనా గురువుగారు నేలపైనా వుంటే, శిష్యుడా వాహనంపై నుండే వందనం చేసిపోరాదు. క్రిందికి దిగి నమస్కరించాలి. అయితే ఆయన ఆజ్ఞతో ఆయనతో కలిసి వాహనం పై, శిలపై, నౌకపై ఆసీనులు కావచ్చు. గురువుగారికిచ్చే గౌరవాన్నే ఆయన గురువులకి, ఆయన పుత్రులకి, శ్రేష్ఠులైన గురుబాంధవులకి ఇవ్వాలి.

గురుపత్నిని తల్లిలాగే గౌరవించాలి గాని ఆమె పాదాలు తాకడం కూడా నిషిద్ధమే! బ్రహ్మచారి ఏ స్త్రీతోనూ సోదరి, మాతయైనా సరే, ఒకే ఆసనంపై కూర్చొనరాదు. ఇంద్రియాలు విద్వాంసునికన్నా ఎంతో బలవత్తరాలు.

భూమిని తవ్వుతున్న కొద్దీ నీరు ఎలా ఉబికి వచ్చి లభిస్తుందో గురుశుశ్రూష చేస్తున్నకొద్దీ విద్యా అలాగే లభిస్తుంది, లాభిస్తుంది. బ్రహ్మచారి గురుకులంలో వున్నా స్వగ్రామంలో వున్నా రోజులోని రెండు సంధ్యల్లో ఒకటి కూడా అతడు నిద్రిస్తుండగా జరిగిపోరాదు. సూర్యోదయ సూర్యాస్తమానాలు రెండింటినీ అతడు చూసి తీరాల్సిందే. నిర్జనస్థానంలో శ్రద్ధగా సంధ్యావందనాలు చెయ్యాల్సిందే! లేకుంటే అతడు మహాపాపం చేసినట్టు శాస్త్రాల్లో వుంది. కృచ్ఛ్రవ్రతమనే ప్రాయశ్చిత్తం చేసిన తరువాతనే సంధ్యాసమయంలో నిద్రలో మునిగియున్నవాడికి మరల అన్ని బ్రహ్మచర్యార్హతలూ కలిగేది.

తల్లి, తండ్రి, సోదరుడు, ఆచార్యుడు ఆపదలో వున్నపుడు బ్రహ్మచారి ఉపేక్షించరాదు. అలాగే తాను ఆపదలోనున్నా కూడా వారి సేవలలో తేడాను చూపించరాదు. ఆచార్యుడు బ్రహ్మయొక్క మూర్తి. అలాగే తండ్రి ప్రజాపతికి, తల్లి భూమాతకీ, అన్న ఆత్మకీ ఆనవాళ్ళు. అందుకే వారంతా పూజ్యులే(పూజనీయులు అనేమాట వ్యాకరణం ప్రకారం తప్పు.). జన్మనిచ్చి మనను పెంచడానికి తల్లిదండ్రులు పడే కష్టానికి కొలమానంలేదు. అందుకే వందేళ్ళపాటు వారిని సేవించినా ఆ ఋణం తీరదు. తల్లి, తండ్రి, ఆచార్యుడు - ఈ మువ్వురినీ బ్రహ్మచారి నిత్యం సేవించాలి. ఈ ముగ్గురూ సంతుష్టి చెందితే ఆ సేవించిన వ్యక్తి అన్ని రకాల తపఃఫలాలనూ లేనిదే పొందగలడు. ఈ సేవయే మహా తపస్సమానము. అదే పరమతపము. వీరి ఏ ధర్మాచరణాన్నీ ప్రారంభించకూడదు. ఈ ముగ్గురే ముల్లోకాలు, మూడు వేదాలు, మూడు అగ్నులు. గార్హపత్యాగ్నిమాత, దక్షిణాగ్ని స్వరూపుడే తండ్రి, ఆహవనీయ అగ్ని ఆచార్యుడు. వీరి సేవ దేవలోక సుఖ భోగాలను ప్రాప్తింపజేస్తుంది.

పితృభక్తి వల్ల ఇహలోకము, మాతృభక్తి వల్ల మధ్యలోకము, గురుసేవ వల్ల ఇంద్రలోకము ప్రాప్తిస్తాయి. వీరిని నిరాదరించిన వానికి ఏ విద్యా అలవడదు, ఏ యాగమూ ఫలమిడదు. ఏ ధర్మమూ నిలబడదు. ఈ మువ్వురినీ వారు జీవించియున్నంతకాలమూ సేవా, శుశ్రూషలతో తృప్తిపఱచడమే పురుషుని యొక్క సంపూర్ణ కర్తవ్యము. అదే ధర్మము. మిగతావన్నీ దానికి ఉపధర్మాలే.

ఉత్తమ విద్య - ఒక వేళ అధమ పురుషుని వద్దనున్నా సరే - దానిని గ్రహించాలి. వృత్తిరీత్యా చండాలుడైనా వాని నుండి మోక్షధర్మ శిక్షణను పొందిన వారున్నారు. నీచ వృత్తికారులనుండి ఉత్తమ స్త్రీ, విషము నుండి అమృతము, బాలకుని నుండి ఉపదేశము, శత్రువు నుండి సదాచారము, అపవిత్ర స్థానము నుండి బంగారము స్వీకరించవచ్చును. ఎందుకంటే లభించే వస్తువే ముఖ్యం. పైన చెప్పిన వాటిని ఎక్కడి నుండైనా గ్రహించ వచ్చును. చదువు కొనసాగుతున్న కాలంలో గురువుకేమీ ఇవ్వాలనుకోరాదు. కాని చదువు పూర్తయిన తరువాత ఆయన అనుజ్ఞతోనే భూమి, స్వర్ణం, ఆవులు, గుఱ్ఱాలు, గొడుగులు, ధాన్యాలు, వస్త్రాలు - ఇంకేమైనా కూడా, యథాశక్తి, గురుదక్షిణగా ఇవ్వాలి. గురువుగారి తదనంతరం కూడా బ్రహ్మచర్యం ముగిసినా కూడా వ్యక్తి గురుపుత్రులను, గురు సోదరులను, గురుపత్నిని - తానెపుడూ గురువుని చూసినట్టే చూడాలి. విద్యాంతం బంధాంతం కారాదు.

ఈ విధంగా ఎవరైతే బ్రహ్మచారి ధర్మాన్ని అవిచ్ఛిన్నంగా ఆచరిస్తారో వారికి బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతుంది.

బ్రాహ్మణునికి ఉపనయనం వసంతఋతువులో చేయడం ప్రశస్తం. క్షత్రియునికి గ్రీష్మంలోనూ, వైశ్యునికి శరత్తులోనూ నడుగు చేయడం శ్రేష్ఠం.

ఇక గృహస్థాశ్రమం చూద్దాం.