భవిష్య మహా పురాణము
30-33 - అక్షయ తృతీయ - ధర్మవణిక్ చరిత్ర
“మాధవా! అక్షయతృతీయ అనే పేరు విన్నాను. దాని విషయం తెలుపుమని ప్రార్థిస్తున్నాను అన్నాడు ధర్మజుడు. చెప్తున్నాడు శ్రీకృష్ణుడు.
“మహారాజా! వైశాఖ శుద్ధతదియను అక్షయ తృతీయ అంటారు. ఈ రోజు చేయు స్నాన, దాన, జప, హెూమ, స్వాధ్యాయ, తర్పణాది ఏకర్మకైనా అక్షయ ఫలాలుంటాయి. (మత్స్యపురాణం 65వ అధ్యాయములో మరోలా చెప్పబడింది.)
శ్లోకం!! అక్షయా సంతతిస్తస్య
తస్యాం సుకృతమక్షయం।
అక్షతైః పూజ్యతే విష్ణుః
తేన సాక్షతయా స్మృతా॥
(ఈరోజు అక్షతలతో విష్ణువుని పూజిస్తే ఆయన బహుప్రసన్నుడై అన్నిటితోబాటు సంతానాన్ని కూడా అక్షయంగా ప్రసాదిస్తాడని శ్లోకోద్దేశ్యం)
సత్యయుగారంభం కూడా ఈ తిథినాడే జరిగింది. కాబట్టి దీనిని కృతయుగాది తృతీయ అని కూడా అంటారు. ఇది సర్వపాప ప్రణాశిని, సర్వసుఖ ప్రదాయిని ఐన తిథి. ఈ సంబంధమై ఒక ప్రసిద్ధమైన ఆఖ్యానం వుంది ఆలకించు:
శాకల నగరంలో ధర్ముడని ఒక వణిక్కు (వైశ్యుడు) వుండేవాడు. ఆయన ధర్మాత్ముడు, ప్రియభాషి, సత్యవాది, బ్రాహ్మణ, దైవభక్తుడు. ఆయన ఒకనాడెక్కడో ధర్మ ప్రసంగంలో
‘వైశాఖ శుక్ల తదియతో రోహిణీ నక్షత్రం, బుధవారం యోగిస్తే ఆరోజు చేసిన దానం అక్షయం కాగలదు’ అని విన్నాడు. అతడలా విన్న కొన్నాళ్ళకే ఆ తిధి వచ్చింది. ధర్ముడా రోజు గంగలో పితరులకు తర్పణలిచ్చి ఇంటికి వచ్చి అన్నంతో జలంతో నున్న నిండు కుండలనూ, పేలపిండి, పెరుగు, వేరుశనగపలుకులు, గోధుమలు, ముతక పందార, బెల్లం, చెఱకు గడలతోబాటు సువర్ణాన్ని కూడా అడ్డూ ఆపూ, లెక్కాపక్కా, హద్దూ పద్దూ లేకుండా, కుటుంబ హానికి వెఱచిన భార్య ఆపుతున్నా ఆగకుండా, బ్రాహ్మణులకు దానం చేసి వేశాడు. తరువాత మిగిలిన దానితోనే సుఖంగా జీవిస్తూ కొన్నాళ్ళకు మృతి చెందాడు. మరుజన్మలో నతడు కుశావతీ నగరంలో పుట్టి దానికి రాజైనాడు. పూర్వజన్మలో చేసిన దాన ప్రభావం వల్ల అతనికి అంతులేని ఐశ్వర్యం, ధన సంపదలూ సమకూడాయి. ఈ జన్మలో కూడా పెద్ద యెత్తున దక్షిణలిస్తూ యజ్ఞాలు చేశాడు. బ్రాహ్మణులకు ఆవులనూ, భూమినీ, సువర్ణాదులనూ చేతికి ఎముక లేదన్నట్లుగా దానం చేస్తునేవుండేవాడు. దీనులకూ దుఃఖితులకూ కూడా ఇచ్ఛా పూర్తి కలిగించేవాడు. ఇలా ఎన్ని లక్షల మందికి ఏ స్థాయిలో దానాలిచ్చినా అతని ధనసంపదలు తరిగేవికావు. అందరూ ఆశ్చర్యపోయే వారు. మహారాజా! ఇదీ అక్షయ తృతీయ వ్రతఫలం. ఇక వ్రత విధానాన్ని వినిపిస్తాను. అన్ని రసాలనూ, అన్నాన్నీ, తేనెనూ, నీటికుండలనూ, రకరకాల పండ్లనూ, చెప్పులతో సహా గ్రీష్మర్తువును తట్టుకోవడానికి పనుకొచ్చు సర్వసామగ్రినీ, ఆవునూ, భూమినీ, వస్త్రాలనూ, సువర్ణాన్నీ, ఇంతే కాక తనకెంతో ప్రీతికరమైన వస్తువులనూ బ్రాహ్మణులకు దానం చెయ్యాలి. అదే పూజ, అదే యజ్ఞం, అదే వ్రతం. ఇది రహస్యం. ఈ దినం చేసే, సత్కర్మకు వచ్చే ఫలం అరగదు, తరగదు, నశింపదు. అందుకే మునులు దీనికి అక్షయ తృతీయ అనే పేరు పెట్టారు.
(ఈరోజు ఎలాగో అలాగు ఎంతో కొంత బంగారం కొనేసి దాచేసుకుంటే అది అక్షయమై పోతుందనే నమ్మకాన్ని కొందరు ప్రజల బుర్రల్లో ప్రవేశపెట్టారు. దానికి ప్రమాణం ఏ పురాణంలో వుందో మరి!)