భవిష్య పురాణము

77, 78 - సంప్రాప్తి, గోవింద ద్వాదశీ వ్రతాలు

పుష్య బహుళద్వాదశి నుండి జ్యేష్ఠ ద్వాదశి దాకా ప్రతి బహుళ ద్వాదశినాడూ సంప్రాప్తి ద్వాదశి వ్రతాన్ని చేయాలి. ప్రతి మాసంలో క్రమంగా పుండరీకాక్ష, మాధవ, విశ్వరూప, పురుషోత్తమ, అచ్యుత, జయ - అనే నామాలతో ఉపవాస పూర్వకంగా భగవానుని తిరిగి ఆషాఢ కృష్ణ ద్వాదశినాడు వ్రతగ్రహణం చేసి మార్గశిరం దాకా వ్రత నియమాలను పాటించాలి. అవే నామాలతో అదే క్రమంలో భగవానుని పూజించాలి.

ప్రతి నెలా బ్రాహ్మణునికి భోజనం పెట్టి దక్షిణనిస్తుండాలి. నూనెనూ ఉప్పునూ ఈ వ్రతం చేస్తున్నన్ని నాళ్ళూ వదిలేసుకోవాలి. ఇలా ఒక యేడాదిపాటు ఈ వ్రతాన్నాచరించిన వారికి ‘ఇక్కడ’ అన్ని కోరికలూ తీరిపోయి సుఖజీవనం కలిగి ‘అక్కడి’కి వెళ్ళవలసి వచ్చినపుడు విష్ణులోకం ద్వారాలు తెరుస్తుంది.

మహారాజా! ఇలాటిదే గోవింద - ద్వాదశియను పేరుగల వ్రతమొకటుంది. దీనివల్ల సర్వాభీష్ట సిద్ధి కలుగుతుంది. పుష్య శుద్ధ ద్వాదశినాడు ఉపవాసముండి పుష్ప ధూపదీప నైవేద్యాదులతో గోవిందుని పూజించి ఆరోజంతా ఏం చేస్తున్నా మనసులో గోవింద గోవింద అని స్మరిస్తుండాలి. ఈ రోజు పాఖండులతో మాట్లాడరాదు. బ్రాహ్మణులకు యథాశక్తి దక్షిణలిస్తూ వుండాలి. ప్రతి ఆ రోజుకి గోమూత్రం, గోమయ, దధి, గోదుగ్ధము లలో నేదో ఒకటి ప్రాశించి నేలపై పడుకోవాలి. మరునాడు స్నానానంతరం మరల గోవిందుని పూజించి బ్రాహ్మణునికి భోజనం పెట్టి వ్రతి కూడా భోంచెయ్యాలి. ఈ విధంగా ప్రతి నెలా చేసి యేడాది ముగుస్తున్నప్పుడు లక్ష్మీ గోవిందుల సువర్ణ ప్రతిమను తయారుచేయించి పుష్ప ధూప దీప మాలా నైవేద్యాదులతో పూజించి సవత్సగో సహితదంగా దానిని బ్రాహ్మణునకిచ్చి వేయాలి. ప్రతి నెలలోనూ ఈ ద్వాదశినాడు గోసేవ చేస్తుండాలి. ఈ వ్రతాన్ని చేయడంవల్ల కొమ్ములకు బంగారాన్ని అలంకరించి వెయ్యి గోవులను వృషభంతో సహా దానమిచ్చిన ఫలం దక్కుతుంది. దేహాంతంలో శ్రీరాధాకృష్ణ నిత్య విహారమైన గోలోక నివాస ప్రాప్తి వుంటుంది.”