భవిష్య పురాణము

11 - కోకిలా వ్రతవిధానం - మాహాత్మ్యం

“భగవన్! స్త్రీలకు తమ పతులనుండి పరస్పరం విశుద్ధమైన ప్రేమ పదికాలాల పాటు విలసిల్లాలంటే వారు ఏ వ్రతం చెయ్యాలి?”

“ధర్మరాజా! యమునాతటంపై మథురయను పేరుగల సుందర నగర మొకటి వున్నది కదా! అక్కడ త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు శత్రుఘ్నుని మహారాజ పదవిలో ప్రతిష్ఠించాడు. అతని భార్య కీర్తిమాల. (అన్ని రామాయణాల్లో ఈమెపేరు శ్రుతకీర్తి అనే చెప్పబడింది). ఆమె గొప్ప పతివ్రత. ఒకనాడామె తమకులగురువైన వసిష్ఠ మహర్షిని ‘గురుదేవా! నాకు అఖండ సౌభాగ్యప్రదమైన వ్రతాన్నుపదేశించండి’ అని ప్రార్థించింది.

‘పుత్రీ! కల్యాణ కామిని (పెండ్లిని కోరుకొనేది అనే అర్థం ఇక్కడే కాదు ఎక్కడా లేదు)యైన స్ర్తీ ఆషాఢ పూర్ణిమనాడు సాయంత్రం ముందుగా తాను శ్రావణ మాసమంతా నిత్యస్నాన, రాత్రి భోజన, భూశయన, బ్రహ్మచర్య, పాపవిదూర, పాపివిదూర నియమాలను పాటిస్తూ భూతదయను కలిగివుంటానని సంకల్పం చెప్పుకోవాలి. మరునాడు పెందలకడనే లేచి సర్వ సంభారాలనూ పట్టుకొని నదీ లేదా సరోవర తీరాన్ని చేరుకొని, అక్కడే పండ్లు తోముకొని సుగంధితద్రవ్యాలు, తిలలు, ఉసిరికలతో శాస్త్రోక్తంగా అభ్యంగనస్నానాన్ని చెయ్యాలి. ఈ విధంగా ఎనిమిది రోజులపాటు గావించి, ఆతరువాత సర్వౌషధులతో కూడిన ముద్దతో మరొక ఎనిమిది రోజులు అభ్యంగన స్నానాన్నాచరించాలి. మిగిలిన రోజుల్లో వచయుక్త అభ్యంగనస్నానాలు చేయాలి. స్నానానంతరం సూర్యభగవానుని ధ్యానించాలి. అప్పుడు నువ్వులను పిండి చేసి దానితో కోయిల పక్షి ఆకారాన్ని (మూర్తిని) తయారుచేసి దానికి రక్త చందనం, చంపక పుష్పాలు, పత్రాలు, తిలలు, బియ్యం, దూర్వ, ధూపదీపనైవేద్యాలతో పూజ చేసి ఈ క్రింది మంత్రం ద్వారా ప్రార్థించాలి.

తిలసహేతిలసౌఖ్యే తిలవర్ణే తిలప్రియే

సౌభాగ్య ద్రవ్య పుత్రాంశ్చ దేహిమే కోకిలేనమః (ఉత్తరపర్వం 11/14)

 ఇలా పూజ చేసి ఇంటికి వచ్చి భోజనం చేయాలి. ఈ విధంగా వ్రతానుష్టానం చేసి నెలరోజులు పూర్తయిన అనంతరం తిలపిష్టంతో కోకిల బొమ్మను తయారుచేసి దానికి రత్ననేత్రాలనూ బంగారురెక్కలనూ అమర్చి రాగిరేకుపై ప్రతిష్ఠించాలి. పూజానంతరం దానిని దక్షిణా సహితంగా వస్త్రం, ధాన్యం, బెల్లంతోబాటు మామగారికిగాని, దైవజ్ఞునికిగాని, పురోహితునికిగాని, బ్రాహ్మణునిగానికి దానం చెయ్యాలి. ఈ పద్ధతిలో కోకిలా వ్రతాన్ని చేసిన నారీమణి ఏడుజన్మల వఱకూ సౌభాగ్యవతిగా వర్ధిల్లుతుంది. చివర ఉత్తమ విమానంలో గౌరీ లోకాన్ని చేరుకుంటుంది’ అని చెప్పాడు (వసిష్ఠుడు = ప్రజాపతి, వశిష్ఠుడు = రామగురువు) వశిష్టుడు.

ఆయన చెప్పిన విధంగా చేసి తరించింది కీర్తిమాల. ఆ తరువాత ఎందరో స్త్రీలు ఈ వ్రతాన్ని ఆచరించి సుఖ, సౌభాగ్యాదులను పొందారు.