సూతమహర్షి బృహస్పతి మాటలను ఇంకా ఇలా చెప్పుచున్నాడు. “దేవేంద్రా! పూర్వకాలంలో నికుంభుని వంశంలో జన్మించిన ‘హిర్బు’ అని ఒక దానవుడుండేవాడు. అతడు పరాక్రమంలో నీతో సమానుడే కాని లోక కంటకుడు. ఒక వెయ్యేళ్ళపాటు తపస్సు చేసి బ్రహ్మప్రత్యక్షం కాగా, తనకు మరణం లేకుండా వరాన్ని పొందాడు. అపుడా భయంకరదైత్యుడు దేవతలను గెలిచి స్వర్గంనుండి తగిలేసి తనవారైన రాక్షసులకు స్వర్గంలో నివాసం కల్పించాడు. దేవతలు నిలువనీడలేక ఎక్కడో వనాల్లో అలమటిస్తుండగా త్రిలోకసంచారి, మహాతపస్వియైన నారదుడు వారి వద్దకు పోయి, ‘మీరంతా భక్తిశ్రద్ధలు ప్రస్ఫుటించేటట్లు శంకరభగవానుల ఉపాసన చెయ్యండి. ఆయన ఈ బ్రహ్మాండానికే స్వామి, ఆపదలను నశింపజేయు స్వభావము గల భక్తపక్షపాతి’ అని హితవు చెప్పాడు. వారు వెంటనే దేవదేవుడైన ఈశ్వరుని పార్థివపూజ ద్వారా పదకొండేళ్ళపాటు ఆరాధించగా లోక కల్యాణ కారకుడైన భగవానుడు శివశంకరుడు ప్రసన్నుడై జ్యోతిర్లింగమయుడై దేవతలనుపీడిస్తున్న అసురులందరినీ అగ్నికీలలలో దగ్ధం చేసి వేశాడు. అప్పుడు బ్రహ్మ, విష్ణువు పరమానందభరితులై మధురమోహన స్వరంతో సామసూక్తమును గానం చేశారు. సూర్యుడు మిథునరాశిలో నున్నపుడు హిర్బు దైత్యుని సంహరించిన శివుని యొక్క ఒక రుద్రాంశను దేవతలంతా తమ రక్షణకై శశిమండలానికి రాజుగా చేసి నిత్యము సేవించుకోసాగారు. ఈ మహారుద్రుడు దేవకార్యతత్పరుడై వుండేవాడు. ఈ మహారుద్రుడే అనంతరకాలంలో అనంతరమణీయ హిమాలయ రాజ్యంలో సాధ్యకర్మకు పుత్రునిగా జనించాడు. పెరిగి పెద్దవాడై సకల కళాజ్ఞాతయై భారతీశుడను పేరిట ప్రసిద్ధుడయ్యాడు. తన ప్రాంతపు పండితులందరినీ వాదంలో ఓడించి దారి పొడవునా నాస్తికులను గెలుచుకుంటూ పోయిచివరికి శంకరాచార్యుని శిష్యునిగా స్థిరపడ్డాడు.
దేవేంద్రా! మయుని పుత్రిక మాయి ఒంటికాలిపై నిలబడి వెయ్యేళ్ళు ఘోరతపస్సు చేసింది. ఆ తపశ్శక్తికి విశ్వంలో ప్రాణులన్నీ వేడిగాలుల మధ్య ఇరుక్కున్న అనుభవాన్ని పొందాయి. అపుడు బ్రహ్మదేవుడామెకు ప్రత్యక్షమై త్రిపురాలను వరంగా ఇచ్చాడు. పదహారు యోజనాల విస్తీర్ణంతో స్వర్గ సమానమై స్వర్ణమయమైన నగరమొకటి, దాని క్రింద భువర్లోక సమానమై, ఒక యోజన విస్తృతమైన రజతమయ నగరమొకటి, దానిక్రింద భూర్లోక సమానమై ఒక యోజన వైశాల్యంలో లోహమయ నగరమొకటి ఆమెయు, ఆమె జాతియు భోగించుటకై బ్రహ్మ ప్రసాదించాడు. ఆ త్రిపురాలలో వందకోట్లమంది దైత్యులు పత్నులతోబాటు. నివసించసాగారు. వారు దేవతలకందవలసిన యజ్ఞభాగాలను గ్రహణం చేసి దేవతలతో సమానమైపోయారు యజ్ఞభాగాలు అందకపోవడంతో దేవతలు నిర్బలులై కృశించిపోసాగారు. వారంతా ఆకలికి మాడిపోతూ యేడుస్తూ పోయి విష్ణుదేవుని పాదాలపై పడి ఇలా ఆక్రందించారు. ‘భగవాన్! ప్రభో! మయపుత్రిమయి ద్వారా ప్రాప్తించిన దుఃఖంవల్ల మేము కృశించిపోతున్నాము. చాలాకాలంగా మాకు హవిస్సులు లేవు. ఇక మాకు మీరే దిక్కు’ మధుసూదనుడు వారి మొర విని జాలిపడి త్రిపురాలలోనే సంస్కృత పండితుడు, ధర్మ పరాయణుడు నగు అజినుడనే ద్విజుని పుత్రునిగా బౌద్ధుడను పేర జన్మించాడు. త్రిపురాలలో యజ్ఞాలు చేస్తూ హవిస్సులతో దైత్యులను మేపుతున్న వేద ధర్మపరాయణ విప్రులందరినీ బౌద్ధుడు తన మాటలచే మోహితులను చేసి క్రమంగా వారిని వైరాగ్యంలోకి నెట్టివేశాడు. తామస మన్వంతరంలో త్రివర్ణులూ వేదవిహీనులూ, కర్మరహితులూ అగునట్లు చేశాడు. క్రమంగా పదహారవ కలియుగం వచ్చేసరికి యజ్ఞయాగాదులు పూర్తిగా ఆగిపోయి త్రిపురదైత్యులకు పుష్టికరమైన ఆహారం అనగా హవిస్సు లేకుండా పోయింది. అపుడా దైత్యులు పరమకృద్ధులై యజ్ఞశూన్యులైన అక్కడి మనుష్యులను తినేయడం మొదలెట్టారు. కల్పాంతనికల్లా అక్కడ మనుష్యులే లేరు.
మరల సత్యయుగం వచ్చినపుడు దేవతలంతా కలిసి వెళ్ళి సకలజన శుభాకాంక్షియైన శంభుని ఆరాధించారు. ఆయన జ్యోతిర్లింగ రూపధారియై వారికి దర్శనమిచ్చాడు. అపుడు దేవతలు ఆనందించి భూమిసారాన్ని గ్రహించి దాని నుండి ఒక రథాన్ని నిర్మించారు. సూర్యచంద్రుల సారాన్ని గ్రహించి రెండు చక్రాలను తీర్చిదిద్దారు. సుమేరు పర్వత సారంతో రథానికి ధ్వజాన్ని నిర్మించి ఆ స్యందనాన్ని భగవానుడైన శివునికి సమర్పించారు. స్వయంగా బ్రహ్మదేవుడే దిగివచ్చి ఆ రథానికి సారధియైనాడు. నాలుగు వేదాలూ గుఱ్ఱాలైనాయి లోకాలోక పర్వత సారతత్త్వం ‘ఆజగవ’ నామంతో ప్రసిద్ధమైన ధనుస్సుగా మారి శివుని చేతిని చేరింది. అది ఘోరమైన శబ్దాలు చేస్తుంది. శంకర భగవానులు దాని నెక్కుపెట్టగనే ఆయన శక్తిని తట్టుకోలేక అది విరిగిపోయింది. అపుడు శ్రీ మహావిష్ణువు స్వర్గలోక సారాన్ని గ్రహించి ‘పినాక’ నామకమగు ఒక ధనుస్సును నిర్మించి శివునికిచ్చాడు. శివుడు దాని నెక్కుపెట్టాడు. అది విరిగిపోలేదు. ఆయన చేతిలో అది చాలా చక్కగా అమరింది నాటి నుండి శివుడు ‘పినాకి’గా ‘పినాకపాణి’గా స్తుతింపబడుతున్నాడు. ఆదిశేషువు ఆ ధనుస్సుకు వింటినారిగా నిలువగా ఇంద్రుడే బాణమైనాడు. ఆ బాణానికి పార్శ్వాలుగా వాయువు, అగ్ని అమరగా చివరి మూలికగా మహావిష్ణువు సిద్ధమైనాడు. శివుడా బాణాన్ని ప్రయోగించి త్రిపురాలనూ భస్మం చేసి ఆకాశమార్గంలో పారిపోతున్న అసురులను కూడా భస్మం చేశాడు.
ఆ భయంకర త్రిపురాలు అసురులతో సహా దగ్ధమై పోవడంతో ఆనందించిన లోకపతి బ్రహ్మ మీనరాశిలో సూర్యుడున్నప్పుడు పినాకి మహారుద్రుని చంద్రమండలానికి రాజుని చేయగా అప్పుడు జరిగిన దేవదాన యుద్ధంలో గెలిచి తామస మన్వంతరంలో దేవతలు తిరిగి తమ తమ అధికారాలను పొందగలిగారు. అని బృహస్పతి నాతో చెప్పాడు. మునులారా! అనంతరం పినాకపాణి తన ముఖం నుండి తన అంశాన్ని ఉత్పన్నం చేసి హరిద్వారంలో నున్న మచ్ఛందుడను యోగిలో తన తేజంతో సహా ప్రవేశపెట్టాడు. ఆ మచ్ఛందుడు నిత్య శివార్చన తత్పరుడు, గోరఖుని యొక్క గురువు. ఆ తేజం అతనికి పుత్రరూపంలో నాథశర్మయను పరమసుందరుడు, విద్వాంసుడు, శ్రేష్ఠుడుగా అవతరించింది. ఆ నాథశర్మ పృథ్విపై నున్న అన్ని రకాల అన్ని మతాల పండితులనూ వాదంలో ఓడించి కాశీపురి వెళ్ళి అక్కడ శంకరాచార్యుని శిష్యునిగా స్థిరపడిపోయాడు.
బృహస్పతి దేవతలతో ఇంకా ఇలా చెప్పానని నాతో అన్నాడు. ‘దేవేంద్రా! చాక్షుష మన్వంతరంలో తాలజంఘ వంశీయులైన క్షత్రియులు భృగువంశం వారైన బ్రాహ్మణులపై దాడి చేసి, వారిని సంహరించి, వారివద్ద నున్న ప్రచురధనరాశులను మోసుకుపోయారు. అంతేకాక ఆ క్షత్రియులు దైత్యపక్షపాతులై ప్రవర్తించసాగినారు. అప్పట్లో నొక గర్భవతియైన బ్రాహ్మణ స్త్రీ తన తపశ్శక్తిని వినియోగించి తన గర్భంలోని పిండాన్ని నూరేళ్ళపాటు అక్కడే ఉంచగలిగింది. తరువాత ఆ శిశువు మాతృగర్భాన్ని చీల్చుకొని భూమిపై పడేటప్పటికి అతని తేజస్సు అగ్నిగా మారి మొత్తం ప్రపంచాన్నే మాడ్చి మసి చేయసాగింది. దేవతలంతా భయపడి ఆ బాలకుని ప్రార్థించగా, పితరులు కూడా వచ్చి ఆజ్ఞాపించగా, నతడు ఆ తేజస్సునంతటినీ ముద్దగా చేసి పక్కనే వున్న నదిలోకి విడిచాడు. ఆ జలదేవి దానిని తట్టకోలేక బయటికి వదిలేసింది. అప్పుడు స్వయంగా పరమేష్టి బ్రహ్మదేవుడే దిగివచ్చి ఆ తేజస్సునందుకొని త్రికూటగిరిపై నిలబడి సాగర మధ్యంలో నిక్షిప్తం చేశాడు. అదే బడబాగ్ని ఆ బాలకుని రుద్రదేవునిగా గుర్తించిన బ్రహ్మ మేషరాశిలోకి సూర్యుడు ప్రవేశించినపుడు ఆ బాలకుని శశిమండలాధిపతిగా నియమించాడు. ఆ రుద్రతేజాన్ని ఊరువుల నుండి వచ్చినవాడు కావున వోర్వుడని, బడబాగ్నికి కోశము కావడంవల్ల, బడబుడని, సంసారాన్ని దహించబోయి నందువల్ల దహనుడని పిలుస్తారు.
మునులారా! ఆ దహనుని యొక్క తేజస్సే కురుక్షేత్రనివాసియు వేదాంగవేత్తయునగు సారస్వత బ్రాహ్మణునికి పుత్రరూపంలో ఉద్భవించింది ఆ పుత్రుడే క్షేత్రశర్మయను పేరిట ప్రసిద్ధుడయ్యాడు. అక్కడి విద్వాంసులలో నుత్తమునిగా ప్రపంచ విద్వాంసులలోనే అగ్రశ్రేణికి చెందిన వానిగా ప్రఖ్యాతి గాంచిన క్షేత్రవర్మ శంకరాచార్యుని చేతిలో మాత్రమే ఓడిపోయాడు. వెంటనే ఆయన శిష్యునిగా మారి కఠోర బ్రహ్మచర్యాన్నవలంబిస్తూ శంకర దేవుని ఉపాసిస్తూ కాశీలో స్థిరపడ్డాడు.
విప్రులారా! ఇపుడు మరల బృహస్పతి అమృతమయ వాక్కులను వినండి. ‘దేవేంద్రా! జలప్రళయ సమయంలో ప్రపంచమంతా ఒకే సాగరంగా కనిపించినపుడు స్థావర జంగమాలేవీ మిగలనపుడు అవ్యక్త బ్రహ్మ ఆదేశంమేరకు మాయారూపియైన ప్రకృతి ఆనందంగా ఆజలాన్నంతటినీ త్రాగేసింది. అపుడా దారుణ ప్రాకృత జగతిలో మహాకాళి ఏకాకిగా ఉత్పన్నురాలైంది. ఆమెయే నిత్య శుద్ధ సనాతన ప్రకృతియైన మహాగౌరీదేవిగా పరిణతి చెందింది. అయిదు ముఖాలతో, పదిబాహువులతో, మధ్యస్థ ముఖంపై మూడవ నేత్రంతో ఆమె భాసిల్లింది. ఆమె శివనామాన్ని ధరించింది. లలాటంపై నున్న కంటి ద్వారా ఆమె ఒక తేజస్సును ప్రకటించింది. ఆ సూక్ష్మతేజం పెరిగి పెరిగి నిత్యమై, నిరంజనమై, అవికారమై, సర్వదిశలలోనూ వ్యాపించింది. అది బ్రహ్మను కూడా ముంచెత్తడానికి ప్రయత్నించింది కానీ దానివల్ల కాలేదు. ఆశ్చర్యచకితయైన ఆమూల ప్రకృతి అంతట తన అయిదు ముఖాలనూ వంచి ఆయనను ప్రార్థించి ప్రసన్నం చేసుకుంది. అపుడు సర్వజ్ఞుడైన ఆ సనాతన బ్రహ్మ ఆమె అయిదు వదనాలలోనూ తేజోరూపుడై ప్రవేశించాడు. ఆ బ్రహ్మయే పురుషత్వాన్ని ప్రాప్తించుకొని ‘స్వయంభూ’ అనే నామంతో ప్రసిద్ధుడయ్యాడు. అవ్యక్త ప్రకృతి నుండి పుట్టినవాడవడం వల్ల అవ్యక్త జన్ముడని కూడా ఆయననే అంటారు. ఆయన కొఱకు వరదాయనీ, లోకరూపిణీ, అష్టాదశ భుజయుక్తాయైన మహాలక్ష్మిదేవి జన్మించింది. ఆమె ప్రపంచాన్ని రక్షించడానికే వచ్చింది. ఆమె రూపరేఖా లావణ్యాలను గాంచి స్వయంభువంతటి వాడే ఆశ్చర్యచకితుడైనాడు. ఆ తరువాత ఆయన బ్రహ్మరూపంలో సత్యలోకానికి వెళ్ళాడు. అక్కడ ఆయన ముఖం నుండి వేదాలు వచ్చాయి. ఆ వేదాలనే స్తుతులుగా చేసి ఆయన చాలాకాలం దాకా శంకరభగవానుని కీర్తించాడు. అపుడు అతని శరీరం నుండి నదులు పుట్టాయి. మరల సముద్రమేర్పడగా ఆయన అందులో శయనించాడు. అలా ఈ అవ్యక్త స్వయంభువు ఆ నీటిలో వెయ్యేళ్ళు శయనించి లేచి సత్యలోకానికి పోయి పునః సృష్టిని ప్రారంభించాడు.
గణరూపాలలో అనంత సృష్టులన్నీ మరల జనించాయి. వాటన్నిటిలో వేరు వేరు రూపాల్లో, కళలతో లక్ష్మి ప్రవేశించింది. అయినా ఆ సృష్టి యొక్క అనేకత్వాన్ని చూసి మహాసనాతనియైన ఆమెయే ఆశ్చర్యపోయింది. సర్వేశ్వరుడు, అవ్యక్తుడు, మంగళరూపుడు సాగరశయనుడు, విష్ణురూపుడునైన, ఆ సృష్టికర్తకే సృష్టికర్త అయిన వాని వద్దకు ఆమెయే వచ్చి నమస్కరించి ఇలా అన్నది, ‘భగవాన్! మీరు నిత్యులు, శుద్ధాత్ములు, ఇపుడు ప్రపంచంలో ప్రాణులు ఎక్కువగానున్నాయి. నేను వారినెట్లు గణించగలను?’ అని అడిగిన లక్ష్మికి గణన చేసే గణనాథుని చూపించాడు పరంబ్రహ్మ; ఇలా: ఆయనే ముందు లేచి నిలబడి రెండు భాగాలైనట్లు కనిపించాడు. అయినా ఆయన శేషశయనుడై అక్కడే వున్నాడు. ఈ రెండు భాగాల్లో పూర్వార్ధం ఎఱ్ఱగానూ పరార్ధం తెల్లగానూ వున్నాయి. రెండూ చతుర్భుజాలతో విష్ణువువలెనే వికసించాయి. సంపూర్ణ సృష్టి గణాలకు స్వామిగా ఎఱ్ఱనివాడైన గణేశుడు సృష్టింపబడినాడు. ఈయనను ఈశుడనీ అంటారు. పరార్ధము నుండి పుట్టిన తెల్లనిస్వామి యోగీశ్వరేశ్వరుడు. ఆయన పేరు నిరంజనుడు.
ఒకమారు పార్వతీపతియైన, పరమేశ్వరుడు ఒక వేయి సంవత్సరాలు ఈ గణేశుని శ్రద్ధగా పూజించాడు. అపుడు ఆయనకు దర్శనమిచ్చిన గణేశుని ఇలా స్తుతించాడు:
నమో విష్ణుస్వరూపాయ
గణేశాయ పరాత్మనే ।
చతుర్భుజాయ రక్తాయ
యజ్ఞపూర్ణకరాయచ ॥
విఘ్నహంత్రే జగద్భర్ర్తే
సర్వానంద ప్రదాయినే ।
సిద్ధీనాం పతయే తుభ్యం
నిధీనాం పతయే నమః ॥
ప్రసన్నోభవ దేవేశ
పుత్రోభవమమ ప్రియః । (ప్రతిసర్గం 4/12/90-92)
‘ప్రభో! నీవు నాకు పుత్రునిగా జనించాలి’ అని కోరాడు శివుడు. అందువల్లనే పార్వతీదేవి తేజోమయ శరీరం నుండి గణేశుడుద్భవించడం జరిగింది. ఇంద్రునితోబాటు సమస్త దేవగణాలవారూ ఆయన మంగళమయ దర్శనానికై కైలాస శిఖరానికి వచ్చారు. అక్కడ సర్వసుఖదమైన ఒక మహెూత్సవమే జరిగింది. ఆ మహెూత్సవ మండపానికి క్రూరదృష్టి, కాలాత్మయగు శని వచ్చాడు. అతని కన్ను గణేశునిపై పడగానే ఆ బాల గణేశుని శిరస్సు కనబడకుండా పోయింది. బాలకుడు మస్తక విహీనుడైనాడు. కైలాసమందంతటా హాహాకారాలు చెలరేగాయి. ఆ శిరస్సు అప్పటికే సూర్యచంద్రులను కరుణించడానికి వెడలిపోయింది. అది సూర్యుడు తులారాశిలో నున్నప్పుడు చంద్రలోకంలో నివసించి పదిహేడు రోజులపాటు పృథ్వికి ప్రకాశాన్నందిస్తుంది. అందరు దేవతలచే వినిందితుడు, భయంకరుడు నైన శని దేవుడు ఒకే దంతమున్న ఒక ఏనుగు యొక్క తలను ఖండించి తెచ్చి ఆ బాలుని మెడపై అతికించాడు. గౌరీదేవి అభ్యర్థనపై బ్రహ్మదేవుడు ఆ శిరాన్ని మరింత శోభాయమానం గావించాడు. ఈ ప్రకారంగా సాక్షాత్తూ ఈశ్వర స్వరూపుడైన గజాననుడుత్పన్నుడైనాడు.
లోకకల్యాణం కోసం బృహస్పతి గణేశుని ప్రార్థించగా గణేశుడు తన ముఖముం నుండి ఒక స్కంధము నుత్పన్నం చేసి పంపగా అది ఆయన తేజస్సును తీసుకుపోయి కాశీలో ఒక దైవజ్ఞుడైన విప్రునిలో ప్రవేశపెట్టింది. ఆ విప్రుని పుత్రుడైన మహనీయుడు ఢుండిరాజుగా ఆ తేజస్సు నేలపై పుట్టింది. అతడు గొప్ప వేదవేదాంగవేత్తయై, ‘జాతకాభరణ’మను ప్రామాణిక కృతిని వెలయించి, వేదాలను వాటి సంప్రదాయాన్నీ రక్షించడంలో తన వంతు పాత్రను పోషించడానికై శంకరాచార్యుని ఆశ్రయించి ఆయన శిష్యుడై ప్రకాశించాడు.