భవిష్య పురాణము

140 - దీపమాలికోత్సవం

మహారాజా! కార్తిక అమావాస్యనాడు బలి చక్రవర్తి భూలోకంలో సంచరిస్తాడు. ఆ రోజు అసుర శక్తులు స్వేచ్ఛగా విహరిస్తాయి. వాటికి చీకటి అంటే చాలా ఇష్టం. అందుచేత మనం దీపాలు వెలిగించి చీకటిని పారద్రోలడం మంచిది.

కార్తిక బహుళ చతుర్దశి ప్రభాత సమయంలో నరక భయాన్ని దూరం చేసే ప్రత్యేక స్నానాన్ని ప్రతి ఒక్కరూ తప్పక చేయాలి. అపామార్గ (ఉత్తరేణి) పత్రాన్ని తలపై పెట్టుకొని ఈ క్రింది నుంత్రాన్ని చదువుతూ తలపైనే తిప్పాలి:

హరపాపమపామార్గ భ్రామ్యమాణం పునః పునః

ఆపదం కిల్బిషం చాపి మమాపహర సర్వశః

అపామార్గనమస్తేఽస్తు శరీరం మమశోధయ॥ (ఉత్తరపర్వం-140/9)

అనంతరం యమ, ధర్మరాజ, మృత్యు, వైవస్వత, అంతక, కాల, సర్వభూత క్షయక అనే యముని నామాలనుచ్చరిస్తూ తర్పణాలు వదలాలి. దేవతలను పూజించి ఆ తరువాత నరకం నుండి నాకు విముక్తి కలగాలి గాక’ అని పదే పదే అంటూ దీపాలను వెలిగించాలి. ప్రదోష కాలంలో శివ, విష్ణు, బ్రహ్మాదుల మందిరాల్లోనూ కోశాగార, చైత్య, సభా మండప, నదీతట, తటాక, ఉద్యాన, గజాశ్వ శాలాదులలోనూ దీపాలు వెలిగించాలి.

అమావాస్య దినాన పెందలకడనే స్నానం చేసి పితరులకు భక్తిపూర్వకంగా పూజన తర్పణాదులను గావించి పార్వణ శ్రాద్ధం పెట్టాలి. తరువాత పాలు, పెరుగు, నెయ్యి మరియు అనేక స్వాదిష్ట పదార్థాలతో బ్రాహ్మణులకు భోజనాలు పెట్టి దక్షిణలివ్వాలి. అపరాహ్ణ కాలంలో ప్రతి రాజూ తన రాజ్యంలో ఇలా దండోరా వేయించాలి. ‘ప్రజలారా! నేడు ఈలోకంలో బలిచక్రవర్తి శాసనం చెల్లుతుంది. మీరంతా మీమీ ఇళ్ళను స్వచ్ఛంగా నిర్మలంగా వుంచుకొని నానారకాల రంగుల తోరణాలతో, పతాకాలతో, పుష్పమాలలతో గుమ్మాలనూ ప్రాంగణాలనూ అలంకరించాలి. ప్రజలంతా బాలురతో వృద్ధులతో సహా మంచి బట్టలు వేసుకొని సుగంధ ద్రవ్యాలు పూసుకొని తాంబూలం నములుతూ అత్యుల్లాసంగా ఉత్సాహంగా ఊళ్ళో తిరగాలి. ప్రీతి పూర్వకంగా దీపోత్సవాన్ని నిర్వహించి పండుగ చేసుకోవాలి. ప్రదోష సమయంలో దీపవృక్షాలను వెలిగించి శ్రేష్ఠకన్యలు వాటిపై నవధాన్యాలు విసురుతూ నీరాజనాలివ్వాలి. అప్పుడీ ప్రదోష వేళ దోషరహితమై రాక్షస భయం దూరమవుతుంది.’

ధర్మజా! ఆ రాత్రి రాజు, మంత్రి, మెల్ల మెల్లగా కాలినడకన ఊరంతా కలయ దిరగాలి. రాజుగారి ముఖ్యోద్యోగులు వెలుగుతున్న దీపాలను పట్టుకొని ఎవరి ఇంటి ముందు వారు నిలబడి పండుగ చేయించాలి. ఈ వెలుగులన్నిటినీ చూసి బలి చక్రవర్తి నేడు నాపట్ల ప్రసన్నుడై వుంటాడు’ అనే తృప్తితో రాజు తన భవనానికి మరలిపోగలగాలి.

అర్ధరాత్రి దాటిపోయాక ఇంటివారంతా అలసిసొలసి నిద్రిస్తున్నప్పుడు ఆ ఇంటికోడళ్ళు మృదంగాన్ని చప్పుడు చేసుకుంటూ ఇల్లంతా కలయదిరిగి వీధి వాకిలి దాకా వెళ్ళాలి. దీనివల్ల ఇంట్లో ఏ మూలైనా అలక్ష్మి వుంటే పారిపోతుంది.

తెల్లవారినాక రాజు వస్త్రాభూషణాలతో బ్రాహ్మణులను సంతోషపెట్టాలి. సత్పురుషులను కూడా అలాగే ఆనందింపజేయాలి. ఆ తరువాత భోజన తాంబూలాదులతో మధుర వచనాలతో పండితులను సంతృప్తిపఱచాలి. సామంతులను, సిపాయిలను సేవకులను ధనాదులతో బహుమతులతో ఆనందింపజేయాలి. ఇలా ఎన్నో సంబరాలను, హవనాలను వినోద కార్యక్రమాలను మార్గపాలీ (స్వాగత ద్వారం) పూజను గావించి బలిచక్రవర్తిని వింధ్యాదేవితో సహా విగ్రహంగా చేయించి సర్వోపచారాలతో పూజించి ఇలా ప్రార్థించాలి:

బలిరాజ నమస్తుభ్యం విరోచన సుత ప్రభో!

భవిష్యేంద్ర సురారాతే పూజేఽజయం ప్రతిగృహ్యాతాం॥

(ఉత్తరపర్వం 140/54)

ఈ ప్రకారంగా పూజించి రాత్రంతా ఉత్సవము చేయించి జాగరం చేయాలి. నగర ప్రజలంతా ఇంట్లోనే బలికి పూజచేసి ఆయననుద్దేశించి దానాలివ్వాలి. ఎందుకంటే బలిచక్రవర్తి పేరుతో ఇచ్చిన దానం అఖండం, అక్షయం, విష్ణుప్రీతి పాత్రం.

విష్ణునావసుధాలబ్ధా ప్రీతేన బలయేపునఃః

ఉపకారపరోదత్త శ్చా సురాణాం మహోత్సవః॥

తతః ప్రభృతి రాజేంద్ర ప్రవృత్తా కౌముదీ పునః (ఉత్తరపర్వం - 140/59,60)

ఈ తిథికి కౌముదీ అనిపేరు. కుముద అనేది దీని మూల పదం ‘కు’ అనగా భూమి ‘ముది’ అంటే ముదాన్ని అనగా ప్రసన్నతను కలిగించేదని అర్థం. ఈ తిథిలో మరొక వైచిత్రి కూడా వుంది. ఒక వ్యక్తి ఆ రోజు ఆ తిథిలో ఎలా వుంటాడో ఆ సంవత్సరమంతా అలాగే వుంటాడు. స్త్రీలైనా అంతే. కాబట్టి ఆ రోజు అంతా భక్తిగా పూజ చేసి ఆనందంగా తిని తిరగాలి(వైష్ణవీ = విష్ణు సంబంధం. దానవీ = బలి చక్రవర్తితో బంధం. పైత్రికీ = పితృదేవతలకి ప్రియం.‌)  ఈ తిథి వైష్ణవీ, దానవీ, పైత్రికీ కూడ.” (శ్రీకృష్ణుని కాలం నాటికి రాజులే వున్నారు కాబట్టి కొన్ని రాజులే చేయగల వ్రతాలను ఆయన చెప్పాడు. ఈరోజు రాజులు లేరు. అయినా ఆ వ్రతాలు అప్రస్తుతం కాదు. మంత్రులు, గవర్నర్లు, పారిశ్రామిక వేత్తలు రాజాంశతోనే పుడతారు. వారే ఈ వ్రతాలను చేయాలి. దానాలివ్వాలి. - అను)