భవిష్య పురాణము

87,88 - అబాధక, దుర్గంధ నాశక వ్రతాలు

“యదువంశ సుధాంబుధి చంద్రా! జనశూన్య ఘోరవనంలో, సముద్రాన్ని దాటే వేళల్లో, చోరాది భయాలతో చిత్తం వ్యాకులమైనపుడు, ఇలాంటి సందర్భాలలో ఏ దేవతనూ స్మరించాలి?”

“కురువంశ వర్ధనా! సర్వమంగళ, భగవతి శ్రీ దుర్గాదేవిని స్మరిస్తే అన్ని దుఃఖాలూ భయాలూ దూరమవుతాయి. రాజా, మా అన్న బలదేవుడూ నేనూ మా విద్య పూర్తయ్యాక గురువుగారిని గురుదక్షిణగా ఏం కావాలని అడిగాం. ఆయన మా నిజ రూపాలను కని పెట్టగలిగాడో ఏమోగాని ఎప్పుడో ప్రభాస క్షేత్రం వద్ద సముద్రంలో గల్లంతైపోయిన తన పుత్రుని తెచ్చి ఇమ్మన్నాడు. మేము అలాగే చేశామని నీకు తెలుసుకదా! అయితే, మేము ఆయన పుత్రుని ఆయన కొప్పగించి వెళ్ళిపోతున్నపుడాయన ఒక మాటన్నాడు. ‘పుత్రులారా మీరు ప్రణామం చేస్తున్నప్పుడు నేలపైబడిన పాదముద్రలు, ప్రగాఢములై ఇక్కడ పూజలందుకుంటాయి.’

నాటి నుండి బలరాముని కుడిపాదమూ, నా వామ పాదమూ, మధ్యలో సర్వమంగళాదేవి పవిత్ర చిహ్నమూ అక్కడ ముద్రితాలై పుత్రప్రాప్తి, ఇచ్ఛాపూర్తి కోరేవారిచే వ్రతపూర్వకంగా ఆరాధింపబడుతున్నాయి. ప్రతి నెలలో శుద్ధ త్రయోదశినాడు ఏకభుక్తంగాగాని, నక్తవ్రతం గాని, ఉపవాసం గాని చేసి మట్టి లేదా బంగారంతో అమ్మవారి ప్రతిమను చేయించి గంధపుష్ప ధూప దీప మధు నైవేద్యాదులతో పూజించే స్త్రీ పురుషులు సంపూర్ణ పాపవిముక్తులై స్వర్గ నివాస ప్రాప్తి నొందుతారు.”

“పరంధామా! శరీర దుర్గంధంతో బాటు జాతకంలోని దౌర్భాగ్యాన్ని కూడా తొలగించే వ్రతమేమైనా వుందా?”

“ధర్మజా! పూర్వకాలంలో ఒక రాణి వుండేది. ఆమె పేరే విష్ణుభక్తి. ఆమె తన ప్రజల కోసం ఒకప్పుడు జాతూకర్ణ్యుడనే మునిని ఇదే విషయమై ప్రార్థించగా ఆయన ఇలా చెప్పాడు, ‘దేవీ! జ్యేష్ఠ శుక్ల త్రయోదశినాడు పవిత్ర జలాశయంలో స్నానం చేసి పవిత్ర స్థానంలో పుట్టిన తెల్లజిల్లేడు, ఎఱ్ఱగన్నేరు, వేపచెట్లను పూజించాలి. ఈ మూడూ సూర్య భగవానుని కిష్టమైనవి. సూర్యోదయమైన పిమ్మట సూర్యభగవానుని దర్శించి ఆయనను మనసులోనే ధ్యానించాలి. తరువాత మరల ఆ చెట్ల వద్దకు పోయి పుష్ప నైవేద్య ధూపాది ఉపచారాలతో వాటిని పూజించి నమస్కారం చేసుకోవాలి.’

ధర్మజా! ఈ వ్రతాన్ని చేసే స్త్రీ పురుషుల శరీరానికి సుగంధమూ, జీవితానికి సౌభాగ్యమూ లభిస్తాయి.” (కాలపరిమితి చెప్పబడలేదు కాబట్టి జీవిత పర్యంతమూ చేయాలి.)