భవిష్య పురాణము

47-48 - శ్రీకృష్ణ - సాంబసంవాదం: సూర్య పూజనవిధి

“మునీంద్రా! సూర్యనారాయణమూర్తి ప్రభావాన్నీ, మహిమనీ ఇంకా వినాలనివుంది” అన్నాడు శతానీకుడు.

“రాజా! ఈ విషయమై ఒకమారు శ్రీకృష్ణుడు ఆయన పుత్రుడైన సాంబునికి బోధించిన పరమార్ధం చెప్తాను విను. సాంబుడొకమారు తన తండ్రియైన శ్రీకృష్ణునిలా అడిగాడు: “నాన్నగారూ! మనిషై పుట్టినవాడు దుఃఖం లేకుండా, అన్ని కోరికలూ తీరుతుండగా జీవించి, చివరికి స్వర్గాన్నీ, ఆపై మోక్షాన్ని పొందాలంటే ఏకర్మనాచరించాలి? సర్వజ్ఞులైన మీరే ఈ అంశాన్ని వర్ణించి చెప్పగలరు. ఈ ప్రపంచంలో దుఃఖాలను, వ్యాధులను చూసి చూసి నేను విరక్తి చెందివున్నాను. నాకైతే ఈ లోకంలో ఇక ఒక్కక్షణమైనా వుండాలని లేదు. కాబట్టి దయచేసి చెప్పండి. ఇక్కడున్నన్నాళ్ళూ బాగుండాలి, మళ్ళా ఇక్కడికింక రాకూడదు. దానికి సాధనం ఏమిటి?”

“వత్సా! దేవతారాధన, దైవానుగ్రహం, దేవప్రసాదం వుంటే ఇవన్నీ సాధ్యమవుతాయి.  దేవతలను ఆరాధించుటయే పరమోపాయం. అనుమాన, ఆగమ ప్రమాణం ద్వారా దేవతల దయను పొందవచ్చు. విశిష్ట పురుషుడు విశిష్ట దేవతలను ఆరాధిస్తే వచ్చే ఫలం కూడా విశిష్టంగానే వుంటుంది. ఐతే దేవతలందరూ ప్రత్యక్షం కారు”.

“హే జగద్గురూ! ప్రత్యక్షదైవమై, విశిష్టాభీష్ట ఫల ప్రదాతయైన భగవత్‌స్వరూపుని వర్ణించండి.”

“ప్రత్యక్షదైవము, ఈ విశ్వానికి నేత్ర స్వరూపుడు సూర్యనారాయణుడే. ఆయనను మించినవారు లేరు. ఈ ప్రపంచం ఆయననుండే వచ్చింది. ఆయనలోనే లీనమైపోతుంది.

సత్యాది యుగముల కాలగణన సూర్యుని ద్వారానే సిద్ధమైంది. గ్రహ, నక్షత్ర, యోగ, కారణ, రాశి, ఆదిత్య, వసు, రుద్ర, వాయు, అగ్ని, అశ్వనీకుమార, ఇంద్ర, ప్రజాపతి, దిశలు, భూః భువః స్వః ఆది లోకాలు, పర్వత, నదీ, సముద్ర, నాగాది సంపూర్ణ విషయాల ఉత్పత్తికి ఏకమాత్ర హేతువు సూర్యనారాయణ స్వామి. ఈ చరాచర జగత్తు ఆయన ఇచ్ఛామాత్రము వల్ల పుట్టి, పెరుగుతోంది. ఈ సంసారం ప్రయత్నశీలమైనదీ సూర్యానుగ్రహం వల్లనే. సూర్యోదయాన పుట్టిన ఈ జగత్తు సూర్యుడు లేకుంటే లేదు. ఆయన కంటే నధికుడైన దేవుడు లేడు. ఇకపై వుండడు. వేద, శాస్త్ర, పురాణ, ఇతిహాసాది ప్రాచీన సాహిత్యమంతటా పరమాత్మ, అంతరాత్మ అనే శబ్దాలద్వారా సూర్యుడే ప్రతిపాదించబడ్డాడు. ఆయన సంపూర్ణ గుణాలనూ, ప్రభావాలనూ వర్ణించాలంటే నూరేళ్ళు కూడా చాలవు. (చాలదు) స్వయంభూ, అవ్యయ స్వరూపుడైన సూర్యుని ఇందుచేతనే దివాకర, గుణాకర, సర్వ స్వామి, స్రష్ట, స్థితికారక, లయకార గుణాలంకారునిగా సూర్యుని సంభావిస్తారు.

సూర్యపూజ ఎలా చేయాలంటే సూర్యమండలాన్ని రచించుకొని పొద్దున్న, మధ్యాహ్నం, సాయంత్రం పూజించి ఉపస్థానం చేసేవానికి పరమగతి ప్రాప్తిస్తుంది. అదొక పూజా విధానం. మరొకటి ప్రత్యక్షంగా భక్తి పూర్వకంగా సూర్యుని ఆరాధించడం. ఇలా చేసేవాని కసాధ్యముండదు. తన అంతరాత్మలోనే మండలస్థుడైన సూర్యభగవానుని ప్రతిష్టించుకొని తన బుద్ధి ద్వారా నిశ్చితరూపంలో దర్శించి, బయట ఆయనకు ధ్యానపూర్వకంగా పూజ, హెూమం, జపం చేసి అర్పించడం మరొకపద్ధతి. ఇలా చేయగలిగిన వానికి ఇహలోకంలో అన్ని కోరికలూ తీరగా, దేహాంతమందు సూర్యలోకగతి ప్రాప్తిస్తుంది. కాబట్టి ఓ పుత్రా! నీకు ఇక్కడ సుఖం, భుక్తి, ముక్తి కావాలంటే విధిపూర్వకంగా తన్మయతతో ఆ ప్రత్యక్ష దైవమైన సూర్యభగవానుని ఆరాధించు. అపుడు నీకు ఆధ్యాత్మిక, ఆధిభౌతిక, ఆధిదైవిక దుఃఖాలనేవి ఉండవు. ఆయన శరణులోనికి వెళ్ళినవానికి ఏభయమూ వుండదు. ఈ లోకంలో పరలోకంలో శాశ్వతసుఖం ప్రాప్తిస్తుంది. నేనే స్వయంగా సూర్యభగవానుని చిరకాలంపాటు యథావిధి ఆరాధించి ఆయన దయవల్ల ఈ దివ్యజ్ఞానాన్ని పొందాను. మనుష్యహితాన్నిచ్చే దేవుడు సూర్యభగవానుడే.”