(శని దేవతను కొంతమంది శనీర్వరుడంటున్నారు. శనీశ్వర శబ్దం సరైనది కాదు. శనైః చర అనగా మాటిమాటికీ వచ్చిపోయేవాడు శనైశ్చరుడయ్యాడు. శనైః అనగా మందగతి అని కూడా అర్థముంది. మందంగా అంటే మెల్లగా కదులుతూ ఎక్కువకాలం మనిషి జాతకంలో చరించే గ్రహం శని.)
ధర్మజా! త్రేతాయుగంలో నొకమారు అనావృష్టి కారణంగా భయంకర దుర్భిక్ష మేర్పడింది. ఆ కరవును తట్టుకోలేక కౌశిక ముని తన భార్యతో పుత్రులతో మరొకచోటికి బయలుదేరాడు. అలా వెళుతుండగా దారిలో నొక పుత్రుడు తప్పిపోయాడు. ముని దంపతులు చూసుకోలేదు. ఆ బాలకుడు అటూ ఇటూ తిరుగుతూ ఏడవసాగాడు. అకస్మాత్తుగా అక్కడొక రావిచెట్టు కనబడింది. పక్కనే ఒక నీటి చెలమ కూడా గోచరించింది. ఆ బాలకుడా పండ్లను తిని చెలమ నీటిని త్రాగి సేదదీరాడు. ఆ తరువాత అక్కడే కఠిన తపస్సును ప్రారంభించాడు. రావిపళ్ళనే తింటూ చెలమ నీటినే త్రాగుతూ మిగిలిన కాలమంతా తపస్సులోనే గడిపేవాడు. అనుకోకుండా ఒకరోజు అక్కడికి దేవర్షి నారదుడు రాగా ఆ బాలకుడు గబగబా లేచి ఎదురేగి సాష్టాంగ నమస్కారంతో దేవర్షిని పూజించాడు. దయాలువైన దేవర్షి ఆ బాలకుని తపస్సు, వినమ్రతాదులనుగని ప్రసన్నుడై ఆ బాలకునికి మౌంజీ బంధనాది సర్వ సంస్కారాలూ చేసి వటువుగా పెంచి పద క్రమ రహస్య సహిత వేదాధ్యయనం చేయించాడు. పన్నెండక్షరాల మహామంత్రం, సర్వజన సంస్తూయ మాన ఓం నమో భగవతే వాసుదేవాయ అను మంత్రమునుపదేశించాడు.
ఆ బాలకుడు విష్ణు ధ్యానం; వాసుదేవ మంత్రజపం నిష్ఠగా చేయసాగాడు. నారదుడు ఎందుకనో అక్కడే వుండిపోయాడు. బాలకుని నిష్ఠను చూసి ముచ్చటపడి శ్రీ మహావిష్ణువే గరుడు నెక్కి కదలివచ్చి అతనికి దర్శనమిచ్చాడు నారదుడు చెప్పగా విష్ణువును పోల్చుకొన్న బాలకుడాయనకు సాష్టాంగ ప్రణామం చేసి స్తుతించాడు. విష్ణువు వరం కోరుకొమ్మంటే భగవానుని పట్ల సుదృఢమైన భక్తినే కోరుకున్నాడు. విష్ణువు ప్రసన్నుడై జ్ఞానాన్నీ యోగాన్నీ ఉపదేశించి వెళ్ళాడు. భగవంతుని ఆశీర్వాదం వల్ల అతడు మహాజ్ఞానీ, మహర్షీ అయినాడు.
ఒకనాడతడు నారదుని ఇలా అడిగాడు: ‘స్వామీ! నేను పసితనంలోనే పెక్కు కష్టాలు పడడం నా యొక్క ఏ కర్మల ఫలం? గ్రహాలు నన్ను పీడించబట్టి కదా అమ్మా నాన్నలకు దూరమయ్యాను. వారిపుడెక్కడున్నారు? సౌభాగ్య వశాన మీరు వచ్చి నన్ను సంస్కరించి నాకు బ్రాహ్మణత్వాన్ని ప్రసాదించి విష్ణు దర్శనం చేయించారుగాని, లేకపోతే నాగతి ఏమై వుండెడిదో ఊహించలేకున్నాను.’
“నాయనా! నిన్నింత దారుణంగా పీడించిన దేవత శనైశ్చర గ్రహం. ఈనాడు సంపూర్ణ దేశంపై ఆయన అధికారమే సాగుతోంది. చూడు ఎలా వెలిగిపోతున్నాడో ఆ శనైశ్చరుడు అహంకారంతో ఆకాశంలో.”
ఈ మాటలు వినగానే ఆ బాలకుని తపశ్శక్తికి క్రోధానలం తోడై అగ్నిజ్వాలలు అక్షియుగ్మంలో తాండవిస్తుండగా పైకి, శనైశ్చరుని వైపు చూశాడు. వెంటనే శని ఆకాశం నుండి భూమిపైకి పడిపోయాడు. అదీ ఒక పర్వతంపై పడడం వల్ల ఆయన కాలోకటి విరిగిపోయింది. నారదుడు పరమానందభరితుడై బ్రహ్మ, ఇంద్ర, అగ్ని, రుద్రాది దేవతలందరినీ మనస్సుతో పిలచి వారు మనోవేగంతో వచ్చి చేరగా వారందరికీ శనికి పట్టిన శనిని చూపించి ‘ఇది నా అనుగ్రహ పుత్రుడు పిప్పలాదుని తపోబలం, క్రోధఫలం’ అన్నాడు.
అపుడు బ్రహ్మ తనకు నమస్కరించి నిలబడిన ఆ బాలకునితో ఇలా అన్నాడు. ‘నాయనా! నీవు పీపల ఫలాలు తిని పెరిగావు కాబట్టి పిప్పలాదుడని నారదుడు చేసిన నామకరణం సముచితంగా నున్నది. (ఈ కథ కడు సుందరమైనది. దీనిని చదివిన వానికి శని పీడ వదలిపోతుంది. పిప్పలాద మహర్షి వేద సంహితులను వెలయించాడు. అథర్వ వేదంలోని పిప్పలాద సంహిత ఆయన దర్శించి మనకు ప్రసాదించినదే. కొన్ని పురాణాలలో ఇతని తండ్రి పేరు దధీచియని చెప్పబడింది. తండ్రి మృతి చెందగా తల్లి (ప్రతిథేయి లేదా సువర్చ ఆయనతో సహగమనం చేయగా ఒంటరిగా మిగిలిపోయిన బాలకుని నారదుడు చేరదీసి ఉద్ధరించడం జరిగిందనీ స్కాందాది పురాణాలలో చెప్పబడింది. భేదముంది కదాని కథనే సందేహించడం పొరబాటు. కల్పాంతరమే కథలో తేడాకి కారణం.) నేటి నుండి నీవు పిప్పలాద మహర్షిగా విశ్వ విఖ్యాతి నొందుతావు. ఈనాటి నుండి శనివారము నన్నుగాని ఏ దేవునిగాని పూజించిన అనంతరం ‘పిప్పలాద’ నామాన్ని స్మరిస్తే చాలు. ఆ వ్రతికి ఏడుజన్మల దాకా శని బాధ వుండదు. పుత్ర పౌత్రయుక్తుడై సుఖంగా జీవిస్తాడు. ఇక నీవు నీ తపోబలంతో శనైశ్చరుని మరల సముద్ధరించి ఆకాశంలో నిలుపవలసి వుంది. ఎందుకంటే జనపీడనంలో అతని దోషమేమీ వుండదు. బ్రహ్మవ్రాతను బట్టియే గ్రహాలు జనాలను పట్టుకుంటాయి. పూజిస్తే అనుగ్రహిస్తాయి. నైవేద్య నివేదన, హవనాది, నమస్కార సహిత కర్మలతో గ్రహాలను పూజించాలి. వాటిని నిరాదరణకు గురిచేయరాదు. పూజితమైన గ్రహమేదైనా శాంతి ప్రదాయకమే అవుతుంది.
ఈ క్రింది శ్లోకాలలో గ్రహశక్తి చెప్పబడింది.
చరన్ వృక్షం శనైరేష శుభాశుభ ఫలప్రదః ।
హతసాధ్యా గ్రహాశ్చైతే నభవంతి కదాచన ॥
బలిహోమ నమస్కారైః శాంతిం యచ్ఛంతి పూజితాః ।
అతోఽర్థమస్యదివసే స్నానమభ్యంగ పూర్వకం ॥ (ఉత్తరపర్వం-114/29,30)
యాజ్ఞవల్క్యాది స్మృతులలో కూడ ఇదే భావం వచ్చే శ్లోకాలు గోచరిస్తాయి.
అని చెప్పి పిప్పలాద మహర్షి చేతనే మరల శనిదేవుని గగనంలో స్థాపింపజేసి బ్రహ్మ ఇతర దేవతలతో ఇలా చెప్పసాగాడు.
‘శనిగ్రహ జన్య పీడ నుండి విముక్తిని కోరుకొనేవారు శనివారం నాడు స్వయంగా నూనెతో అభ్యంగనం చేసుకొని బ్రాహ్మణులకు కూడా అభ్యంగనానికి నూనెనివ్వాలి. శని ప్రతిమను ఇనుముతో తయారుచేయించి నూనె నింపిన ఇనుప పాత్రలో దానిని వుంచి ఒక ఏడాది దాకా ప్రతి శనివారమూ పూజించి, సంవత్సరాంతమున నల్లపూలూ, రెండు నల్లని బట్టలూ, కసారం, తిలలూ, భాతూ (పొంగరంలాంటిది) మున్నగు వానితో శనిదేవుని పూజించాలి. పూజానంతరం బ్రాహ్మణులను రావించి వారికి నల్లావు, నల్లకంబళి, అప్పుడే నువ్వుల నుండి తీయించిన నూనెలను దక్షిణతో సహా ఇచ్చి వేయాలి. శని ప్రతిమ వున్న తైలపాత్రనూ ఇచ్చెయ్యాలి.
ఇక శని దేవుని పూజలో, దానంలో ఈ మంత్రాన్ని పలుమార్లు పఠించాలి.
శంనో దేవీరభిష్టయ ఆపోభవంతు పీతయే ।
శంయోరభి స్రవంతు నః ॥ (యజుర్వేదం 36/12)
నలమహారాజు రాజ్యభ్రంశుడైన తరువాత ఒకరోజు శనిదేవుడాయనకు కలలో కనిపించి ఒక ప్రార్థనా మంత్రాన్నుపదేశించాడు. ఆ నామ స్తుతి వల్లనే అతనికి మరల అన్ని అదృష్ట భాగ్యాలూ అబ్బినవి. రాజ్యం లభించింది. ఆ స్తుతితోనే శనిని ప్రార్థించాలి. సర్వకామ ప్రదమైన ఆ స్తుతి ఇది:
క్రోడం నీలాంజనప్రఖ్యం నీలవర్ణ సమస్రజం ।
ఛాయామార్తండ సంభూతం నమస్యామి శనైశ్చరం ॥
నమోఽర్కపుత్రాయ శనైశ్చరాయ
నీహారవర్ణాంజన మేచకాయ ।
శ్రుత్వా రహస్యం భవ కామదశ్చ
ఫలప్రదో మే భవ సూర్యపుత్ర ॥
నమోఽస్తు ప్రేత రాజాయ కృష్ణదేహాయవై నమః ।
శనైశ్చరాయ క్రూరాయ శుద్ధ బుద్ధిప్రదాయినే ॥
యఏభిర్నామభిః స్తౌతితస్య తుష్టో భవామ్యహం ।
మదీయంతు భయం తస్య స్వప్నేఽపి నభవిష్యతి । (ఉత్తరపర్వం 114/39-42)
ఒక యేడాదిపాటు ప్రతి శనివారం ఈ వ్రతాన్ని చేసి ఇలా విధిగా ఉద్యాపన చేసేవానికి శని బాధ ఉండదు. ఇలా లోకాలకి శనివ్రతాన్నుపదేశించి బ్రహ్మ తన పరమ ధామానికి నిర్గమించాడు. శని కూడా దేవుడేనని గ్రహించిన పిప్పలాద మహర్షి ఆయనను ఇలా స్తుతించాడు:
కోణస్థః పింగలోబభ్రుః కృష్ణో రౌద్రోంఽతకో యమః ।
సౌరిః శనైశ్చరో మందః ప్రీయతాం మే గ్రహోత్తమః ॥ (ఉత్తరపర్వం - 114/47)
ఈ శనైశ్చరోపాఖ్యానమును విన్నవారికి కూడా శని బాధ వుండదు.