“జగద్గురుదేవా! వృషభం సాక్షాత్తూ గోవింద స్వరూపమేనని విన్నాను. ఆ మహనీయ దానాన్ని గూర్చి వినగోరుతున్నాను.”
“ధర్మజా! పవిత్రాలలో పవిత్రతమం, దానాలలో పరమోత్తమం వృషభదానం. ఒక స్వస్థ, హృష్ట వృషభాన్ని దానం చేస్తే పదికంటె నెక్కువ గోవులను దానం చేసిన ఫలం దక్కుతుంది. వృషభ దానం వల్ల దాతయొక్క రక్తబంధువులంతా ఉద్ధరింపబడతారు. ఒక పుణ్య లేదా పర్వదినం నాడు వృషభం తోకకి వెండిని కట్టి మిగతా శరీరాన్నంతటినీ దాతకి నచ్చినట్లు అలంకరించి బ్రాహ్మణునకు దక్షిణతో సహా దానమిచ్చి ఇలా ప్రార్థించాలి.
ధర్మస్త్వం వృషరూపేణ జగదానందకారకః।
అష్టమూర్తే రధిష్ఠానమతః పాహి సనాతనః॥ (ఉత్తరపర్వం - 160/9)
ఈ విధిలో వృషభదానమిచ్చిన వానికి గత యేడు జన్మలలో చేసిన పాపాలన్నీ నశించిపోతాయి. దేహాంతంలో స్వర్గలోకం ప్రాప్తిస్తుంది. అతడు దానమిచ్చిన యెద్దు శరీరంపై ఎన్ని రోమాలున్నాయో అన్ని వేల యేళ్ళు అతనికి సర్వోన్నత లోకమైన గోలోకంలో నివాసప్రాప్తి వుంటుంది. తరువాత భూమిపై పడినపుడు బ్రాహ్మణుడై పుట్టి యజ్ఞాథ్వర్యుడు, పరమతేజస్వి, బ్రహ్మపూజితుడునగు స్థాయికెదుగుతాడు. ఇక ఈ వృషభదానం శాంతచిత్తుడు, వేదవేత్త, అహింసకుడు, సంఘోద్ధరణ సమర్థుడు, గృహస్థునగు బ్రాహ్మణునికే చేయాలి.”