భవిష్య పురాణము

120 - వైవస్వత లక్షణము - సూర్యమహిమ

‘బ్రహ్మా! ప్రపంచంలో చాలామంది మనుష్యులు విష, రోగ, గ్రహ, ఇంకా అనేక రకాల ఉపద్రవాలచే పీడింపబడుతుంటారు కదా, ఇవి ఏ కర్మఫలాలు? ఇట్టి బాధలే ఉండకుండా జీవించే ఉపాయమేదైనా వుందా?’ అని ప్రశించాడు కమల సంభవుని కమల నాభుడు.

‘జగద్రక్షకా! ఎవరైతే పూర్వజన్మలో వ్రత, ఉపవాసాదులతో సూర్యభగవానుని ప్రసన్నుని చేసుకోలేదో వారే మనం చూస్తున్న విష, రోగ, గ్రహాది పీడితులు. సూర్యదేవుని పూజించిన వారికి ఉపద్రవాలే రావు. సూర్యనారాయణ భక్తులపట్ల దుష్టులు కూడా సౌమ్యదృష్టులై అనుకూలురై వుంటారు. గ్రహాలు కూడా బాధించవు. ఎవరినైతే సూర్యానుగ్రహం వరిస్తుందో వారు ఇతర దేవతలకూ ఇష్టులైపోతారు. కాని, సూర్యానుగ్రహం మంచివారినే వరిస్తుంది. ఆరాధనలు, ఉపవాసాలు చేసే దుష్టులను కాదు.’

‘బ్రహ్మదేవా! మొదట్లో సూర్యారాధన చేయకుండా ఇపుడు కష్టాల్లో పీకల దాకా కూరుకుపోయిన వారికి దుఃఖవిముక్తి ఎట్లు?’

‘వారికి తమంతట తమకే సూర్యారాధన, బ్రాహ్మణ పోషణలపై బుద్ధిమళ్ళుతుంది. వారు ఆ పనులను ప్రారంభించి నిష్టగా చేస్తున్న కొద్దీ పాపాలు నశించిపోతుంటాయి. సుఖశాంతులు కలుగుతుంటాయి. సూర్యనారాయణారాధన చేయాలంటే ముందు మనం వైవస్వతులం కావాలి. వైవస్వతమనగా సూర్యునిపట్ల భక్తి. ఈ సంసార చక్రంలో భ్రమణం చేస్తున్న జీవులకు సర్వసుఖ ప్రాప్తికి సూర్యదేవుని ప్రసన్నం చేసుకోవడమే కళ్యాణమయ నిష్కంటక మార్గము. ‘

‘వైవస్వతుల లక్షణాలనూ కర్తవ్యాలనూ వినగోరుచున్నాను’ అన్నాడు విష్ణువు. చెప్పసాగాడు బ్రహ్మ.

‘సూర్యభగవానుని పరమభక్తుడిగా జీవిస్తూ మనోవాక్కాయకర్మలచే అకలంకమైన అహింసను పాటించేవాడు వైవస్వతుడు. బ్రాహ్మణులకు, దేవతలకు, భోజకులకు నిత్యం ప్రణామం చేస్తాడు. ఇతరుల ధనాన్ని ఆశించడు. దేవతలనూ, విశ్వాన్నీ సూర్యస్వరూపంగానే భావిస్తాడు. తనను సూర్యునికి భిన్నునిగా అనుకోడు. ఏ ప్రాణిపైననూ దుష్ట భావాలనుంచుకోడు. అటువంటి వాడే వైవస్వత సూర్యోపాసకుడు. ఆసక్తిరహితుడై అన్ని కర్మలనూ సూర్యనిమిత్తమే కావించేవాడు వైవస్వతుడు. శత్రువులు గాని, మిత్రులు గాని తనకుండరు. ఎందుకంటే తనకు భేదభావముండదు కదా! వైవస్వతులకు కలిగేటంత ఉత్తమగతులు గొప్పగొప్ప తపస్వులకు మహాయోగులకు కూడా దుర్లభాలే. నిజంగా వైవస్వతుడు ధన్యుడు. భక్తిపూర్వకమైన ఆరాధన ద్వారా మాత్రమే ఎవరైనా సూర్యభగవానుని అనుగ్రహానికి అర్హులుగా కాగలరు.

నేను (బ్రహ్మ) కూడా ఆయన దక్షిణ కిరణాలనుండే ఉత్పన్నుడనైనాను. ఆయన వామ కిరణాలనుండి శివ భగవానుడు, ఆయన వక్షఃస్థలం నుండి శంఖ చక్రగదాధారులైన తమరు ఉదయించారు. మన సృష్టి స్థితిలయ కర్మలన్నీ సూర్యాదేశాలే. మరల సృష్టి క్రమాన్ని మరొకమారు చెప్పి శలవు తీసుకుంటాను’ అని బ్రహ్మ ఇదివరకు నీవు (శతానీకుడు) విన్నట్లుగానే, సూర్యదేవుని నుండి అన్నీ ఎలా ఉద్భవించాయో చెప్పి నమస్కరించి నిష్క్రమించాడు.

శతానీక మహారాజా! పితామహుడైన బ్రహ్మకూ ఆయనకే పితృదేవుడైన విష్ణుదేవునకూ జరిగిన ఈ సంవాదాన్ని భక్తిపూర్వకంగా శ్రవణం చేసిన వారికి మనోవాంఛిత ఫలాలన్నీ ప్రాప్తిస్తాయి. దేహాంతంలో సువర్ణవిమానమెక్కి సూర్యలోకం వెళ్ళే అదృష్టం కూడా పడుతుంది.” అని సుమంతుడు శతానీకునికి చెప్పాడు.