భవిష్య పురాణము

6 - దిల్లీ నగరం - పఠానుల శాసనం - తైమూర్లంగ్ ఉత్పాతం

 “సూతమహాదేవా! పైశాచ (పఠాన్) రాజు కుతుకోదీనుడు (కుతుబుద్దీన్), ఇతర పృథ్వీరాజానంతర రాజుల గూర్చి వినగోరుతున్నాము” అన్నాడు శౌనకాచార్యుడు.

“మునులారా! కుతుబుద్దీన్ దిల్లీ శాసకుడు, సురమ్య వలీగఢం యాదవ రక్షితమై వుండేది. ఇతడొక పదివేలమంది సైనికులను వెంట వేసుకునిపోయి వీరసేనుని మనుమడగు భూపసేనుని యుద్ధంలో గెలిచి దిల్లీ కేంద్రంగా రాజ్యపాలనం చేయసాగాడు.

అప్పుడు అనేక దేశాల రాజులు దిల్లీ వచ్చి కుతుబుద్దీనుని గెలిచి రాజ్యం నుండి తగిలేశారు. ఈ వార్తను విని శహాబుద్దీను మరల దిల్లీపై దండెత్తి అక్కడున్న రాజులను గెలిచి ఈమారు కొంతకాలం తానే ఇక్కడ వుండిపోయాడు. ఈ దుష్కాలంలో అనేక హిందూ విగ్రహాలనూ, మందిరాలనూ ధ్వంసం చేశాడు. ఆ దైత్యరాజు తరువాత అనేకులైన మ్లేచ్ఛులక్కడ చేరి నిలువసాగారు. ఇలా ఏడు సంవత్సరాలపాటు మ్లేచ్ఛ పాలన సాగింది.”

సూతమహర్షి శౌనకాదులు దుఃఖితులై యుండుట చూచి కథను ఆపి వారందరినీ తోడ్కొని బదరీ క్షేత్రానికి గొనిపోయాడు. అక్కడ సమాధిస్థులై ఈ మహామునులంతా చాలాకాలం వుండిపోయారు. చివరికి అందరూ ఈ లోకంలోకీ నైమిషారణ్యంలోకీ కూడా వచ్చాక సూతమహర్షి ఈ కల్పేతి హాసాన్ని పునఃప్రారంభించాడు. ఇలా చెప్పసాగాడు.

“నేను యోగనిద్రలో చూచిన విషయాన్ని మీకు విన్నవిస్తున్నాను. మహర్షులారా! ఆ తరువాత మూకులుడు (మొగలువంశంవాడు) మ్లేచ్ఛరాజైనాడు. అతడే తైమర్లంగ్’ ఇతడు మధ్యప్రదేశమునకు వచ్చి మ్లేచ్ఛ, ఆర్యరాజులందరినీ జయించి ఆర్యావర్తాన్ని అల్లకల్లోలం చేశాడు. ఆర్య ప్రతినిధులను తన వద్దకు రప్పించుకొని ఆ కాలస్వరూపుడైన మ్లేచ్ఛుడిలా అన్నాడు:

‘మీరంతా విగ్రహారాధకులు. సాలగ్రామం అంటే శిల. మీరీ రాతినే విష్ణువంటున్నారు. అది అస్సలు కుదరదు. ఎందుకంటే విష్ణువనువాడు లేనేలేడు. మీరు నెత్తినెట్టుకు తిరిగే ఈ వేదాలనూ శాస్త్రాలనూ ఈ మునులంతా కలిసి ప్రపంచాన్ని దగా చేయడం కోసం వ్రాసిపెట్టారు.

ఇలా అంటూ ఆమ్లేచ్ఛుడు జనాల వద్ద నున్న సాలగ్రామాలన్నిటినీ బలవంతాన లాగుకొని వాటన్నిటినీ అగ్నిజ్వాలలకు ఆహుతి చేశాడు. పెద్ద పెద్ద, పూజలందుతున్న విగ్రహాలను సాలగ్రామాలను ఒంటెలపై వేసుకొని తనదేశం పోయి అక్కడ ఈ సాలగ్రామ శిలలను తన సింహాసనానికి పాదపీఠాలుగా వాడుకున్నాడు.

దీనిని చూసిన దేవతలంతా దుఃఖితులై దేవరాజైన ఇంద్రుని వద్దకు పోయి రోదిస్తూ ఇక్కడి విషయాన్ని చెప్పారు. తాము నివసించేది సాలగ్రామాలలోనే అనీ వాటికే అంతటి అవమానం జరిగితే ఇక తమ పరిస్థితేమిటనీ అడిగారు. ఇంద్రుడతి కృద్ధుడై వెంటనే తన వజ్రాయుధాన్ని చేతిలోకి తీసుకొని తైమర్లంగ్ రాజధాని అనగా తైత్తిరంవైపు విసరివేశాడు. ఆ వజ్రాయుధ శబ్దాన్నే తట్టుకోలేక ఆదేశం మొత్తం తుత్తునియలై పోయింది. తైర్లంగుని తన మ్లేచ్ఛ సభాసదులతో సహా మరణించాడు. అప్పుడు ఆనందిత హృదయులైన దేవతలు తైరంగుని దేశానికి పోయి సాలగ్రామాలన్నిటినీ తెచ్చి గండకీ నదిలో వదలి స్వర్గానికి మరలారు.

ఇంద్రుడు బృహస్పతిని ఇలా అడిగాడు “గురుదేవా! కలియుగం రాగానే వేలసంఖ్యలో దైత్యులు పుట్టుకొస్తున్నారు. వారు వేదధర్మాన్నీ మన సాంప్రదాయాన్నీ మా అస్తిత్వాన్నీ నాశనం చేయడానికి సిద్ధంగా వున్నారు. ఇక మమ్ము మీరే కాపాడాలి.”

‘మహేంద్రా! నీ ధర్మపత్ని శచీదేవికి పుత్రునిగా కలియుగంలో అవతరిస్తానని విష్ణువు వరమిచ్చాడు. ఆ సమయం ఆసన్నమైంది. ఆమె గౌడదేశంలో నీ ఆదేశంతోనే గంగాతీరంలో గల శాంతిపురంలో బ్రాహ్మణీ రూపంలో అవతరిస్తుంది. నీవు బ్రాహ్మణ రూపంలో అవతరించి దేవకార్యాన్ని సిద్ధింపజేస్తావు’ అని చెప్పాడు బృహస్పతి.

దేవరాజైన ఇంద్రుడు ఏకాదశ రుద్రులనూ, అష్ట వసువులనూ, అశ్వినీకుమారులనూ తోడ్కొని సూర్యుని కత్యంత ప్రీతికరమైన ప్రయాగక్షేత్రానికి సూర్యభగవానుడు మాఘమాసంలో మకరలగ్నంలో నున్నప్పుడు వచ్చి సూర్యారాధన చేయగా పురోహిత రూపంలో బృహస్పతి సూర్యమహాత్మ్యాన్ని వారందరికీ ఉపదేశించాడు” అని ఆపాడు సూతుడు.