భవిష్య పురాణము

169 - అన్నదాన మహిమ - రెండు కథలు

ధర్మనందనా! పూర్వజన్మలో ఇవ్వనిదేదీ ఈ జన్మలో మనకిరాదు. శ్రీరామచంద్రుడు వనంలో ఒకరోజు తన తమ్మునితో భార్యతో కందమూలాలు తింటూ హాస్య ధోరణిలో ‘లక్ష్మణా! మనం పూర్వజన్మలో ఎవరికీ అన్నదానం చేసి వుండమేమో. ఇవాళ అన్నం దొరకలేదు’ అన్నాడట. భోజన యోగ్యమైన అన్నదానము అన్నిటిలోకీ శ్రేష్ఠమైన దానము, పరమ శ్రేయస్కరము. భోజ్య పదార్ధాలెన్ని వున్ననూ అన్నమే ముఖ్యము కదా! ధర్మజా! సత్యమును మించిన పుణ్యం, సంతోషమును మించిన సుఖం, అన్నదానమును మించిన దానం లేవు. స్నానాలూ, అనులేపనాలూ, పానీయాలూ, వస్త్రాద్యలంకారములూ - ఇవేవీ కడుపునిండా అన్నం లేకపోతే సుఖమునివ్వలేవు. ఈ విషయమై ఒక ఇతిహాసం వుంది. ఆలకించు.

చాలాకాలం క్రిందట శ్వేతుడని ఒక చక్రవర్తి వుండేవాడు. ఆయన అనేక యజ్ఞాలు చేశాడు, అన్ని యుద్ధాల్లో గెలిచాడు, ఎన్నో రకాల దానాలిచ్చాడు, ధర్మపూర్వకంగా రాజ్యాన్ని పరిపాలించాడు. చాలా యేళ్ళు రాజ్యభారం వహించి, చివర్లో దానిని త్యజించి వనంలోకి పోయి తపస్సు చేశాడు. అక్కడ మృతిచెందిన వెంటనే దివ్య విమానమెక్కి స్వర్గానికి వెళ్ళాడు. అక్కడ విద్యాధర, కిన్నరాదులతో కలిసి విహరించసాగాడు. అప్సరలాయనను సేవించుకొనేవారు. గంధర్వులాయనను ‘గీతాలాపనతో ఆనందింప జేసేవారు. ఇంద్రుడు కూడా ఆయనను మిక్కిలి గౌరవంతో సంభావించేవాడు. దివ్య వస్త్రాలతో ఆభరణాలతో అనుదినము అలంకరింపబడుతుండేవాడు. అంతా దివ్యాద్భుత జీవనమే గడిచేది గాని భోజనానికి మాత్రం భూలోకంలో ఆయన మరణించిన వనంలోకి వచ్చి తన శరీరాన్ని తానే భక్షించవలసి వుండేది. అది ఎన్నాళ్ళయినా అయిపోలేదు. ఎవరినడిగినా ‘ఈ ఒక్క విషయంలో మాత్రం మేమేమీ చేయలేం. అది నీ పూర్వ కర్మఫలం’ అనేవారు. ఇలా కాదని ఆయన తిన్నగా బ్రహ్మదేవుని వద్దకేగి ఆ భగవానునే ఇలా అడిగేశాడు, “హే దేవాధిదేవా! మీ అనుగ్రహం వల్లనే నాకు స్వర్గనివాస సుఖం లభించింది. అందరు దేవతలూ నన్ను ఆదరంతో చూస్తున్నారు. భోగాలకూ సుఖాలకూ లోటులేదు. కాని, అన్నీ వున్న నాకు ఈ పాపినీ క్షుద్బాధ ఏల? రోజూ పోయి నా మాంసం నేనే తిని ఆకలిని తీర్చుకొనుట యేమి? తలచుకొంటేనే అసహ్యంగా వుండే ఈ పరిస్థితి నాకెందుకు వచ్చింది? నేనేమైనా మహాపాపం చేశానా? చేసివుంటే దానిని దగ్ధం చేసుకోవడమెలాగో అనుగ్రహించి నన్నుద్ధరించండి.’

బ్రహ్మ ఇలా చెప్పాడు.

‘నాయనా! నీవు అనేక రకాల దానాలిచ్చావు. ఎన్నో మరెన్నో యజ్ఞాలు చేశావు. ప్రజారంజకుడవైన పాలకునిగా చరిత్రలో నిలిచిపోయావు. నిజమే. కాని, అన్నదానం ఎప్పుడైనా, నీ సుదీర్ఘ జీవితంలో నొక్కమారైనా చేశావా? లేదుకదా. అందువల్లనే నీకు ఈరోజు ఈ స్థితి యేర్పడింది. అన్నాన్ని మించిన సంజీవని లేదు. అన్నమే అమృతం. అరిగించుకోగలిగిన వానికి అన్నమే పరబ్రహ్మ స్వరూపం. ఏవేవో వ్రతాల్లో యజ్ఞాల్లో భాగంగా కాకుండా అన్నదానం కోసమే అన్నదానం చేయాలి. బ్రాహ్మణులనుగానీ ఇతరులను గానీ ఆహ్వానించి ఆప్యాయంగా ఆత్మకింపయిన భోజనం పెట్టాలి. పోనీ ఆ పని ఇప్పుడు చెయ్యి.’

బ్రహ్మవచనాలను విన్న శ్వేత మహారాజు వెంటనే అగస్త్యమహర్షి కోసం తపం చేయగా ఆయనవచ్చి రాజు పెట్టిన అన్నాన్ని తృప్తిగా భోంచేశాడు. రాజు ఆ మహర్షికి దక్షిణగా తన కంఠాన్నలంకరించిన ఏకావళీ అను దివ్యమాలను సమర్పించాడు. ఇక ఆ రాజుకి ఆకలి వేయనేలేదు. శ్రీరామచంద్రునితో మొదలైన ఈ కథ ఆ మహనీయుని ప్రసక్తితోనే అంతమవుతుంది. శ్రీరామచంద్రుడు రావణుని వధించిన వెంటనే అగస్త్య మహర్షి ఆ జగదేకవీరుని అభినందించి తన ఏకావళీ దివ్యమాలను ఆ స్వామికి సమర్పించాడు.

జంతుకోటికి అన్నాన్ని మించిన ఉత్తమ పదార్థం లేదు. అదే జీవులకు ప్రాణం. అందులోనే తేజస్సు, సుఖము ఉన్నవి. కాబట్టి అన్నదాత ప్రాణదాత కూడా అగుచున్నాడు. ఆకలిగానున్న వ్యక్తి ఆశగా ఒక యింటికి వెళ్ళి అన్నంతిని, ఆకలి తీరి తృప్తిగా బయటికి వస్తే, ఆ ఇంటి యజమానిని మించిన ధన్యుడు లేడు. దీక్షలో నున్న స్నాతకుడు, కపిలగోవు, యాజ్ఞికుడు, భిక్షువు, మహోదధి - ఇవి దర్శనమిచ్చి ధన్యులను చేస్తాయి. వీరిలో కొందరినైనా అన్నదానంతో తృప్తిపఱచగలిగే జీవుని కన్న ధన్యుడెవరు? ఇంటికి ఆకలితో వచ్చిన వానికి అన్నం లేదనే వాని ఇల్లు, వాని గృహస్థాశ్రమము వ్యర్థములు. మనిషి చేసిన పాపాలు వాడు దానం చేసిన అన్నం ద్వారా బయటికి పోతాయి. తిన్నవానిని పట్టుకోవు. అన్నదానం చేయని వారి పాపాలు వారి దగ్గరే వుండిపోతాయి. పైగా అన్నదానం చేయకపోవుట అనే పాపం కూడా చుట్టుకుంటుంది. అన్నదానం చేయడంవల్ల తిన్న వ్యక్తి యొక్క ఒక నెల పుణ్యం దానకర్తను చేరుకుంటుంది. ఎవరికీ పెట్టకుండా భోజనం చేస్తున్నవారు పాపభక్షకులే. ఒక వెయ్యిమంది బ్రాహ్మణులకు భోజనం పెట్టిన వానికి నివాసమివ్వడానికి బ్రహ్మలోకం ఎదురుచూస్తుంటుంది.

ప్రాచీన కాలంలో వారణాసీ నగరంలో ధనేశ్వరుడని ఒక వైశ్యుడుండేవాడు. అతడు నిత్యం దేవతలను, బ్రాహ్మణులను పూజిస్తుండేవాడు. ఒకనాడొక పాము అతని దుకాణంలో గుడ్డుపెట్టి వెడలిపోయి, మరలి రాలేదు. అతడా అండమును చూసి జాలిపడి దానిని సంరక్షించాడు. కొన్నాళ్ళకు ఆ గుడ్డు నుండి ఒక నల్లతాచుపిల్ల బయటికి రాగా ధనేశ్వరుడు అంతే కరుణతో దానికి కావలసిన ఆహారాన్నిపెడుతూ పోషించాడు. అది కూడా అతని కాళ్ళను చుట్టుకుంటూ, ఒడిలో పడుక్కుంటూ, మెడలో ఆడుకుంటూనే పెరిగింది. కొన్నాళ్ళకది ఒక పెద్ద భయంకర కృష్ణసర్పంగా ఎదిగింది. అయినా అది అతని కాళ్ళ వద్ద చుట్టుకొని పడుకునేది. ఎవరినీ కాటేయలేదు, ఎవరి పైనా బుస కొట్టలేదు.

ఇలా కొన్నాళ్ళు సాగింది. ధనేశ్వరుని ఏకైక పుత్రుడు గురుకులంలో చదువుకొని వచ్చాడు. ధనేశ్వరుడు గంగా స్నానానికి వెళ్ళగా కొడుకు వచ్చి కొట్లో కూర్చున్నాడు. ఈ పాము అలవాటు ప్రకారం ప్రవేశించి కొడుకు కాళ్ళను చుట్టుకొని పడుకుంది. వైశ్యపుత్రుడు భయకంపితుడై దానిని కర్రతో కొట్టాడు. దెబ్బ తిన్న పాము లేచి భయంకరంగా బుసకొడుతూ వాని మెడను చుట్టుకొని పడగవిప్పి “మూర్ఖుడా! నీ తండ్రి నాకు నేను పుట్టకముందే శరణిచ్చాడు. ఈరోజుదాకా నామీద దెబ్బ పడింది లేదు. నేను నిన్ను కాటేయక మానను. అయినా మీ నాన్నగారు వచ్చాక ఆయనకు చెప్పి నిన్ను చంపిపోతాను” అంది.

ఈలోగా అచ్యుతా, గోవిందా, నారాయణా అని విష్ణునామాలు పాడుకుంటూ ధనేశ్వరుడు ఇంటికి చేరుకున్నాడు. సర్పం అతనితో ‘స్వామీ! నీ పుత్రుడు నన్ను అన్యాయంగా కొట్టాడు.

ఇటుపై ఎవరూ ఇటువంటి అన్యాయం చేయకుండా వుండాలని నేను వానిని కాటు వేయబోతున్నాను’ అని చెప్పింది. ధనేశ్వరుడు మనసులో ఇలా అనుకున్నాడు:

మూర్ఖ మిత్ర సంబంధం హీనజాతిజనోహియః ।

యః కరోత్యబుధోంఽగారాన్‌స స్వహస్తేన కర్షతి॥ (ఉపసర్గపర్వం 169/56)

మూర్ఖుడితో స్నేహం చేయడం చేతితో నిప్పును పట్టుకోడం ఒకటే! ‘పైకి మాత్రం తన తప్పేమీ లేకున్నా శిక్షననుభవించిన వానికి కోపం రావడం, వాడు ఆ కోపాన్ని కార్యరూపంలోకి తేవాలనుకోవడం సహజమే. కాని నాకు ఒక్క గంట గడువివ్వు. నాకు వీడొక్కడే కొడుకు. వీడు పోతే నాకు ఔర్ధ్వదైహికర్మలు అంటే నేను పోయాక నన్ను పై లోకాలకు పంపడానికి చేయవలసిన అపరకర్మలు - జరగవు. అందుచేత నేను ఇప్పుడే వాడి చేతి వెంట వాటిని చేయించుకుంటాను. ఆ వెంటనే నీవు వానిని కాటు వెయ్యి’ అని ప్రార్థించి అది అంగీకరించగానే వందమంది బ్రాహ్మణులకు అన్నదానం చేసి తన కొడుకు చేత వారికి మంత్రపూర్వకంగా అర్ఘ్యమిప్పించి అతని చేత తనకు కర్మ చేయించుకున్నాడు. బ్రాహ్మణులు పరమ సంతుష్టులై వైశ్యపుత్రుని ఇలా దీవించారు.

వణిక్‌పుత్ర చిరంజీవ నశ్యంతు తవ శాత్రవః

అభీష్ట ఫలసంసిద్ధిరస్తు తే బ్రాహ్మణాజ్ఞయా (ఉత్తరపర్వం 169(63)

‘వైశ్యపుత్రా! నీవు చిరంజీవివి కావాలి నీ శత్రువులు నశించాలి. ఇది బ్రాహ్మణాజ్ఞ’ అని శిరస్సుపై పుష్పాక్షతలు జల్లుచూ బ్రాహ్మణులు వేదఘోషవలె పలుకగానే వారి వాక్కులనెడి వజ్రాయుధపు దెబ్బ తగిలి అంతవఱకు పడగెత్తి సగర్వంగా నిలబడ్డ పాము నేలపై బడి మరణించింది.

కన్న కొడుకు బతికిన ఆనందం కంటే తన కారణంగా పెంపుడు కొడుకు వంటి సర్పం గతించిన దుఃఖమే ధనేశ్వరునికి ఎక్కువైంది. అతడు ఇలా దుఃఖించాడు:

ఉపకారిషుయః సాధుః సాధుత్వేతస్యకోగుణః

అపకారిషు యః సాధుః ససాధుః సద్భిరిష్యతే॥ (ఉత్తరపర్వం 169/67)

‘ఉపకారికి ఉపకారం చేయడం గొప్ప సాధులక్షణమేమీ కాదు. జంతువులూ చేయగలవు. కాని అపకారికి కూడా ఉపకారం చేయడమే నిజమైన సాధు లక్షణం. మనిషి లక్షణం. ఈ సర్పాన్ని నేను పుత్ర ప్రేమతో పెంచాను. ఈరోజు కన్నకొడుకు కోసం దీన్ని బలి ఇస్తానా? ఎప్పటికీ అలా కానివ్వను’ అని ఆరోజంతా అన్నం తినకుండా, నిద్ర పోకుండా ఒకనాడు ఆ సర్పం పుట్టకముందు గుడ్డు నెలా సంరక్షించాడో ఈనాడు దాని కళేబరాన్నీ అలాగే సంరక్షించాడు. తెల్లవారగానే గంగా స్నానం చేసి దేవతలకూ పితరులకూ పూజన తర్పణాలను చేసి తనకేం కావాలో కోరుకుని, వెయ్యిమంది బ్రాహ్మణుల నాహ్వానించి ఇంటికి వచ్చి వారికి అనేక ప్రకారాలు ఉత్తమ వ్యంజనాలతో తృప్తిగా భోజనాలు పెట్టి వారు మిక్కిలి సంతోషంతో ‘ధనేశ్వరా! మేము ఇవాళ పరమ సంతుష్టులమైనాము. నీకేం వరం కావాలో కోరుకో” అని అడుగగా ‘మహానుభావులారా! నేను పెంచుకున్న ఈ సర్పాన్ని మరల బతికించండి’ అని వేడుకొన్నాడు.

బ్రాహ్మణులు అభిమంత్రిత జలాన్ని సర్పంపై జల్లగానే అది వెంటనే బ్రతికి మరల ధనేశ్వరుని కాళ్ళకు చుట్టుకొని పడుకుంది. కాశీనగర వాసులంతా ధనేశ్వరుని ప్రశంసించారు.

ధర్మజా! ఇదీ అన్నదాన మహిమ. బ్రాహ్మణులకూ, అనుకోని అతిథులకూ అన్నం పెట్టువాడు కాలమంతా సుఖంగా జీవించి, అది తీరగానే విష్ణులోక నివాస ప్రాప్తి నొందుతాడు.”