“గోవిందా! సంపూర్ణంగా పాపాలన్నిటినీ తొలగించేదీ, ఆరోగ్యాన్ని ప్రసాదించేదీ, అనంత ఫలప్రదమూనగు ఒక వ్రతాన్నుపదేశించండి.”
“కురునందనా! విశ్వాత్మయు పరమ సనాతన భావమునైన పరబ్రహ్మ మూడు భాగాలుగా విభజింపబడి చంద్ర, సూర్య, అగ్నులలో కొలువుంటాడు. ఆ పరమాత్మని ఆరాధించే మనుష్యుడు పొందలేని దేముంటుంది? కాబట్టి ఆయనను ఆరాధించాలి. ఈ ఆరాధనా మార్గాలలో నొకటి ఆదిత్య వార నక్త వ్రతం. అంటే ఆదివారం రాత్రి మాత్రమే భోం చేయాలి. సూర్యునిపై అనన్య భక్తిని కలిగి వుండాలి. ప్రతి ఆదివారం, యేడాదిపాటు చేసే ఈ వ్రతాన్నెపుడైనా మొదలెట్టవచ్చు. బ్రాహ్మణుని విధి ప్రకారం పూజించి సాయంకాలం రక్తచందనంతో నొక పన్నెండు దళాల కమలాన్ని రచించి దాని పన్నెండు దళాల్లో దినకర రూపాలైన సూర్య, దివాకర, వివస్వంత, భగ, వరుణ, మహేంద్ర, ఆదిత్య, శాంత, మార్తండ, రవిలనే కాక ఆయన గుఱ్ఱాలనూ, ఆయన కొడుకైన యమధర్మరాజునీ కూడా స్థాపించి పద్ధతి ప్రకారం పూజించి తిలలు, రక్త చందనం, ఫలాలూ, అక్షతలతో అర్ఘ్యమివ్వాలి. రాత్రి భాస్కర భగవానుని తలచుకొంటూ తైలరహిత భోజనం చేయాలి. వ్రతానికి ముందురోజు, అనగా శనివారం తలకి నూనె రాసుకోకూడదు. ఇలా ఒక యేడాదిపాటు చేసి ఉద్యాపన చెప్పుకొని యథాశక్తి ఒక బెల్లంతో నింపిన రాగి పాత్రలో నొక స్వర్ణకమలాన్ని స్థాపించి దానిపై రెండు భుజాల సూర్యదేవుని స్వర్ణ ప్రతిమను కూడా స్థాపించి దానితో బాటే ఒక స్వర్ణమయి సవత్స గోప్రతిమను కూడా స్థాపించి, పూజ చేసి ఈ మొత్తం సామగ్రి నొక విద్వాంసుడైన బ్రాహ్మణుని కిచ్చి వేయాలి.
ఈ ప్రకారంగా ఈ వ్రతాన్ని చేసేవారు ఆరోగ్యంగా, ధన ధాన్యాలతో, పుత్ర పౌత్ర వృద్ధితో, ధార్మికులై ఈ లోకంలో వర్ధిల్లి దేహాంతంలో సూర్యలోకాన్ని చేరుకుంటారు.
సంక్రాంతి వ్రతం సూర్యుని ఉత్తరాయణ లేదా దక్షిణాయన ప్రవేశ దినంనాడు గాని విషువయోగంలోగాని ఈ వ్రతాన్ని ప్రారంభించాలి. సంక్రాంతికి ముందురోజు ఒకపూటే భోంచేసి శయనించాలి. సంక్రాంతి నాటి ప్రాతర్వేళనే తిలమిశ్రిత జలంతో స్నానం చేయాలి. తరువాత పవిత్రమైన నేలపై చందనంతో కర్ణసహితమైన అష్టదళ కమలాన్ని రచించి దానిపైకి సూర్యుని ఆవాహనం చేసుకోవాలి.
అష్టకమల కర్ణికలో సూర్యాయనమః
తూర్పువైపున్న దళంలో ఆదిత్యాయ నమః
అగ్నికోణ స్థిత దళంలో సప్తార్చిషే నమః
దక్షిణదళంలో ఋఙ్మండలాయ నమః
నైరృతివైపున్న దళంలో సవిత్రే నమః
పశ్చిమదళంలో వరుణాయ నమః
వాయవ్యపు దళంలో సప్తసప్తయే నమః
ఉత్తరంవైపున్న దళంలో మార్తండాయ నమః
ఈశాన్యంమూల దళంలో విష్ణవే నమః
అనే మంత్రాల నుచ్చరిస్తూ దేవుని స్థాపించుకుంటూపోయి మరల మరల ఆయనను పూజించాలి. అర్చన చేయాలి. తరువాత వేదిపై చందనం, పుష్పమాల, ఫలాలు, తినుబడి వస్తువులతో ఆయనను పూజించి అర్ఘ్యమివ్వాలి. తరువాత వ్రతి శక్త్యానుసారమూ స్వర్ణ కమలాన్ని తయారుచేయించి దానిని నేతిపాత్ర, కలశలతోబాటు బ్రాహ్మణునికి దాన మివ్వాలి. తరువాత చందన, పుష్పయుక్త జలాలతో సూర్యునికి భూమిపైనే అర్ఘ్యమిస్తూ ఇలా అనాలి: ‘హే భగవాన్! నీవే విశ్వము. విశ్వమే నీ స్వరూపము. ఈ విశ్వంలో సర్వాధిక తేజస్వివి, ధాతవు, ఋగ్యజుస్సామ వేదాలకు స్వామివి, స్వయంభువువు నీవే. నీకు శతశత నమస్కారములు ఇలా విన్నవించి ప్రతినెలా ఇలా వ్రతం చేయాలి. దానికి సామర్ధ్యం చాలకపోతే వర్ష సమాప్తి దినాన్నే పన్నెండుమార్లు చేయాలి.
ఒక యేడాది పూర్తియైన పిమ్మట నేతి పాయసంతో అగ్నిని సంతుష్టపఱచాలి. ఆపై పన్నెండుగురు బ్రాహ్మణులను రావించి ఒక్కొక్కరికీ ఒక్కొక్క గోవునూ, రత్నసహిత (ఖచిత) స్వర్ణ కమలాన్ని స్థాపించిన కలశనీ దానం చేయాలి. అలాగే యథాశక్తి నిర్మించిన శేషనాగ సహిత భూదేవి ప్రతిమనూ దానం చేయాలి. ఈ వ్రతాన్ని అత్యంత శ్రద్ధాభక్తులతో చేసిన వారిని దేవతలు స్వయంగా తీసుకుపోయి (దేహాంతంలోనే) ఈ మృత్యులోకంలో హిమాలయాది పర్వతాలూ, సప్త సముద్రాలూ వున్నంత కాలం ఆ స్వర్గలోకంలో ఈ వ్రతిని ఉంచుకొని గౌరవాదరాలతో పూజిస్తారు. మరల సృష్ట్యాదిలో ఈ వ్రతి సుందర రూపంతో, సౌందర్య రసాధి దేవత యగుపత్నితో సప్తద్వీపాల కధీశ్వరుడై పుడతాడు. ఈ పుణ్యమయి సంక్రాంతి వ్రతవిధిని చదివిన వారూ, విన్నవారూ, వ్రతికి సహాయం చేసిన వారూ కూడా స్వర్గప్రాప్తి నొందుతారు.”