62 -  ఉల్కానవమి వ్రతం

మహారాజా! ఆశ్వయుజ శుద్ధ నవమి నాడు చాముండాదేవిని ఉల్కా నవమీ వ్రతం ద్వారా పూజించాలి. ముందుగా ఆ రోజు నదిలో స్నానం చేసి పితృదేవిని విధిపూర్వకంగా అర్చించాలి. తరువాత గంధ పుష్ప ధూప నైవేద్యాదులతో భైరవ ప్రియమైన చాముండాదేవిని పూజించి ఈ క్రింది మంత్రంతో చేతులు జోడించి ప్రార్థించాలి.

మహిషఘ్ని మహామాయే చాముండే ముండమాలిని

ద్రవ్యమారోగ్య విజయోదేహి దేవి నమోఽస్తుతే  (ఉత్తర పర్వం 62/5)

తరువాత యథాశక్తి ఏడుగురు, ఐదుగురు లేదా ఒక్క కన్యను సత్కరించి, భోజనం పెట్టి ఒక నీలిరంగు రవికెను, ఆభూషణాలను, వస్త్రాలనూ, దక్షిణాదులను ఇచ్చి ఆనందింపజేయాలి. తరువాత పేడతో ఒక రాయిని చేసి దాని ఎదురుగా ఆసనంపై కూర్చుని దానిపై పాత్రను పెట్టి అందులోనే భోజన ద్రవ్యాలన్నిటినీ పెట్టుకోవాలి. పిమ్మట మట్టిపొయ్యిలో గడ్డినీ ఎండుటాకులనూ వేసి అగ్నిని రగిల్చి అది ఆరిపోయేలోగా భోజనం పూర్తి గావించాలి. తరువాత ఆచమనం చేసి చాముండా దేవినే మనసులో ధ్యానిస్తూ ఇంటిపనులు చేసుకోవాలి. ఇలా ప్రతి శుద్ధనవమినాడూ ఏడాదిపాటు వ్రతం చేసి చివరి నవమినాడు వ్రత సమాప్తి చేసి, కుమారిని పూజించి వస్త్ర, భూషణాదులనిచ్చి భోజనం పెట్టాలి. బ్రాహ్మణునికి సువర్ణాన్నీ, గోవునీ దానమివ్వాలి. ఈ రకంగా చేసిన వానికి శత్రువుల, రాజు, అగ్ని, దొంగ, భూత ప్రేత పిశాచాదులలో ఏ ఒక్కదాని వల్ల కూడా భయముండదు. యుద్ధాలకు వెళ్ళినపుడు శస్త్రాలేవీ అతనికి తగలవు. దేవి చాముండ సర్వత్ర రక్షిస్తుంది. వాని, లేక ఆమె యొక్క తేజస్సు ఉల్కా సమానమై వర్ధిల్లుతుంది.