సూతమహర్షి ఇలా చెప్పసాగాడు. ‘మహర్షులారా! లోక ప్రసిద్ధమైన కాశీనగరంలో ఒక శ్రేష్ఠుడైన బ్రాహ్మణుడుండేవాడు. ఆయన గొప్ప విద్వాంసుడు, విష్ణువ్రత పరాయణుడు, గృహస్థు, భార్యాపుత్రులున్నవాడు. నిర్ధనుడగుట చేత భిక్షావృత్తితో జీవిస్తుండేవాడు. దైవం అనుకూలిస్తేనే కదా విద్యకైనా విలువపుట్టేది. ఈ బ్రాహ్మణునిపేరు శతానందుడు. ఆయన పరమశాంతుడు, నిత్యానందుడు. ఒకనాడు ఆయన భిక్షకు బయలుదేరగా స్వయంగా శ్రీహరియే ఒక వృద్ధ బ్రాహ్మణ వేషంలో ఎదురుగా వచ్చి ఇలా అడిగాడు.
‘ఓయి ద్విజా! నీవెక్కడికి, ఏ పనిమీద పోతున్నావు?’
అతిశయశాంతుడైన శతానందుడు విసుక్కోకుండా వినయంగా ఇలా చెప్పాడు. ‘ఓ సౌమ్యమూర్తీ! నేను నా దారాపుత్రాదుల పోషణకై ధనాన్ని యాచించడానికి పోతున్నాను.’
‘ఓయి బ్రాహ్మణా! నిర్ధనతవల్ల భిక్షుక వృత్తిని స్వీకరించి జీవిస్తున్నావన్నమాట. కాని ఈ దారిద్య్రం, ఈ యాచన శాశ్వతాలు కావాలని ఎక్కడుంది? నీకు శాశ్వత సుఖ ప్రాప్తినిచ్చే ఉపాయం ఉపదేశిస్తాను విను. కలియుగంలో సర్వక్లేశాలనుండి తరణోపాయం ‘శ్రీ సత్యనారాయణవ్రతం’ నేను చెప్పినట్టు చెయ్యి. ‘
‘బ్రాహ్మణోత్తమా! ఈ సత్యనారాయణ భగవానులెవరు?”
‘ద్విజా! భక్తజన రక్షణార్థము నానా వేషాలు ధరించే ఆ సత్యవ్రతుడు, సర్వవ్యాపి, నిరంజనుడు నీ ఎదురుగానే వృద్ధబ్రాహ్మణవేషంలో నిలబడియున్నాడు. ఈ మహాదుఃఖ రూప సంసారసాగరాన్ని సుఖంగా తరింపజేసే నౌక భగవంతుని చరణమే. బుద్ధిమంతుడైన వ్యక్తి అన్నీ మరచి ఆ పాదాన్ని శరణువేడుతాడు. బుద్ధిలేనివాడు అన్నీ వలచి విషయరక్తుడై చెడతాడు. కాబట్టి ఓ ద్విజా! నీవు లోక కళ్యాణానికై యేర్పరుపబడిన వివిధ దైవ ఉపచారాలలో శ్రేష్ఠమైన శ్రీ సత్యనారాయణుని పూజ, ఆరాధన, ధ్యానాలను చేస్తూ ఆయన వ్రతాన్ని చేసి, అందరి చేతా చేయించు.’
ఇలా అంటూనే వృద్ధ బ్రాహ్మణుడదృశ్యమై పోయాడు. ఆ స్థానంలో శతానందుని పుణ్యమెట్టిదోగాని, సాక్షాత్తు శ్రీ సత్యనారాయణస్వామి దర్శనమిచ్చాడు.
దట్టమైన మేఘవర్ణంలో సుందరంగా అమరిన నాలుగు భుజాలతో, శంఖ చక్ర గదా పద్మాలను ధరించిన చేతులతో, పీతాంబరమును ధరించి, నవీన వికసిత కమలాలవంటి కన్నులలో కరుణ తొణికిసలాడుచుండగా, వనమాలాయుక్తుడై, పద్మాలనే భ్రమతో భ్రమరాలు మూగుతున్న పాదద్వయము కలవాడై, చల్లని మెల్లని ప్రసన్న భాసురమైన మందహాసం చేస్తూ పురుషోత్తముడైన నారాయణుడు శతానందునికి సాక్షాత్కరించాడు.
భగవంతుని ప్రత్యక్షదర్శనం చేసి ఆయన వాణిని వీనులారా విన్న శతానందుని దేహమే కాదు, మనసే పులకరించింది. కన్నుల నుండి ప్రేమాశ్రువులు ధారలు కట్టాయి. భూమిపైబడి సాష్టాంగ నమస్కారములు చేస్తూ పాదాలను స్పృశించాడు. ఇంకా తనివి తీరక గద్గద స్వరంతో ఇలా స్తుతించాడు.
ప్రణమామి జగన్నాథం జగత్కారణ కారణం।
అనాథనాథం శివదం శరణ్య మనఘం శుచిం ॥
అవ్యక్తం వ్యక్తతాం యాతం తాపత్రయ విమోచనం ॥
నమః సత్యనారాయణాయాస్య
కర్త్రేనమః శుద్ధసత్త్వాయ విశ్వస్యభర్త్రే ।
కరాలాయ కాలాయ విశ్వస్య హర్త్రే
నమస్తే జగన్మంగలాయాత్మ మూర్తే ॥
ధన్యోస్మ్యద్య కృతీ ధన్యోభవోఽద్య సఫలోమమ
వాఙ్మనోఽగోచరోయస్త్వం మమ ప్రత్యక్ష మాగతః ॥
దిష్టం కిం వర్ణయామ్యాహో నజానే కస్యవా ఫలం ।
క్రియా హీనస్య మందస్య దేహోఽయం ఫలవాన్ కృతః II
(ప్రతిసర్గ పర్వం. 2/25/15-19)
‘హే లోకనాథా! రమాపతీ! ఏలాగున సత్యభగవానుల పూజ చేయాలి? నాపై కృపను ప్రసరించి అదికూడా చెప్పండి.’
జగన్మోహనుడైన జగన్నాథుడు ప్రసన్నంగా నవ్వుతూ ఇలా చెప్పాడు. ‘విప్రేంద్రా! నా పూజకి ధనంతో పెద్దగా పనివుండదు. అనాయాసంగా దొరికే ధనంతోనే నీవు నా యజనం చెయ్యవచ్చు. ఎలాగైతే నన్ను స్తుతించి గజేంద్రుడు, అజామిళుడు సంకటముక్తులైనారో అలాగే ఈ వ్రతం చేసిన మనుజులు వెంటనే క్లేశముక్తులు కాగలరు.
ఇక వ్రత విధానాన్ని విను.
అభీష్ట కామసిద్ధికి పూజా సామగ్రి నంతటినీ ఒక చోట చేర్చి విధిపూర్వకంగా సత్యదేవుని పూజించాలి. పావుశేరు గోధుమనూక, పాలు, చక్కెర కలిపి అందులో బాగా నేతిని పోసి హరికి నివేదించాలి. ఈ పదార్థం హరికి చాలా ప్రియమైనది. స్వామి వారి సాలగ్రామానికి పంచామృతాలతో బాగా స్నానం చేయించి, గంధపుష్పధూపదీపనైవేద్య తాంబూలాది ఉపచారాలతో మంత్రాల ద్వారా దానిని అర్చించాలి. తీపి పిండివంటలు, భక్ష్యభోజ్యాలు, ఆయాఋతువుల్లో దొరికే ఫలాలు, పూలతో భక్తి పురస్సరంగా పూజ చేయాలి. తరువాత బ్రాహ్మణులను, స్వజనమును చుట్టూ ఉంచుకొని నాకథను ఆదరపూర్వకంగా శ్రద్ధాభక్తులతో శ్రవణం చేయాలి. కథానంతరం నాకు ప్రమాణం చేసి ప్రసాదాన్ని సంతోషంగా పంచాలి. తరువాత భోజనంచేయాలి. ఎంత ద్రవ్యంతో చేశావో ఎంత నేతిని పోశావో నాకు ముఖ్యం కాదు. ఎంత శ్రద్ధతో చేశావో, ఎంతభక్తితో చేశావో మాత్రమే నేను చూస్తాను. విప్రేంద్రా! ఈ ప్రకారంగా ఎవరైతే విధిపూర్వకంగా ఈ వ్రతాన్ని చేస్తారో వారు పుత్ర పౌత్రాభివృద్ధిని, ధనసంపద్విశేషాల కలిమినీ, శ్రేష్ఠ భోగాలనూ ఈలోకంలో పొంది దేహాంతంలో నా సాన్నిధ్యాన్ని పొంది నాతో కలిసి ఆనందంగా జీవిస్తారు. ప్రతి కోరికలన్నీ నెరవేరుతాయి.’
ఇలా చెప్పి భగవంతుడంతర్ధానం చెందగా ఆ బ్రాహ్మణుడు కూడా పరమానంద భరితుడై మనసులోనే మరొక్కమారు సత్యనారాయణస్వామికి నమస్కారంచేసుకొని ఈ రోజు నాకు భిక్షలో ప్రాప్తించే ధనాన్నంతటినీ సత్యదేవుని వ్రతానికే వినియోగిస్తాను - అని నిశ్చయం చేసుకొని భిక్షాటనకై నగరిలోకి పోయినాడు. ఆరోజు తాను పూర్తిగా అడగకుండానే జనాలు తమంతతామే వచ్చి అతనికి డబ్బులు వేసి పోసాగారు. సామాన్య దినాలకి ఏ పదింతలో ధనం అతనిని చేరింది. అతడు ఆశ్చర్యచకితుడై ఆనందంగా ఇంటికిపోయి ఆరోజు జరిగినదంతా తన ధర్మపత్నికి చెప్పగా ఆమె కూడా అచంచలభక్తితో శ్రీ సత్యనారాయణస్వామి వారి వ్రతాన్ని చేయ సమకట్టింది. పతి ఆజ్ఞ వెళ్ళి వ్రతానికి అవసరమైన సామగ్రినంతటినీ కట్టించి తెచ్చింది. బంధువులనూ, ఇరుగుపొరుగు వారినీ సత్యనారాయణ స్వామి పూజలో భాగం పంచుకోవడానికి రమ్మని పిలిచింది. తదనంతరం శతానందుడు భక్తిపూర్వకంగా స్వామిని పూజించాడు. కథ పూర్తికాగానే భగవంతుడు ప్రసన్నుడై అతని కోరికలన్నిటినీ తీర్చడం కోసం అతని కన్నుల యెదుట వచ్చి నిలిచాడు. శతానందుడు తనకు ఈ లోకంలోనూ పరలోకంలోనూ సుఖశాంతులనూ సత్యదేవుని పట్ల అచంచల భక్తివిశ్వాసాలనూ వరంగా కోరుకున్నాడు. తనను స్వామి దాసగణంలోకి స్వీకరించాలని యాచించాడు. స్వామి ‘తథాస్తు’ అని అంతర్హితుడయ్యాడు.
ఈ దృశ్యాన్ని చూసి వ్రతానికి వచ్చిన వారందరూ విస్మితులైనారు. శతానందుడును తన పనిలో కృతకృత్యుడైనాడు. అక్కడి వారందరూ సత్యనారాయణస్వామికి దండప్రమాణం చేసి ‘ఈ శతానందుడు ధన్యజీవి’ అని తమలో తాము పదేపదే అనుకుంటూ ఇళ్ళకు పోయారు. నాటి నుండి సత్యనారాయణస్వామి వారి వ్రతం అభీష్టకామనల సిద్ధిప్రదమనీ, పరమపుణ్యప్రదాయకమనీ, భోగ, మోక్ష సాధనమనీ, సకల క్లేశనాశకమనీ లోకంలోకి ఒక నిత్య నూతన సత్యం ప్రచారంలోకి వచ్చింది.
సత్యనారాయణ వ్రత కథలో రెండవ అధ్యాయము పూర్తి